బండ బాదుడు... చితక్కొట్టుడు... ఐపీఎల్‌లో బ్యాటింగ్ వీరుల మెరుపు విన్యాసాల అభివర్ణనలు కావివి! సామాన్యుల వీపులపై సర్కారీ చరుపులకు సరిగ్గా సరిపోయే విశేషణాలు! కరోనా మహమ్మారి కవుకు దెబ్బలకు కుటుంబాలకు కుటుంబాలే చితికిపోయాయి. గోరుచుట్టుపై రోకటిపోటులా దాపురించిన పెట్రో ధరలతో నిత్యావసర ఉత్పత్తులు రెక్కలు తొడుక్కుని ప్రజలతో కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. గడచిన తొమ్మిది నెలల్లోనే రెండొందల రూపాయలకు పైగా ఎగబాకిన గ్యాస్‌బండ వెలతో (Lpg Gas Cylinder Price) వంటింటి బడ్జెట్లన్నీ తలకిందులైపోతున్నాయి. ఆకాశమే హద్దుగా దినదినాభివృద్ధి చెందుతున్న ఇంధన ధరలపై కేంద్ర చమురు శాఖామంత్రి హర్‌దీప్ సింగ్ పురి ఏమంటారోనని పాత్రికేయులు ఇటీవల పలకరించబోతే- 'ఛోడో'(వదిలేయండి) అనేసి ఆయన అక్కడి నుంచి నిష్క్రమించారు. 'వదిలేయడం' అంటే ఏమిటో మరి... జనం బాధల గురించి పట్టించుకోవడం దండగ అనడమా? పెట్రో మంటలపై తననేమీ అడగొద్దని అభ్యర్థించడమా? అమాత్యవర్యుల అభిమతం ఏదైనా కానీ, ధరల దుడ్డుకర్రలతో బడుగు జీవుల నడుములు విరగ్గొట్టడంలో ఏలినవారి ప్రతిభాసామర్థ్యాలు న భూతో న భవిష్యతి!
లీటరు పెట్రోలు రూ.8.50కు లభ్యమైన 1989లో పద్నాలుగు కిలోల గ్యాస్‌బండ ధర... రూ.57.60. ఆ తరవాత పాతికేళ్లలో అది ఏడు రెట్లు అధికమై, 2014 మార్చి ఒకటి నాటికి రూ.410.50కి చేరింది. అంతే... అప్పటి నుంచి బండ ధరకు ఒక్కసారిగా రెక్కలు మొలుచుకొచ్చాయి. ప్రస్తుతం రూ.950కి పైగా వెచ్చిస్తే తప్ప హైదరాబాదులో సిలిండర్ లభ్యం కావడం లేదు. అనధికార డెలివరీ రుసుములతో కలిపితే కొన్ని జిల్లాల్లో వెయ్యి రూపాయలు ధారపోస్తే తప్ప బండ దొరకడం లేదు. గడచిన ఏడేళ్లలో రెట్టింపునకు పైగా ధర పెంచిన కేంద్ర ప్రభుత్వం- వినియోగదారులకు అందించే రాయితీని మాత్రం అంతకంతకూ కోసేసుకుంటూ వస్తోంది. రూ.535 వరకు రాయితీ ఇచ్చిన రోజుల నుంచి నేడు దాన్ని 40.71 రూపాయలకు పరిమితం చేసేసింది. అదీ, కొన్ని రాష్ట్రాల్లోనే చెల్లిస్తోంది. ఈ నామమాత్రపు రాయితీకి సైతం త్వరలో మంగళం పాడేయబోతున్నట్లు ఉన్నతాధికారులే చెబుతున్నారు. గ్రామీణ పేదింటి మహిళలను కట్టెలపొయ్యి కష్టాల నుంచి బయటపడేయడానికి ఉద్దేశించిన 'ఉజ్జ్వల' పథకం స్ఫూర్తికి సైతం ఈ ధరాఘాతాలు తూట్లు పొడుస్తున్నాయి. ఈ పథకం కింద వంటగ్యాసు కనెక్షన్లు పొందినవారిలో ఒక కోటీ 20 లక్షల మంది ధరకు జడిసి బండలు తీసుకోవడం మానేశారని రెండేళ్ల క్రితమే వెలుగుచూసింది. సాధారణ పొయ్యిపై వంట చేయడమంటే గంటకు నాలుగొందల సిగరెట్లను కాల్చడంతో సమానమని సర్కారే లోగడ ఉద్ధృతంగా ప్రచారం చేసింది. గృహిణుల ఆరోగ్యాన్ని బలితీసుకునే వంటింటి కాలుష్యానికి అడ్డుకట్ట వేయాలంటే గ్యాస్ పొయ్యిలను అందిపుచ్చుకోవాల్సిందేనని హితవు పలికింది. కొండెక్కి కూర్చోవడంలో ఎప్పటికప్పుడు కొత్త రికార్డులను బద్దలుగొడుతున్న గ్యాస్ బండతో ఈ లక్ష్యం ఎలా సాకారమవుతుందో పాలక పెద్దలకే తెలియాలి!
