కొవిడ్ అంటే జ్వరం, దగ్గు, రుచి, వాసన లేకపోవడం వంటి లక్షణాలు కలిగిన వ్యాధి అని అందరికీ తెలుసు. మానసిక ఆరోగ్యంపైనా కరోనా వైరస్ ప్రభావం కనబరుస్తోందన్నది కాదనలేని వాస్తవం. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం కరోనా ఉద్ధృతంగా ఉన్న సమయంలో మానసిక సమస్యలతో సతమతమయ్యేవారి సంఖ్య భారీగా పెరిగింది. వృత్తిపరమైన ఎదురుదెబ్బలు, దీర్ఘకాలిక లాక్‌డౌన్‌లు, మునుపెన్నడూ లేని భౌతిక దూరాలు మానవాళిని ఒత్తిడికి లోనుచేశాయి. కొత్త జీవన విధానానికి అలవాటుపడే క్రమంలో మానసిక సమస్యలు ముసురుకొన్నాయి.
కరోనా కలవరం..
బయటకు వెళ్ళాలన్నా, ఏ వస్తువునైనా ముట్టుకోవాలన్నా భయంతో వణికిపోయే వాతావరణం వ్యక్తుల మానసిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందనడంలో మరోమాట లేదు. వీటికితోడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లుకొట్టే బెంబేలెత్తించే సమాచారం! కాలానుగుణంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థనుంచి చిన్న కుటుంబ జీవనంలోకి ప్రస్థానించిన భారతీయులు- మనసు కలవరపడినప్పుడు ఊరటనిచ్చి, భరోసా పలికే పెద్దల తోడుకు దూరమయ్యారు. చిన్న ఇళ్లలో ముగ్గురు లేదా నలుగురు ఉంటూ కాంక్రీట్ అడవుల్లో ఒంటరిగా బతకడానికి అలవాటుపడ్డారు. ఒంటరితనాన్ని జయించేందుకు అక్కరకొచ్చే సామాజిక జీవనం దూరమై, ఇళ్లన్నీ కార్యాలయాలుగా మారిన పరిస్థితుల్లో జీవనం కిందుమీదులైంది. మరోవంక ఇళ్లలో గృహిణులపై పనిభారం విపరీతంగా పెరిగింది. పిల్లల పరిస్థితి మరీ దారుణం. వారు ఇంట్లో ఉండలేక, కొత్త విద్యావిధానానికి అలవాటు పడలేక గందరగోళంలో పడ్డారు. 'ఆన్‌లైన్' క్లాసులకు పరిమితమై; వీడియో గేమ్స్ వంటివాటికి అలవాటుపడటంవల్ల సామాజిక నైపుణ్యాలకు విద్యార్థులు దూరమయ్యారు. అన్ని వయసులవారు ఇంట్లోనే గడపడం, స్నేహితులను కలవలేకపోవడం, పని ఒత్తిడి అమాంతం అందరిలోనూ ఆందోళన పెంచాయి. దాంతో కోపం, చికాకు, కుంగుబాటు, ఆందోళన, తలనొప్పి వంటివి ఎక్కువ అయ్యాయి.
కొందరిలో ఆరోగ్యపరమైన ఆందోళన పెరిగింది. కరోనా వచ్చింది, వచ్చేస్తుంది అన్న ఆదుర్దా వారిని కుంగదీసింది. అవసరమున్నా లేకపోయినా పరీక్షలు చేసుకోవడం సహా, చుట్టూ ఉన్నవారికీ చేయించడం వారికి అలవాటుగా మారింది. భౌతికదూరం పాటించడం మరో సమస్యగా మారింది. ఇంటికి ఎవరు వచ్చినా అనుమానం, ఎవరేం ముట్టుకుంటారోనని భయం! వీటికితోడు మితిమీరిన శుభ్రత మరో సమస్య. మానసిక ఒత్తిడినుంచి బయటపడే పేరిట కొందరు మద్యపానం, ధూమపానం వంటి వ్యసనాలను ఆశ్రయించారు. మరోవంక ఇంటి సభ్యుల మధ్య ఒకరిపై మరొకరికి చికాకు, కోపం పెరగడంవల్ల గొడవలు, గృహహింస విస్తరించాయి. కరోనా తగ్గుముఖం పట్టింది అని సంబరపడేలోగా మళ్ళీ మహమ్మారి మునుపటికన్నా వేగంగా విజృంభిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఒత్తిడి తగ్గించుకుని మానసిక ఆరోగ్యం కాపాడుకోవడం ఎలా అన్నది అందరి ముందు ఉన్న అతి పెద్ద ప్రశ్న.
ఇదిగో పరిష్కారం..
వ్యాయామం, మంచి ఆహారం, సరైన నిద్ర ఒత్తిడిని తగ్గిస్తాయి. వ్యాయామం ఎన్‌డార్ఫిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. కాబట్టి వ్యాయామం చాలా ముఖ్యం. మరోవంక ఒకరిని మరొకరు నిందించుకుంటూ కాలం గడిపేయకుండా- సావధానంగా వ్యవహరించాలి. మన చుట్టూ ఉన్న పరిస్థితులను అంగీకరించాలి. ఇంట్లోనే చిన్నపాటి యోగాసనాలు వేయడం దినచర్యలో భాగం కావాలి. పిల్లలనూ ఇందులో భాగస్వాములను చేయాలి. వీలైనంతవరకు ఇంట్లో పని అందరూ కలిసి సరదాగా చేసుకోవాలి. పిల్లలకూ కొన్ని బాధ్యతలను అప్పగించి వారినీ జవాబుదారీగా మార్చాలి. ప్రణాళికాబద్ధంగా రోజును గడపడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఒకరి ఒత్తిడిని మిగిలిన వారు అర్థం చేసుకొని సర్దుకుపోవాలి. కుదిరితే ఇంటిల్లపాదీ కలిసి ఉదయం, సాయం వేళల్లో నడకకు వెళ్ళాలి. రోజులో ఒకసారైనా అందరూ కలిసి భోజనం చెయ్యాలి. దీని వల్ల కుటుంబసభ్యుల మధ్య ప్రేమానురాగాలు ఇనుమడిస్తాయి. నాణ్యమైన నిద్ర తప్పనిసరి. రోజూ ఒకే సమయంలో నిద్రించడం చాలా అవసరం. పనులను ప్రాధాన్యత, ఆవశ్యకత క్రమంలో విభజించాలి. దీనివల్ల పనుల పట్ల స్పష్టత పెరుగుతుంది... ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబసభ్యులు అందరూ కలిసి చిన్న చిన్న ఆటలు ఆడుకోవడం వల్ల పిల్లలకు స్నేహితులులేని లోటు తెలియదు. తద్వారా మానసిక ఉల్లాసం, రోగ నిరోధక శక్తి సైతం పెరుగుతాయి. కరోనా క్లిష్టమైన సమయాల్లో మానసిక స్థెర్యమే మనల్ని నిలబెడుతుందని అందరూ గుర్తుంచుకోవాలి.
- డాక్టర్ అనిత ఆరె (క్లినికల్ సైకాలజిస్ట్)
ఇదీ చూడండి:మాతృభాషలో బోధనతోనే నేర్పరితనం