ప్రస్తుత కరోనా సంక్షోభంలో భౌతిక దూరం అత్యంత ప్రాధాన్య అంశంగా స్థిరపడింది. బయట తిరిగేవారు.. ముఖ్యంగా నిత్యావసరాల కోసం దుకాణాలకు వెళ్లి- భౌతిక దూరాన్ని విస్మరిస్తున్న చాలామంది వైరస్ బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మనుషులెవరూ ఉండని దుకాణాలు ఏర్పాటైతే- కొనుగోలుదారులు నేరుగా వెళ్లి తమకు అవసరమైన సరకులు తీసుకొని డబ్బులు ఉంచి వస్తే ఎలా ఉంటుంది? ఇదంతా సాధ్యమయ్యే పని కాదనిపిస్తున్నా.. ప్రపంచంలో చాలాచోట్ల చాలామంది దీనిని సుసాధ్యం చేసి చూపుతున్నారు.
కోల్‌కతాలోని ఓ బస్టాప్ సమీపంలోని వార్తాపత్రికలు అమ్మే స్టాండ్‌లో మనుషులెవరూ ఉండరు. వినియోగదారులు వచ్చి అవసరమైన వార్తాపత్రికలు తీసుకొని, అక్కడే ఓ మూలగా ఉన్న ఓ పళ్లెంలో డబ్బుల్ని ఉంచి వెళ్తారు. ఇదేమిటని అడిగితే- మరో వ్యాపకంలో ఉన్న తనకు దుకాణం చూసుకునే తీరిక ఉండదని- తాను లేకున్నా వార్తాపత్రికల డబ్బులు అక్కడ ఉంచి వెళ్తారని, ఇబ్బందేమీ ఉండదని యజమాని చెబుతారు. ప్రపంచంలో చాలామంది నిజాయతీగానే ఉంటారనేందుకు నిదర్శనమిది. మిజోరం ఐజ్వాల్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న 'సెలింగ్ హైవే'పై స్థానికులు కొత్త తరహా వాణిజ్యానికి రూపమిచ్చారు. ఇది మనుషుల నిజాయతీపై ఆధారపడి పనిచేస్తుంది. రోడ్డు వెంబడి వెదురు బొంగులతో రూపొందించిన మనషులెవరూ ఉండని గుడిసెల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిలో కూరగాయలు, పండ్లు, పూలు, పండ్లరసాలు, ఎండు చేపలు, నత్తలు అమ్మకానికి పెడతారు. అక్కడ ఏర్పాటు చేసిన బోర్డులపై సరకులు, వాటి ధరలను రాసి ఉంచుతారు. వినియోగదారులు తమకు అవసరమైన సరకుల్ని తీసుకొని, డబ్బుల్ని అక్కడే ఉన్న డబ్బాలో వేస్తారు. అవసరమైతే ఆ డబ్బాలో నుంచి చిల్లర కూడా తీసుకుంటారు. ఇక్కడ నమ్మకమనే సూత్రమే పని చేస్తుంది. మిజోరంలో నిర్వహిస్తున్న ఈ తరహా వ్యాపారం- 'మైహోమ్ ఇండియా' అనే ఓ స్వచ్ఛంద సంస్థ చేసిన ట్వీట్‌తో వెలుగులోకి వచ్చింది. మిజోరం ముఖ్యమంత్రి జోరంథంగ దీనిపై స్పందిస్తూ.. చాలామంది అమ్మకందారులు, కొనుగోలుదారులు సురక్షిత భౌతిక దూరం పాటించేందుకు ఈ పద్ధతి చాలా సౌకర్యంగా ఉందని పేర్కొన్నారు.
-
Along highway of Seling in Mizoram, many shops without shopkeepers are found without shopkeepers. It is called 'Nghah Lou Dawr Culture Of Mizoram' which means ‘Shop Without Shopkeepers’. You take what you want & keep money in deposit box. These shops work on principle of trust! pic.twitter.com/LbG1J8xN1d
— My Home India (@MyHomeIndia) June 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Along highway of Seling in Mizoram, many shops without shopkeepers are found without shopkeepers. It is called 'Nghah Lou Dawr Culture Of Mizoram' which means ‘Shop Without Shopkeepers’. You take what you want & keep money in deposit box. These shops work on principle of trust! pic.twitter.com/LbG1J8xN1d
— My Home India (@MyHomeIndia) June 19, 2020Along highway of Seling in Mizoram, many shops without shopkeepers are found without shopkeepers. It is called 'Nghah Lou Dawr Culture Of Mizoram' which means ‘Shop Without Shopkeepers’. You take what you want & keep money in deposit box. These shops work on principle of trust! pic.twitter.com/LbG1J8xN1d
— My Home India (@MyHomeIndia) June 19, 2020
నాగాలాండ్‌లో లెషెమి గ్రామానికి చెందిన రెతులూ ఇలాంటి పద్ధతిని ఆచరిస్తున్నారు. బెంగళూరులోని 'ట్రస్ట్ షాప్' గొలుసు దుకాణాలు వినియోగదారులకు నిరంతరం అందుబాటులో ఉంటాయి. తమిళనాడులోని పాపనాశంలో గత 20 ఏళ్లుగా గాంధీజయంతి రోజు కాపాలదారులెవ్వరూ లేని దుకాణం ఏర్పాటవుతోంది. స్థానిక రోటరీ క్లబ్ దీన్ని నిర్వహిస్తోంది. దివ్యాంగుల సంక్షేమ కార్యకలాపాలు సాగించే జనశక్తి ఛారిటబుల్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ కేరళలో తీరగ్రామమైన అజికోడ్‌లో ఇలాంటి స్వయంసేవ దుకాణాన్ని ఏర్పాటు చేసింది. సీసీటీవీ కెమెరాలను సైతం అమర్చారు. చండీగఢ్‌లోని ధనాస్ ప్రభుత్వ మోడల్ సీనియర్ సెకండరీ పాఠశాలలో నోటుబుక్కులు, కలాలు, పెన్సిళ్లు, వంటివాటితో ఏర్పాటు చేసిన దుకాణంలో కాపలాదారుగానీ, సీసీటీవీ కెమెరాలుగానీ ఉండవు. 'నిజాయతీగా చెల్లించండి' అనే బోర్డు మాత్రమే ఉంటుంది.
జపాన్ తీర గ్రామాల్లో ఈ తరహా కాపలాదారుల్లేని చిన్నపాటి దుకాణాలు ఎన్నో దర్శనమిస్తాయి. స్విట్జర్లాండులోని గిమ్మెల్‌వాల్డ్ గ్రామంలోనూ ఈ తరహా అంగడి ఏర్పాటైంది. వీటితో స్ఫూర్తిపొందిన ఓ హోటల్ యజమాని డేవిడ్ వాటర్‌హౌస్ లండన్‌లో 'హానెస్టీ షాప్' పేరిట స్వయంసేవ దుకాణాన్ని ఓ డబుల్‌డెకర్ బస్సులో ఏర్పాటు చేశారు. అక్కడ వస్తువులు చోరీకి గురైనట్లు ఇప్పటివరకూ ఫిర్యాదులేదు. మనుషులెవరూ ఉండని స్వయంసేవ దుకాణాలు వినియోగదారుల నిజాయతీపైపే ఆధారపడతాయనడానికి ఇవన్నీ నిదర్శనాలే.
ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో ఇలాంటి భావన ఉపయుక్తమైనదే. ఒకవేళ ఏదైనా నష్టం సంభవించినా, మొత్తంగా దక్కే లాభంకన్నా తక్కువగానే ఉంటుంది. అన్ని తరహా దుకాణాలకూ ఇదే పద్ధతి సరిపోతుందని చెప్పలేం. మందుల దుకాణంలో అవసరమైన ఔషధాన్ని గుర్తించేందుకు కొంత అనుభవం అవసరమవుతుంది. మరికొన్ని దుకాణాల్లో సరకులు అమ్మేందుకు సేల్స్‌మెన్ నైపుణ్యం కూడా కావాల్సి ఉంటుంది. కూరగాయలు, కిరాణా సరకులు అమ్మేందుకు మనుషుల్లేని దుకాణాల ఏర్పాటు వల్ల అమ్మకం సిబ్బంది ఉపాధికి గండిపడుతుందనే వాదనల్లోనూ వాస్తవం లేకపోలేదు. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాల కల్పన అంత తేలికైనదేమీకాదు. నమ్మకం అనే భావన చాలా ఆకర్షణీయంగా ఉన్నా, భారీస్థాయిలో దుకాణాల ఏర్పాటు సాధ్యం కాకపోవచ్ఛు ఈ దుకాణాలు పెద్దయెత్తున ఏర్పాటైతే- ఆర్థిక, సామాజిక విపరిణామాలకు దారితీసే అవకాశమూ లేకపోలేదు!
- అతాను బిశ్వాస్
(రచయిత- కోల్‌కతాలోని భారతీయ గణాంక సంస్థ ఆచార్యులు)