సామాన్యులకు పెనుభారంగా పరిణమించిన పెట్రోలు, డీజిలు వెలలైతే- గత నెలాఖరు నుంచి అక్టోబరు మూడు మధ్య తొమ్మిది రోజుల్లో ఏడుసార్లు పెరిగాయి! పోనుపోను ఇంతలంతలవుతున్న ఇంధన ధరలతో ద్రవోల్బణం కట్టుతప్పుతోందని రిజర్వ్ బ్యాంకే ఆందోళన వ్యక్తం చేస్తోంది. ధరాఘాతాల్ని కట్టడి చేయాలంటే పెట్రోలు, డీజిలుపై ఇబ్బడిముబ్బడిగా విధిస్తున్న పరోక్ష పన్నులకు కోత పెట్టాల్సిందేనని రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తాజాగా ఉద్ఘాటించారు. లోగడ ఇదే సూచన వచ్చినప్పుడు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి అనేక చర్యలు తీసుకొంటున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెలవిచ్చారు. అవేమీ క్షేత్రస్థాయిలో అక్కరకు రాలేదని ఆర్బీఐ గవర్నర్ తాజా ప్రకటనే స్పష్టీకరిస్తోంది. పెట్రోలు, డీజిలుపై 2013లో వసూలు చేసిన పన్నుల మొత్తం రూ.52,537 కోట్లు. 2019-20 నాటికి ఆ రాబడి రూ.2.13 లక్షల కోట్లకు చేరింది. గడచిన ఏడేళ్లలో పెట్రో ఉత్పత్తుల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.36 లక్షల కోట్ల మేరకు ఆదాయాన్ని ఆర్జించాయి. అందులో దాదాపు 68శాతం కేంద్ర ఖజానాకే జమయ్యింది. కొవిడ్ సంక్షోభ కాలంలోనూ ఎడాపెడా ఎక్సైజ్ సుంకాన్ని బాది గల్లాపెట్టెను నింపుకొన్న కేంద్ర ప్రభుత్వం- ఇంధన ధరలు దిగిరావాలంటే రాష్ట్రాలే చొరవ తీసుకోవాలని దబాయిస్తోంది. కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురి వంటివారైతే ఇంకో అడుగు ముందుకేసి... పెట్రోలు, డీజిలు పన్నుల మొత్తంతోనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు సెలవిస్తున్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన నుంచి గరీబ్ కల్యాణ్ యోజన వరకు, ఆయుష్మాన్ భారత్ మొదలు అన్న యోజన దాకా అన్ని పథకాలకు, కొవిడ్ టీకాలకూ ఈ సుంకాల సొమ్మే ఆయువుపట్టుగా ఆయన అభివర్ణించారు. ప్రజల జేబులకు చిల్లు పెట్టేది వారి మేలు కోసమేనన్న వాదన ఉంది చూశారూ... అతిగొప్ప పాలనాపాఠం!
చుక్కలను తాకుతున్న ఇంధన ధరలతో ఎకరానికి ఎనిమిది వేల రూపాయల వరకు సాగువ్యయం అధికమై అన్నదాతలు అల్లాడుతున్నారు. వాహన రంగమూ గుడ్లు తేలేస్తోంది. తడిసిమోపెడవుతున్న రవాణా వ్యయంతో సరకుల ధరలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థలూ దెబ్బతింటున్నాయి. నింగిని తాకుతున్న పెట్రోలు, డీజిలు ధరల ధాటికి ప్రజలు అత్యవసర ఖర్చులను కుదించుకుంటు న్నారు. ఇటీవల 291 జిల్లాల్లో సాగిన ఒక అధ్యయనంలో పాలుపంచు కున్న వారిలో అత్యధికులు- కేంద్ర ఎక్సైజ్ సుంకం దిగివస్తే తప్ప తమ బాధలు తగ్గవని స్పష్టంచేశారు. గత యూపీఏ ప్రభుత్వం జారీచేసిన ఆయిల్ బాండ్ల వల్లే పెట్రో ఉత్పత్తుల ధరలు మండిపోతున్నాయని ఆర్థిక మంత్రి నిర్మల రెండు నెలల క్రితం విడ్డూరభాష్యం వినిపించారు. ఆ వాదన వట్టి బూటకమని ఇటీవలే సమాచార హక్కు చట్టం కింద దాఖలైన అర్జీ పుణ్యమా అని నిగ్గుతేలింది. పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు చేసినట్లు- విదేశాల్లోని పన్ను విధానాలను పరిశీలించి ఇక్కడి పెట్రో ఉత్పత్తులపై పన్నులను హేతుబద్ధీకరించడం అత్యవసరం. 'ఆ ఒక్కటీ అడక్కండి' అన్నట్లుగా మొద్దునిద్ర నటిస్తున్న పాలకులు ఇందుకు ముందుకొస్తారా, సామాన్యులకు సాంత్వన కలిగిస్తారా?
- శైలేష్ నిమ్మగడ్డ
ఇదీ చూడండి: Fuel Price Today: ఆగని పెట్రో బాదుడు- మళ్లీ పెరిగిన చమురు ధరలు