పేదవాడి కలప, ఆకుపచ్చ బంగారంగా పేరొందిన వెదురు- అడవులకు స్థిరీకరణ శక్తిగా పనిచేస్తుంది. అడవుల్లో వర్షాల ధాటికి మట్టి కొట్టుకొని పోకుండా నిలువరిస్తుంది. అడవులపై ఆధారపడిన గిరిజనులతోపాటు, గ్రామీణుల జీవితాలతోనూ వెదురు పెనవేసుకుపోయింది. జీవనోపాధి మార్గంగానే కాకుండా, సామాజిక, సాంస్కృతిక, మతపరమైన కార్యకలాపాల్లోనూ ఒక భాగంలా మారింది. వెదురుకు ఉన్న బహుళ ప్రయోజనకర లక్షణాల కారణంగా గిరిజనులు తదితరులకు ఆదాయ, ఉపాధి కల్పనలో తోడ్పడుతోంది. గిరిజనుల వేట, ఆహార సేకరణ, వ్యవసాయ పనిముట్లు, సంగీత వాయిద్యాలు, గృహోపకరణాలు తదితరాలెన్నో వెదురుతో తయారవుతాయి. బతుకు తెరువు చూపిస్తున్న వెదురుతో గిరిజనులకు పవిత్రమైన సహజీవన సంబంధం ఏర్పడింది. పుట్టుక నుంచి మరణందాకా వారి జీవన చక్రంలోని ఆచారాల్లో వివిధ రూపాలలో వెదురుతో చేసిన ఉపకరణాలు ఉపయోగించడం సంప్రదాయంగా కొనసాగుతోంది.
విరివిగా నాటాలి..
ఇలాంటి విలువైన అటవీ వనరుపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రపంచ వెదురు సంస్థ ఏటా సెప్టెంబర్ 18న 'ప్రపంచ వెదురు దినోత్సవం' నిర్వహించాలని 2009లో నిర్ణయించింది. ఈ సంవత్సరం 'విరివిగా వెదురు నాటాలి' అనే నినాదాన్ని నిర్దేశించింది. వెదురును సహజ వనరులు, పర్యావరణ పరిరక్షణకు, సామాజిక ఆర్థికాభివృద్ధికి ఉపయోగించడం వంటి లక్ష్యాలను నిర్దేశించింది. వెదురుతో అడవుల సంరక్షణ చేపట్టాలని పిలుపివ్వడం సహా వెదురు అభివృద్ధి కోసం ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మన దేశంలో జాతీయ వెదురు మిషన్, కేంద్ర వ్యవసాయశాఖ వెదురు పెంపకాన్ని ప్రోత్సహించేందుకు 2006-07లో కేంద్ర ప్రాయోజిత పథకాన్ని ప్రారంభించగా, 2018లో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా పునరుద్ధరించారు. వెదురు సాగు, మార్కెటింగ్‌లను ప్రోత్సహిస్తూ విస్తీర్ణం పెంచేందుకు కృషి చేస్తున్నారు. నర్సరీల ఏర్పాటుకు ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు, నాణ్యమైన నారు లభ్యతను పెంచి, వెదురు అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారు. అటవీ చట్టానికి సవరణ చేపట్టడం ద్వారా ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు, రైతులు వెదురు పెంపకం చేపట్టేందుకు మార్గం సుగమమైంది.
రెండో స్థానంలో భారత్..
ప్రపంచవ్యాప్తంగా 3.6 కోట్ల హెక్టార్లకు పైగా, మొత్తం అటవీ ప్రాంతంలో సగటున 3.2శాతం వెదురు ఉన్నట్లు 2005 నాటి 'ప్రపంచ అటవీ వనరుల గణన'లో తేలింది. మొత్తం ప్రపంచ వెదురు వనరుల్లో 65శాతం ఆసియా ఖండంలోనే ఉన్నాయి. 28శాతంతో అమెరికా రెండోస్థానంలో ఉండగా, ఏడుశాతంతో ఆఫ్రికా మూడో స్థానంలో నిలిచింది. చైనా, భారత్, మయన్మార్‌లలో 1.98 కోట్ల హెక్టార్లలో వెదురు వనాలు విస్తరించాయి. ఇందులో భారత్ వాటా 45శాతం. భారత అటవీ సర్వే-2011 ప్రకారం చైనా తరవాత వెదురు నిల్వలను కలిగి ఉన్న రెండో అతిపెద్ద దేశం భారత్. మన దేశంలో దాదాపు 125 స్వదేశీ, 11 అన్యదేశ జాతులతో పాటు 23 ఉప జాతులు ఉన్నట్లు అంచనా. ఇది కశ్మీర్ మినహా దేశమంతటా 12.8శాతం అటవీ ప్రాంతంలో విస్తరించి ఉంది. దేశంలో ఈశాన్యభారత్ అతిపెద్ద వెదురు ఉత్పత్తి ప్రాంతం; పశ్చిమ కనుమలు, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవులు తరవాతి స్థానాల్ని ఆక్రమించాయి.
వెదురు అత్యంత వేగంగా పెరగడమే కాకుండా- ఒక కోణంలో నరికితే, అక్కడి నుంచి మళ్లీ పెరుగుతుంది. తద్వారా అడవుల క్షీణతను అడ్డుకుంటుంది. వెదురు వర్షపు నీటిని సంరక్షిస్తుంది. నిస్సార భూముల అభివృద్ధికి తోడ్పడుతుంది.
వెదురుతో అనేక లాభాలు..
వెదురు పొదలు వివిధ వన్యజీవులకు ఆవాసాలుగా ఉపయోగపడతాయి. గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు జీవనోపాధి కల్పించడంలో వెదురు ఎనలేని పాత్రను పోషిస్తుంది. ఇటీవల బస్తర్ ప్రాంతంలో- మహిళలు వెదురుతో చేసిన రాఖీలకు ప్రజల నుంచి మంచి స్పందన రావడం సహా సామాజిక మాధ్యమాల్లో దేశమంతటా చర్చనీయాంశంగా మారింది. వెదురుతో తయారు చేసే కళారూపాల్ని బహుమతులుగా తీర్చిదిద్దడం ద్వారా పలువురు ఆదాయ మార్గాల్ని సృష్టించుకొని, ఆర్థిక ఉన్నతి వైపు అడుగేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వెదురు వస్తువుల ఎగుమతులు సుమారు 250 కోట్ల డాలర్లకు చేరుకోవడం దీని ఆర్థిక ప్రాధాన్యానికి అద్దం పడుతోంది. అంతేకాకుండా, వెదురును అభివృద్ధి చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణతోపాటు అడవుల క్షీణతను అడ్డుకోవచ్చు. వెదురుతో కూడిన అటవీ వనాల పెంపకాన్ని ఒక ఉద్యమంలా చేపట్టవలసిన బాధ్యత ప్రభుత్వాలతో పాటు అందరిపైనా ఉంది. ఇకనైనా ప్రభుత్వాలు ఈ దిశగా యోచించాల్సిన అవసరం ఉంది.
- డాక్టర్ దన్నారపు వెంకట ప్రసాద్
(మధ్యప్రదేశ్‌లోని ఇందిరాగాంధీ గిరిజన వర్సిటీ సహాయ ఆచార్యులు)
ఇదీ చూడండి: ప్రకృతిని పరిరక్షిస్తేనే మనిషికి భవిత