గతేడాది కరోనా సృష్టించిన విలయం కారణంగా యావత్ ప్రపంచం విపత్కర పరిస్థితిని ఎదుర్కొంది. లక్షలాది మంది మహమ్మారికి బలయ్యారు. దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు ఛిన్నాభిన్నమయ్యాయి. కరోనా సంక్షోభం నుంచి కోలుకుని, మునుపటిలా ప్రగతి పథంలో దూసుకుపోయేందుకు ఆర్థిక ప్రణాళికలు రూపొందిండం విధానకర్తలకు సవాల్‌గా మారింది.
ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంటులో వార్షిక బడ్జెట్‌ను సోమవారం ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆరోగ్య రంగం మినహా మరే ఇతర రంగానికి ఉహించిన స్థాయిలో నిధులు కేటాయించలేదు.
కరోనా కారణంగా ఆరోగ్య వ్యవస్థలో లోటుపాట్లను గుర్తించిన ప్రభుత్వం, అందరూ అంచనా వేసినట్లుగానే బడ్జెట్లో ఆ రంగానికే పెద్దపీట వేసింది. కరోనా వ్యాక్సినేషన్ కోసం రూ.35వేల కోట్లతో కలిపి మొత్తం రూ.2,23,846 కోట్లు ఆరోగ్య రంగానికి కేటాయించింది. గతేడాది బడ్జెట్లో కేటాయింపులతో పోల్చితే ఇది 137 శాతం అధికం కావడం గమనార్హం. ఇది నిజంగా స్వాగతించాల్సిన విషయమే. కరోనా నుంచి ప్రపంచం ఇంకా పూర్తిగా కోలుకోలేదు. సాధారణ పరిస్థితులు రావడానికి ఇంకా ఒకటి లేదా రెండేళ్లు పట్టే అవకాశముంది.
రక్షణ రంగానికి తక్కువే..
ప్రాచీన భారతంలో ప్రజల యోగ క్షేమాలకే ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రజా సంక్షేమంతో పాటు దేశ సార్వభౌమత్వంతో ముడిపడి ఉన్న జాతీయ భద్రతకు కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాలని, ఇది ప్రజలు ఎన్నుకున్న నాయకుల బాధ్యత అని చాణక్యుడు రాసిన అర్థశాస్త్రం స్పష్టం చేస్తోంది.
తూర్పు లద్దాఖ్‌లో చైనాతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జాతీయ భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం మోదీ సర్కార్‌కు తప్పనిసరైంది. ఈసారి బడ్జెట్లో రక్షణ రంగానికి కేటాయింపులు ఎలా ఉంటాయా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ఆశ్చర్యపరిచే నిర్ణయాలేవీ మోదీ ప్రభుత్వం తీసుకోలేదు. గతేడాది సవరించిన వ్యయం ప్రకారం రక్షణ రంగానికి రూ.4 లక్షల 71వేల కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది కేవలం 7 వేల కోట్లు పెంచి రూ.4లక్షల 78వేల కోట్లు కేటాయించింది. ఇది అమెరికా కరెన్సీలో దాదాపు 65.48 బిలియన్ డాలర్లు.
జీడీపీలో 1.63 శాతమే..
గతేడాది సవరించిన వ్యయంతో పోల్చితే ఈ ఏడాది బడ్జెట్లో రక్షణ రంగానికి కేటాయింపులు కేవలం 1.48 శాతమే పెరిగాయి. ఇది దేశ డీజీపీలో 1.63 శాతమే. 2011-12 వార్షిక బడ్జెట్లో రక్షణ రంగానికి జీడీపీలో 2 శాతం కేటాయించగా.. అది క్రమంగా తగ్గుతూ వస్తోంది. భారత సైనిక శక్తి సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు రక్షణ రంగానికి జీడీపీలో 3 శాతం వరకు కేటాయింపులు ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కరోనా సంక్షోభం కారణంగా భారత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సిన నేపథ్యంలో సరిహద్దులో చైనాతో సమస్యలు ఉన్నప్పటికీ రక్షణరంగానికి కేటాయింపులు పెంచలేదనే విషయం స్పష్టమవుతోంది.
రక్షణ రంగానికి బడ్జెట్లో రూ. 4,78,000 కేటాయించగా, ఇందులో రూ.1,16,000 కోట్లు పింఛన్ల కోసమే ఖర్చు చేయనుంది. రక్షణ సేవల కోసం రూ.3,62,000 కోట్లు వెచ్చించనుంది. గతేడాది రక్షణ సేవల ఖర్చు రూ.3,37,000 కోట్లుగా ఉండగా.. ఈ ఏడాది రూ.25వేల కోట్లు పెరిగింది.
మూలధన వ్యయం పెరిగింది తక్కువే..
2021-22 ఆర్థిక సంవత్సరానికి రక్షణ కేటాయింపుల మూలధన వ్యయం రూ. 1,35,000 కోట్లు. దీనిని సైనిక పరికరాల ఆధునికీకరణ, అత్యాధునిక యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలు కొనుగోలు చేయడానికి ఉపయోగించాలి. గతేడాది సవరించిన మూలధన వ్యయం రూ. 1,34,510 కోట్లతో పోల్చితే ఇది కేవలం రూ.500 కోట్లే అధికం కావడం గమనార్హం.
గతేడాది సవరించిన వ్యయంలో సైన్యానికి రూ.33,213 కోట్లు, నౌకాదళానికి రూ.37,542 కోట్లు, వాయుసేనకు రూ.55,055 కోట్లు కేటాయించింది కేంద్రం. ప్రస్తుత బడ్జెట్లో సైన్యానికి రూ.36,482 కోట్లు, నేవీకి రూ.33,254 కోట్లు, వాయుసేనకు రూ.53, 215 కోట్లు కేటాయించింది.
తూర్పు లద్దాఖ్ సరిహద్దులో చైనాతో ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గతేడాదితో పోల్చితే సైన్యానికి రూ. 3,269 కోట్లు అదనంగా కేటాయించగా.. నేవీ, వాయుసేనకు కేటాయింపుల్లో కోత విధించింది.
ఈ సంవత్సరం రక్షణ రంగానికి సరిపడా కేటాయింపులు జరగకున్నా, ఆర్థిక వ్యవస్థ కోలుకున్న తర్వాత వచ్చే ఏడాది బడ్జెట్లో అధిక కేటాయింపులు ఉంటాయని ఆశిద్దాం.
రక్షణ రంగం ఆధునికీకరణకు అధిక కేటాయింపుల ఉండేలా చూడటం భారత రాజకీయ నాయకులకు సవాల్‌గా మారింది. దేశ జీడీపీలో ఇంత తక్కువ శాతాన్ని రక్షణ శాఖకు కేటాయించడం, జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆయన హయాంలోనే 1962లో చైనాతో యుద్ధంలో భారత్‌కు పరాభవం ఎదురైంది.
(రచయిత- సీ ఉదయ్ భాస్కర్)