ETV Bharat / opinion

అరకొర నిధులతో సంక్షోభంలో ప్రజారోగ్యం - ఆరోగ్యరంగానికి బడ్జెట్ కేటాయింపులు

దేశంలో వైద్యరంగం సరైన నిధులు అందక కునారిల్లుతోందని ఎన్నో గణాంకాలు తేటతెల్లం చేస్తున్నా.. ఏటా కేటాయింపులు మరీ తీసికట్టుగా మారుతున్నాయి. మహమ్మారులు ప్రబలిన వేళ.. వైద్య, ఆరోగ్య శాఖపై ప్రభుత్వాలకున్న చిత్తశుద్ధి బయటపడుతుంది. దాదాపు 80 శాతానికిపైగా పల్లెల్లో సరైన వైద్య సౌకర్యాలు లేవని సర్వేలు చెబుతున్నాయి. అరకొర నిధులతో అగచాట్లు పడుతున్న వైద్య, ఆరోగ్య శాఖకు చికిత్స చేయాల్సిన అవసరం ఉంది.

indian health sysytem
అరకొర నిధులతో సంక్షోభంలో ప్రజారోగ్యం
author img

By

Published : Jun 21, 2021, 7:36 AM IST

దశాబ్ద కాలంగా కేంద్ర పద్దులో వైద్యారోగ్య శాఖకు ప్రాధాన్యం తగ్గుతూ వస్తోంది. ఇతర దేశాలతో పోల్చితే ప్రజారోగ్య భద్రతకు భారత్‌లో కేటాయింపులు చాలా తక్కువ. ఇది మారాలి. లేకుంటే భవిష్యత్తులో ప్రమాదం తప్పదని రెండేళ్ల క్రితం నీతిఆయోగ్‌ హెచ్చరించింది. ఈ మేలిమి సూచనను పెడచెవిన పెట్టడమే ప్రస్తుత విపత్కర పరిస్థితులకు ప్రధాన కారణం!

ప్లేగు, కలరా, స్వైన్‌ఫ్లూ ఇలా ఎన్నో వ్యాధులు దేశవ్యాప్తంగా ఎంతమందినో పొట్టన పెట్టుకున్నా ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేయడానికి పాలకులు దశాబ్దాలుగా ప్రయత్నించలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఆసుపత్రుల పెంపు, వసతుల కల్పన, వైద్య సిబ్బంది నియామకాలు తదితరాలపై దృష్టిసారించ లేదు. మనకంటే చిన్నవైన ఎన్నో దేశాలు సమధిక కేటాయింపులు, దీర్ఘకాల వ్యూహాలతో వైద్యారోగ్య రంగాన్ని మెరుగు పరచుకున్నాయి. ఆ ముందుజాగ్రత్తే కొవిడ్‌ కాలంలో వాటికి రక్షాకవచమైంది.

కరోనా లాంటి మహమ్మారులు సింగపూర్‌కు కొత్త కాదు. 2003లో సార్స్‌, ఆ తరవాత రెండేళ్లకు హెచ్‌5ఎన్‌1 ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌లు దేశాన్ని వణికించాయి. చోక్రా, టైఫాయిడ్‌ వంటి వ్యాధులూ జనావళికి మృత్యుపాశాలు విసిరాయి. వీటి నుంచి ఆ దేశ ప్రభుత్వం అనేక పాఠాలు నేర్చుకుంది. ప్రజారోగ్యంపై శ్రద్ధ తీసుకుని ప్రపంచంలోనే అత్యంత మెరుగైన వైద్య సదుపాయాల్ని సృష్టించింది. వైద్యారోగ్య రంగంపై 2011లో నాలుగొందల కోట్ల డాలర్లు వెచ్చించిన సింగపూర్‌, అయిదేళ్లు గడిచేసరికి అంతకు రెట్టింపు మొత్తంలో (980 కోట్ల డాలర్లు) ఖర్చుచేసింది. ప్రస్తుతం అక్కడి పౌరుల్లో 80 శాతం ప్రభుత్వ వైద్యమే పొందుతున్నారు. కొవిడ్‌ మొదటి దశ సమయంలో సైతం ముందే కట్టడి చర్యలు ప్రారంభించి సత్ఫలితాలు సాధించింది. ఆరోగ్యకర జీవన ప్రమాణాల్లో డెన్మార్క్‌ సైతం ముందువరసలో ఉంటుంది. అక్కడి పౌరులకు నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందుతాయి.

