పోలీసు అధికారులు విచారణ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని నిందితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని అడ్డగూడూరు పోలీసుస్టేషన్లో ఒక నేరారోపణలో మరియమ్మ అనే దళిత మహిళ లాఠీ దెబ్బలకు ప్రాణాలు కోల్పోయారు. ఆ కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని భావించిన తెలంగాణ హైకోర్టు మరియమ్మ లాకప్ డెత్(Mariamma lockup death) కేసు దర్యాప్తును సీబీఐకి (CBI) అప్పగించడం సముచితమని వ్యాఖ్యానించింది. తాజాగా సూర్యాపేట జిల్లాలో రామోజీ తండాకు చెందిన 25 ఏళ్ల వీరశేఖర్‌ను దొంగతనం అనుమానంతో ఆత్మకూర్(ఎస్) పోలీసులు తీవ్రంగా హింసించారన్న కథనాలు వెలుగుచూశాయి. ఇటువంటి సంఘటనలతో లాకప్‌లో పోలీసులు పెడుతున్న చిత్రహింసలు చర్చనీయాంశమవుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1977 నుంచి ఇప్పటిదాకా సుమారుగా 750కి పైగా కస్టడీ మరణాలు చోటుచేసుకున్నాయని మానవహక్కుల నివేదికలు చెబుతున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే స్మార్ట్ పోలీసింగ్‌లో తెలుగు రాష్ట్రాల పనితీరు మేటిగా ఉన్నట్లు ఇటీవల ఇండియన్ పోలీస్ ఫౌండేషన్(ఐపీఎఫ్) సర్వే పేర్కొంది. కఠినత్వం, సత్ప్రవర్తన, ఫ్రెండ్లీ పోలీసింగ్ వంటి విభాగాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసు(Telangana police news) శాఖలు ఒకటి, రెండు స్థానాల్లో నిలిచినట్లు వెల్లడికావడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
చట్ట ప్రకారం శిక్షలు పడలి..కానీ...
పోలీసు అధికారులు విచారణ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని నిందితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తుండటంతో అది వికటించి నిందితులు ప్రాణాలు(lockup death news) కోల్పోతున్నారనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. నిందితులపై పోలీసులు తమ ప్రతాపం చూపకుండా వారి నేరారోపణలను రుజువు చేసి న్యాయవ్యవస్థకు అప్పగించవలసి ఉంటుంది. అక్కడ చట్ట ప్రకారం వారికి శిక్షలు పడతాయి. పోలీసుల విచారణలో అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పోలీసుల చిత్రహింసల కారణంగా ప్రతి వారం కనీసం ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారని అధ్యయనాలు చాటుతున్నాయి. దేశంలో 2019లో 1723 కస్టోడియల్ మరణాలు(Custodial deaths in telangana) చోటుచేసుకున్నట్లు జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC report) తన నివేదికలో వెల్లడించింది. వారిలో దాదాపు 93శాతం(1606) మంది జ్యుడీషియల్ కస్టడీలో ప్రాణాలు కోల్పోయారు. 117 మంది పోలీసు నిర్బంధంలో అసువులుబాశారు. పోలీస్ కస్టడీ మరణాలు ఏటా పెరుగుతున్నాయని జాతీయ హింస వ్యతిరేక సాధన సమితి గతేడాది తన వార్షిక నివేదికలో పేర్కొంది. దేశంలో దోపిడి, దొంగతనాలు, అఘాయిత్యాల కేసుల్లో చిక్కుకున్నవారే ఎక్కువగా పోలీసు కస్టడీలో బందీలుగా ఉంటున్నారు. అణగారిన వర్గాలకు చెందిన అనేక మంది అమాయకులను ఎటువంటి ఆధారాలు లేకున్నా కేవలం అనుమానితులుగా గుర్తించి అక్రమ కేసులు బనాయించి జైలు గోడల మధ్య బంధిస్తున్నారన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరోవైపు దేశంలో ప్రతి సంవత్సరం దళితులపై దాడులు పెరుగుతూనే ఉన్నాయి. జాతీయ నేర గణాంకాల ప్రకారం 2018లో దళితులపై 42,793 దాడులు జరిగాయి. 2020లో ఆ సంఖ్య 50,291కి పెరిగింది. ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బిహార్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో దళితులపై అత్యధిక దాడులు(Most lockup deaths on Dalits) నమోదవుతున్నాయి. ఈ దాడులకు సంబంధించి పలు కేసుల్లో స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ 20శాతం నేరస్తులపై పోలీసులు ఫిర్యాదుపత్రం దాఖలు చేయడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిర్బంధంలో ఉన్న నిందితులపై చిత్రహింసల నిరోధానికి ఐక్యరాజ్య సమితి (UNO)చేసిన తీర్మానంపై పాతికేళ్ల క్రితం భారత్ సంతకం చేసింది. అందుకు అనుగుణంగా రూపొందించాల్సిన ప్రత్యేక చట్టాన్ని మాత్రం ఇంతవరకూ పట్టాలకు ఎక్కించలేదు. చిత్రహింసల నిరోధక చట్టాన్ని రూపొందించే ప్రక్రియ కొనసాగుతోందని ఈ ఏడాది మార్చిలో కేంద్రం లోక్‌సభలో ప్రకటించింది. పోలీసుల పనితీరుకు ప్రజల సంతృప్తే కొలమానం కావాలని జస్టిస్ వర్మ కమిటీ గతంలో తేల్చి చెప్పింది. పోలీసుల సెలవులు, సౌకర్యాల లేమి వంటివి సిబ్బంది పనితీరును ప్రభావితం చేస్తున్నాయన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. పోలీస్‌స్టేషన్లలో మానవ హక్కులకు తీవ్ర ముప్పు వాటిల్లుతోందని ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ(Justice NV Ramana Comment on Human rights) సైతం ఆందోళన వ్యక్తం చేశారు. నేరస్తులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం నేరం అయినప్పటికీ దాన్ని నివారించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఇప్పటికైనా ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వాలు కంకణబద్ధం కావాలి. పోలీసు అధికారులు సైతం హింసకు తావులేకుండా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. అప్పుడే ప్రభుత్వాలు, పోలీసు శాఖ గొప్పగా చెప్పుకొనే స్నేహపూర్వక పోలీసింగ్ ప్రజలకు అనుభవమవుతుంది. - డాక్టర్ సిలువేరు హరినాథ్ (‘సెస్’లో రీసెర్చ్ అసిస్టెంట్)
ఇదీ చదవండి: Etela Rajender on KCR: 'రాజకీయాలకోసం రైతుల జీవితాలతో ఆడుకోవద్దు'