కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ఇండియాను టాటా గ్రూపు (Air India Tata) పరం చేయడంపై అటు ఉద్యోగుల నుంచి కానీ, ఇటు రాజకీయ వర్గాల నుంచి కానీ తక్షణ విమర్శలేవీ రాలేదు. ఫలితంగా ఎన్‌డీఏ ప్రభుత్వం ఇక సంస్కరణల పథంలో మరింత జోరుగా ముందుకు సాగనుందనే విశ్లేషణలు వినవస్తున్నాయి. ప్రైవేటీకరణకు తోడుగా అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి, రాబోయే డిజిటల్ పారిశ్రామిక యుగానికి దేశాన్ని సంసిద్ధం చేయడానికి కేంద్రం కట్టుబడి ఉంది. ఆ మేరకు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడానికి ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ (Air India Tata) తోడ్పడవచ్చు. దశాబ్దానికి పైగా ఒక్క రూపాయి లాభం ఆర్జించలేకపోయిన ఎయిర్ ఇండియాకు ప్రస్తుతం రోజుకు 20 కోట్ల రూపాయల నష్టం వస్తోంది. ఆ సంస్థను నిలబెట్టడానికి ప్రభుత్వం మరెంతో కాలం ప్రజాధనాన్ని వెచ్చించే స్థితిలో లేదు. అసలే కొవిడ్‌తో కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థకు ఆ స్తోమతా లేదు. ప్రభుత్వం పని పాలించడమే తప్ప వ్యాపారం చేయడం కాదని సూత్రీకరిస్తూ నరేంద్ర మోదీ సర్కారు, ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను ప్రైవేటు రంగానికి విక్రయించే కార్యక్రమాన్ని చేపట్టింది. దాన్ని మరింత బలంగా ముందుకు తీసుకువెళ్ళడానికి ఎయిర్ ఇండియా అమ్మకం ఊతమిస్తుంది.
పెరిగిన పోటీతో కష్టనష్టాలు
టాటా సన్స్ ఛైర్మన్ సర్ దొరాబ్జీ టాటా తొంభై ఏళ్ల క్రితం అయిష్టంగా ఇచ్చిన రెండు లక్షల రూపాయల మూలధనంతో జేఆర్‌డీ టాటా ఎయిర్ ఇండియాను ప్రారంభించారు. దాన్ని 68 ఏళ్ల క్రితం కేంద్రం జాతీయీకరించింది. తాజాగా ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ (Air India Tata) కొనుగోలు చేయడం వల్ల ఆ సంస్థ పుట్టింటికి తిరిగిచేరినట్లయింది. ఎయిర్ ఇండియా పాటు లాభాల్లో నడుస్తున్న అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ను పూర్తిగా, రవాణా కార్యకలాపాలు నిర్వహించే ఏఐశాట్స్ సంస్థలో 50 శాతం వాటాలను టాటాలు (Air India Tata) కైవసం చేసుకున్నారు. ఇందుకు స్పైస్ జెట్ పోటీపడినా, దానికన్నా ఎక్కువ ధర కోట్ చేసి టాటా గ్రూప్ వేలంలో గెలిచింది. దీనివల్ల స్వదేశంలో 4400, అంతర్జాతీయంగా 1800 ల్యాండింగ్, పార్కింగ్ ప్రదేశాలు, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో 900 స్లాట్‌లు టాటాల పరమవుతాయి. దాదాపు 140 ఎయిర్ ఇండియా విమానాలూ వారి అధీనంలోకి వెళ్తాయి.
విదేశాలకు విమానాలను నడిపే ఎయిర్ ఇండియా, స్వదేశంలో విమాన సర్వీసులు నిర్వహించే ఇండియన్ ఎయిర్‌లైన్స్ చాలాకాలం లాభాల్లో నడిచాయి. 1991 నాటి ఆర్థిక సరళీకరణ వల్ల దేశంలో ప్రైవేటు విమానయాన సంస్థలు రంగంలోకి దిగడం వల్ల ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు పోటీ పెరిగింది. దాన్ని తట్టుకోవడానికి 2007లో ఆ సంస్థను ఎయిర్ ఇండియాలో విలీనం చేశారు. కానీ, సంవత్సరం తిరిగేసరికే ఎయిర్ ఇండియాకు రూ.2226 కోట్ల నష్టం వచ్చి, అప్పులు చేయసాగింది. అలా పేరుకుపోయిన అపార రుణభారం- ఆ సంస్థ ప్రైవేటీకరణకు ఇంతకాలం ప్రతిబంధకంగా నిలిచింది.
