రజనీకాంత్ సినిమాలో ఒకసారి చెబితే వందసార్లు చెప్పినట్లు. కానీ రాజకీయాల్లో వందసార్లు చెప్పినా ఒక్కసారి కుదరడానికి పాతికేళ్లు పట్టింది. ఇప్పటికి విడుదల తేదీ మాత్రమే వచ్చింది. బొమ్మ తెరపై పడేంత వరకూ సందేహమే. 'నేను ఎప్పుడు వస్తానో, ఎలా వస్తానో ఎవరికీ తెలియదు... కానీ రావాల్సిన సమయానికి వచ్చేస్తా' అంటున్న మాణిక్యం అలియాస్ బాషా రాజకీయాల్లోకి వస్తారో లేదో అనే అనుమానాలు అందరితోపాటు ఆయనకీ ఉన్నాయని తోటి నటులే వెటకారం చేశారు. అమిత జనాకర్షణ ఉన్న రజనీకి రాజకీయ ప్రవేశం రహదారే అయినా రాజకీయ రహదారిపై ప్రయాణం ప్రారంభించేందుకు రెండున్నర దశాబ్దాల కాలం అవసరమైంది.
శూన్యత ఉందా?
ఇంతకీ తమిళనాట రజనీ చెబుతున్న రాజకీయ శూన్యత ఉందా అంటే, అనుమానమే. జయలలిత మరణం తరవాత ఏర్పడిన ఖాళీని ఎంతోకొంత పూరించడానికి ఓపీఎస్ (ఒట్టకారతేవర్ పన్నీర్ సెల్వం), ఈపీఎస్ (ఇడప్పాది కె.పళనిస్వామి) తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. జనవరిలో శశికళ జైలు నుంచి బయటకొచ్చే అవకాశం ఉంది. ఆమె అమ్మ పార్టీ సరికొత్త సందడిని సంతరించుకోబోతోంది. కరుణానిధి వారసత్వాన్ని అందిపుచ్చుకొన్న స్టాలిన్, సోదరుడు అళగిరి ఇంటిపోరుతో అష్టకష్టాలు పడుతున్నా- ఈసారి డీఎంకేను గెలిపించుకోవాలని పట్టుదలతో పథకాలు సిద్ధం చేస్తున్నారు. ఇటీవలే పార్టీ పెట్టిన కమల్‌హాసన్ పెద్దగా ప్రభావం చూపకపోయినా ఎన్నికల్లో సత్తా చాటేందుకు సమాయత్తమవుతున్నారు.
వరస ఓటములతో వాడి తగ్గినా, పట్టువీడని విజయ్‌కాంత్ పోటీకి సై అంటున్నారు. ప్రాంతీయ పార్టీల ప్రభతో అయిదు దశాబ్దాల క్రితమే ఆ రాష్ట్రంలో కళ కోల్పోయిన కాంగ్రెస్ తన ఉనికి చాటుకోవడానికి ఊపిరి బిగపట్టి ఇప్పటికీ సాగుతోంది. సామాజిక ఇంజినీరింగ్‌లో సాటిలేని భాజపా ద్రవిడ రాజ్యంలో జెండా పాతడానికి సర్వ ప్రయత్నాలూ చేస్తోంది. అణగారిన కులాల యువతను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఉత్తర తమిళనాడులో బలీయమైన వన్నియార్ వర్గానికి చెందిన అడవిదొంగ వీరప్పన్ కుమార్తె విద్యారాణికి యువమోర్ఛా ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టింది. ఆమె మూడువేల మందితో కమలం పార్టీలో చేరి కొంత ఉత్తేజాన్ని తెచ్చారు. ఇంతమంది ఉన్నా... తమిళనాట బలమైన నాయకత్వ లోపం ఉందంటూ రజనీకాంత్ కొత్త పార్టీతో వచ్చేందుకు సన్నద్ధమయ్యారు.
రజనీ లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా వద్దామని చూస్తున్నారు. పార్టీ వేరు, ప్రభుత్వం వేరని చెబుతున్నారు. చదువుకున్న యువకులకే ముఖ్యమంత్రి పదవి అంటున్నారు. అదెంతవరకు సాధ్యపడుతుందో చూడాలి. ఆధ్యాత్మిక రాజకీయం అంటూ ఆయన సరికొత్త రాగం అందుకున్నారు. అది అందరినీ అలరించగలుగుతుందా? హేతువాద ఉద్యమం ఎగసిన గడ్డపై ఆధ్యాత్మికత ఆశించిన ఫలాలు అందిస్తుందా? భాజపాయే మత ముద్ర కారణంగా అనుకున్నంత వేగంగా అడుగులు వేయలేకపోతోంది. ప్రాంతీయ తత్వానికి పెట్టింది పేరైన తమిళ ప్రజలు- మరాఠీ మూలాలున్న రజనీకి అధికారాన్ని అప్పగించేందుకు అంగీకరిస్తారా? రజనీ రాజకీయాల్లోకి రానక్కరలేదు. స్థానికేతరుల పాలన కోసం తపించాల్సిన అగత్యం తమిళనాడుకు అంతకంటే లేదని నటుడు సత్యరాజ్ కాస్త గట్టిగానే కోప్పడ్డారు. రాజకీయ శూన్యత ఏమీ లేదని, ఏదైనా కొద్దిగా ఉంటే స్టాలిన్, దయానిధి మారన్ వంటి వాళ్లు చూసుకుంటారని బహిరంగంగా స్పందించారు. ఇది ఆయన ఒక్కడి మాటగా కొట్టిపారేయడానికి వీల్లేని విషయం. సినిమాల కోసం భారీగా తరలి వచ్చిన అభిమాన గణం పోలింగ్ కేంద్రాలకు అదే ఊపుతో వస్తారా అనేది వేచిచూడాలి.
సందేహాలెన్నో!
తమిళనాడులో రాజకీయాలకు, సినిమాలకు దశాబ్దాలుగా దగ్గరి సంబంధం ఉంది. అన్నాదురై మొదలు ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత సహా పలువురిది సినీ నేపథ్యమే. అందులోనూ ద్రవిడనాడులో రాజకీయ సంక్లిష్టత ఎక్కువ. రజనీకి తెలిసింది గోరంత, తెలియనిది కొండంతని విమర్శకులు చెబుతున్నారు. ఎంజీఆర్‌కు దీటుగా వెండితెర వేలుపుగా వెలిగిన సున్నిత మనస్కుడు ఇకముందు వెల్లువెత్తబోయే రాజకీయ, వ్యక్తిగత విమర్శలను ఎదుర్కోగలుగుతారా? రాజకీయ రొచ్చులో ఈ రోబో రాణించగలుగుతారా? అభిమానులు కులాలు, వర్గాలుగా చీలిపోకుండా ఉంటారా? ఇప్పటికే ఏదో ఒక పార్టీని ఆశ్రయించి ఉన్నవారు ఇప్పటికిప్పుడు రాజకీయంగా తమ పంథాను మార్చుకుంటారా? ఇలా ఎన్నో సందేహాలున్నాయి. స్థానికతతోపాటు ఆరోగ్య పరిస్థితులూ ఆయనకు ప్రతికూలంగా మారి ప్రత్యర్థులు విరుచుకుపడే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. 'ఇప్పుడు జరగకపోతే ఇంకెప్పటికీ జరగదు' అంటున్న రజనీ ఏడు పదుల వయసులో ఆరునెలల కాలంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసి అగ్రస్థానంలో నిలబడాలంటే విస్తృతంగా శ్రమించాల్సి ఉంటుంది. అంతశక్తిని ఆయన ఇప్పుడు కూడగట్టుకోవడం సాధ్యమేనా? 'మారుస్తాం... అన్నీ మారుస్తాం' అంటూ తమిళనాడు తలరాతను మార్చేందుకు సిద్ధమైన తలైవా అతిగా ఆశపడ్డారా? దక్కేది దక్కక మానదు. దక్కనిది ఎప్పటికీ దక్కదని సూత్రీకరించిన సూపర్‌స్టార్ బాక్సాఫీసుల రికార్డులు బద్దలుకొట్టినంత తేలిగ్గా బ్యాలెట్ బాక్స్‌లను కొల్లగొడతారా? ఈ సందేహాలన్నింటికీ సమాధానాలు కావాలంటే కనీసం ఇంకో ఆరునెలలు ఆగాల్సిందే!
- ఎమ్మెస్