'గ్రామ స్వరాజ్య జ్యోతి కొడిగట్టకుండా ఉండాలంటే, మహిళల నిర్ణయాధికార శక్తిని ప్రతి ఒక్కరూ గుర్తించి గౌరవించాలి' అన్న మహాత్మాగాంధీ హిత వచనాలు దేశానికి ఆచరణీయాలు. 2011 జనాభా గణాంకాల ప్రకారం దేశ జనాభాలో 68.84 శాతం గ్రామీణులే. 72.4 శాతం శ్రామిక శక్తి గ్రామాల్లో ఉంది. జాతీయాదాయంలో 47 శాతం వాటా గ్రామీణ ఆర్థిక వ్యవస్థదే. దేశంలో 48.5 శాతం మహిళా జనాభా ఉంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనాల ప్రకారం శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని, పురుషుల స్థాయికి పెంచితే ఆర్థిక వ్యవస్థ 27 శాతం పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో గ్రామీణాభివృద్ధికి ఆలంబనగా నిలిచే మహిళా శ్రామిక శక్తిని పెంపొందించేందుకు ప్రభుత్వాలు పలు జీవనోపాధి పథకాలు ప్రవేశపెట్టి, గ్రామీణ వికాసానికి కృషి చేస్తున్నాయి.
నిరుపేదల అభ్యున్నతే లక్ష్యం...
ప్రభుత్వం 1999లో స్వర్ణజయంతి గ్రామ స్వరోజ్‌గార్ యోజనను ప్రారంభించి, ఆదాయాన్ని సృష్టించే ఆస్తులు లేదా ఆర్థిక కార్యకలాపాల ద్వారా స్థిరమైన ఆదాయాన్ని అందించి పేదరికాన్ని అంతమొందించాలని భావించింది. బహుళ జీవనోపాధులను కల్పించాలనే లక్ష్యం నెరవేరలేదు. ఈ క్రమంలో ప్రొఫెసర్ రాధాకృష్ణ కమిటీ సూచనల మేరకు ఆజీవిక-జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్‌ను 2011 జూన్‌లో ప్రారంభించింది. దీన్ని 2015లో దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన- జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్‌గా మార్చారు. వ్యవసాయ, వ్యవసాయేతర రంగాల్లో విభిన్న జీవనోపాధి అవకాశాలను పెంచడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపరచి, గ్రామీణ శ్రేయో జీవనానికి- మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనేది ప్రభుత్వ లక్ష్యం. పేద కుటుంబాలకు లాభదాయకమైన స్వయం ఉపాధి, నైపుణ్యం కలిగిన వేతన, ఉపాధి అవకాశాలను కల్పించి పేదరికాన్ని తగ్గించడం, పేదలకు బలమైన పునాది కలిగిన సంస్థలను నిర్మించడం, తద్వారా వారికి స్థిరమైన జీవనోపాధిని కల్పించాలన్నదే ఈ మిషన్ ధ్యేయం. దేశంలోని ప్రతి గ్రామీణ పేద కుటుంబం నుంచి ఒక మహిళా సభ్యురాలితో స్వయం సహాయక బృందాలుగా రూపొందించి, 2.5 లక్షల గ్రామ పంచాయతీలలో ఏడు కోట్ల గ్రామీణ పేద కుటుంబాలకు జీవనోపాధి కల్పించాలని తలపెట్టారు. నిరుపేదల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసి, వారి పని సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడానికి అవసరమైన సమాచారం, నైపుణ్యాలు, ఆర్థిక సహాయం సమకూరుస్తున్నారు. సమాజంలోని అత్యంత పేదల అభ్యున్నతే లక్ష్యంగా జీవనోపాధుల ప్రణాళిక అమలుతో గ్రామీణాభివృద్ధికి పాటుపడుతుండటం విశేషం.
