ETV Bharat / opinion

యువతకు అండగా జాతీయ విద్యావిధానం

ప్రపంచంలోనే అత్యధికంగా యువత ఉన్న దేశం భారత్​. అయితే నైపుణ్యం గల యువతను తయారుచేసుకోవాల్సిన అవసరం దేశం ముందుంది. ఈ దిశగానే అడుగులు వేస్తూ... పాత విద్యా విధానానికి స్వస్తి పలికి నూతన జాతీయ విద్యావిధానానికి తెరలేపింది కేంద్రం. ఫలితంగా 2030నాటికి ప్రపంచంలోనే అత్యధికంగా పనిచేయడానికి ఉపయోగపడే యువత ఉండే దేశంగా భారత్‌ నిలుస్తుందన్నది అంచనా. ఈ క్రమంలో జాతీయ విద్యా విధానం వల్ల సాధ్యాసాధ్యాలపై ప్రత్యేక కథనం.

Special story on the new national education policy to make skilled youth
యువతకు అండగా జాతీయ విద్యావిధానం
author img

By

Published : Aug 13, 2020, 10:10 AM IST

మానవ వనరుల అభివృద్ధి దృష్ట్యా భారతదేశానికి రానున్న పదేళ్ల కాలం అత్యంత కీలకమైంది. విశేష నైపుణ్యం గల యువకులను తయారుచేసుకోవాల్సిన అవసరం దేశం ముందుంది. 2030నాటికి ప్రపంచంలోనే అత్యధికంగా పనిచేయడానికి ఉపయోగపడే యువత ఉండే దేశంగా భారత్‌ నిలుస్తుందన్నది అంచనా. ఆంగ్లంలో దీన్నే 'డెమోగ్రఫిక్‌ డివిడెండ్‌' అంటున్నారు. ప్రస్తుతం దేశజనాభా సగటు వయస్సు 28.7 ఏళ్లు. చైనా 38.4, అమెరికా 38.5, జపాన్‌ 48.6 ఏళ్ల సగటు వయసు కలిగిఉన్నాయి. ఇందువల్లే మానవ వనరులు సమధికంగా అందుబాటులో ఉన్న దేశంగా భారత్‌ గుర్తింపు పొందుతోంది.

ఈ అవకాశం నాలుగైదు దశాబ్దాలపాటు మాత్రమే మన దేశానికి ఉండవచ్ఛు జననాల రేటు పెంపుదలకు ఆయా దేశాలు ప్రయత్నిస్తుండటమే దీనికి కారణం. చైనా 1980లో ప్రవేశపెట్టిన ఏకసంతాన విధానాన్ని 2013లో ద్విసంతానానికి మార్చడమే ఇందుకు నిదర్శనం. యువజనాభా ఉండటమే ప్రయోజనకరం కాదు... యువత నైపుణ్యాలు కలిగి ఉండటం కీలకం. అందువల్లే 2030నాటికి యువతకు విలువలు, నైపుణ్యాలతో కూడి విద్య అందజేయాలి. కీలక దశాబ్దిలో నూతన విద్యావిధాన ప్రకటన అటువైపు వేసిన ముందడుగు. 18 ఏళ్లు వచ్చేసరికి అంటే సెకండరీ విద్యాదశ పూర్తయ్యేసరికి విద్యార్థి తనకు ఇష్టమైన అంశంలో నైపుణ్యాలను సాధించేందుకు ఇది ఉపయుక్తంగా ఉంది!

అసమానతలకు అడ్డుకట్ట

కొన్ని పాఠ్యాంశాలు గొప్పవి, కొన్ని తక్కువన్న భావన ఇప్పటివరకూ కొనసాగింది. తనకు ఆసక్తిగల అంశానికి ఆదరణ ఉండదా అన్న మీమాంస విద్యార్థుల్లో అధికంగా ఉండేది. ఇష్టంలేని సబ్జెక్టును బలవంతంగా చదవాల్సి వచ్చేది. ఈ ప్రభావం విద్యార్థుల చదువుల తీరునే ఇన్నేళ్లూ ప్రభావితం చేస్తూ వచ్చింది. దీనివల్ల గణిత, భౌతిక, రసాయన, సాంకేతిక శాస్త్రాలకు ప్రాధాన్యం పెరిగింది. విజ్ఞాన, తత్వ, రాజనీతి, చరిత్ర, వ్యాపార, వాణిజ్య నిర్వహణ లాంటి అంశాలు; భాషా శాస్త్రాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఆదరణ కోల్పోయాయి. వృత్తివిద్యతో సమానమైన పాలిటెక్నిక్‌ కోర్సులపట్ల చిన్నచూపు ఉండేది. కళలకు సంబంధించిన కోర్సులూ గుర్తింపునకు నోచుకోకుండా ఉన్నాయి. ఈ పరిస్థితుల వల్లే 19-24 వయోపరిమితిలో అతి తక్కువ మంది వృత్తివిద్యా కోర్సుల్ని చదువుతున్నారు.

