కరోనా కారణంగా మనిషి మానసిక స్థితిగతులు అస్తవ్యస్తంగా మారాయి. సాంఘిక వ్యవస్థల్లో కట్టుబాట్లు చెల్లాచెదురయ్యాయి. సమాజంలో ఎగుడు దిగుళ్లు ఏర్పడ్డాయి. భయం, అనిశ్చితి, ఆందోళన రాజ్యం ఏలుతున్నాయి. మునుపటి ఉత్సుకత, సంసిద్ధత, సృజనాత్మకత లోపించి మనిషి యాంత్రికంగా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాడు. ఏడు నెలలుగా పర్వదినాలెన్నో వస్తున్నాయి... పోతున్నాయి. మనిషి నిస్తేజంగా చూస్తున్నాడు. పనులు తాను చేస్తున్నట్లు లేదు, తనచేత ఎవరో బలవంతంగా చేయిస్తున్నట్లుగా రోజులు గడుస్తున్నాయి.
ఒక్కమాటలో చెప్పాలంటే- మనిషి జీవితం పునర్‌వ్యవస్థీకరణ దశకు చేరుకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఆలోచించాలి. పునరుత్తేజక చర్యలకు పూనుకోవాలి. దీన్ని ఆంగ్లంలో 'రీ ఓరియెంటేషన్'గా చెబుతారు.
పరిశోధనలు..
చాలాకాలం క్రితం మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఈ దిశగా లోతైన పరిశోధనలు చేశారు. ఆశావహ దృక్పథానికి, వ్యక్తిత్వ వికాసానికి, సామాజిక పునరుద్దీపనకు వారి నివేదికలు ఎంతగానో దోహదం చేశాయి. తొలుత వారు రెండు గదుల్లో మనుషుల్ని రెండు రకాల సమూహాలుగా విభజించి ఉంచారు. మొదటిగదిలో ఉంచిన ఒకాయన తీరిక దొరికినప్పుడల్లా తిరుపతో శిరిడీయో తీర్థయాత్రలకు వెళ్లేవాడు. మరొకాయనకు మనసు పుట్టినప్పుడల్లా హిమాలయాలకు వెళ్ళిరావడం ఇష్టం. పర్వత సానువుల్లోని ఆశ్రమాలను సందర్శించడం, సాధువులతో గడపడం ఆయన వ్యాపకం. ఆ గదిలోనివారంతా ఇదేతరహా మనస్తత్వం గల వ్యక్తులు.
రెండోగదిలో ఉంచినవారిలో ఒకాయన చీటికిమాటికి కాఫీ టీలు తాగనిదే ఉండలేడు. మరో ఆయనకు సిగరెట్ లేకుంటే కాళ్లూచేతులు ఆడవు. మరొకరు గుట్కాకు బానిస. వీరికి నిత్యావసరాలు తప్పించి వేరే ఏవీ చేతికి అందకుండా చేశారు. పారిపోదామంటే వీలులేని దుస్థితి. ఇలా అతికష్టంమీద వారం పది రోజులు గడిచాయి. నెలరోజులు పూర్తయ్యాయి. చివరకు ఏం జరిగిందన్నది చాలా ఆసక్తికరం.
పరిశోధన ఫలితాలు..