ఇదీ చదవండి: 'కరోనా రెండో దశలో 719మంది వైద్యులు మృతి'

అక్కడ అలా.. ఇక్కడ ఇలా

దేశంలోని అయిదు ప్రాంతాలు, 98 స్థానిక కమ్యూన్లు (పురపాలికలు) వైద్య వ్యవస్థను పర్యవేక్షిస్తాయి. కమ్యూన్ల నుంచి వసూలైన పన్నుల్లో ఎక్కువ శాతం ఆరోగ్య రంగానికే కేటాయిస్తున్నారు. వాటిలోనూ 43 శాతం సొమ్మును ఆసుపత్రుల్లో వసతుల కల్పనపై వెచ్చిస్తున్నారు. భారత్‌లో 1,511 మందికి ఒక వైద్యుడు అందుబాటులో ఉంటే, డెన్మార్క్‌లో 290 మందికి ఓ వైద్యుడు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. స్వీడన్‌ సైతం స్థూలదేశీయోత్పత్తి (జీడీపీ)లో 11 శాతాన్ని వైద్యరంగంలో వసతుల కోసం వినియోగిస్తోంది. మొదటి కొవిడ్‌ కేసు నమోదైనప్పటి నుంచే కఠిన ఆంక్షలను విధించింది. బహిరంగ సమావేశాలను నిరుడే నిలిపేసింది. సాకర్‌ ఆటల్ని వాయిదా వేసింది. ప్రజల్లో 40 శాతం కంటే ఎక్కువ మందికి టీకాల్ని వేయించింది. 2011లో తీసుకొచ్చిన రోగుల భద్రతా చట్టంతో అక్కడ అందరికీ మెరుగైన వైద్యం అందుతోంది. మరోవైపు, ఇజ్రాయెల్‌లో యాభై శాతం కంటే ఎక్కువ మంది పౌరులకు టీకా రెండు డోసులు అందాయి. బడులు తిరిగి తెరుచుకున్నాయి. ఏడాది నుంచి అమల్లో ఉన్న మాస్కు నిబంధన ఎత్తివేశారు.

ఇదీ చదవండి: 'దేశంలో 80% పల్లెలు వైద్యానికి దూరం'

ప్రపంచ దేశాలతో పోల్చితే ప్రజారోగ్యంపై అతి తక్కువ ఖర్చు చేస్తున్నది భారత దేశమే! ప్రస్తుతం దేశ జీడీపీలో కేవలం 1.26 శాతాన్ని వైద్య రంగం కోసం ఖర్చుచేస్తున్నారు. బ్రిటన్‌, నెదర్లాండ్స్‌, న్యూజిలాండ్‌, ఫిన్లాండ్‌, ఆస్ట్రేలియా వంటి దేశాలు జీడీపీలో తొమ్మిది శాతాన్ని ఆరోగ్య రంగంలో వసతుల కల్పనకు కేటాయిస్తున్నాయి. జపాన్‌, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, స్విట్జర్లాండ్‌లు 10 శాతాన్ని వెచ్చిస్తున్నాయి. అమెరికా జీడీపీలో 16 శాతాన్ని ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఖర్చు చేస్తోంది. మన పొరుగు దేశాలు బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ సైతం జీడీపీలో మూడు శాతం నిధులను ప్రజారోగ్యం కోసం వెచ్చిస్తుండటం గమనార్హం!.

30శాతానికి మించట్లేదు..

కేంద్ర ప్రభుత్వం 2020-21 పద్దులో ఆరోగ్య రంగానికి రూ.69 వేల కోట్లు కేటాయించింది. అంతకుముందు ఏడాదిలో రూ.62,659.12 కోట్లను ప్రత్యేకించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.64,180 కోట్లను ప్రకటించింది. ఈ కొద్దిపాటి కేటాయింపులనైనా క్షేత్రస్థాయిల్లో పూర్తిగా ఖర్చు చేస్తున్నారా అంటే అదీ లేదు. ఆరోగ్య రంగానికి చేసిన కేటాయింపుల్లో ఖర్చు చేస్తున్నవి 30 శాతానికి మించట్లేదని ఇటీవలే పార్లమెంటరీ స్థాయీ సంఘం కుండబద్దలు కొట్టింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. గ్రామాల నుంచి నగరాల వరకు సర్కారీ దవాఖానాల్లో వసతుల పెంపునకు నిధుల కేటాయింపు పెంచి, నిరంతర తనిఖీలతో ఆ సొమ్ము సద్వినియోగం అయ్యేలా చూస్తేనే దేశానికి ఆరోగ్య భద్రత లభిస్తుంది. ప్రభుత్వాలు దీర్ఘకాలిక వ్యూహాలతో ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేయకపోతే భావితరాలూ మూల్యం చెల్లించకతప్పదు!

- అభిసాయి ఇట్ట

ఇవీ చదవండి: మహమ్మారితో మానసిక కల్లోలం.. స్థైర్యమే విరుగుడు!

'నాలుగేళ్లలో ఆయుష్మాన్ భారత్​కు 7% నిధులే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.