కరోనా తర్వాత పరిస్థితులు ఎప్పటిలాగే ఉండవనే చర్చ ప్రతి చోటా జరుగుతోంది. దౌత్య వర్గాల్లోనూ ఇదే తరహా చర్చ సాగుతోంది. అయితే... ఇది ప్రపంచాన్ని ప్రచ్ఛన్న యుద్ధం నాటి సమయానికి తీసుకువెళ్తుందన్నది కొందరు దౌత్యవేత్తల అభిప్రాయం. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లుగా.. దీనికి కూడా అనేక కారణాలున్నాయి. బీజం ఎప్పుడు పడిందో, ఎక్కడ పడిందో గానీ, దేశాలు రెండు కూటములుగా విడిపోయి మరీ ఘర్షణకు దిగే అవకాశాలున్నాయని దౌత్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
కొవిడ్‌కు ముందే ప్రపంచ శక్తులన్నీ మరోసారి ఏకమవుతున్నట్లు అస్పష్ట సంకేతాలు వెలువడినప్పటికీ.. ప్రస్తుతం అది స్పష్టమైంది. ప్రపంచ దేశాలు రెండు రకాల కూటముల వైపు మొగ్గుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమై రష్యా బలం క్షీణించడం వల్ల ప్రచ్ఛన్న యుద్ధం ముగిసి, అమెరికా ఏకైక అగ్రరాజ్యంగా ఎదిగింది. దీనికి యూరప్ దేశాలు, ఇతర మిత్ర దేశాలు మద్దతిచ్చాయి. ఆ సమయానికి చైనా ఆర్థికంగా, సైనిక బలం పరంగా ప్రారంభ దశలో ఉంది. మరోవైపు.. ప్రపంచీకరణ, సరళీకృత ఆర్థిక విధానాలతో భారత్.. అప్పుడప్పుడే ఆధునిక ప్రపంచంలో స్థానం కోసం ప్రయత్నిస్తోంది.
సోవియట్ తర్వాతి కాలం..
సోవియట్ పతనానంతర కాలంలో అనేక మార్పులు జరిగాయి. ప్రపంచ పాలన సంస్థలను సంస్కరించడం సహా అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఆర్థిక వ్యవస్థలకు అవకాశాలు కల్పించడం వల్ల చైనా, రష్యా, భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వంటి దేశాలు ప్రపంచ వ్యవహారాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ఇది ప్రపంచంలో... వివిధ దేశాల కూటముల ఏర్పాటుకు దారితీసింది. ఈ కారణాల కలయికతో ప్రపంచం మరో దిశ వైపు కదులుతున్నట్లు కనిపించింది.
అమెరికా-యూరప్ కూటమి, రష్యాల మధ్య విబేధాలు:
సోవియట్ పతనమైన తర్వాత రష్యా వెంటనే చైనా వైపు అడుగేసింది. అటు... అమెరికా, ఐరోపా సమాఖ్యలు.. వివిధ రాజకీయ సిద్ధాంతాలు, ఆర్థిక, వ్యూహాత్మక లక్ష్యాలతో సోవియట్ అనంతర కాలంలో ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేశాయి. ఐరోపాలో మళ్లీ కమ్యూనిజం ఉద్భవించకుండా... కొత్తగా ఏర్పడిన స్వతంత్ర దేశాలను యూరో-అట్లాంటిక్ సిద్ధాంతాలతో అనుసంధానించాలని వారు భావించారు. కాస్పియన్ సముద్రం, మధ్య ఆసియాలో సమృద్ధిగా ఉన్న ఇంధన వనరులు, ఐరోపాకు కీలకంగా మారాయి. ముఖ్యంగా రష్యన్ ఫెడరేషన్‌పై ఆధారపడడాన్ని తగ్గించేందుకు ఇవి ఎంతగానో లాభించాయి.
