ప్రజల ప్రాణాలను కాపాడే వైద్యులే ఇటీవలి కాలంలో ఆత్మహత్యలకు పాల్పడుతుండటం సమాజాన్ని నివ్వెరపాటుకు గురి చేస్తోంది. 2019లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి లక్ష మంది వైద్యుల్లో పది మందికి పైగా ఆత్మహత్యలు (suicide among doctors) చేసుకున్నారని, ఇండియాలో ప్రతి లక్షమంది వైద్యుల్లో 16 మందికి పైగా బలవన్మరణాలకు పాల్పడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అమెరికాలో వైద్యుల ఆత్మహత్యలు ఏటా 300 నుంచి 400 వరకు ఉన్నట్లు వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం నివేదించింది. ఆరోగ్య, సామాజికపరమైన సమస్యలతో పాటు వృత్తిపరమైన ఇబ్బందులూ ఉక్కిరిబిక్కిరి చేయడమే ఇందుకు కారణమని పరిశోధకులు భావిస్తున్నారు.
తీవ్రమవుతున్న ఒత్తిడి
వైద్య వృత్తిలో తలెత్తే మానసిక సంఘర్షణలు దుర్బల మనస్కులపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వైద్య విద్యలో పరీక్షల ఒత్తిడి, కుంగుబాటు, నిద్రలేమి, సహాధ్యాయుల మధ్య పోటీతత్వం వంటి కారణాలతో మొగ్గదశలోనే కొందరు రాలిపోతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వైద్యుల్లో అత్యధికులు మానసిక రుగ్మతలు కలిగి ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అంతులేని ఒత్తిడి, మితిమీరిన ఆందోళన, నిరాశ, వ్యాకులత వంటి సమస్యలతో వీరు ఆత్మహత్యలకు ప్రేరేపితులవుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. సామాన్య ప్రజానీకం కంటే వైద్యుల్లో మానసిక సమస్యలు 3.4శాతం, ఆత్మహత్య ఆలోచనలు 10శాతం అధికంగా ఉన్నట్లు అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.
వైద్యులు.. కీర్తి ప్రతిష్ఠలు, డబ్బుతో పాటు తమ సేవలకు తగిన గుర్తింపు, గౌరవాన్ని కోరుకుంటారు. రోగుల బాగోగులకై అహర్నిశలు శ్రమించినప్పటికీ ఒక్కో సందర్భంలో సమాజం దృష్టిలో దోషిగా నిలవాల్సి వస్తుంది. కొందరు వైద్యులు మానసికంగా అటువంటి పరిస్థితులను జీర్ణించుకోలేకపోతున్నారు. అలాంటి సమయాల్లో ప్రధాన, సామాజిక మాధ్యమాల్లో జరిగే ప్రచారంవల్ల ఉద్వేగాలకు, అభద్రతాభావానికి లోనవుతున్నారు. ఆసుపత్రులు, వైద్యులపై జరుగుతున్న భౌతిక దాడులు వారిని మరింత కుంగదీస్తున్నాయి. వారి స్థాయిని పలుచన చేసే ఈ పరిణామాలు వైద్యులకు, ప్రజలకు సైతం చేటు చేస్తాయని వైద్య సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రపంచ దేశాల్లోని 60శాతానికి పైగా వైద్యులు వృత్తిపరమైన అసంతృప్తికి గురవుతున్నట్లు వివిధ అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. కార్పొరేట్ రంగంలోని వైద్యులు యాజమాన్యాల నుంచి వివిధ రూపాల్లో ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తోందని అంటున్నారు. సుదీర్ఘమైన పనివేళలతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఉల్లాసంగా గడిపే తీరిక సమయం తగ్గిపోతోంది. దాంతో పలువురు వైద్యుల్లో మానసిక సమతౌల్యం దెబ్బ తింటోంది.
