ETV Bharat / opinion

శ్వేతసౌధంలో భారతీయం- అగ్రరాజ్యంలో కీలకం - కమలా హారిస్​ అమెరికా ఉపాధ్యక్షురాలు

ఆరో దశకంలో మెరుగైన ఉపాధి అవకాశాలకోసం అమెరికా బాటపట్టిన భారతీయులు క్రమంగా విస్తరించి అక్కడి 'సిలికాన్‌ వ్యాలీ'లో మూడో వంతు అంకుర పరిశ్రమలకు యజమానులయ్యారు. ఆ దేశంలోని అత్యున్నత సాంకేతిక విజ్ఞాన ఆధారిత కంపెనీల్లో ఎనిమిదిశాతం భారత సంతతి స్థాపించినవే. ఉద్యోగ, ఉపాధి రంగాల్లో కళ్లు చెదిరే విజయాలు సాధిస్తున్న భారతీయ అమెరికన్లు- అక్కడి చట్టసభల్లోనూ ప్రాతినిధ్యం అనూహ్యంగా పెంచుకుని దేశ ఉపాధ్యక్ష స్థానాన్నీ చేజిక్కించుకునే స్థాయికి ఎదగడం భారతీయ ముద్రను చాటే స్ఫూర్తిదాయక పరిణామం.

Indian Americans
శ్వేతసౌధంలో భారతీయం
author img

By

Published : Jan 19, 2021, 5:15 AM IST

పొందిన పదవులతోనూ పోగేసుకున్న ఆస్తులతోనూ జీవితాన్ని కొలుస్తారు కొందరు! పదిలపరచుకొనే నేర్పరితనం ఉంటే జీవితంలోని ప్రతి మలుపూ వెలకట్టలేని అనుభవమేనని భావించి, ముందుకు సాగడమే జీవిత సారమని తెలిసిన ధన్యజీవులు... ఇంకొందరు. ఏ దేశమేగినా, ఏ పీఠమెక్కినా జాతి నిండుగౌరవం నిలబెడుతూ ప్రతిభ చాటుకుంటున్న అమెరికాలోని భారత సంతతి ప్రజల్లోనూ ఇలాంటి ధన్యజీవులకు కొదవ లేదు. శక్తి సామర్థ్యాలు చాటుకొనే వేదిక దొరికితే భిన్న రంగాల్లో ప్రత్యేక ముద్రతో దూసుకుపోయే సత్తా తమ సొంతమని భారతీయులు అమెరికన్‌ గడ్డపై ఘనంగా ప్రకటిస్తున్నారు.

కళ్లు చెదిరే విజయాలు

ఆరో దశకంలో మెరుగైన ఉపాధి అవకాశాలకోసం అమెరికా బాటపట్టిన భారతీయులు క్రమంగా విస్తరించి అక్కడి 'సిలికాన్‌ వ్యాలీ'లో మూడో వంతు అంకుర పరిశ్రమలకు యజమానులయ్యారు. ఆ దేశంలోని అత్యున్నత సాంకేతిక విజ్ఞాన ఆధారిత కంపెనీల్లో ఎనిమిదిశాతం భారత సంతతి స్థాపించినవే. ఉద్యోగ, ఉపాధి రంగాల్లో కళ్లు చెదిరే విజయాలు సాధిస్తున్న భారతీయ అమెరికన్లు- అక్కడి చట్టసభల్లోనూ ప్రాతినిధ్యం అనూహ్యంగా పెంచుకుని దేశ ఉపాధ్యక్ష స్థానాన్నీ చేజిక్కించుకునే స్థాయికి ఎదగడం భారతీయ ముద్రను చాటే స్ఫూర్తిదాయక పరిణామం. తాజాగా 20 మంది భారతీయ అమెరికన్లు బైడెన్‌ యంత్రాంగంలో కీలక స్థానాలు దక్కించుకోవడం, అందులో 13 మంది మహిళలే కావడం విశేషం. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ తరవాత బడ్జెట్‌ వ్యవహారాల డైరెక్టర్‌గా నియమితురాలైన నీరా టాండన్‌కు అంతటి ప్రాధాన్య స్థానం దఖలుపడటం, అమెరికన్‌ సర్జన్‌ జనరల్‌గా ప్రతిష్ఠాత్మక స్థానంలో వివేక్‌ మూర్తి నియమితులు కావడం, విధాన నిర్ణయాలతో ముడివడిన బైడెన్‌ ప్రసంగ తయారీ బృందానికి వినయ్‌ రెడ్డి డైరెక్టర్‌గా నియమితులవడం కీలకాంశాలు. మరో అయిదేళ్లపాటు శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడికి కళ్లూ ముక్కూ చెవులుగా ఈ బృందం వ్యవహరించనుంది. మారిన పరిస్థితుల్లో భారత-యూఎస్‌ సంబంధాలు ఏ రకంగా ఉండబోతున్నాయోనని ఆందోళన చెందుతున్నవారికి... బైడెన్‌ నిర్ణయాలు కొంతలో కొంత సమాధానంగా నిలుస్తున్నాయి.

"నేను ఇంగ్లిషువాణ్ని, నేనేమైనా చేయగలను అని గర్వంగా ప్రకటించుకునే ఆత్మవిశ్వాసం ఆంగ్లేయుల్లో కనిపిస్తుంది. విద్యా విజ్ఞానాల సాయంతో భారతీయులూ ఆ స్థాయికి చేరుకొని, భవిష్యత్‌ విజేతలు కావాలి" అని సుమారు 125 ఏళ్లక్రితం అమెరికాలోని షికాగో సర్వమత సమ్మేళన సభలో చరిత్రాత్మక ప్రసంగానంతరం వివేకానందుడు ఇచ్చిన పిలుపు మూలమూలలా ప్రతిధ్వనించింది. అది శాఖోపశాఖలై విస్తరించి, కార్యరూపం దాల్చి, ఫలవృక్షమై నేడు వికసించింది. ఆకాశంనుంచి పిడుగులు పడినా లేచి నిలబడి ముందుకు నడవాలని, ధైర్యంగా నిలవాలని, ఎవరి భవిష్యత్తును వారే నిర్మించుకోవాలన్న ఆనాటి 'వివేకవాణి'కి అమెరికాలోని భారతీయ సంతతి ఆచరణ రూపంలా కనిపిస్తుంది. ఫార్చూన్‌ 500 కంపెనీల్లో మైక్రోసాఫ్ట్‌, అల్ఫాబెట్‌, అడోబ్‌, ఐబీఎం, మాస్టర్‌ కార్డ్‌ వంటి పది విఖ్యాత సంస్థలకు భారతీయ సంతతి సారథ్యం వహిస్తోంది. అమెరికాలోని ప్రతి ఏడుగురు వైద్యుల్లో ఒకరు భారతీయ సంతతికి చెందినవారే కావడం- అగ్రరాజ్య ఆరోగ్య వ్యవస్థల్లో భారతీయుల ప్రాధాన్యాన్ని తెలిపే పరిణామం. డొనాల్డ్‌ ట్రంప్‌నకు ముఖ్య ఆరోగ్య సలహాదారుగా సైతం ఇండియన్‌ అమెరికన్‌ అయిన సీమా వర్మ వ్యవహరించారు. అమెరికావ్యాప్తంగా సగానికి సగం మోటెళ్ల(రహదారులపై యాత్రికుల వసతి గృహాల)ను భారత సంతతి ప్రజలే స్థాపించి నిర్వహిస్తున్నారు. అక్కడ స్థిరపడిన 40 లక్షలకుపైగా భారతీయ సంతతి కుటుంబాల వార్షిక సగటు ఆదాయం లక్షా 27వేల డాలర్లు! అగ్రరాజ్యానికి వలసవెళ్ళిన మరే జాతీయులతో పోల్చినా ఈ సగటు చాలా ఎక్కువ. దాదాపు 70వేల డాలర్ల సగటు ఆదాయంతో భారతీయుల తరవాతి స్థానంలో చైనీయులు నిలుస్తున్నారు. భారతీయ సంతతి ప్రజలతో పోలిస్తే స్థానిక అమెరికా కుటుంబాల సగటు ఆదాయం సగమైనా లేకపోవడం గమనార్హం. విద్యార్హతలు, విజ్ఞానమే భూషణాలుగా సముద్రాలు దాటి, వేల కిలోమీటర్లు ప్రయాణించి అమెరికాకు చేరుతున్న భారతీయ సంతతి ప్రభావాన్వితంగా మారుతోంది. అక్కడి భారతీయ సంతతిలో 72శాతానికి గ్రాడ్యుయేట్‌ పట్టా ఉంటే- స్థానిక అమెరికన్లలో డిగ్రీ పట్టా ఉన్నవారు అటుఇటుగా 30శాతమే ఉండటం గమనార్హం.

