ETV Bharat / opinion

సంగీత ప్రపంచం మరువలేని మహా మనీషి 'బాలు'

author img

By

Published : Sep 26, 2020, 7:00 AM IST

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రజలకు సంగీత రససిద్ధి కలిగించారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీర్తించారు. "బాలు అంటే, వ్యక్తి కాదు, ఓ వ్యవస్థ. గతానికి, వర్తమానానికి మధ్య చక్కటి స్వరాల వారధి. ఒక్క మాటలో చెప్పాలంటే అమర స్వర గంధర్వుడు. వారు పాడిన గీతాల రూపంలో సంగీత అభిమానుల గుండెల్లో జీవించే ఉంటారు." అంటూ బాలుతో తన అనుభవాలను పంచుకున్నారు.

BALU- VENKAIAH
బాలు

ప్రతి రోజూ ప్రాతఃకాలాన నిద్రలేచి దినచర్య ప్రారంభించే ముందు అన్నమాచార్యుల కీర్తనలు, ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం పాటలు విని ఇతర కార్యక్రమాలు ప్రారంభిస్తాను. అంతగా వారి గాత్రం నా జీవితంలో అంతర్భాగమైపోయింది. ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలిసిన నాటి నుంచి ‘బాలూ... నీ మధుర స్వరం వినకుండా ఎలా ముందుకు వెళ్ళగలను’ అనే ఓ భావన మనసులో మొదలై, కలచివేసింది.

బాలసుబ్రహ్మణ్యం ఆస్పత్రిలో చేరిన నాటి నుంచి దాదాపు ప్రతి రోజూ వైద్యులతో మాట్లాడుతున్నాను. ఆరోగ్యం మెరుగుపడుతోంది, రాసి చూపిస్తున్నారు, సంకేతాలు చేస్తున్నారు, వైద్యానికి స్పందిస్తున్నారు, మాట్లాడుతున్నారు, టీవీ చూస్తున్నారు, క్రికెట్‌ మ్యాచ్‌ చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు, ఉదయం సాయంత్రం కొంత సమయం కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు... ఇలా వారి ఆరోగ్యం కుదుటపడుతోందని తెలియజేసిన ప్రతి వార్తా మనసుకు కాస్త ఊరటనిచ్చేది.

ఎప్పటికప్పుడు..

అమెరికాలోని బోస్టన్‌, మాయో క్లినిక్‌కు చెందిన ప్రముఖ వైద్యులతో పాటు, భారతదేశంలోని నిపుణులైన వైద్యుల సలహాలు తీసుకుంటున్నామని ఎం.జి.ఎం. వైద్యులు చెప్పారు. దక్షిణభారతంలోని ప్రముఖ వైద్యనిపుణుల్నీ సంప్రదించి సలహాలు తీసుకోవాలని ఆస్పత్రి వర్గాలకు సూచించాను. వారిచ్చిన సలహాలు ఏమిటో తెలియజేయడమే గాక, అవన్నీ పాటిస్తున్నామని, పరిస్థితి మెరుగుపడుతోందని, కాకుంటే కాస్త సమయం పడుతుందని వైద్యులు చెబుతూ వచ్చారు. వారి కోసం ఫిజియోథెరపీ యంత్రం అవసరమని నాకు తెలియజేయగా, అపోలో ఆస్పత్రి ఛైర్మన్‌(ప్రతాప రెడ్డి)తో మాట్లాడి వారి దగ్గర ఉన్న యంత్రాన్ని తరలించి, చికిత్స అందించే ఏర్పాటు చేశాం.దీనివల్ల వారి ఆరోగ్యపరిస్థితి చాలా మెరుగుపడిందని వైద్యులు తెలియజేస్తూ వచ్చారు.