రష్యన్ ఫెడరేషన్‌లో ఐరోపా సమాఖ్య, నాటో దళాల ఉనికి విస్తరించడం నాటి రష్యా అధ్యక్షుడు బోరిస్ యెల్త్‌సిన్ అంతగా పట్టించుకోలేదు. అయితే వీరి ఉనికి రష్యా భద్రతపై ప్రతికూల ప్రభావం కల్గిస్తుందంటూ ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్... 2000 సంవత్సరం నుంచి వాదిస్తూనే ఉన్నారు. 2008 ఏప్రిల్‌లో జార్జియా, ఉక్రెయిన్‌లను నాటో దళంలో చేరడం, కొసోవో స్వతంత్రతను అమెరికా సహా పలు ఐరోపా దేశాలు గుర్తించడం వంటి అంశాలు రష్యాను రెచ్చగొట్టాయి. ఇందుకు ప్రతిగా జార్జియా నుంచి విడిపోయిన ప్రాంతాలైన అబ్‌ఖాజియా, దక్షిణ ఒసెటియాలను... స్వతంత్ర దేశాలుగా రష్యా గుర్తించింది. దీనితో పాటు 2014లో ఉక్రెయిన్ నుంచి క్రిమియా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ కారణాలతో పశ్చిమ దేశాలు, రష్యాల మధ్య అగాధం పెరిగింది. ముఖ్యంగా అమెరికా విధించిన ఆంక్షలతో రష్యా ఆర్థికంగా ఇబ్బందులకు గురైంది. దీంతో అనుకూలమైన భాగస్వామిని వెతికే క్రమంలో.. చైనా వైపు మళ్లడం రష్యాకు అనివార్యమైంది.
చైనా-రష్యా మైత్రి
2019 నాటికి కొత్త శకం కోసం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, సమన్వయం చెందేలా రష్యా-చైనా సంబంధాలు అభివృద్ధి చెందాయి. ప్రాంతీయ ప్రపంచ సమస్యలపై సమన్వయ విధానాన్ని అవలంబించడం సహా విస్తృత రంగాలలో పరస్పరం ద్వైపాక్షిక సహకారాన్ని అందించుకున్నాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్యం 100 బిలియన్ డాలర్లు దాటి 2018 నాటికి 108 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇరు దేశాలకు ప్రయోజనం అందించే కీలక రంగంగా ఇంధన రంగం ఆవిర్భవించింది. రక్షణరంగంలో సహకారం పెరిగింది. దాదాపు అన్ని సరిహద్దు సమస్యలు పరిష్కరించుకున్నాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలు పరస్పర అనుబంధంగా, బహుమానపూర్వకంగా తయారయ్యాయి.
దగ్గరైన చైనా-ఇరాన్:
ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి 2018 మేలో అమెరికా వైదొలగింది. అనంతరం కఠిన ఆంక్షలను తిరిగి విధించడం వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఆంక్షల ద్వారా తన ప్రతర్థులను కట్టడి చేసే చట్టమైన సీఏఏటీసీఏ-కాట్సా ద్వారా ఇరాన్, రష్యా, ఉత్తర కొరియాపై అమెరికా ఆంక్షలను విధించింది. వారితో ఇతర దేశాలు లావాదేవీలు నిర్వహించకుండా పరిమితులు విధించింది.
ఇరాన్, అమెరికాల మధ్య సంబంధాలు క్షీణించడం వల్ల చైనా, ఇరాన్‌ల మధ్య 400 బిలియన్ డాలర్ల విలువైన వ్యూహాత్మక, వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఈ ఒప్పందంలో భాగంగా చైనా.. ఇరాన్ ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టనుంది. ఇందుకు ప్రతిఫలంగా.. అత్యంత చవకైన ధరకే చైనాకు ఇరాన్ ముడి చమురు, సహజ వాయువును సరఫరా చేస్తుంది. ఇరాన్ అణు ఆశయాలపై నీళ్లు చల్లి, ఆ దేశాన్ని ఒంటరి చేసే అమెరికా ప్రయత్నాలను ఈ ఒప్పందం బలహీనపరుస్తుంది.
