Agricultural Education Day: భారతదేశ ప్రజల జీవనంలో పురాతన కాలం నుంచి వ్యవసాయం కీలకపాత్ర పోషిస్తోంది. జనాభాలో అరవై శాతానికి పైగా ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవించడం మన దేశ ప్రత్యేకత. వ్యవసాయం కోట్లాది ప్రజలకు ఆహారాన్ని, ఈ రంగంపై ఆధారపడిన పరిశ్రమలకు ముడిసరకును అందిస్తోంది. ప్రజల ఆహార అవసరాలను తీర్చడంలో, వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతిలో విద్య, పరిశోధనలు ప్రధానంగా తోడ్పడ్డాయి.
పురాతన కాలం నుంచి అమలులో ఉన్న సాగు విధానాలను ఆచరిస్తూ వస్తున్న రైతులకు- మధ్యయుగంలో వ్యవసాయ విద్య కొంతమేరకు సహాయపడింది. అప్పటి ప్రపంచ మేటి విశ్వవిద్యాలయాలైన తక్షశిల, నలంద.. వ్యవసాయ విద్యాబోధన నిర్వహించినట్లు చరిత్ర చెబుతోంది. ఆంగ్లేయుల కాలంలో భారతదేశ సంప్రదాయ వ్యవసాయ విజ్ఞానాన్ని కాలం చెల్లినదిగా, అశాస్త్రీయమైనదిగా ప్రచారం చేశారు. దాంతో మన వ్యవసాయ విద్య విస్తరణకు నోచుకోలేదు. వ్యవసాయ విద్యకు ఉన్న పాధాన్యాన్ని గుర్తించిన జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) ఏటా డిసెంబరు మూడో తేదీన జాతీయ వ్యవసాయ విద్యా దినోత్సవంగా ప్రకటించింది. స్వతంత్ర భారతదేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
బాధ్యత విస్మరించిన వర్సిటీలు
స్వాతంత్య్రం సాధించిన తరవాత భారత్‌లో క్రమంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాల ఏర్పాటుతో.. విద్య, పరిశోధనలపై దృష్టిసారించే అవకాశం కలిగింది. స్వతంత్ర భారతదేశంలో సంభవించిన ఆహార సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోవడంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాల తోడ్పాటు కీలకంగా నిలిచింది. అందరికీ ఆహార భద్రతను కలిగించడంలో, సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించడంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు చురుకైన పాత్ర నిర్వహించాయి. కాలక్రమేణా వ్యవసాయ రంగంలో నెలకొన్న పలు సమస్యలకు పరిష్కారాలు వెదకడంలో ఈ విశ్వవిద్యాలయాలు వెనకబడ్డాయి. కేవలం తరగతి గదుల్లో పాఠాలు చెప్పడంవరకే పరిమితమయ్యాయి. క్షేత్రస్థాయి సమస్యలపై విద్యార్థులకు అవగాహన కలిగించి, ఈ రంగంలో తిష్ఠవేసిన సమస్యలకు పరిష్కారాలను సూచించలేకపోయాయి. మారుతున్న జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడంలో విఫలమయ్యాయి.
పంట ఉత్పత్తులకు విలువ జోడింపు, సుస్థిరత, ఎగుమతులకు అనుకూలంగా మార్కెటింగ్ నైపుణ్యాలను పెంచడం, సహజ వనరుల పరిరక్షణ, వ్యవసాయ రంగంపై వాతావరణ మార్పుల ప్రభావం.. తదితర అంశాలపై విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించడంలో వ్యవసాయ విద్యదే ప్రధాన పాత్ర. విస్తరిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఎన్నో రంగాలు పురోగమిస్తున్నాయి. దురదృష్టవశాత్తు వ్యవసాయ విద్యాబోధన, పరిశోధనలు మాత్రం అందుకు అవసరమైన వేగాన్ని సంతరించుకోలేకపోయాయి.
ప్రపంచ బ్యాంకు సహకారంతో కేంద్ర ప్రభుత్వం 2017లో జాతీయ వ్యవసాయ ఉన్నత విద్యాకార్యక్రమాన్ని చేపట్టింది. వ్యవసాయ ఆధారిత రంగాల్లో ఉద్యోగ, వ్యవస్థాపక అవకాశాలను పెంపొందించడం వంటివి దాని లక్ష్యాలు. ఆ ప్రాజెక్టు ఉద్దేశం నెరవేరితే మంచి ఫలితాలను ఆశించవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూపొందించిన 'జాతీయ విద్యా విధానం'లో వ్యవసాయ విద్యపై కొన్ని అంశాలను ప్రకటించింది. వ్యవసాయ విద్యను మాధ్యమిక స్థాయి నుంచే ప్రారంభించాలన్నది అందులో ముఖ్యమైంది. ప్రస్తుతం వ్యవసాయ విద్య రాష్ట్ర పరిధిలో ఉంది. అయినప్పటికీ కేంద్ర పరిధిలోని ఐసీఏఆర్ పలు రకాల వ్యవసాయ విద్యాభివృద్ధి కార్యక్రమాలు రూపొందిస్తోంది.
దేశార్థికానికి కీలకం
వ్యవసాయ విద్యకు ఉన్న గిరాకీని దృష్టిలో పెట్టుకొని, ప్రైవేటు విద్యాసంస్థలు విస్తరిస్తున్నాయి. అయినప్పటికీ పలు కారణాలతో చాలా విద్యాసంస్థల్లో విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారు. జాతీయ స్థాయిలో వ్యవసాయ విద్యామండలి (ఏఈసీ) ఏర్పాటువల్ల వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలను పెంచడానికి అవకాశాలు మెరుగయ్యాయి. ఆధునిక అవసరాలకు అనుగుణంగా విశ్వవిద్యాలయాల్లో పాఠ్యప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉందని పలు నివేదికలు స్పష్టం చేశాయి. వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికీ పాత పాఠ్యప్రణాళికనే అధ్యాపకులు బోధిస్తున్నారు. వ్యవసాయ విద్య పూర్తి చేసుకొని క్షేత్రాలను సందర్శించే విద్యార్థులకు- అక్కడి పరిస్థితులు, సమస్యలపై అవగాహన అంతంతమాత్రంగానే ఉంటోంది. వ్యవసాయ రంగానికి ఆధునిక హంగులద్దితే, ఎగుమతులు ఊపందుకొంటాయి. రైతుల ఆదాయం పెరుగుతుంది. ఉపాధి అవకాశాలూ విస్తరిస్తాయి.
మన దేశంలో వ్యవసాయ రంగానికి ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు- వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు నిధుల కేటాయింపులు గణనీయంగా పెంచాలి. విద్య, పరిశోధనలపై పెట్టుబడులు దేశ ఆర్థికాభివృద్ధికి కీలకమనే వాస్తవాన్ని విస్మరించరాదు. వ్యవసాయం భారతీయులకు జీవనాధారం. విద్యతో తెలివితేటలు విస్తరిస్తాయి. తెలివితో సంపదను సృష్టించవచ్చు. అక్షరజ్ఞానం సమాజానికి తోడ్పడాలి. అందుకోసం విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విద్యనందించాలి. మెరుగైన పరిశోధకులను తయారుచేయాలి.
వ్యవసాయ రంగాన్ని పురోగమన దిశగా తీసుకువెళ్లడంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేసి, అభివృద్ధికి బాటలు వేస్తాయని ఆశిద్దాం.
- ఎల్.జలపతిరావు