పోషకాహార పరంగా భారత్ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. తాజా అంతర్జాతీయ క్షుద్బాధా సూచీ(116 దేశాలు)లో భారత్ 101వ స్థానంలో నిలిచింది. నాలుగో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం- దేశంలో 38 శాతం పిల్లల్లో ఎదుగుదల సరిగ్గా లేదు. 21 శాతం పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు లేరు. 35 శాతం పైగా తక్కువ బరువుతో ఉన్నారు. యాభై శాతానికి పైగా గర్భిణులు, మహిళలు రక్తహీనతను ఎదుర్కొంటున్నారు. 2018-19నాటి అయిదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారమూ పిల్లల్లో ఎదుగుదల అంతంతమాత్రంగానే ఉన్నట్లు తేలింది. ఇలాంటి అనారోగ్య భారతాన్ని కుదుటపరచేందుకు నీతిఆయోగ్ జాతీయ పోషకాహార విధానాన్ని రూపొందించింది. దేశంలోని పిల్లలు, కౌమార బాలికలు, గర్భిణులు, బాలింతలకు తగినంత పోషకాహారాన్ని అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2018 నుంచి పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. 2022 నాటికి పోషకాహార లోపం లేని భారత్‌ను సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
ప్రజారోగ్యమే గీటురాయి
ఏ దేశ సుస్థిరాభివృద్ధికైనా ప్రజల ఆరోగ్యమే గీటురాయి. ప్రజారోగ్యం పౌష్టికాహార లభ్యతపైనా ఆధారపడి ఉంటుంది. సమతుల ఆహారం కోసం రోజుకు 400 గ్రాముల పండ్లు, కూరగాయలు తినాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది. అందులో 150 గ్రాముల పండ్లు, 250 గ్రాముల కూరగాయలు ఉండాలని తెలిపింది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో 126 గ్రాముల కూరగాయలు, 26 గ్రాముల పండ్లు మాత్రమే తీసుకుంటున్నట్లు అంచనా. ఇందుకు ఎన్నో కారణాలు తోడవుతున్నాయి. పిల్లల్లో ఆరేళ్ల వయసులోనే మానసిక ఎదుగుదల జరుగుతుంది. ఆ వయసులో పిల్లలకు సరైన పోషకాహారాన్ని అందిస్తే ఆరోగ్యంగా తయారవుతారు. కేంద్ర నూతన విద్యా విధానం చిన్నారుల మానసిక ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. పాఠశాల ఆహార పట్టికలో అల్పాహారాన్ని చేర్చి గుడ్లు, తాజా, ఎండు పండ్లు అందించాలని నిర్దేశించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలైన ప్రజల ఆకలిని తీర్చడం, ఆరోగ్యకరమైన జీవనాన్ని, సంక్షేమాన్ని ప్రోత్సహించాలంటే మంచి పోషకాహారాన్ని అందించాల్సి ఉంటుంది. అప్పుడే 2030 నాటికి లక్ష్యాన్ని చేరుకోగలం. దేశంలో పోషకాహారాన్ని అందించడానికి చేపట్టిన సమగ్ర శిశు అభివృద్ధి పథకం పిల్లలు, గర్భిణులు, బాలింతలకు తోడ్పాటు అందిస్తోంది. ప్రధానమంత్రి మాతృ వందన యోజన ద్వారా గర్భిణులకు, తొలి కాన్పు అనంతరం పాలిచ్చే తల్లులకు పోషకాహార అవసరాలు తీర్చడానికి ఆరువేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. పౌష్టికాహార భద్రత గురించి ఆహార భద్రతా చట్టంలోనూ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
చౌక ధరల్లో తగినంత పరిమాణంలో ఆహార పదార్థాల్ని అందుబాటులో ఉంచడం ద్వారా పేదలకు పోషక భద్రతను కల్పించాలి. తద్వారా క్యాలరీల లోపాన్ని అధిగమించవచ్చు. పప్పు దినుసులు, పాలు, పౌల్ట్రీ ఉత్పత్తుల పంపిణీ, వినియోగాలను పెంచి- ప్రొటీన్ల లోపాన్ని నివారించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం ద్వారా పోషకాహారాన్ని అందిస్తున్నా కొవిడ్ కల్లోలంతో ఆ కార్యక్రమం కుంటువడింది. అది సజావుగా సాగేలా చూడాలి. పోషణ్ అభియాన్ విజయానికి ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు, ప్రోత్సాహకాలు అందించడం, సృజనాత్మక మార్గాల ద్వారా సక్రమ అమలు, సిబ్బందిలో సామర్థ్యం పెంపు, ఫిర్యాదుల సత్వర పరిష్కారంతో పాటు స్త్రీ, శిశు సంక్షేమ అభివృద్ధి శాఖను బలోపేతం చేయాలి.
సమన్వయ లోపం
గ్రామస్థాయిలో మహిళా శిశు అభివృద్ధి శాఖ, తాగునీరు, పారిశుద్ధ్యం, ప్రజా పంపిణీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, విద్యా, మానవ వనరుల అభివృద్ధి, గిరిజన వ్యవహారాల వంటి శాఖల మధ్య సమన్వయం అవసరం. దేశంలో సాంక్రామికేతర వ్యాధులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై సంబంధిత వర్గాలకు విస్తృత అవగాహన కల్పించాలి. పౌష్టికాహార పరంగా బలవర్ధకమైన ధాన్యాల ఉత్పత్తికి రైతులకు ప్రోత్సాహకాలు అందించాలి. స్థానికంగా దొరికే ఆహార పదార్థాలు, కూరగాయలు, ఆకుకూరల్లో లభించే విటమిన్ల గురించి అవగాహన కలిగించాలి. ఇంటి ఆవరణలో పండ్ల మొక్కల పెంపకంతో పాటు, కూరగాయల సాగును ప్రోత్సహించాలి. పాఠశాలలు, అంగన్ వాడీల్లో కూరగాయలు, ఆకుకూరలతో పాటు పండ్ల చెట్లను పెంచాలి. ఖరీదైన పండ్లలోనే పోషకాలు అధికంగా ఉంటాయనే అపోహను తొలగించాలి. అందుబాటులో చౌకగా లభించే పండ్లలో ఉండే పోషకాల గురించి వివరించాలి. ప్రొటీన్ల లోపం, ఐరన్, జింక్, అయోడిన్, విటమిన్-ఎ వంటి సూక్ష్మ పోషకాల లోపాలపై గ్రామీణుల్లో చైతన్యం కలిగించి, వాటిని అందుబాటులోకి తీసుకురావాలి. అందుకు బహుముఖ వ్యూహాలను అవలంబించాలి. పోషకాహారంతో రోగ నిరోధకశక్తి, జీవన ప్రమాణాలు పెరిగి, మేధావికాసానికి దారితీస్తుంది. తద్వారా దేశాభివృద్ధికి వేగంగా అడుగులు పడతాయి.
--ఎ.శ్యామ్‌కుమార్
ఇవీ చదవండి: