ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం(యూఎన్‌డీపీ ) తాజాగా విడుదల చేసిన మానవాభివృద్ధి సూచీలో భారత్ 131వ స్థానానికి పడిపోయింది. పొరుగు దేశం భూటాన్ (129) మనకన్నా మెరుగైన ర్యాంకు సాధించగలిగింది. మొత్తం 189 దేశాల్ని యూఎన్‌డీపీ పరిగణలోకి తీసుకుంది.
ర్యాంకులో ఇండియా వెనకబాటుతనానికి ప్రధాన కారణం
మానవాభివృద్ధి సూచీలో భారత్ వెనకబాటుకు కారమేమిటో నివేదిక సాపేక్షంగా విశదపరచింది. పదిహేనేళ్ల వయసుకు పైబడి- ఇంటర్మీడియట్, ఆపైన చదివినవారిని నిపుణ శ్రామికులుగా పరిగణించాలన్నది ‘యునెస్కో’ నిర్వచనం. ఆ లెక్కన జనాభాలో 95 శాతానికి మించిన నిపుణ శ్రామిక శక్తికి నెలవులుగా జపాన్, బెలారస్, అమెరికా, లిథువేనియా, రష్యాల అద్భుత రికార్డు కళ్లు మిరుమిట్లు గొలుపుతోంది. 27 లక్షల జనాభా కలిగిన లిథువేనియా నుంచి అమెరికా (33కోట్లు) వరకు నైపుణ్యాభివృద్ధిని మానవ ప్రగతిగా అన్వయించుకుంటూ ముందంజ వేస్తుండగా- ఇక్కడి ప్రతి అయిదుగురిలో ఒక్కరే నిపుణశక్తుల కోవకు చెందడం మందభాగ్య మూలాల్ని పట్టిస్తోంది.
దేశవ్యాప్తంగా విద్యావంతులైన యువతలో అత్యధికులు ఉద్యోగార్హత కొరవడిన వారేనన్న అధ్యయనాలు- ఇక్కడి నిపుణ శ్రామికుల శాతం అంతంతమాత్రమేనని చాటుతున్నాయి. జనాభా, భౌగోళిక పరిమాణం పరంగా ఇండియా దరిదాపుల్లోకి రాలేని దేశాలెన్నో ఉద్యోగార్హ అభ్యర్థుల తయారీలో మనకన్నా ఎంతో ముందుండటం- విధానాలు, ప్రణాళికలకు సంబంధించి అత్యవసర ప్రాతిపదికన దిద్దుబాటు చర్యల ఆవశ్యకతను ఎలుగెత్తుతోంది. ప్రాథమిక దశలో 97శాతం పిల్లలు బడిబాట పడుతుండగా మాధ్యమిక స్థాయికి 70శాతమే చేరుతున్నారని, ఉన్నత విద్యాభ్యాసానికి నోచుకుంటున్నది 26 శాతమేనన్న గణాంకాలు- అపార మానవ వనరులు నైపుణ్యాభివృద్ధికి, సరైన చదువుకు బతుకుతెరువుకు దూరమవుతున్న వైనాన్ని ప్రస్ఫుటీకరిస్తున్నాయి.
యువ శక్తి ని సద్వినియోగం చేసుకోకపోవడమే అసలు సమస్య
చైనాకు చెందిన గణాంక వివరాలు అందుబాటులో లేవని యూఎన్‌డీపీ నివేదిక చెబుతున్నా- సీనియర్ సెకండరీ విద్య కొనసాగిస్తున్నవారిలో ఇంచుమించు సగంమంది అక్కడ వృత్తి నిపుణులుగా రాణిస్తున్నట్లు ఆమధ్య పాక్షిక సమాచారం వెలుగుచూసింది. చైనా తరవాత అత్యధికంగా సుమారు 138 కోట్లమందికి నెలవైన దేశం మనది. 15-59 ఏళ్ల మధ్యవారు దేశ జనాభాలో 62శాతం; ప్రస్తుతం భారతపౌరుల్లో సగంమందికిపైగా పాతికేళ్లలోపు వారే. మరే దేశానికీ లేనంతటి యువత బలిమిని గరిష్ఠంగా సద్వినియోగపరచుకోలేకపోవడమే భారత ప్రగతి ప్రస్థానాన్ని దిగలాగుతోంది. సరైన అర్హతలు కలిగిన నిపుణ శ్రామికులు తగినంతమంది దొరకడం లేదని పలు సంస్థల యాజమాన్యాలు మొత్తుకుంటున్నాయి. మరోవైపు, చిన్నాచితకా ఉద్యోగాలకు సైతం స్నాతకోత్తర పట్టభద్రులూ బారులు తీరుతుండటం- వ్యవస్థాగత లోపాలకు అద్దం పడుతోంది.
2030 వరకల్లా విజృంభించనున్న నిరుద్యోగ భారతం
2022నాటికి 40కోట్లమందిని నిపుణశక్తులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమంటూ ఎన్డీయే ప్రభుత్వం ‘స్కిల్ ఇండియా’ను ఆవిష్కరించినా- చేరాల్సిన గమ్యం ఇంకా యోజనాల దూరాన ఉంది. ఏపీ, తెలంగాణ, ఒడిశా, తమిళనాడులతో పోలిస్తే హిమాచల్, యూపీ, సిక్కిం లాంటిచోట్ల లబ్ధిదారుల సంఖ్య వెలాతెలా పోతోంది. కొవిడ్ సంక్షోభం ఉపాధి రంగాన్ని ఒక్కుదుటున కుదిపేయగా, కొన్ని కోట్లమంది దారిద్య్రరేఖ దిగువకు జారిపోయారు. పల్లెల్లో నిరుద్యోగిత తొమ్మిది శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 11 శాతానికి మించిపోయినట్లు సీఎమ్‌ఐఈ (భారత ఆర్థిక పర్యవేక్షక కేంద్రం) గణాంకాలే చెబుతున్నాయి. 2025 నాటికి కోట్లాది ఉద్యోగాల స్వరూప స్వభావాలు మారిపోనున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2030 సంవత్సరం నాటికి నిరుద్యోగంలో కూరుకుపోయే 80 కోట్లమందిలో భారతీయులే ఎక్కువగా ఉంటారన్న అంచనాలూ వెలువడ్డాయి. నైపుణ్యాభివృద్ధికి విశేష ప్రాధాన్యమిచ్చి, బహుముఖ సంస్కరణల్ని ఉపాధి అవకాశాల పెంపుదలతో ముడిపెట్టడమే- ఈ విషవలయం నుంచి భారత్‌ను గట్టెక్కించగలుగుతుంది!