జటిలంగా కనిపించే సమస్యలను పరిష్కరించుకోలేక మరణమే మార్గమని భావించే సున్నిత మనస్కులు ఎక్కువగా అఘాయిత్యాలకు తలపడుతున్నారు. ప్రతీ 20 ఆత్మహత్యా ప్రయత్నాల్లో 19 మంది ఎన్నో కారణాలతో మరణాన్ని తప్పించుకొంటున్నారు. కేవలం ఒక్కరు మాత్రమే విగతజీవిగా మారుతున్నారు. అయినా వైద్యుల్లో ఆత్మహత్యలు ఎక్కువగా ఉండటం బాధాకరం. వైద్యుల మానసిక సంరక్షణకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 'వైద్యులకు వైద్యులు' (డి 4 డి) కార్యక్రమం ద్వారా స్వీయ సహకారం అందిస్తోంది. మానసిక వ్యధతో సతమతం అవుతున్న వైద్యులకు నిరంతరం హెల్ప్‌లైన్ సేవల ద్వారా మనోనిబ్బరం కల్పిస్తోంది. శిక్షణ తరగతులు నిర్వహిస్తూ పెద్ద సంఖ్యలో వైద్యులను చైతన్య పరుస్తోంది. ఆత్మహత్యా రహిత సమాజ స్థాపన లక్ష్యంతో ఏటా సెప్టెంబర్ 10న ప్రపంచ దేశాలు ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని జరుపుకొంటున్నాయి. ఈ సమస్యకు ముగింపు పలికే దిశగా సామాజిక పోరు సలపాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపిస్తోంది. ప్రతి 40 సెకన్లకు ఒక జీవితం బుగ్గిపాలు అవుతున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ పరిశీలనలో తేలిన దృష్ట్యా- '40 సెకన్ల చర్య' నినాదంతో ప్రపంచ దేశాలు ఆత్మహత్యలకు వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నాయి.
మనోనిబ్బరం కీలకం
తనువు చాలించాలనే ఆలోచన వచ్చిన సమయంలో- దాన్ని గుర్తించి బాధితుల ప్రయత్నాలను కొన్ని నిమిషాలు లేదా గంటలపాటు ఆపగలిగితే ఆత్మహత్యలు గణనీయంగా తగ్గగలవని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అభివృద్ధి చెందిన అమెరికా, కెనడా, ఐరోపా దేశాల్లో పలు స్వచ్ఛంద ధార్మిక సంస్థలు ఆత్మహత్యల నివారణపై ప్రజలను జాగృతం చేస్తున్నాయి. ఈ వైఖరితో సతమతమయ్యే వారికి తోడ్పాటు అందించి వారిని ఆశావహ దృక్పథంతో జీవించేలా చేస్తున్నాయి. ఆత్మహత్యలపై అధ్యయనాలను, పరిశోధనలను పెద్దయెత్తున ప్రోత్సహించాలి. ప్రజల్లో నెలకొని ఉన్న అపోహలను పోగొట్టి బహిరంగ చర్చల ద్వారా వారిలో మనోనిబ్బరం కల్పించాలి. మనోవేదనను మరొకరితో పంచుకుంటే హృదయం తేలిక పడుతుందని, తద్వారా ఆత్మవిశ్వాసం జనిస్తుందని తెలియజెప్పాలి. చిన్న విషయాలకు సైతం మథనపడేవారిని గుర్తించి కుటుంబ సభ్యులు, స్నేహితులు వారికి అండగా నిలవాలి. సైకోథెరపీ, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, యాంటీ డిప్రెసెంట్ మందుల ద్వారా వారికి చికిత్స అందించాలి. ఎంతటి సమస్యనైనా సులభంగా ఎదుర్కోగలమనే స్థైర్యాన్ని అలవరచుకొంటే ఎవరూ ఆత్మహత్య యోచనను దరి చేరనీయరు.
- డాక్టర్ జెడ్.ఎస్.శివప్రసాద్ (వైద్య రంగ నిపుణులు)
ఇదీ చూడండి : భారీ పేలుడుకు నక్సల్స్ కుట్ర- 15 కిలోల బాంబులతో...