అవసరార్థ ఒప్పందాలతో విస్తరిస్తున్న చైనా ప్రాబల్యం:
రష్యా, ఇరాన్‌ల వంటి వనరులు అధికంగా ఉన్న దేశాలతో అవసరార్థ ఒడంబడికల ద్వారా చైనా తమ భాగస్వాములుగా చేసుకుంది. ఇప్పటికే పాకిస్థాన్, ఉత్తరకొరియాలు చైనా భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి. ఇటీవల నేపాల్, శ్రీలంక కూడా చైనా శిబిరంలో చేరినట్లు కనిపిస్తోంది. భారత్‌కు చెందిన ప్రాంతాలను నేపాల్ తమ దేశ మ్యాపులో చూపించడం, కొలంబో నౌకాశ్రయంలోని తూర్పు కంటైనర్ టెర్మినల్ అభివృద్ధి కోసం ఉద్దేశించిన శ్రీలంక-ఇండియా-జపాన్ ఉమ్మడి ప్రాజెక్టును పునఃసమీక్షించాలని శ్రీలంక నిర్ణయం తీసుకోవడం వెనక కచ్చితంగా చైనా హస్తం ఉంటుంది. అటు, ఆఫ్రికాలోని పలు చిన్న దేశాలను కూడా చైనా తన గుప్పిట్లో ఉంచుకుంది.
చైనాకు వ్యతిరేకంగా ప్రపంచ శక్తుల పునరేకీకరణ:
ప్రపంచంలో చైనా వ్యతిరేక సెంటిమెంటు పెరిగిందని వర్తమాన అంతర్జాతీయ వ్యవహారాల మీద పని చేసే చైనా నిఘా విభాగం స్వయంగా అంగీకరించినట్లు ఓ మీడియా సంస్థ తెలిపింది. 1989 తియనాన్మెన్ హింసాకాండ తర్వాత చైనా వ్యతిరేక భావాలు అత్యధికంగా పెరిగినట్లు చైనా నిఘా విభాగం పేర్కొంది. దీనికి అనేక కారణాలున్నాయి. చైనాపై ఇతర ప్రపంచ దేశాలకు ఎంతో కాలంగా అపనమ్మకం కలిగిస్తూ ఉంది. ప్రధానంగా చైనా విస్తరణ కాంక్ష, అన్యాయమైన మార్గాల ద్వారా చిన్న దేశాలను ఆర్థిక బానిసలుగా చేసుకోవాలన్న డ్రాగన్ ఆశయాల ద్వారా ఈ అపనమ్మకం ఏర్పడింది. చైనా అంతర్జాతీయ ప్రాజెక్టులు, ముఖ్యంగా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ వంటి విషయాల్లో భౌగోళిక రాజకీయ, భద్రతాపరంగా చిక్కులు ఉన్నట్లు అనేక దేశాలు భావిస్తున్నాయి.
భారత్ ఆందోళన
చైనాతో భారీ వాణిజ్య లోటు, ప్రపంచ సంస్థల్లో ఆ దేశానికి పెరుగుతున్న వాటా, ప్రపంచ పాలన సంస్థల్లో చైనా ప్రాముఖ్యంపై అమెరికా, భారత్ సహా అనేక దేశాలు ఆందోళన చెందుతున్నాయి. విదేశీ సంస్థలకు చైనా మార్కెట్లలో పరిమిత ప్రవేశం, ప్రభుత్వ రంగ సంస్థలకు అధిక ప్రాధాన్యమివ్వడం కూడా ఈ ఆందోళనకు కారణమే. చైనా సైబర్ గూఢచర్యానికి కూడా పాల్పడుతోందన్న ఆరోపణలున్నాయి.
చైనాపై దెబ్బకొట్టడం
అంతర్జాతీయ వాణిజ్యంలో బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగే ప్రదేశమైన దక్షిణ చైనా, తూర్పు చైనా సముద్రాల్లో.. డ్రాగన్ దూకుడు స్వేచ్ఛ నౌకాయానం, విమానాయానానికి ముప్పుగా పరిణమించింది. కరోనా వైరస్‌ను ఉద్దేశపూర్వకంగానే ప్రపంచదేశాలకు వ్యాప్తి చెందేలా వ్యవహరించిందన్న ఆరోపణలు చైనాపై ఉన్నాయి. మరోవైపు.. ఈ సంక్షోభ సమయాన్ని ఉపయోగించుకొని నకిలీ వైద్య పరికరాలను విక్రయించడం, ఇతర దేశాల్లో ఉన్న నిరర్ధక ఆస్తులను స్వాధీనం చేసుకోవడం వంటి విషయాల వల్ల అంతర్జాతీయంగా చైనా ప్రతిష్ఠ దిగజారడమే కాకుండా చైనా వ్యతిరేక భావజాలం కూడా పెరుగుతోంది. ఈ భావజాలం ప్రధాన ఉద్దేశం, చైనా ఆర్థికవ్యవస్థను బలహీనపరిచి తద్వారా దాని ఆశయాలను దెబ్బకొట్టడం. ఇప్పటికే పలు దేశాలు చైనా పెట్టుబడులను గమనించడానికి ప్రత్యేకంగా యంత్రాంగాలను రూపొందిస్తున్నాయి.
చైనాకు వ్యతిరేకంగా...
చైనాతో కుదుర్చుకున్న ఒప్పందాలను పునఃసమీక్షించడం లేదా రద్దు చేయడం చేస్తున్నాయి. చైనాకు చెందిన ప్రముఖ చరవాణి సంస్థ హువావేను అమెరికా నిషేధించింది. అటు... చైనా నుంచి బయటకు వచ్చేస్తున్న సంస్థలకు పలు దేశాలు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా, జపాన్, భారత్, ఆస్ట్రేలియాలు జల విన్యాసాలు చేపట్టడం ద్వారా చైనాకు హెచ్చరికలు పంపాయి. చైనాను విమర్శించడంలో అమెరికా ఆది నుంచి ముందుంది.
ఐరోపా సమాఖ్య కూడా చైనా విషయంలో కఠినంగానే ఉన్నట్లు తెలుస్తోంది. జపాన్, ఆస్ట్రేలియా సహా పలు ఆసియాన్ దేశాలకు చైనా వ్యతిరేక కూటమిలో చేరేందుకు వారి వారి కారణాలున్నాయి. అటు... భారత్‌లో కూడా చైనా వ్యతిరేక సెంటిమెంటు బలంగా వినిపిస్తోంది.
ఫలితంగా...
ప్రపంచ శక్తుల పునరేకీకరణ ద్వారా త్వరలోనే రెండు విభిన్న ప్రపంచ శక్తుల మధ్య ఘర్షణ జరిగే అవకాశం ఉంది. అమెరికా కూటమిలో ప్రజాస్వామ్యం, పారదర్శకత ఉండి, న్యాయం, మానవహక్కులు, మైనారిటీల పట్ల గౌరవం వంటి లక్షణాలున్న దేశాలున్నాయి. మరోవైపు... చైనా తరపున ఉన్న దేశాల్లో ఈ అంశాలు కొరవడ్డాయి.
చైనా కూటమిలో రష్యా, పాకిస్థాన్, ఉత్తర కొరియా, ఇరాన్ వంటి దేశాలున్నాయి. ఈ దేశాల్లో విశ్వవ్యాప్తంగా ఆమోదించిన విలువలకు తక్కువ ప్రాధాన్యముంటుందన్నది జగమెరిగిన సత్యం. మొత్తంగా మనం ప్రజాస్వామ్య దేశాల కూటమితో నిరంకుశత్వ పాలన ఉన్న దేశాల మధ్య ఘర్షణను చూడబోతున్నామా అనిపిస్తోంది.
(రచయిత-అచల్ మల్హోత్రా, ఐరాస ప్రధాన కార్యాలయంలో పనిచేసిన భారత మాజీ దౌత్యవేత్త)