విస్పష్ట అడుగుజాడలు

నేర్చుకునే సమయంలో ఎంత ఎక్కువ చెమట చిందిస్తే... యుద్ధం వేళ అంత తక్కువ రక్తం చిందుతుంది అంటాడు గ్రీకు సమరయోధుడు క్రెడో. సహనం, నికార్సయిన వ్యక్తిత్వం, విలువలతో కూడిన భారతీయ జీవన నేపథ్యం అగ్రరాజ్యంలో తమను తాము రుజువు చేసుకునే క్రమంలో ఇండో అమెరికన్లకు అద్భుతమైన వరాలవుతున్నాయి. ప్రపంచంలో అత్యధికులు ఆంగ్లం మాట్లాడే రెండో దేశమైన భారత్‌కు- భాషా నైపుణ్యాలు బ్రహ్మాండంగా అక్కరకొస్తున్నాయి. లక్ష్యం సాధించేవరకూ విశ్రమించని తత్వం... వారి సొంతం. ఈ లక్షణాలు- అడుగుమోపిన ప్రతి రంగంలోనూ విజయదుందుభి మోగించడానికి వీరికి ఉపకరణాలవుతున్నాయి. మహత్తర కార్యభారాన్ని భుజాల మోయగల సామర్థ్యాన్ని అవి భారతీయులకు అందించాయి. అమెరికా అంతటా ప్రతి రంగంలోనూ ఇప్పుడు భారతీయుల అడుగుజాడలు విస్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికాకు వలస వెళ్ళిన తొలినాళ్లలో వైద్య, శాస్త్ర సాంకేతిక, ఐటీ, ఇంజినీరింగ్‌, గణిత రంగాల్లో ప్రతిభ చాటిన భారతీయులు- గడచిన పదేళ్లుగా అక్కడి రాజకీయాల్లో శక్తిమంతమైన పాత్ర పోషిస్తున్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌ జమానాలో నిక్కీ హేలీ, రాజ్‌ షా, అజిత్‌ పాయ్‌, నియోమీ రావ్‌, సీతా వర్మ, విశాల్‌ అమిన్‌, నీల్‌ ఛటర్జీ, మనీషా సింగ్‌ వంటివారు రిపబ్లికన్‌ ప్రభుత్వంలో కీలక విధాన నిర్ణేతలుగా బాధ్యతలు నిర్వహించారు. తాజాగా బైడెన్‌ యంత్రాంగంలోని అత్యంత ప్రధానమైన స్థానాల్లో ఇండియన్‌ అమెరికన్లకు మెజారిటీ వాటా దక్కడం భారతీయులందరికీ గర్వకారణం. భారత అమెరికాల మధ్య బలపడుతున్న అనుబంధానికి ఇది నిదర్శనం!

- ఇందిరాగోపాల్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.