వ్యవసాయ రంగంలో మహిళా కిసాన్ సశక్తీకరణ పరియోజన ద్వారా మహిళా భాగస్వామ్యం, ఉత్పాదకతను పెంచడానికి క్రమబద్ధమైన పెట్టుబడులు పెట్టడం ద్వారా తోడ్పాటు అందిస్తుండటం గమనార్హం. ఇందులో వ్యవసాయ పరికరాలను సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకుంటూ, తోటల ఏర్పాటు ద్వారా ఆహారం, పోషక భద్రతను పెంపొందిస్తుండటం ప్రయోజనకరంగా ఉంటోంది. వ్యవసాయేతర రంగంలో, ఆజీవిక-గ్రామీణ్ ఎక్స్‌ప్రెస్ యోజన ద్వారా గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన, సరసమైన రవాణా సేవలను అందిస్తూ, సభ్యులకు ప్రత్యామ్నాయ జీవనోపాధిని కల్పిస్తుండటం మేలు కలిగించేదే. 2016లో ప్రారంభించిన అంకుర గ్రామ వ్యాపారవ్యవస్థాపన కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో అంకురాలకు ప్రోత్సాహకంగా నిలుస్తోంది. దీనిద్వారా మహిళల్లో వ్యాపార వ్యవస్థాపకతను, ఉత్పత్తిని పెంచి, మార్కెట్‌తో అనుసంధానించి ఉపాధి అవకాశాలు ఇనుమడింప జేస్తుండటం వల్ల లబ్ధిదారులకు ప్రయోజనకరంగా ఉంటోంది. ఇప్పటికే సుమారు 153 బ్లాకులలో 1.01 లక్షల సంస్థలు స్థాపించి, మాస్క్‌లు, శానిటైజర్లు, వ్యక్తిగత రక్షిత కిట్‌ల తయారీ, విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టడం వంటి కార్యకలాపాలతో 2.10 లక్షల మందికి ఉపాధి కల్పించినట్లు చెబుతున్న గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి.
ఆర్థిక అక్షరాస్యత పెరగాల్సిందే
గ్రామీణ మహిళల పురోగతి నుంచి మహిళల నేతృత్వంలోనే అభివృద్ధి దశకు చేరుకోవడానికి ఆర్థిక భాగస్వామ్యం, సాధికారత అవసరం. 2018-19 ఆర్థిక సర్వే ప్రకారం దేశంలోని 93 శాతం శ్రామిక శక్తి అసంఘటిత రంగంలో ఉంది. వీరికి ఆర్థిక, సామాజిక భద్రతతోపాటు హక్కులనూ కల్పించాలి. ‘ఆర్థిక విద్యా వ్యూహం 2020-25’ మహిళల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంచాల్సిన అవసరాన్ని గుర్తించింది. ఆధునిక వ్యాపార కార్యకలాపాల కోసం మహిళలు డిజిటల్, ఆర్థిక అక్షరాస్యతను అందిపుచ్చుకోవాల్సి ఉంది. ఇందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మహిళలు, ప్రభుత్వేతర సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, పంచాయతీరాజ్ సంస్థల సమన్వయం తప్పనిసరి. జీవనోపాధుల కల్పన కార్యక్రమాలు దీర్ఘకాలం మనుగడ సాగించేందుకు కావలసిన నాయకత్వ లక్షణాలు, నైపుణ్యాలు, మార్కెటింగ్, ఆర్థిక వ్యూహాలను నిరంతరం అందిస్తుండాలి. సంస్థలు నిలదొక్కుకునేంత వరకు ప్రభుత్వం అండగా నిలవాలి. సేవా రంగం విస్తరిస్తున్న తరుణంలో అందుకు అనుగుణంగా తమ కార్యకలాపాలను మార్చుకునేలా వారిని ప్రోత్సహిస్తేనే పోటీ ప్రపంచంలో ముందడుగు వేస్తారు. అప్పుడే ఆర్థికాభివృద్ధికి ఆటంకంగా పరిణమించే పేదరికం, నిరుద్యోగాలకు అడ్డుకట్ట వేసి, గ్రామీణ ప్రగతికి దోహదపడే అవకాశం ఏర్పడుతుంది. గ్రామీణ మహిళలకు ఆధునిక, సాంకేతిక నైపుణ్యాలతో వైవిధ్య జీవనోపాధుల పెంపునకు తగిన తర్ఫీదునిచ్చి మేలిమి, ఉత్పాదక వనరులుగా మారిస్తేనే కుటుంబం, సమాజం, దేశం గ్రామీణాభ్యుదయం సాయంతో సత్వర అభివృద్ధిని సాధిస్తాయి.
-ఎ.శ్యామ్ కుమార్