దేశంలో వీరు అయిదు శాతమే ఉన్నారు. అమెరికాలో వృత్తివిద్యలను అభ్యసించేవారు 52 శాతం ఉన్నారు. జర్మనీలో 75శాతం ఉండగా, దక్షిణ కొరియాలో 96 శాతం ఉన్నారు. అంటే అభివృద్ధి చెందిన దేశాల్లో 19-24 వయసున్న యువకులు ఎక్కువ మంది వృత్తివిద్యా కోర్సుల్లో చేరుతున్నారు. అందువల్ల యువకులు వృత్తివిద్య కోర్సులు ఎంపిక చేసుకుని చదవడానికి అనుకూలంగా నూతన విద్యావిధానం రూపొందించారన్నది నిర్వివాదం. 2030నాటికి 75 శాతం యువకులను వృత్తివిద్య కోర్సుల్లో చేర్చేందుకు అనువుగా ప్రయత్నాలు సాగాలి. పాఠశాల విద్యలోనే అందుకు పునాదులు పడాలి.

ఆదిలోనే గుర్తించాలి!

ఆరంభంలోనే విద్యార్థుల ఆసక్తి గ్రహించి, వారు తగిన కోర్సులను ఎంపిక చేసుకునేలా మార్గదర్శనం చేయాలి. కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక సంస్థల ప్రోత్సాహంతో విద్యాలయాల్లో పరిశీలన కేంద్రాలను(ఇంక్యుబేషన్‌ సెంటర్స్‌) స్థాపించాలి. వ్యవసాయ కోర్సులకు అధిక ప్రోత్సాహం అవసరం. సేద్య నైపుణ్యాల వృద్ధికి పెద్దపీట దక్కింది. దీనివల్ల వ్యవసాయంలో ఉత్పాదకత పెరిగే అవకాశాలు ఉండటం జాతికి కొత్త ఆశాకిరణం. దేశంలో ఇప్పుడున్న వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు అంతంతమాత్రంగా ఉండటం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతుంది. విద్యార్థి అవగాహన సామర్థ్యాలకు ఇకపై డిగ్రీలతోపాటు వ్యవసాయ విద్యలో సర్టిఫికెట్‌, డిప్లొమా కోర్సులూ వస్తుండటం నూతన విద్యావిధానంలోని మేలిమి అంశం. వైద్యవిద్యలోనూ ప్రాథమిక వైద్యం, నర్సింగ్‌ కోర్సులకు ప్రాధాన్యం దక్కనుంది. రాబోయే కోర్సులకు సమకాలీనత ఉండటం ఎంతో అవసరం. కృత్రిమ మేధ, బిగ్‌డేటా ఎనాలిసిస్‌ వంటివి ఎక్కువ రావాలి.

నూతన దృక్పథం

తొలిసారి భావోద్వేగ సూచీ వృద్ధిపై కొత్త విద్యావిధానం దృష్టి సారించడం ఆహ్వానించదగిన పరిణామం. నాయకత్వ లక్షణాల పెంపుదల, ఒత్తిళ్లను అధిగమించడం, మానవ సంబంధాలను పెంపొందించుకోవడం వంటి అంశాలు అన్ని పరిస్థితుల్లో రాణించడానికి యువతకు ఎంతగానో ఉపకరిస్తాయి. ఇన్ని మార్పులను ముందుకు తీసుకెళ్లడానికి అనువుగా ఉపాధ్యాయులకు బోధన విషయంలో నైపుణ్యాలు అలవరచడానికి విద్యావిధానంలో నిర్మాణాత్మక సూచనలు పొందుపరచడం మరో సానుకూలాంశం.

ఉపాధ్యాయ వృత్తిని యువత ఎంచుకోవడానికి అత్యంత ప్రాముఖ్యం ఇచ్చారు. విలువలతో కూడిన నాణ్యమైన విద్య అందించడానికి నూతన విధానంలో అనేక సూచనలు ఉన్నాయి. భారతీయ సంస్కృతీ మూలాలు ఇందులో ఉన్నాయి. దేశ పరివర్తనకు ఇది ప్రత్యక్షంగా ఉపకరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు! మన దేశం ప్రపంచ దేశాల్లో వచ్చే దశాబ్దికి అగ్రగామిగా నిలవడానికి, ఉన్నత విద్యలో అమెరికా, చైనాలను అధిగమించి ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండటానికి నూతన విద్యా విధానం తోడ్పడుతుందని ఆశిద్దాం!

రచయిత- ఆచార్య ముర్రు ముత్యాలునాయుడు, మాజీ ఉప కులపతి, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం, రాజమండ్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.