సైనిక కమాండ్ నుంచి కీలక సమాచారం చోరీకి గురికావడం కలకలం రేపుతోంది. జమ్ముకశ్మీర్ ఉధంపుర్లోని ఆర్మీ నార్తర్న్ కమాండ్‌లో డేటా చౌర్యం వెలుగులోకి వచ్చింది. మిలిటరీ డేటాబేస్‌లోకి చొరబడిన గూఢచారులు భారీగా సమాచారాన్ని తస్కరించినట్లు తెలుస్తోంది.
'లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారంటే.. ఈ అంశం ఎంత తీవ్రమైందనే విషయాన్ని సూచిస్తోందని' సంబంధిత వర్గాలు ఈటీవీ భారత్‌తో చెప్పాయి.
పంజాబ్‌కు చెందిన ఓ జవానును ఈ ఘటనకు పాల్పడ్డాడని అధికారులు తెలిపారు. పాకిస్థాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) కొద్దిరోజుల క్రితం ఈ జవానును నియమించుకుందని పేర్కొన్నారు. నిందితుడిని సైన్యం అదుపులోకి తీసుకుంది. పెన్‌డ్రైవ్ ద్వారా సమాచారాన్ని సేకరించి పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తులకు అప్పగించాడని తెలుస్తోంది.
దీనిపై భారత ఆర్మీ ప్రతినిధులను వివరణ కోరగా.. భద్రతా ఉల్లంఘన జరిగిందని వారు స్పష్టం చేశారు. అయితే అధిక సమాచారం చోరీకి గురైందని చెప్పలేమని అన్నారు. అయితే దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
'భారీగా కాకపోవచ్చు'
అయితే సమాచార చౌర్యంపై మరో అధికారి అనుమానం వ్యక్తం చేశారు. భారీగా డేటా చోరీ కాకపోవచ్చని అన్నారు.
"ఈ కాలంలో సమాచారాన్ని పటిష్ఠంగా భద్రపరుస్తున్నాం. సమాచారం భద్రపరిచే శాఖ ఎంత సున్నితంగా ఉంటే.. మార్గదర్శకాలు అంత రహస్యంగా ఉంటాయి. ఓ జవాను కీలక పత్రాలను చోరీ చేశాడని అంటే అది ప్రశ్నార్థకమే."
-సైనిక అధికారి
16వ కార్ప్స్ ప్రధాన కార్యాలయం నెలకొన్న జమ్ములోని నగ్రోటా ప్రాంతంలో ఈ జవాను విధులు నిర్వర్తించేవాడు. జమ్ము కశ్మీర్‌లోని పీర్‌పంజల్ ప్రాంతంలోని సైనిక వ్యవహారాలను 16వ కార్ప్స్ పర్యవేక్షిస్తుంది. ఉత్తర భారతదేశంలోని సైన్యం వ్యవహారాలు, ప్రణాళికలకు ఉధంపుర్ బేస్ కేంద్ర బిందువు లాంటిది. నియంత్రణ రేఖ, వాస్తవాధీన రేఖ వద్ద కార్యకలాపాలనూ ఉధంపుర్‌లో పర్యవేక్షిస్తున్నారు.
(సంజీవ్ బారువా-సీనియర్ పాత్రికేయులు)
ఇదీ చదవండి: చేతిలో పేలిన ఐఈడీ.. నక్సలైట్ మృతి