తమ దేశ భౌగోళిక పటాన్ని మార్చేందుకు నేపాల్ ప్రభుత్వం మే 31న రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చింది. భారత్‌లోని కాలాపానీ, లింపియాధురా, లిపులేఖ్ ప్రాంతాలను తమ అంతర్భాగంగా చూపిస్తూ మ్యాప్‌ను రూపొందించింది. దీంతో ఇరుదేశాల మధ్య వివాదం మళ్లీ మొదటికొచ్చింది.
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా తొలగించిన తర్వాత భారత్ నూతన మ్యాప్ విడుదల చేయడం వల్ల నేపాల్‌తో వివాదం ప్రారంభమైంది. కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతాలను భారత్‌లో అంతర్భాగంగా చూపించడంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇంతకుముందు కుదుర్చుకున్న ఒప్పందాలకు ఈ చర్య విఘాతం కలిగిస్తోందని ఆరోపించింది. అయితే భారత్ మాత్రం నేపాల్ వాదనను ఖండిస్తూ వచ్చింది.
ఉత్తరాఖండ్‌లో భారత్ రోడ్డు మార్గం నిర్మించిన తర్వాత వివాదం మళ్లీ మొదలైంది. కైలాస మానస సరోవర్‌ను చేరుకోవడానికి భారత్ చేపట్టిన ఈ నిర్మాణం పట్ల అభ్యంతరం తెలిపింది కాఠ్మాండూ. మరోవైపు.. వేరొక దేశం ఆదేశాల ప్రకారమే నేపాల్ నిరసన వ్యక్తం చేస్తోందన్న భారత ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణె వ్యాఖ్యల తర్వాత పరిస్థితి మరింత దిగజారింది.
విశేష బంధం
ముందునుంచి భారత్-నేపాల్ మధ్య చాలా ప్రత్యేక సంబంధాలే ఉన్నాయి. 1950లో కుదుర్చుకున్న శాంతి, స్నేహపూర్వక ఒప్పందం ప్రకారం ఎలాంటి పత్రాలు లేకుండా భారత్‌లో పనిచేసుకునే అవకాశం నేపాల్ పౌరులకు లభించింది. అటు భారత సైన్యంలోనూ నేపాల్ పౌరులు సేవలందిస్తున్నారు. 'జనరల్' హోదాకు చేరుకున్నవారూ ఉన్నారు. ఇరుదేశాల మధ్య సామరస్యానికి ఇవి ప్రతీకలుగా చెప్పుకోవచ్చు.
భారత జాతీయ భద్రత విషయంలో నేపాల్ పౌరులు భాగస్వాములుగా ఉన్నారు. గూర్ఖా బ్రిగేడ్‌లోని ఏడు రెజిమెంట్లలో కలిపి ప్రస్తుతం 35 వేల మంది జవాన్లు భారత సైన్యంలో సేవలందిస్తున్నారు. మరో 90 వేల మంది పెన్షనర్లుగా ఉన్నారు. ఈ విషయంలో ఇరుదేశాల మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. దీన్ని మరింత కాపాడుకోవాలి.
వ్యతిరేక వర్గాల కుట్ర!
నేపాల్ మాత్రం భారత్‌ను మిశ్రమ దృష్టి కోణంతో చూస్తూ వస్తోంది. చాలా ద్వైపాక్షిక సమస్యలకు పరిష్కారాలు అసంపూర్ణంగా ఉన్నాయని నేపాల్ భావిస్తోంది. ఇప్పటికే చేసుకున్న వాగ్దానాలను భారత్ గౌరవించలేదని అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో భారత్ నిబద్ధత పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
ఇదీ చదవండి: భారత్‌తో 'మ్యాప్ వార్' కోసం నేపాల్ రాజ్యాంగ సవరణ!
లిపులేఖ్ పాస్ గుండా భారత్ రహదారి ప్రారంభించిన విషయంలో నేపాల్ పూర్తి స్థాయిలో ఘర్షణకు దిగకపోయినప్పటికీ.. భారత్‌కు వ్యతిరేకంగా పొరుగు దేశంలో అంతర్గతంగా ఏర్పడిన వర్గాలే ఈ వివాదాన్ని మరింత తీవ్రం చేస్తున్నట్లు తెలుస్తోంది.
చైనా చిచ్చు!
భౌగోళికంగా ఆసియాలో రెండు శక్తిమంతమైన దేశాల మధ్య ఉన్న నేపాల్ 2006లో రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య ప్రభుత్వం వైపు అడుగులు వేసింది. ఈ సమయంలో భారత్-నేపాల్ మధ్యనున్న ప్రత్యేక బంధానికి పరీక్షలు మొదలయ్యాయి. నేపాల్‌లో కమ్యునిస్టు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్‌తో సంబంధాలు క్రమంగా క్షీణించాయి. మరోవైపు కమ్యునిస్టు దేశమైన చైనాకు సైద్ధాంతికంగా, రాజకీయంగా కాస్త ప్రయోజనం కలిగింది.
ఇదీ చదవండి: భారత్‌కు వ్యతిరేకంగా నేపాల్‌లో చైనా చిచ్చు!
కొన్ని ప్రాంతాల్లో చైనాతో ఉన్న ట్రైజంక్షన్(మూడు దేశాల సరిహద్దులు కలిసే చోటు)లలో పలు వివాదాలు తలెత్తాయి. అక్కడి ప్రాదేశిక సమస్యలన్నీ అపరిష్కృతంగా మిగిలిపోయాయి.
దక్షిణాసియాలో భారత్‌తోనే పోటీ!
దక్షిణాసియా దేశాలకు భౌగోళికంగా ఓ ప్రత్యేకమైన అంశం ఉంది. ఇక్కడి ఏ ఒక్క దేశం కూడా ఒకదానినొకటి వ్యక్తిగతంగా సరిహద్దు కలిగి ఉండవు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక వంటి దేశాలన్నీ భారత్‌తోనే సరిహద్దు పంచుకుంటున్నాయి.
ఈ ప్రాంతంలో బ్రిటీష్ సామ్రాజ్యం అంతమైన తర్వాత పలు స్వతంత్ర రాజ్యాలు ఉద్భవించాయి. భౌగోళికంగా, జనాభా పరంగా అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది. దీంతో దక్షిణాసియా ప్రాంతంలో భారత్ మాత్రమే చైనాకు పోటీ ఇచ్చేలా కనిపించింది.
1962 అక్టోబర్ నుంచి వాస్తవాధీన రేఖ వెంబడి చైనాకు భారత్‌కు మధ్య ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఈ వివాదాన్ని నెట్టుకొస్తున్న భారత్‌కు.. నేపాల్, చైనా మధ్య ఇటీవల పెనవేసుకున్న బంధం తెలియనిది కాదు. అయితే నేపాల్ విషయంలో మోదీ ప్రభుత్వం సానుభూతితో వ్యవహరిస్తుందని చాలా మంది ఊహించారు.
బ్రిటీష్ నాటి సమస్య
ప్రస్తుత నేపాల్ సమస్య అప్పటి వలస రాజ్యాల్లో భాగంగా ప్రారంభమైనదే. 1816లో బ్రిటీష్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని నేపాల్ తెరపైకి తీసుకొస్తుంటే.. భారత్ మాత్రం చారిత్రకంగా ఆయా ప్రాంతాలపై ఉన్న అధికారాన్ని ప్రస్తావిస్తోంది. చారిత్రక వాదనను భారత్ 1950 తర్వాత అధికారికంగా మార్చింది.
ప్రభుత్వం ముందున్న మార్గం..
ఈ ఆరోపణలన్నింటినీ పక్కనబెడితే, పొరుగున ఉన్న చిన్న దేశాలతో తలెత్తే సమస్యలను భారత్ చొరవ తీసుకొని పరిష్కరించుకోవాలి. సార్వభౌమత్వానికి సంబంధించిన వివాదాలను శాంతియుత వాతావరణంలోనే పరిష్కరించగలగాలి.
పొరుగుదేశాలతో అస్థిరతల మధ్య.. మోదీ ప్రభుత్వం అనుసరించే వ్యూహాత్మక విధానాలకు నేపాల్ సమస్య ఓ పరీక్ష. పొరుగుదేశాలన్నీ భారత్‌ను విశ్వసనీయమైన భాగస్వామిగా పరిగణిస్తే.. చైనాను నిలువరించడం భారత్‌కు తేలిక అవుతుంది.
కేపీ ఒలి ప్రతిపాదించిన కొత్త మ్యాప్‌ను నేపాల్ పార్లమెంట్ త్వరలో ఆమోదించే అవకాశం ఉంది. తదనంతర పరిణామాలపై స్పందించే విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరించాలి. ఇప్పటివరకు కొనసాగినట్లు కాకుండా.. శాంతియుతంగా సమస్య పరిష్కారానికి కృషి చేయాలి. నేపాల్‌తో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని మరింత దిగజారకుండా కాపాడుకోవాలి.
(రచయిత- ఉదయ భాస్కర్)
ఇదీ చదవండి చైనా అండతో నేపాల్ కయ్యం- భారత సైన్యంతో ఢీ!