ఈ ఏడాది ఆగస్టు 31నాటికి ఎయిర్ ఇండియా మొత్తం రుణాలు రూ.61,560 కోట్లకు చేరాయి. అందులో రూ.15,300 కోట్ల రుణాలను మాత్రం టాటా గ్రూప్ స్వీకరిస్తుంది. మిగిలిన రూ.46,262 కోట్లతో దానికి సంబంధం ఉండదు. ఆ రుణాలు ఎయిర్ ఇండియా ఎసెట్ హోల్డింగ్స్ లిమిటెడ్ అనే ప్రత్యేక ప్రయోజన సంస్థ (ఎస్‌పీవీ) ఖాతాలో ఉంటాయి. ఎయిర్ ఇండియా భూములు, ఇతర ఆస్తులను విక్రయించి, ఆ రుణాలను చెల్లువేసే అధికారం ఈ ఎస్‌పీవీకి కట్టబెట్టారు. ఆస్తుల విక్రయం ద్వారా గరిష్ఠంగా రూ.14,718 కోట్లు సేకరించవచ్చు. మిగిలిన రూ.28,844 కోట్ల అప్పులకు ప్రభుత్వమే జవాబుదారీగా ఉండకతప్పదు. ఏతావతా ఎయిర్ ఇండియా స్వాధీనానికి టాటాలు దాఖలు చేసిన రూ.18 వేల కోట్ల బిడ్‌లో నగదు వాటా రూ.2700 కోట్లుగా లెక్కతేలుతోంది. వ్యాపారం పుంజుకొంటే టాటాలు మరిన్ని పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. పన్నెండు వేల మంది ఎయిర్ ఇండియా ఉద్యోగులు ఏడాది పాటు తమ ఉద్యోగాల్లో కొనసాగనున్నారు. ఆ తరవాత టాటా గ్రూప్ ప్రతిపాదించే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకాన్ని (వీఆర్‌ఎస్) స్వీకరించే సౌకర్యం వారికి లభిస్తుంది. 55 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు వీఆర్‌ఎస్ ఇవ్వవచ్చు. సుశిక్షితులు, అనుభవజ్ఞులైన ఎయిర్ ఇండియా పైలట్లను మాత్రం టాటా గ్రూప్ వదులుకోదు. బోయింగ్ 777 విమానాన్ని నడపడానికి ఒక పైలట్‌కు శిక్షణ ఇవ్వాలంటే కోటి రూపాయల వరకు ఖర్చవుతుంది. ఎయిర్ ఇండియాకు అలాంటి పైలట్లు రెండు వేల మంది వరకు ఉంటారు. ఇంజినీరింగ్ తదితర విభాగాల్లో రెండున్నర వేల దాకా సుశిక్షిత సిబ్బంది ఉన్నారు. వారు ఎయిర్ ఇండియాకే కాక టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఏసియా ఇండియా, విస్టారా ఎయిర్‌లైన్స్ నిర్వహణకూ ఉపయోగపడతారు.
సవాళ్ల స్వాగతం
ఎయిర్ ఇండియాను స్వాధీనం చేసుకున్న టాటా గ్రూప్‌కు ముందుగా ఎదురయ్యే సవాలు- రూ.20 కోట్ల రోజువారీ నష్టాలను తగ్గించి సంస్థను లాభాల బాట పట్టించడం ఎలా అన్నదే! కొవిడ్ వల్ల పౌర విమానయాన రంగం దెబ్బతిన్న తరుణంలో లాభార్జన చాలా కష్టసాధ్యం. ప్రస్తుతం విమానాశ్రయాల్లోనూ, ఇతరత్రా వివిధ సేవలను అందించే వెండర్లకు ఎయిర్ ఇండియాను చెల్లింపులు బాగా ఆలస్యమవుతున్నాయి. లీజు రుసుముల కింద రూ.18 వేల కోట్లు చెల్లించాల్సి వస్తోంది. టాటా గ్రూప్‌కు ఎయిర్ ఇండియాతో పాటు మరో రెండు ఎయిర్‌లైన్స్ ఉన్నందు వల్ల అందులో రాయితీని అభ్యర్థించవచ్చు. వెండర్లకు చెల్లించే రుసుములనూ తగ్గించాలని కోరవచ్చు. ఆ వెండర్లలో చాలామందికి రాజకీయ సంబంధాలు ఉన్నమాట నిజమే అయినా, కేంద్రం ప్రైవేటీకరణకు కట్టుబడి ఉండటం వల్ల టాటా గ్రూప్‌నకు వారి నుంచి ఇబ్బందులు రాకపోవచ్చు. మొత్తంమీద ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ చాలా సంక్లిష్ట కార్యం. దాన్ని దిగ్విజయంగా పూర్తిచేసిన కేంద్రం ఇక బీపీసీఎల్ ప్రైవేటీకరణపైనా, ఎల్‌ఐసీ ఐపీఓ మీద దృష్టి కేంద్రీకరించనుందంటున్నారు.
రెండు దశాబ్దాల ప్రయత్నం
ప్రభుత్వం 2001లోనే ఎయిర్ ఇండియాలో 40శాతం వాటాలను అమ్మకానికి పెట్టినా, ప్రైవేటు రంగం వాటిని కొనడానికి ముందుకురాలేదు. మళ్ళీ 2018లో ఎన్డీఏ సర్కారు ఎయిర్ ఇండియాలో 76శాతం వాటాలను అమ్మకానికి పెట్టగా, కనీసం ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదు. అలాంటిది ఇప్పుడు కొవిడ్ దెబ్బకు విమానయాన రంగం కుదేలైనా, కేంద్రం ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణను విజయవంతంగా పూర్తిచేయగలిగింది. ఇంతకుముందు చేసిన ప్రయత్నాలు విఫలం కావడానికి కారణం- ఎయిర్ ఇండియాలో ప్రభుత్వం కొంత వాటాను అట్టిపెట్టుకోవాలని చూడటం. దీనివల్ల తమ వ్యాపార ప్రణాళికలకు, కార్య నిర్వహణ స్వేచ్ఛకు సర్కారు ఎప్పటికప్పుడు అడ్డుతగులుతుందన్న అనుమానంతో ఎయిర్ ఇండియా కొనుగోలుకు ఎవరూ ముందుకురాలేదు. ఈసారి ఎయిర్ ఇండియా మొత్తం వాటాలను ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం వల్ల ప్రైవేటు రంగం వెంటనే స్పందించింది.
- వరప్రసాద్
ఇదీ చూడండి : 'ఆస్తులు టాటాలకు.. అప్పులు ప్రజలకా?'