తిరుపతి యాత్రికుడు తొలిరోజునుంచే బెంగ పెట్టుకొన్నాడు. భగవంతుణ్ని ఈపాటికి రెండు సార్లయినా దర్శించి ఉండేవాణ్ని... సుప్రభాత శుభవేళ మాడవీధుల్లో మంగళవాయిద్యాలు చెవిన పడేవి. గోవింద నామస్మరణ హృదయాన్ని అభిషేకించేది... అద్భుతశోభ ఆహ్వానం పలికేది. అదిగో ప్రవేశద్వారం. ఆ పొడుగాయనను నాకు అడ్డు తప్పించు స్వామీ... ఆహా! అదుగో స్వామి... అల్లంత దూరాన దివ్యమంగళ రూపం. సజీవ చైతన్యం... పరిమళభరితమైన ప్రాంగణం... స్వామి అందమైన చిరునవ్వు... ఏదో తెలియని పారవశ్యం... అనుకొంటూ మనసులోనే ఆ మూలవిరాట్టును స్పష్టంగా దర్శిస్తున్నాడు. మరొకాయన హిమాలయాలను తలచుకొంటున్నాడు. ఆ తెల్లని మెరుపులు ఆస్వాదిస్తున్నాడు. చల్లదనాన్ని అనుభవిస్తున్నాడు. మనుచరిత్రలో ప్రవరుడికి వినిపించిన సెలయేటి గలగలల మృదంగ ధ్వనులు స్పష్టంగా వినవస్తున్నాయి. ఆలోచనల్లో అనుభూతి సాంద్రత గాఢంగా అలముకొంది. రోజురోజుకూ అది చిక్కబడి వారంతా యోగసాధనలోని సమాధిస్థితికి చేరుకొన్నారు. ‘యద్భావం తద్భవతి’ అన్న ఆర్యోక్తి వారి పాలిట నిజమైంది. అదే ఏ కళాకారుడో అయితే ఆ మనోహర దృశ్యాలకు ఆకృతి కల్పించేవాడు. కవి అయితే కవిత్వాలు కురిపించేవాడు. గానాలు చేసేవాడు. ఆ గదిలో ఉన్నవారంతా ఇంచుమించు అలాంటి స్థితుల్నే పొందారు.
రెండో గదిలోనివారికి తొలిరోజుల్లో కాఫీ టీలు సిగరెట్లు గుట్కాలు దొరక్క నరకయాతన పడ్డారు. అవతలివాణ్ని చంపేద్దామని, అసలు తమను తామే కత్తితో పొడుచుకుంటే ఎలా ఉంటుందన్న తరహా ఆలోచనలు సాగాయి. నాలుగు రోజులైంది, పది దినాలు గడిచాయి. ఒకాయన 'మొదట్లో ఉన్నంత 'ఇది'గా లేదు. ఫర్వాలేదనిపిస్తోంది. మీ సంగతి ఏమిటి?' అని అడిగాడు. 'మొదట్లో చచ్చిపోదామనిపించింది. ఇప్పుడు నెమ్మదిగా అలవాటవుతోంది. ఫర్వాలేదు’ అన్నాడు రెండోవాడు. అందరి పరిస్థితీ నిజానికి అదే! క్రమంగా అందరిలో మార్పు వచ్చింది.
40 రోజులు సాధన చేస్తే..
జాగ్రత్తగా ఆలోచిస్తే- సృష్టిలో ఈ రక్షణ మనకు ఎప్పుడూ ఉంది. మనిషికి 21 రోజుల్లో మంచి అలవాట్లు ఒంటపడతాయి. 40 రోజులు సాధన చేస్తే వ్యసనాలు దూరం అవుతాయి. మండలదీక్ష అంటారు దాన్ని. ఈ గదులు కూడా ఎక్కడో లేవు! మొదటి గది- మన బుద్ధికి, రెండోగది- మనసుకు సంకేతం. మనసును సంస్కరించుకుంటూ, బుద్ధిని ఎదగనివ్వడమే రీఓరియెంటేషన్ అంటే! ఎందుకు మారాలో కాలం నిర్ణయిస్తుంది. ఎప్పుడు మారాలో అనుభవం చెబుతుంది. ఎలా మారాలో వివేకం సూచిస్తుంది. పునర్‌వ్యవస్థీకరణ విధాన ప్రక్రియ అదే!
బ్రహ్మోత్సవాలకు తిరుమల వెళ్లలేకపోయామన్న బెంగ నుంచి, కరోనా కల్లోలంతో రోజువారీ దినచర్యలు ఛిన్నాభిన్నం అవుతున్నాయన్న చీకాకుల్లోంచి, స్తబ్దత, క్రియాశూన్యతల నుంచి మనం తేరుకోవాలంటే- రీఓరియెంటేషన్ ప్రక్రియ చాలా అవసరం. కరోనా రోజుల్లో దూరంగా ఉంచిన వ్యసనాలను పూర్తిగా వదిలేయడంకన్నా మేలైన పునర్‌వ్యవస్థీకరణ ఏముంటుంది? ఈ కోణంలోంచి మనల్ని మనం పునర్‌నిర్వచించుకొందాం. పునర్‌నిర్మించుకుందాం! కరోనా భయాన్ని జయిద్దాం!
- వై.శ్రీలక్ష్మి