భారతదేశ ఆత్మ వ్యవసాయంలోనే ఉంది. సాగులో మనం స్వయం సమృద్ధి సాధిస్తే, ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటే- మన రైతుకు, దేశానికి తిరుగుండదు. గడచిన ఆరేళ్లుగా మోదీ ప్రభుత్వం ఈ దిశగానే సాగుతోంది. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన 'ఆత్మ నిర్భర్ భారత్' ఉద్దేశమూ స్వావలంబనే. తాజా ఆర్డినెన్సులు సహా మోదీ ప్రభుత్వం వేసే అడుగులన్నీ ఈ దిశగానే. ఉదాహరణకు గతంలో మన దేశం 30 వేల కోట్ల నుంచి 40 వేల కోట్ల రూపాయల విలువైన పప్పు ధాన్యాలు దిగుమతి చేసుకొనేది. మోదీ సర్కారు వచ్చిన తరవాత పప్పు దినుసుల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించింది. పామోలిన్, వేరుశనగ, పొద్దు తిరుగుడు వంటి వాటిని దిగుమతి చేసుకునే స్థాయి నుంచి నూనె గింజల ఉత్పత్తిలోనూ స్వయం సమృద్ధి సాధించే దిశగా సాగుతున్నాం. ఇందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తోంది. వ్యవసాయంపై ఎక్కువ మంది ఆధారపడినా- ఇప్పటికీ మనం పాల పొడి, వెన్న, నెయ్యి వంటి వాటిని దిగుమతి చేసుకుంటూనే ఉన్నాం. అందుకే పాలు, అనుబంధ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించాలని మోదీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. మత్స్య ఉత్పత్తులను ఇప్పటికే ఎగుమతి చేస్తున్నాం. వీటిని పెంచడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని మరింత రాబట్టుకోవచ్చు. వెరసి మోదీ హయాములో వ్యవసాయం, పాల ఉత్పత్తులు, మత్స్య ఉత్పత్తుల్లో (గ్రీన్, వైట్, బ్లూ రివల్యూషన్) విప్లవం దిశగా భారత్ ముందుకు సాగుతోంది.
రైతుల ఆదాయం రెట్టింపు
సాగులో స్వావలంబనతో దేశవ్యాప్తంగా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని 2016లో ప్రధాని మోదీ ప్రకటించారు. అందుకు మూడు లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. వ్యవసాయ ఖర్చులు తగ్గించడం. ప్రతి ఎకరాలో పండే పంట దిగుబడిని పెంచడం, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పంటలకు మద్దతు ధరను ఇనుమడింపజేయడం అన్నవి ఆయన ఏర్పరచుకున్న లక్ష్యాలు. ఖర్చుల తగ్గింపులో భాగంగా ప్రతి ఎకరాలోనూ భూసార పరీక్షలతోపాటు, ఎక్కడ ఏ పంట పండుతుందో నిర్ధారించాలని నిర్ణయించారు. ఏ పంట పండితే దానినే వేసేలా ప్రోత్సహించాలని భావించారు. ఇందులో భాగంగా ప్రతి రైతుకూ భూసార ఆరోగ్య కార్డులు ఇవ్వాలని మోదీ ప్రభుత్వం ప్రతిపాదించింది. తద్వారా ఎరువులు, పురుగు మందులను ఎంత అవసరమో అంతే మోతాదులో వేస్తారు. దాంతో రైతుకు ఖర్చు తగ్గుతుంది. భూసారం పెరుగుతుంది. ఖర్చులు తగ్గించడంలో భాగంగా యాంత్రీకరణకు పెద్దపీట వేసింది. ఇక, దిగుబడులు పెంచడానికి మోదీ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. కొత్త వంగడాలు, విత్తనాలను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు నూతన పరిశోధనలకు పెద్దపీట వేసింది. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్)కి ఏటా రూ.2,000 కోట్లు కేటాయిస్తోంది. ఇందిరా గాంధీ తరవాత కేవలం మోదీ మాత్రమే ఐసీఏఆర్‌కు ఈ స్థాయిలో నిధులు కేటాయిస్తున్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 27 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయ్యాయి. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వావలంబన సాధించడమే కాదు, ఇప్పుడు ఎగుమతి చేయడానికీ సిద్ధంగా ఉన్నాం. గడచిన ఆరేళ్లుగా మోదీ సర్కారు అనుసరించిన విధానాలే ఇందుకు కారణం. ఇక, అత్యంత ముఖ్యమైనది మద్దతు ధరలు అందించడం. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత కేవలం ఆరేళ్లలోనే దేశవ్యాప్తంగా 23 రకాల వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరలు రెట్టింపు అయ్యాయి. దాదాపు ఆరు దశాబ్దాల స్వతంత్ర భారతంలో మద్దతు ధర ఏ స్థాయిలో పెరిగిందో ఆరేళ్ల మోదీ హయాములోనే మద్దతు ధరలు ఆ మేర ఇనుమడించాయి. ఉదాహరణకు ఆరు దశాబ్దాల చరిత్రలో వరి మద్దతు ధర రూ.1,360కి చేరుకుంటే- కేవలం ఆరేళ్లలోనే మోదీ ప్రభుత్వం మరో రూ.508 పెంచింది. రాగుల మద్దతు ధర రెట్టింపుపైనే పెరిగింది. 2014-15లో రాగుల మద్దతు ధర రూ.1,550 ఉంటే, తాజాగా పెంచిన దానితో కలుపుకొని అది రూ.3,295కు చేరుకుంది. పత్తి మద్దతు ధర ఏకంగా రూ.3,750 నుంచి రూ.5,515కి చేరుకుంది. మద్దతు ధరలు మాత్రమే కాదు- ‘నాబార్డు’ ద్వారా రైతులకు అందించే దీర్ఘకాలిక రుణ మొత్తం ఆరేళ్ల కిందట ఆరు లక్షల కోట్ల రూపాయలు కాగా- ఇప్పుడు అది 15 లక్షల కోట్లకు చేరింది. వివిధ పంటలకు ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ను సైతం కేంద్ర ప్రభుత్వం పెంచింది. పత్తికి గతంలో ఎకరాకు రూ.20 వేలు మాత్రమే రుణం ఇస్తే ఇప్పుడు దాన్ని 40 వేల రూపాయలకు పెంచింది. మిగిలిన పంటలదీ ఇదే పరిస్థితి. ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతులు నష్టపోకుండా ఫసల్ బీమా యోజనను అమలులోకి తీసుకొచ్చింది. పీఎం కిసాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది.
బద్దలైన సంకెళ్లు
పంట ఉత్పత్తుల విక్రయాలపై దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆంక్షలను మోదీ ప్రభుత్వం ఎత్తివేసింది. తాము కష్టపడి పండించిన పంటను ఇకనుంచి స్వేచ్ఛగా, తమకు ఇష్టం వచ్చిన వారికి అమ్ముకునే విధంగా రైతులకు స్వేచ్ఛనిచ్చింది. చిన్న దుకాణాల నుంచి బడా వ్యాపారుల వరకూ ఎవరితోనైనా ఒప్పందాలు చేసుకోవచ్చు. తద్వారా దేశం మొత్తాన్నీ మోదీ ప్రభుత్వం ఒకే వ్యవసాయ విపణిగా చేసింది. ఇందుకోసం ఆరున్నర దశాబ్దాల నాటి నిత్యావసర వస్తువుల చట్టాన్ని సవరించింది. తృణ ధాన్యాలు, కాయ ధాన్యాలు, ఉల్లి గడ్డలు వంటి వాటిని నిత్యావసర వస్తువుల జాబితా నుంచి తొలగించింది. రాష్ట్రం లోపల, రాష్ట్రాల మధ్య ఎలాంటి ఆటంకాలూ లేకుండా వ్యవసాయ వ్యాపారం చేసుకోవడానికి లాకులు తెరిచింది.
