ETV Bharat / opinion

సర్కారీ పాఠశాలల వ్యధ.. అంతులేని కథ! - opinion news

ప్రైవేటు రుసుముల భారానికి తట్టుకోలేని తల్లిదండ్రులెందరికో సర్కారీ బడులే ఆశాదీపాలవుతున్నాయి. ఈ మేరకు వాటిలో చిన్నారుల చేరికలు పెరిగాయని క్షేత్రస్థాయి నివేదికలు చాటుతున్నాయి. అయితే విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా ప్రభుత్వ విద్యాలయాల్లో మౌలిక వసతులు వృద్ధి మాత్రం నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది.

right to education
విద్యాహక్కు చట్టం
author img

By

Published : Aug 4, 2021, 6:33 AM IST

సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న సర్కారీ విద్యాలయాల్లో చిన్నారుల విద్యాహక్కు అక్షరాలా మంటగలిసిపోతోంది! దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో 11 లక్షలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కావాల్సి ఉందని కేంద్రం తాజాగా ప్రకటించింది. నలభై శాతం గురువుల కొరతతో బిహార్‌లో ప్రభుత్వ విద్య పడకేస్తుంటే- కొన్నాళ్లుగా కొత్త నియామకాల ఊసే లేని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పద్నాలుగు శాతం చొప్పున ఖాళీలతో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

వసతులు అంతంతే..

ప్రాథమిక వసతుల పరంగా సర్కారీ పాఠశాలల వ్యధ అది.. అంతులేని కథ! 'జల్‌జీవన్‌ మిషన్‌(జేజేఎం) ద్వారా గాంధీ జయంతి నాడు ప్రత్యేక ఉద్యమానికి నాంది పలుకుతున్నాం. రాబోయే వంద రోజుల్లో దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో సురక్షిత తాగునీటిని అందుబాటులోకి తీసుకొస్తాం' అని ప్రధాని మోదీ నిరుడు జాతికి హామీ ఇచ్చారు. లక్ష్యాల సాధనకు రాష్ట్రాలు మరింత సమయం కావాలంటున్నాయని మొన్న మార్చి 31వరకు గడువును పొడిగించారు. అయితే మాత్రం లాభమేమిటి? దేశంలోని దాదాపు 35శాతం బడులకు, 40శాతం అంగన్‌వాడీ కేంద్రాలకు మంచినీటి సరఫరా నేటికీ అందని ద్రాక్షగానే ఉండిపోయింది! 'కలుషిత జలాలు మోసుకొచ్చే జబ్బుల బారి నుంచి చిన్నారులను తప్పించాలి' అని పార్లమెంటరీ స్థాయీసంఘం లోగడే నిర్దేశించింది.

సాంకేతికంలోనూ వెనుకంజే..

నత్తనడక పనులతో పాఠశాలలు తిరిగి తెరుచుకునే నాటికైనా పిల్లలకు ఆ భరోసా ఎండమావేనని స్పష్టమవుతోంది. కొరత ప్రాణాధార జలాలకేనా? దేశవ్యాప్తంగా 28.55శాతం ప్రభుత్వ పాఠశాలల్లోనే కంప్యూటర్లు, 11.58శాతం బడుల్లోనే అంతర్జాలం అందుబాటులో ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ ఇటీవల లెక్కక్కట్టింది. 88శాతం బడులకు అంతర్జాలాన్ని అందించిన దిల్లీ ఈ జాబితాలో ముందుంటే- కేరళ(87.61శాతం), గుజరాత్‌(66.88) వంటివి ఆ తరవాతి స్థానాల్లో నిలిచాయి. పదిశాతం లోపు పాఠశాలలకు సైతం ఈ సాంకేతిక సదుపాయాన్ని కల్పించలేని దుస్థితికి ఏపీ, తెలంగాణ పరిమితమయ్యాయి! డిజిటల్‌ బోధనలో మెరుగైన ప్రమాణాలు సుసాధ్యం కావాలంటే- సత్వరం ఈ దుస్థితి సమసిపోవాల్సిందే.

ప్రవేటుకు ధీటుగా..

కొవిడ్‌ కల్లోల కాలంలో 'ప్రైవేటు' రుసుముల భారానికి తట్టుకోలేని తల్లిదండ్రులెందరికో సర్కారీ బడులే ఆశాదీపాలవుతున్నాయి. ఆ మేరకు వాటిలో చిన్నారుల చేరికలు పెరిగాయని క్షేత్రస్థాయి నివేదికలు చాటుతున్నాయి. ఇంతలంతలవుతున్న విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా ప్రభుత్వ విద్యాలయాల్లో మౌలిక వసతులు వృద్ధి చెందాలి. కొవిడ్‌ కేసుల జోరు ఉపశమించి పిల్లలతో బడులన్నీ కళకళలాడే నాటికి వాటిని వెతల ఊబిలోంచి ఒడ్డున పడేయాలి. ప్రభుత్వాలు ఆ సంకల్పదీక్ష వహిస్తాయా అన్నదే చిక్కుప్రశ్న! ప్రభుత్వ పాఠశాలల్లో నిర్మించామని ఊదరగొట్టిన మరుగుదొడ్లలో సింహభాగం అక్కరకు రాకుండా పోతుంటే- కాగితాలపై తప్ప అసలు నిర్మాణానికే నోచుకోనివీ గణనీయంగా ఉన్నాయని కాగ్‌ నిరుడే కుండ బద్దలుకొట్టింది. మెరమెచ్చు మాటలతో పొద్దుపుచ్చకుండా పటిష్ఠ విద్యాపునాదులపై నవతరాన్ని నిలబెట్టడానికి ఏలికలు చిత్తశుద్ధితో కృషిచేస్తేనే ఇటువంటి పరాభవాలు తప్పుతాయి. ఆసేతుహిమాచల పర్యంతం ప్రభుత్వ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేస్తేనే చిన్నారులకు సరైన బోధన సమకూరుతుంది.

నిర్ధిష్ట కార్యాచరణతోనే..

కాలానుగుణంగా విస్తృతమవుతున్న పోటీలో బడుగు బలహీన వర్గాల పిల్లలూ నెగ్గుకురావాలంటే ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కావాలి. అంతర్జాలం, డిజిటల్‌ ఉపకరణాల లేమితో చదువులకు దూరమవుతున్న కోట్లాది విద్యార్థులకు చేయూత దక్కాలి. 'భారత్‌నెట్‌' పథకాన్ని పరుగులెత్తించి గ్రామసీమలకు బ్రాడ్‌బ్యాండ్‌ను తీసుకురావడం మొదలు సమధిక నిధులు, నియామకాలతో బడులను తీర్చిదిద్దడం వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా ముందడుగేయాలి. అప్పుడే అంతరాలకు అతీతంగా అందరికీ నాణ్యమైన విద్య అందగల వీలుంటుంది!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.