ప్రకృతి విసిరిన సవాలు ముందు మనిషి ఎంత చిన్నవాడో తేలిపోతోంది. పర్యావరణాన్ని కాపాడకపోతే, ప్రకృతి నియమాలను లక్ష్యపెట్టకపోతే విరుచుకుపడే ఉత్పాతానికి తార్కాణమే... దేశంలో రోజూ సగటున రెండున్నర లక్షలకు మించి విస్తరిస్తున్న కరోనా కేసులు! ముప్పు పెరుగుతున్న కొద్దీ సౌకర్యాలు, సంసిద్ధత పెరగాలి. కానీ, దేశంలో ఆ తరహా సన్నద్ధత కనిపించడం లేదు. మొదటి దశ కరోనా కొంతమేర మందగించినప్పుడు... కరోనాపై విజయం సాధించామని ప్రభుత్వం నిరుడు ఘనంగా ప్రకటించుకుంది. ముప్పు తొలగిపోలేదని, నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అప్పుడే నిపుణులు హెచ్చరించారు. ప్రైవేటు వైద్య వ్యవస్థలు పూర్తిగా చేతులు ఎత్తేసిన నేపథ్యంలో ప్రభుత్వ రంగంలో మౌలిక సౌకర్యాలు విస్తరించుకోవాల్సిన తక్షణావశ్యకతను ఆరోగ్య నిపుణులందరూ గుర్తు చేశారు. ఇవాళ కొవిడ్ రోగులకు ఆసుపత్రుల్లో పడకలు దొరకని పరిస్థితి నెలకొందంటే అందుకు కారణం... ఆరోగ్య రంగంలో మౌలిక సౌకర్యాల అభివృద్ధిపై ప్రభుత్వానికి పట్టింపులేకపోవడమే!
కిటకిటలాడుతున్న ఆసుపత్రులు..
దేశంలో దాదాపు ప్రతి ఆసుపత్రీ కొవిడ్ వ్యాధిగ్రస్తులతో కిటకిటలాడుతోంది. ఇతర రకాల ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న వారికి దిక్కుతోచడం లేదు. ఆరోగ్య వ్యవస్థలు దాదాపుగా కుప్పకూలిన దురవస్థ కనిపిస్తోంది. ఉత్తర్ ప్రదేశ్‌లో కొవిడ్ ఒకవైపు ఉరుముతుంటే- వైద్యఆరోగ్య విభాగానికి చెందిన అదనపు ప్రధాన కార్యదర్శి ఉదాసీనంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి బ్రిజేష్ పాఠక్ కొన్ని రోజుల క్రితం ఓ లేఖ రాశారు. ప్రభుత్వ యంత్రాంగం స్థాయిలో పొడగడుతున్న ఉదాసీనతను, సౌకర్యాలకు సంబంధించి వేధిస్తున్న మౌలిక సమస్యలను ఏకరువు పెడుతూ ఆయన రాసిన లేఖ సామాజిక మాధ్యమాల్లో పెద్దయెత్తున చక్కర్లు కొట్టింది. ఉత్తర్ ప్రదేశ్‌లో స్వయంగా అధికార పార్టీకి చెందిన ఓ క్యాబినెట్ మంత్రికే ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతుంటే... ఇక సామాన్యుల పరిస్థితి చెప్పేదేముంది?
సాధారణ రోగులకు ఏమైంది?