దళారుల బెడద లేని విపణి
రైతులు తమ పంట ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకోవడానికి వీలుగా ఈనామ్ (ఎలెక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్) తీసుకొచ్చింది మోదీ ప్రభుత్వమే. దేశవ్యాప్తంగా 600 మార్కెట్ యార్డుల్లో వీటిని ఏర్పాటు చేసింది. ఒక్క తెలంగాణలోనే 44 ఈనామ్‌లను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆత్మ నిర్భర్ భారత్ కింద మరో 20 ఈనామ్ మార్కెట్లను ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ కంప్యూటర్లు సహా అన్ని మౌలిక సదుపాయాలూ ఉంటాయి. ఉదాహరణకు, ఖమ్మం మార్కెట్లో మిర్చి క్వింటాలు రూ.5,000 ఉందనుకుందాం. నాగపూర్ మార్కెట్లో దాని రేటు రూ.15 వేలు ఉందనుకుంటే- ఇక్కడి నుంచే రైతు తన ఉత్పత్తిని నాగపూర్ మార్కెట్లో అమ్ముకోవచ్చు. ఇందుకు కొనసాగింపే కేంద్ర మంత్రివర్గం తాజాగా తీసుకున్న నిర్ణయాలు. చిత్తూరు జిల్లాలో టమేటాలు విరివిగా పండిస్తారు. కానీ, ఒక్కో సమయంలో వాటికి ధర లేక నేలపాలు చేస్తారు. ఇటువంటి పరిస్థితులు ఇకపై ఉండబోవు. ఆంధ్రప్రదేశ్‌లో టమేటాలకు ధర లేదనుకుందాం. మహారాష్ట్రలో మంచి ధర పలుకుతోందనుకుంటే- ముగ్గురు నలుగురు రైతులు కలిసి అక్కడి నుంచే తమ ఉత్పత్తిని మహారాష్ట్రకు తీసుకువెళ్ళి విక్రయించుకోవచ్చు, లేదా ఈనామ్‌లో భాగంగా విక్రయించి రవాణా చేయవచ్చు. ఫలితంగా వారికి మార్కెట్ ఖర్చులు తగ్గుతాయి. మెరుగైన ధర లభిస్తుంది. ఆ ఉత్పత్తులను విక్రయించే రైతులపై ఎటువంటి ‘సెస్’గానీ ‘లెవీ’గానీ ఉండవు. ఎగుమతిదారులు, వ్యాపారులు, పెట్టుబడిదారులతో రైతులు నేరుగా మాట్లాడుకోవడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తద్వారా, రైతులు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు సైతం స్వేచ్ఛగా తరలించవచ్చు. వ్యవసాయ రంగంలోనూ ప్రైవేటు పెట్టుబడులు వస్తాయి. ఆహార ఉత్పత్తుల వృథా తగ్గిపోవడంతోపాటు దళారుల బెడద చాలా వరకు సమసిపోతుంది. రైతులు మార్కెటింగ్ చేసుకోవడానికి ఉన్న మరో అడ్డంకి రవాణా. అందుకే, రైతులు తమ ఉత్పత్తులను దేశీయంగా, అంతర్జాతీయంగా తరలించుకోవడానికి కిసాన్ రైలు, కిసాన్ ఉడాన్ పథకాలను ప్రవేశపెడతామని కేంద్ర బడ్జెట్లోనే మోదీ సర్కారు హామీ ఇచ్చింది. ఆ రెండూ వస్తే, రైతు తన ఉత్పత్తులను ఎక్కడికైనా తరలించుకోవచ్చు. పంటలకు, రైతులకు మధ్య వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలను విధిస్తుంటే- దశాబ్దాలుగా పేరుకుపోయిన అడ్డుగోడలను మోదీ ప్రభుత్వం బద్ధలు కొడుతోందన్నది కాదనలేని నిజం!
- జి.కిషన్రెడ్డి (రచయిత- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి)