మా బస్టాండ్‌కు దగ్గర్లో ఓ న్యూస్‌పేపర్ దుకాణం ఉంది. ఆ దుకాణం వద్ద సగం సమయం అసలు యజమానే ఉండడు. కస్టమర్లు న్యూస్‌పేపర్‌ను తీసుకొని పక్కనే ఉన్న ట్రేలో డబ్బులు పెట్టేసి వెళ్లిపోతుంటారు. ఈ విషయం గురించి దుకాణ యజమానిని నేను ఓసారి అడిగితే తనకు మరో పనుందని, వాటర్ బాటిళ్లు సప్లై చేస్తుంటాను కాబట్టి ఇక్కడే ఉండటం కుదరదని చెప్పాడు. తాను లేకపోయినా న్యూస్‌పేపర్ డబ్బులు పొందడంలో సమస్యేమీ లేదని చెప్పుకొచ్చాడు.
న్గా లౌ దావర్
ప్రపంచంలో ప్రతిచోటా చాలా మంది నిజాయతీగానే ఉంటారు. కానీ చిత్రమేంటంటే నిజాయతీ అనేది ప్రతిసారి వింతగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఉదాహరణకు, ఐజావ్ల్కు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెలింగ్ రహదారి వెంబడి స్థానిక ప్రజలు ఓ సంప్రదాయ వాణిజ్య విధానాన్ని ఏళ్లుగా పాటిస్తూ వస్తున్నారు. దాని పేరు 'న్గా లౌ దావర్ '. దీని అర్థం దుకాణదారులు లేని దుకాణాలు. ఇవి ప్రధానంగా నిజాయతీపైనే ఆధారపడి నడుస్తున్నాయి.
వెదురుబొంగులతో తయారుచేసిన గుడిసెలు, చిన్నపాటి పాకల్లో ఇలాంటి దుకాణాలను ఏర్పాటు చేస్తారు. అందులో కూరగాయలు, పళ్లు, పూలు వంటి వస్తువులను అమ్మకానికి పెడతారు. కొన్నిసార్లు పళ్ల రసాలు, ఎండుచేపలు, మంచినీటి నత్తలను కూడా ఇందులో ఉంచుతారు. వీటి ధరలను చిన్న బోర్డు మీద రాసి పెడతారు. కస్టమర్లు తమకు కావాల్సిన వస్తువులను తీసుకొని డబ్బులను అక్కడి కంటైనర్‌లో పెట్టి వెళ్లిపోతారు. ఒకవేళ ఎవరికైనా చిల్లర కావాల్సివస్తే ఈ కంటైనర్ల నుంచి తీసుకోవచ్చు కూడా. ఇలా నమ్మకమనే సూత్రం మీదే ఇక్కడ వ్యాపారం సాగుతోంది.
దుకాణ యజమానులు పొలం పనులకో, జూమ్ వ్యవసాయానికో తమ పూర్తి సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. ఇంట్లోని ఏ ఒక్కరికి కూడా ఈ దుకాణంలో ఉండే తీరిక ఉండదు. కాబట్టి ఈ విధానాన్ని పాటిస్తున్నారు అక్కడి ప్రజలు.
ఇటీవల 'మైహోమ్ ఇండియా' అనే ఎన్జీఓ చేసిన ట్వీట్‌తో 'న్గా లౌ దావర్' గురించి బయటి ప్రపంచానికి తెలిసింది. వ్యక్తిగత దూరం పాటించడానికి కొనుగోలు, అమ్మకందారులకు ఇది చాలా ఉపయోగపడుతుందని మిజోరం ముఖ్యమంత్రి జొరామ్‌థంగా ట్వీట్ చేయడం వల్ల ఈ విధానానికి ప్రాచుర్యం లభించింది.
దేశవ్యాప్తంగా...
యజమానులు లేని దుకాణాలు ఇతర ప్రాంతాల్లోనూ దర్శనమిస్తున్నాయి. నాగాలాండ్‌లోని లెషెమి గ్రామ రైతులు ఇలాంటి విధానాన్ని పాటిస్తున్నారు. బెంగళూరులోనూ ఈ నిజాయతీ దుకాణాలు ఉన్నాయి. దక్షిణాది వెరైటీలైన ఇడ్లీ/దోశ పిండి, గోధుమ చపాతీలు, మలబార్ పరోటాలను 24 గంటలు అందుబాటులో ఉండేలా ఈ దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. చాలాసార్లు ఇక్కడ 90 శాతం వరకు కలెక్షన్లు వస్తుంటాయి. కొన్ని రోజుల్లో వందకు వంద శాతం కలెక్షన్లు వస్తాయి.
తమిళనాడులోని పాపనాసం బస్టాండ్‌లో ప్రతి ఏడాది గాంధీ జయంతికి మనుషులు లేకుండానే దుకాణాలు నడిపిస్తుంటారు. రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో గత ఇరవై ఏళ్ల నుంచి ఈ విధానం కొనసాగుతోంది. ఇందులో బస్టాప్‌నే తాత్కాలిక దుకాణంగా మార్చుతారు. పెన్నులు పెన్సిళ్లు, చిరుతిళ్లు, కొన్ని నిత్యవసరాలను టేబుల్‌పై ఏర్పాటు చేసి వాటి ధరలను రాసి పెడతారు. డబ్బుల కోసం ఓ పెట్టెను టేబుల్‌పై ఉంచుతారు.
కేరళ అజికోడ్లోని తీరప్రాంత గ్రామమైన వంకులాతువాయల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేక సెల్ఫ్ సర్వీస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది స్థానిక ఎన్జీఓ జనశక్తి చారిటబుల్ ట్రస్ట్. ముందుజాగ్రత్తగా ఇక్కడ సీసీటీవీ కెమెరాలను అమర్చారు.
చండీగఢ్ ధనాస్‌లోని ప్రభుత్వ మోడల్ సీనియర్ సెకండరీ స్కూల్లో ఇలాంటి విధానాన్ని ఏర్పాటు చేశారు. దుకాణదారులు, సీసీటీవీల్లాంటివేవీ లేకుండానే పిల్లలకు కావాల్సిన నోటుబుక్కులు, పెన్నులు, పెన్సిళ్లు అందుబాటులో ఉంచారు. మీకు మీరు సేవ చేసుకొని నిజాయతీగా చెల్లించండనే బోర్డును తగిలించారు.
ప్రపంచవ్యాప్తంగా
విదేశాల్లోనూ ఇలాంటి దుకాణాలు ఉన్నాయి. దక్షిణ టోక్యోలోని తీరప్రాంతమైన కనగవాలో యమడా కుటుంబం ఈ నిజాయతీ దుకాణాలను నడిపిస్తుంది. ఇక్కడ డబ్బులు లెక్కించుకోవడానికి చిన్న క్యాల్క్యులేటర్ను సైతం అందుబాటులో ఉంచుతారు.
స్విట్జర్లాండ్‌లోని గిమ్మెల్వాల్డ్ గ్రామంలోనూ ఈ విధానం కొనసాగుతోంది. డేవిడ్ వాటర్‌హౌస్ అనే హోటల్ యజమాని ఈ విధానాన్ని లండన్‌లో ప్రవేశపెట్టాలని ఆలోచించారు. లండన్ టవర్ వద్ద ఓ డబుల్-డెకర్ బస్సులో హానెస్టీ షాప్‌ను ఏర్పాటు చేశారు. చాలా వరకు వస్తువులను 20 కన్నా తక్కువకే అమ్మేవారు. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం వస్తువులను అందుబాటులో ఉంచేవారు. ఇందులో పెద్దగా నష్టమేమీ జరగలేదని చెబుతున్నారు డేవిడ్.
ఈ పరిస్థితుల్లో అవసరం
వినియోగదారులు ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు వారిని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశం నమ్మకం. వినియోగదారుల సమగ్రతపై ఆధారపడి పనిచేసే మానవరహిత దుకాణాలు మాత్రం నిజాయతీని గుర్తు చేస్తున్నాయి. ఇది చాలా అద్భుతమైన విషయం. ఈ విధానం అంటువ్యాధుల సమయంలో ఉపయోగపడుతుంది. మానవరహిత దుకాణాలు ఆర్థికంగా విలువైనవి. దుకాణదారులకు మరో జీవనాధారం ఉంటే ఇవి చాలా ఉపయుక్తంగా ఉంటాయి. కేరళ మాదిరిగా సీసీటీవీలు ఏర్పాటు చేసి ఇలాంటి మానవరహిత దుకాణాలు మరిన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.
పరిమితులూ ఉన్నాయి
అయితే అన్ని రకాల దుకాణాలకు ఇది పనికిరాదు. మెడిసెన్ విషయానికొస్తే.. మనకు కావాల్సిన మందులు తీసుకోవాలంటే నిపుణులు తప్పనిసరిగా అవసరం. కొన్నిరకాల వస్తువులకు అమ్మకందారుడు తప్పకుండా ఉండాలి. మరోవైపు కూరగాయలు, కిరాణా సామగ్రి ఈ విధానంలో విక్రయించడం ద్వారా చాలా మంది ఉద్యోగాలపై ప్రభావం పడుతుంది.
అంతేగాక ఇందులోని కార్మికులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు వెతుక్కోవడం అంత సులభం కాదు. నమ్మకం అనేది ఆసక్తికరంగా ఉన్నా పెద్ద ఎత్తున అమలు చేయడం మంచిది కాకపోవచ్చు.
(రచయిత- అతను బిశ్వాస్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, కోల్‌కతా)