మామూలు రోజుల్లోనూ దేశంలో ఆసుపత్రులన్నీ ఇంచుమించుగా కిటకిటలాడుతూనే ఉంటాయి. కొవిడ్ కోర సాచడం వల్ల ఇప్పుడు సర్వత్రా కరోనా వ్యాధిగ్రస్తులే కనిపిస్తున్నారు. సాధారణ రోగులకు ఏమైంది... ఇతర ఆరోగ్య కారణాలతో తీవ్రంగా సతమతమవుతున్న వీరంతా ఇప్పుడెక్కడున్నారు అన్నది జవాబు వెదకాల్సిన ప్రశ్న! ఈ ప్రశ్నకు మనం చెప్పుకొనే సమాధానం జాతి ఆరోగ్య విధానంలోని డొల్లతనాన్ని వెల్లడిస్తుంది. ఒకవైపు కొవిడ్ విజృంభిస్తున్నా టీకాల వేగం మాత్రం పెరగడం లేదు. మరో ఎనిమిది నెలల్లో మూడింట రెండొంతుల జనాభాకు రెండు డోసుల టీకా అందించగలిగితే 'సామూహిక వ్యాధి నిరోధకత' సాధ్యపడుతుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రపంచంలో 60శాతం టీకాలు ఉత్పత్తి చేస్తున్న భారత్- ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ చేరవేయడంలో దారుణంగా వెనకబడి ఉండటమే నిర్ఘాంతపరిచే పరిణామం. ఇదే వేగం కొనసాగితే దేశ ప్రజలందరికీ టీకాలందించేందుకు ఏళ్లూపూళ్లూ పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థలను జాతీయీకరించాలని, ప్రజారోగ్య బాధ్యతలను పూర్తిగా ప్రభుత్వమే స్వీకరించాలన్న డిమాండ్లు ఇప్పటివి కావు. ఆ చారిత్రక అవసరాన్ని కొవిడ్ మరోమారు చాటిచెప్పింది. అలహాబాద్ హైకోర్టు 2018లో ఇచ్చిన తీర్పు ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. ప్రభుత్వ జీతాలు పొందుతున్న ప్రతి ఉద్యోగీ, వారి కుటుంబ సభ్యులూ తప్పనిసరిగా సర్కారీ దవాఖానాల్లోనే చికిత్స పొందాలని న్యాయమూర్తులు ఆదేశించారు. వారి ఆదేశాన్ని తు.చ. తప్పకుండా అమలు పరిస్తే తప్ప ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలు మెరుగుపడవు.
బహుముఖ పోరు
'అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం ఈ భూమ్మీద ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. అలాంటి వ్యవస్థలను రూపొందించుకోవడంలో వైఫల్యమే ఇప్పుడు మన ప్రాణాల్ని తోడేస్తోంది. కరోనా సృష్టిస్తున్న విలయానికి ఆరోగ్య వ్యవస్థలపట్ల మనం ఇన్నాళ్లూ ప్రదర్శించిన నిర్లక్ష్యమే కారణం. ఆరోగ్య రంగంలో ప్రాథమ్యాలను నిర్దేశించుకోవడంలో తొట్రుపాటు స్పష్టంగా కనిపిస్తోంది. బడ్జెట్ కేటాయింపులు అసమానతలకు అంటుకడుతున్నాయి. నాణ్యమైన వైద్యాన్ని డబ్బున్నవారికే పరిమితం చేస్తున్నాయి. ఇది వాంఛనీయం కాదు'- ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మైఖెల్ ర్యాన్ ఆవేదన ఇది. ప్రభుత్వ రంగంలో మరిన్ని ఆసుపత్రులు, మేలిమి సౌకర్యాల ఏర్పాటులో వైఫల్యం మనల్ని ఇప్పుడు వెక్కిరిస్తోంది. కరోనా వంటి మహమ్మారిని ఎదుర్కోవాలంటే ఆరోగ్య సదుపాయాలపరంగా సరైన సన్నద్ధత ఉండాలి. దేశవ్యాప్తంగా ప్రజలు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ తరుణంలో లక్షల రూపాయలు ఖర్చుపెట్టి కరోనా వైద్యం చేయించుకోవడం సామాన్యుడికి సాధ్యమయ్యే పనికాదు. ప్రజారోగ్య వ్యవస్థలే అండగా నిలవాలి. ప్రభుత్వంతోపాటు స్వచ్ఛంద సంఘాలు, వివిధ మత సంస్థలు సైతం చురుగ్గా రంగంలోకి దిగి బాధ్యతను పంచుకోవాలి. ఒక్కపెట్టున విరుచుకుపడిన ఈ విలయాన్ని బహుముఖ ప్రయత్నాలతోనే ఎదుర్కోవాలి!
- సందీప్ పాండే
(రామన్ మెగసెసే పురస్కార గ్రహీత)
ఇదీ చూడండి: కేవలం ఉద్యోగులకే టీకా ఇస్తే.. ఫలితం తక్కువే