విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనది. ఈ వృత్తిలో ప్రవేశించడానికి తరగతి గది బోధన, పిల్లల మనస్తత్వం, పాఠశాల నిర్వహణ, ప్రణాళికపై అవగాహనతో పాటు నాయకత్వ లక్షణాలూ అవసరం. ఈ అంశాలన్నింటినీ బీఎడ్, డీఎడ్ వంటి ఉపాధ్యాయ వృత్తి కోర్సుల్లో బోధిస్తారు. దేశవ్యాప్తంగా అనేక ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ఈ కోర్సులను అందిస్తున్నాయి. ఏటా లక్షల విద్యార్థులు ఈ శిక్షణ పొందుతున్నారు. కానీ, ఉపాధ్యాయ వృత్తి విద్య పూర్తిచేసిన వారిలో చాలామేరకు ఈ నైపుణ్యాలు కొరవడుతున్నాయని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బోధనలో ప్రమాణాలను మెరుగు పరిచేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను విద్యాహక్కు చట్టం సిఫార్సు చేసింది. వృత్తి విద్యను పూర్తి చేసినవారు ఉపాధ్యాయులుగా ఎంపిక కావాలంటే ఈ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. పదేళ్ల నుంచి అన్ని రాష్ట్రాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఇందులో ఒకసారి ఉత్తీర్ణులైతే ఆ ధ్రువపత్రం ఏడేళ్ల వరకు చెల్లుబాటు అయ్యేది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ నిబంధనను సవరించింది. అభ్యర్థి ఒక్కసారి టెట్ ఉత్తీర్ణుడైతే చాలు, జీవితకాలం పాటు ఆ ధ్రువపత్రం చెల్లుబాటు అయ్యేలా కీలక మార్పు చేసింది.
నిర్వహణలో లోటుపాట్లు
ఉపాధ్యాయ నియామకాల్లో గతంలో దేశవ్యాప్తంగా ఏకరూప విధానం ఉండేది కాదు. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రత్యేకంగా రాత పరీక్షను నిర్వహించకుండానే, ఉపాధ్యాయ కోర్సులో పొందిన మార్కులను పరిగణనలోకి తీసుకుని నియామకాలు చేపట్టేవారు. దీనితో విద్యా బోధనలో నాణ్యత దెబ్బతినేది. ఈ లోపాన్ని సవరించడానికి టెట్‌ను తప్పనిసరి చేశారు. చాలా రాష్ట్రాల్లో ఈ పరీక్ష విధానం, నిర్వహణ తీరుపై విమర్శలు వస్తున్నాయి. మరోవైపు, పోస్టుల భర్తీలో టెట్‌కు కొన్ని రాష్ట్రాలు వెయిటేజీ ఇవ్వగా- మరికొన్ని దీన్ని అర్హత పరీక్షగానే పరిగణిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఇస్తుండటంతో మార్కులు పెంచుకోవడానికి విద్యార్థులు మళ్ళీ మళ్ళీ పరీక్ష రాస్తున్నారు. దీంతో విద్యార్థులపై ఆర్థిక భారం పడటంతో పాటు విలువైన కాలం వృథా అవుతోంది. అలాగే, టెట్‌ను ఏటా రెండు సార్లు నిర్వహించాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) పేర్కొన్నా చాలా రాష్ట్రాలు దాన్ని పాటించడంలేదు. ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకూ టెట్ అర్హతను తప్పనిసరి చేశారు. దీనితో డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన వాళ్లెందరో టెట్‌కు ఎదురుచూడాల్సి వస్తోంది. సబ్జెక్టులవారీగా పరీక్ష నిర్వహిస్తున్న తీరు సైతం లోపభూయిష్ఠంగా ఉంది. ముఖ్యంగా భాషా పండితులకూ గణితం, విజ్ఞాన శాస్త్రాల్లో ప్రావీణ్యాన్ని పరీక్షిస్తున్నారు. ఈ పరిణామాలతో కొన్నాళ్ల నుంచి టెట్‌పై నిరుద్యోగుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఇప్పటి వరకు ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకే టెట్ తప్పనిసరి అర్హతగా ఉంది. దాన్ని పూర్వ ప్రాథమిక నుంచి సెకండరీ పాఠశాలల (9-12 తరగతులు) ఉపాధ్యాయుల వరకు అందరికీ వర్తింపజేయాలని ఎన్‌సీటీఈ నిర్ణయించింది. ఆ మేరకు మార్గదర్శకాల రూపకల్పనకు ఓ సంఘాన్ని నియమించింది. దీనితో భవిష్యత్తులో టెట్ ప్రాధాన్యం ఇంకా అధికమయ్యే అవకాశం ఉంది. ఈ పరీక్ష రాసేవారి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. గడచిన పదేళ్లలో ఇందులో పోటీ 67 శాతం మేరకు అధికమైంది. కానీ, అర్హత సాధిస్తున్నవారి సంఖ్యే ఆశించిన స్థాయిలో లేదు. ఈ పరిస్థితుల్లో సమకాలీన అవసరాలకు అనుగుణంగా టెట్‌లో మరిన్ని సంస్కరణలకు శ్రీకారం చుట్టాలి. కొత్త విద్యా విధానానికి అనుగుణంగా టెట్‌లో చేయాల్సిన మార్పుచేర్పులపై ఎన్‌సీటీఈ సైతం రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కోరింది.
అందరికీ అవకాశమివ్వాలి
కొన్ని రాష్ట్రాలు ఉపాధ్యాయ నియామక పరీక్షలోనే టెట్‌నూ కలిపేసి నిర్వహిస్తున్నాయి. దీంతో ప్రైవేటు పాఠశాలల్లో పని చేయాలనుకునే వారికి అర్హత పత్రం లేకుండా పోతోంది. ఈ రెండు పరీక్షలను వేర్వేరుగా నిర్వహించాలి. ఒకే పరీక్షగా నిర్వహించాలనుకుంటే అర్హతకు కనీస మార్కులు నిర్ణయించి, వాటిని అందుకున్న వారందరికీ ధ్రువపత్రాలు అందజేయాలి. ఇలా చేస్తే ఉపాధ్యాయ నియామకాల్లోనూ జాప్యం జరగదు. నూతన విద్యావిధానంలో ప్రాథమిక విద్యను ఆయా రాష్ట్రాల మాతృభాషల్లో బోధించాలని పేర్కొన్నారు. కాబట్టి జాతీయ స్థాయి సి.టెట్‌ను సైతం ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలి. తద్వారా ఆయా భాషా మాధ్యమాల్లో చదువుకున్న విద్యార్థులకు సీబీఎస్‌ఈ, ఇతర కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో ఉపాధ్యాయులుగా నియమితులయ్యేందుకు అవకాశాలు లభిస్తాయి. ఆంగ్లం, హిందీల్లోనే ఈ పరీక్షను నిర్వహిస్తున్నందువల్ల ఉత్తీర్ణత శాతం తగ్గుతోంది. ఉపాధ్యాయ నియామకాల్లో ఆబ్జెక్టివ్ తరహాలో కాకుండా డిస్క్రిప్టివ్ విధానంలో రాత పరీక్ష నిర్వహించి, తరగతి గది బోధనను పరీక్షించాలనే వాదనలు పెరుగుతున్నాయి. విద్యావేత్తల సూచనల మేరకు దీనిపై తగిన నిర్ణయం తీసుకోవాలి. ఉపాధ్యాయ విద్యలోనూ నాణ్యతా ప్రమాణాల పెంపునకు కృషి చేయాలి. రేపటి పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్రను గుర్తెరిగి ఆమేరకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటేనే బాలల భవిష్యత్తుకు బంగారు బాటలు పడతాయి.
- సంపతి రమేష్ మహారాజ్