Mizoram Elections 2023 : క్రిస్టియానిటీ మెజార్టీ ఉన్న మిజోరంలో ఈ సారి అధికార కోసం మిజో నేషనల్ ఫ్రంట్-MNF, కాంగ్రెస్, ZPM మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. మిజోరంలో ఒక సారి అధికారం చేపట్టిన పార్టీ వరుసగా రెండు విడతలు అధికారంలో ఉండటం ఆనవాయితీగా వస్తోంది. 1987లో మిజోరం రాష్ట్ర హోదా పొందిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో స్వతంత్రుల మద్దతుతో MNF అధికారం చేపట్టింది. ఆ తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం కైవసం చేసుకుంది. 1994 లోనూ ఆ పార్టీ అధికారం నిలబెట్టుకుంది.
1998, 2003లో MNF గద్దెనెక్కగా.. 2008, 2013లో మళ్లీ కాంగ్రెస్ అధికారంలో దక్కించుకుంది. 2018లో MNFకు అధికారం బదిలీ అయింది. మిజోరంలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 3 పార్టీలు అన్ని చోట్ల తమ అభ్యర్థులను బరిలో దించాయి. MNF తరఫున 25 మంది, ZPM నుంచి ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో 39 స్థానాల్లో పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ.. ఒకచోట మాత్రమే గెలుపొందింది. ఈ సారి 23 మంది అభ్యర్థులను మాత్రమే బరిలో దించింది. ఆమ్ ఆద్మీ పార్టీ మిజోరం ఎన్నికల్లో అరంగేట్రం చేస్తోంది. తొలిసారి కావటం వల్ల 4 స్థానాల్లోనే అభ్యర్థులను నిలబెట్టింది.
నామినేషన్ల ఉపసంహరణ తర్వాత మిజోరం ఎన్నికల బరిలో 174 మంది మిగిలారు. వారిలో 27 మంది స్వతంత్రులు సహా 5 పార్టీలకు చెందిన అభ్యర్థులు ఉన్నారు. 16 మంది మహిళలు కూడా ఉన్నారని ఎన్నికల సంఘం ప్రకటించింది. 2018 లో కంటే ఈ సారి 35 మంది తక్కువగా పోటీ చేస్తున్నారు. మిజోరంలో మొత్తం 8 లక్షల 56 వేల 8 వందల 68 మంది ఓటర్లు ఉన్నారు.
మిజోరాంలో నవంబర్ 7న పోలింగ్.. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. డిసెంబర్ 3 ఆదివారం కావడం వల్ క్రిస్టియన్లు ప్రార్థనలకు వెళ్తారని ఓట్ల లెక్కింపు తేదీ మార్చాలని అన్నిపార్టీలు, చర్చీలు, విద్యార్థి సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేశాయి. అయితే వారి అభ్యర్థనపై ఈసీ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
5 States Election Date 2023 : 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. ఫలితాలు ఎప్పుడంటే?
Rahul Gandhi Mizoram : 'మణిపుర్ అల్లర్ల కంటే ఇజ్రాయెల్ యుద్ధంపైనే మోదీకి ఎక్కువ ఆసక్తి'