అడ్డదారిలో సాధించిన విజయానికి అసలు విలువే లేదన్న తొలి ప్రధాని నెహ్రూ మహితోక్తి నేడు చెల్లని కాసు. చట్టబద్ధ నిబంధనల్ని ప్రవర్తన నియమావళిని అడ్డగోలుగా ఉల్లంఘించి పైచేయి చాటుకోవడానికి పార్టీలన్నీ యథేచ్ఛగా పోటీపడుతుంటే- ఎన్నికల రక్షక్షేత్రంలో సమస్త ప్రజాతంత్ర విలువలూ క్షతగాత్రమై విలపిస్తున్నాయిప్పుడు! తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అసోంలో ఆరో తేదీనే పోలింగుకు తెరపడగా, ఈనెల 29దాకా మరో నాలుగు విడతల ఓటింగ్ జరగాల్సి ఉన్న పశ్చిమ్ బంగలో రాజకీయ వాతావరణం తీవ్ర ఉద్రిక్తభరితంగా ఉంది. దాదాపు 6,400 పోలింగ్ కేంద్రాల్ని అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించి, పలు జిల్లాల్లో రెండు మూడు దఫాల పోలింగుకు ప్రతిపాదించి, భారీ సంఖ్యలో కేంద్ర బలగాల్ని మోహరించి ఎనిమిది విడతల ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని నిర్వాచన్ సదన్ ఘనంగా ప్రకటించినా- ప్రవర్తన నియమావళిని నిక్కచ్చిగా అమలు చేసే విషయంలో ఈసీ నిష్పాక్షికతే నేడు ప్రశ్నార్థకమవుతోంది.
ప్రజాస్వామ్యానికి చేటు..
2016 ఎన్నికల్లో కేవలం మూడు అసెంబ్లీ సీట్లు గెలుచుకొన్న కమలం పార్టీ 2019నాటి సార్వత్రిక సమరంలో ఎకాయెకి 18 పార్లమెంటరీ స్థానాలు కైవసం చేసుకొని అధికారపీఠం నుంచి తృణమూల్‌ను పెరికి పారెయ్యాలన్న కదన పౌరుషంతో కదం తొక్కుతోంది. కమలనాథులు పన్నిన పద్మవ్యూహాన్ని ఛేదించి హ్యాట్రిక్ విజయాన్ని ఒడిసిపట్టాలని మమత గిరిగీసి నిలవడంతో- ప్రవర్తన నియమావళి చెదిరిపోతోంది. భాజపా అధినాయక గణం మేర మీరుతున్నా చూసీ చూడనట్లున్న ఎన్నికల సంఘం, తమపైనే కొరడా ఝళిపిస్తోందని ఆక్రోశిస్తున్న మమతా దీదీ- మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను మోదీ కోడ్‌గా తూలనాడుతున్నారు. సమవర్తిగా వ్యవహరించి పోలింగ్ ప్రక్రియ స్వేచ్ఛగా సక్రమంగా సాగేలా చూడాల్సిన ఈసీ నిష్పాక్షికతపై నీలినీడలు- ప్రజాస్వామ్యానికి చేటు.
జవాబుదారీని చేయడం కీలకం..
గుర్తింపు పొందిన రాజకీయ పక్షాలు తమ చుట్టూ ఓ వృత్తం గీస్తే ఎక్కడా బెసగకుండా నడి మధ్యన నిలవడమే స్వీయ రాజ్యాంగ నైతిక ధర్మమని లోగడ సీఈసీగా ఎంఎస్‌గిల్ స్పష్టీకరించారు. ఈసీల నియామకాంశం వివాదగ్రస్తం కాకుండా ప్రత్యేక యంత్రాంగం ద్వారా ఆ బాధ్యతను నెరవేర్చాలన్న రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ సూచనకు ఏడు దశాబ్దాలుగా మన్నన దక్కకపోవడమే నగుబాటు! కేంద్రంలోని పెద్దల చిత్తానుసారం నిర్వాచన్ సదన్ కామందులుగా కుదురుకొనేవారు ఎంతకు తెగిస్తారో నవీన్ చావ్లా ఉదంతమే తేటతెల్లం చేసింది. స్వామిభక్తితో చావ్లా అధికార రహస్యాల్ని వెలుపలికి చేరవేసిన దృష్టాంతాల్ని ఏకరువుపెట్టి సీఈసీ పదవికి తగడంటూ నిర్వాచన్ సదన్ సారథిగా గోపాలస్వామి రాష్ట్రపతికే లేఖ రాసినా, అతగాడినే అదృష్టం వరించింది! గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా- ప్రవర్తన నియమావళి ఉల్లంఘనల ఆరోపణలపై మోదీ, అమిత్ షాలకు క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని తప్పుపడుతూ ఈసీగా లావాసా రాసిన లేఖ కలకలం సృష్టించింది. రాజ్యాంగ విలువలతో రాజీపడని నిబద్ధతగల వ్యక్తుల సారథ్యంలోనే వ్యవస్థలు రాణిస్తాయి. అలాంటివారి ఎంపికకోసం ప్రధాని, దేశ ప్రధాన న్యాయమూర్తి లోక్‌సభలో విపక్ష నేతలతో కమిటీ ఏర్పాటు కావాలన్న గట్టి డిమాండ్లు ఎంతో కాలంగా పోటెత్తుతున్నాయి. అలాంటి ఏర్పాటు అత్యావశ్యకమని అడ్వాణీ నేతృత్వంలో గట్టిగా వాదించిన భాజపా బాణీ నేడు పూర్తిగా మారిపోయింది. ఎన్నికల సంఘం నియామకాలకూ ప్రత్యక యంత్రాంగం ఏర్పాటు కావాలంటూ దాఖలైన కేసు రాజ్యాంగ ధర్మాసనం పరిశీనలో ఉంది. తమ అభీష్టాన్ని స్వేచ్ఛగా, సక్రమంగా ప్రతిఫలింపజేసే పటిష్ఠ వ్యవస్థ ఉందన్న జన విశ్వాసమే ప్రజాస్వామ్యానికి పునాది. అది బీటలు వారకుండా చూసుకోవడానికి నిర్వాచన్ సదన్ నియామకాల్ని ప్రత్యేక కమిటీ ఏకగ్రీవంగా జరిపేలా చూడటం, ఈసీని పార్లమెంటుకు జవాబుదారీ చెయ్యడం అత్యంత కీలకమని గుర్తించాలి!
ఇదీ చూడండి: 'మినీ పాకిస్థాన్' వ్యాఖ్యలపై సువేందుని మందలించిన ఈసీ