నాలుగు రోజుల ముందు అయితే, పరిస్థితి ఇంకా మెరుగు పడిందనే వార్త రావడంతో, వారు ఆస్పత్రి నుంచి కోలుకుని మన ముందుకు త్వరలోనే వస్తారని ఎంతో సంతోషంగా ఎదురు చూస్తూ వచ్చాను. ఈ మధ్యకాలంలో నా శ్రీమతి ఉషమ్మ సైతం వారు క్షేమంగా తిరిగి మన మధ్యకు రావాలని మనసారా కోరుకున్నారు. వారి ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ పూజలు చేసేవారు. నాకు చెప్పేవారు. కోలుకుంటున్నారని తెలిసి ఆనందపడ్డారు. చాలా మంది నాకు ఫోన్లు చేసి మాట్లాడే సమయంలోనూ ఇలాగే ప్రార్థనలు చేస్తున్నామని చెప్పేవారు. ఇలాంటి తరుణంలో ఈ దుర్వార్త మా మనసులను తీవ్రంగా కలచి వేసింది.

మనవాడిగా..

మా ఊరి వాడు, మన తెలుగు వాడు, మన తెలుగు వెలుగును జాతీయ స్థాయిలో ఆలపించినవాడు, సంగీత ప్రపంచానికి తరగని ఆస్తిగానే కాకుండా, నా పట్ల అపారమైన అభిమానం కలిగిన వాడు కావడమూ కారణం కావచ్చు... అన్నింటికీ మించి శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి అంకిత భావాన్ని అలవరచుకుని అందరినీ అలరిస్తున్నాడనీ కావచ్చు- బాలూ అంటే నాకు మొదటి నుంచి ప్రత్యేక అభిమానం. నా చిన్నతనంలో వారి తండ్రి వీధి వీధి తిరిగి హరికథా గానం ద్వారా అందరిలో భక్తిభావం కలిగించే వారు. తద్వారా నిధులు సేకరించి, ఆయన ఇతరులతో కలిసి చొరవ తీసుకుని- ప్రముఖ సంగీత కళాకారులను నెల్లూరుకు పిలిపించి త్యాగరాజ ఆరాధనోత్సవాలను నిర్వహించేవారు.

ఈ సందర్భంగా శ్రీమతి డి.కె.పట్టమ్మాళ్‌, శ్రీమతి ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి, చెంబై వైద్య నాథన్‌ అయ్యర్‌, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, వీణ కళాకారులు చిట్టి.ఎం.ఎల్‌, వయోలిన్‌ వాద్యకారులు లాల్గుడి జయరామన్‌, మృదంగ చక్రవర్తి టి.కె.మూర్తి లాంటి ఎంతో మంది కళాకారులను నెల్లూరుకు పిలిపించి, వారి సంగీత మాధుర్యాన్ని ఆస్వాదించే అవకాశాన్ని నెల్లూరు ప్రజలకు కలిగించారాయన. బాలసుబ్రహ్మణ్యం పట్ల నాకు అభిమానం పెరడానికి బహుశా ఇవన్నీ కారణాలు అయ్యి ఉండవచ్ఛు ముఖ్యంగా జీవితంలో కష్టపడి పైకి వచ్చి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వారి స్వభావం నన్ను విశేషంగా ఆకట్టుకునేది. భాష, సంస్కృతుల పట్ల అభిమానం మా ఇద్దరినీ దగ్గర చేయడమే గాక, మా మధ్య సంబంధ బాంధవ్యాలు పెరగడానికి దోహదపడింది.

భాషపై గౌరవం..

వారి ప్రతిభా విశేషాల గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఆయన కొన్ని దశాబ్దాల పాటు సినీ సంగీత ప్రపంచాన్ని ఏలారనే చెప్పాలి. ఎన్నో భాషల్లో మరెందరో కథానాయకులకు వారి గాత్రంలోకి పరకాయ ప్రవేశం చేసి పాటలు పాడే బాలు ప్రతిభ ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధుల్ని చేసేది. దాంతో పాటు మరెంతో మంది నటుల నటనాశైలికి, హావభావాలకు, గాత్రధర్మానికి అనుగుణంగా పాటలు పాడే ప్రత్యేకత ఎన్నో అవకాశాలను వారి ముందుకు తెచ్చి పెట్టింది. వారి తెలుగు భాష ఉచ్చారణ సైతం ఆనందాన్ని కలిగించేది. పాటల్లో గానీ, మాటల్లో గానీ తెలుగు పలుకులకు వారు ఇచ్చే గౌరవం, భాష పట్ల వారికున్న ప్రేమ... ఇవన్నీ వారి పట్ల అభిమానాన్ని, గౌరవాన్ని మరింత పెంచాయి.

నేను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్నప్పుడు శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారాన్ని (ది సెంటినరీ అవార్డ్‌ ఫర్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ద ఇయర్‌) నా చేతుల మీదుగా వారికి అందించాను. అదే ఏడాది వారి సంగీత ప్రస్థానం 50వ పడిలోకి అడుగు పెట్టిన శుభసందర్భం, సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని దిల్లీలోని మా నివాసంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా సన్మానం నిర్వహించిన క్షణాలు మరచిపోలేనివి.

BALU- VENKAIAH
ప్రధాని మోదీ చేతుల మీదుగా సన్మానం

పాడుతా తీయగా..

విశేషంగా రామోజీరావు సహకారంతో ఈటీవీలో ‘పాడుతా తీయగా’ కార్యక్రమం ద్వారా ఆయన యువతరానికే గాక పసిపిల్లలకు సైతం మన తెలుగు తనాన్ని, సంగీతంలో మెలకువలను తెలియజేస్తున్న తీరు చూసి ఎంతో ఆనందం కలిగేది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాకు వెళ్ళి, అనేక కార్యక్రమాలు నిర్వహించి, పిల్లల్లో నిబిడీకృతమై ఉన్న సంగీత ప్రతిభావిశేషాలను వెలికితీసి, వారికి మెలకువలను తెలియజెప్పి, వేలాది స్వరాలను వెలుగులోకి తెచ్చిన వారి చొరవను, సంగీత ప్రోత్సాహానికి వారు చేసిన కృషిని తెలుగు జాతి, మరీ ముఖ్యంగా సంగీత ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.

నా కోరికపై మా ఊరు నెల్లూరు గురించి, దాని చరిత్ర గురించి రచయిత వెన్నెలకంటి పాట రాసి, నాకు పంపించారు. ఆస్పత్రిలో చేరకముందు బాలు గారితో మాట్లాడితే తాను పాడతానని ముందుకు వచ్చారు. పాట ఎప్పుడు పాడతారా విందామని ఎదురు చూస్తూ వచ్చాను. ఇంతలోనే ఇలాంటి వార్త వినవలసి రావడం తీవ్రమైన ఆవేదన కలిగించింది.

సంస్కారవంతుడు, స్నేహశీలి, మృదుస్వభావి, నిత్యకృషీవలుడు అయిన శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం ఇక లేరనే విషయం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

BALU- VENKAIAH
బాలు

భర్తృహరి సుభాషితంలో చెప్పినట్లు-

కవిసత్తములు (కళాకారులు) ధన్యాత్ములు. ప్రజలకు రససిద్ధి కలిగించిన కారణంగా జరామరణాలు లేని కీర్తికాయులు, యోగులు అవుతారు!

కేవలం కవులకే కాదు, కళోపాసన చేసిన ప్రతి ఒక్కరికీ ఇది వర్తిస్తుంది. ప్రజలకు సంగీత రససిద్ధి కలిగించిన బాలసుబ్రహ్మణ్యం లాంటి నాదయోగులు ఈ కోవలోకే వస్తారు. బాలు అంటే, వ్యక్తి కాదు, ఓ వ్యవస్థ. గతానికి, వర్తమానానికి మధ్య చక్కటి స్వరాల వారధి. ఒక్క మాటలో చెప్పాలంటే అమర స్వర గంధర్వుడు. వారు పాడిన గీతాల రూపంలో సంగీత అభిమానుల గుండెల్లో వారెప్పుడూ జీవించే ఉంటారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘మంచి మనిషిగా గుర్తు పెట్టుకుంటే చాలు’ అని ఆయన అన్నారు. బాలూ! మహా మనిషిని జాతి ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటుంది!

(రచయిత- వెంకయ్యనాయుడు, భారత ఉపరాష్ట్రపతి)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.