భారతదేశం బహుభాషల సంగమక్షేత్రం. ఏ భాషపైనా మరొకటి పెత్తనం చలాయించే పరిస్థితి తలెత్తకూడదన్నది రాజ్యాంగ నిర్మాతల అభిమతం. అందుకనుగుణంగా పలు రాష్ట్రాలకు చెందిన 22 ప్రధాన భాషలను రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూలు గుర్తిస్తోంది. విభిన్న సంస్కృతుల విశాల దేశంలో అన్ని భాషలూ సహజీవనం సాగిస్తూ సమృద్ధమవుతున్నా అప్పుడప్పుడు అలజడులు తప్పడం లేదు. హిందీని తమపై బలవంతంగా రుద్దుతున్నారంటూ ఇటీవల ఆ భాషా దినోత్సవం నాడు కర్ణాటకలో నిరసనలు చోటుచేసుకొన్నాయి. 'ప్రధాని నేతృత్వంలో హిందీతో పాటు అన్ని భారతీయ భాషల అభివృద్ధికీ కట్టుబడి ఉన్నాం' అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టీకరించిన సందర్భంలోనే- భాజపా పాలిత రాష్ట్రంలో తద్భిన్నమైన ఆందోళనలు ముప్పిరిగొన్నాయి. అధికార భాషా విషయకంగా దేశంలో వివాదాలకు దశాబ్దాల చరిత్ర ఉంది. హిందీని పెద్దన్నగా గుర్తించడం పట్ల దక్షిణాదిలో ఆది నుంచీ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రెండు నెలల క్రితం 'నిపుణ్ భారత్' పథకం ప్రారంభ కార్యక్రమంలో హిందీకి ఎత్తుపీట వేయడం వల్ల తాము నిరక్షరాస్యులమనే భావన తలెత్తిందని ఇతర రాష్ట్రాల ఆహ్వానితులు గళమెత్తారు. దిల్లీ ఆసుపత్రిలో మాతృభాషా వినియోగం కూడదంటూ మలయాళీ నర్సులను కట్టడి చేయడంపై లోగడ కలకలం రేగింది. ఆంగ్ల వినియోగాన్ని ఆశించే తమిళనాడు ప్రతినిధులు వెళ్లిపోవచ్చునంటూ ఆయుష్ మంత్రిత్వ శాఖ శిక్షణా కార్యక్రమంలో అధికారులు నోరుపారేసుకోవడంపైనా విమర్శలు వ్యక్తమయ్యాయి.
అమ్మ భాషకు పట్టం..
దేశ సమైక్యతకు ప్రతిబంధకాలయ్యే ఇటువంటి అవాంఛిత ఘటనల నడుమే అన్ని భాషలకూ సమధిక ప్రాధాన్యం కల్పించే యత్నాలు ఇటీవల జోరందుకొన్నాయి. జేఈఈ పరీక్షలతో పాటు ఇంజినీరింగ్, ఇతర వృత్తివిద్యా కోర్సులనూ ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలనే నిర్ణయం, నూతన జాతీయ విద్యా విధానంలో అమ్మభాషలకు అందలం, రాజ్యసభలో ఇతోధికమైన విభిన్న భాషల వినియోగం- ఇవన్నీ మృదుమధుర మాతృభాషలకు పట్టంకట్టే పరిణామాలే!
అన్యభాషలూ ముఖ్యమే..
ప్రాథమిక స్థాయిలో అమ్మభాషలో విద్యాభ్యాసం పిల్లల మేధావికాసానికి తోడ్పడుతుందన్నది నిపుణుల మేలిమి సూచన. పునాది పటిష్ఠమయ్యాక ఉద్యోగ ఉపాధి అవకాశాలు, అవసరాల రీత్యా బహుళ భాషల అభ్యసనమూ అవసరమే. ఒకేసారి ఇన్నేసి భాషలతో విద్యార్థులు ఎలా నెగ్గుకురాగలరనే సందేహాలు నెలకొన్నా- సామాజిక మాధ్యమాలే తోడుగా ప్రపంచ భాషల్లోని వినోద, విజ్ఞాన సమాచార సంద్రంలో మునకలేస్తున్న నవతరానికి అదేమంత సమస్య కాబోదు. బోధనా మాధ్యమాలుగా ప్రాంతీయ భాషలకు ప్రాధాన్య కిరీటాలు అలంకరించడంతో ఆగిపోతే ఒనగూడేది ఏమీ ఉండదు. మాతృభాషలో విద్యను అభ్యసించేవారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలి. ఆ మేరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో సముచిత అవకాశాలు కల్పించాలి. అప్పుడే భావితరానికి అమ్మభాషతో అనుబంధం పటిష్ఠమవుతుంది. విద్యారంగంతో పాటు పాలన, న్యాయ వ్యవహారాల్లో మాతృభాషల వినియోగానికి ప్రభుత్వాలు సంసిద్ధమైతేనే సామాన్యులకు పౌరసేవలు చేరువ అవుతాయి.
భాషలన్నింటికీ సమగౌరవం..
ఆధునిక అవసరాలను తీర్చేలా భారతీయ భాషలు వెలుగులీనాలంటే- విజ్ఞానం అన్ని భాషల్లోకీ విస్తరించాలి. అందుకు సాంకేతికత జతపడాలి. ఆంగ్లంలోని సమాచారాన్ని ఒకేసారి పదకొండు భాషల్లోకి అనువదించేలా అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) రూపొందించిన ప్రత్యేక ఉపకరణం వంటివి ఇందుకు దోహదపడతాయి. భిన్నత్వంలో ఏకత్వ భావనను పెళుసుబార్చే అనవసర వివాదాలకు తావివ్వకుండా ప్రభుత్వ యంత్రాంగమూ తగిన జాగ్రత్తలు వహించాలి. రాజకీయ వ్యూహాల్లో భాష ఒక ఆయుధంగా మారితే ప్రజల మధ్య వైషమ్యాలు ముమ్మరిస్తాయి. భారతీయ మిశ్రమ సంస్కృతి పరిఢవిల్లాలంటే- దేశ భాషలన్నింటికీ సమ గౌరవం లభించాలి. 'ప్రభుత్వ భాష కచ్చితంగా ప్రజల భాష అయి ఉండాలి' అన్న ప్రథమ ప్రధాని నెహ్రూ స్ఫూర్తిసందేశం- పాలకులకు హితవచనం కావాలి!
ఇదీ చూడండి: ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహించరేం?