India GDP Growth Rate : 2023 ఆగస్టు నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ధనిక, వర్ధమాన దేశాలలో నివసిస్తున్న ప్రజల ఆర్థిక స్థితిగతులను అంచనా వేయడానికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)ని ఉపయోగిస్తారు. దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తుసేవల మొత్తం విలువను ఆ ఏడాదికి సంబంధించిన జీడీపీగా పరిగణిస్తారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులు 2022-23లో ప్రపంచ జీడీపీని 112 లక్షల కోట్ల డాలర్లుగా లెక్కించాయి. దీన్నిబట్టి ప్రపంచ ప్రజల తలసరి ఆదాయం ఏడాదికి 14,000 డాలర్లుగా లెక్క తేలుతుంది. అలాగని అన్ని దేశాల్లో తలసరి ఆదాయం ఇదే స్థాయిలో ఉందనుకుంటే పొరపాటే. జనాభాలో భారత్ చైనాను మించిపోయింది. కానీ భారతదేశ తలసరి ఆదాయం కేవలం సుమారు 2,450 డాలర్లు మాత్రమే. అయితే, తలసరి ఆదాయం వృద్ధిపై ఎస్‌బీఐ పరిశోధక నివేదిక అంచనాలు ఆశలు రేకెత్తించేలాగా ఉన్నాయి. జీడీపీ పరంగా ప్రపంచంలో అగ్రశ్రేణిలో ఉన్న 10 దేశాలు అంతర్జాతీయ వాణిజ్యానికి భారీ వాటాను సమకూరుస్తాయి. ఈ 10 దేశాల ర్యాంకులు అటూఇటూ మారినా మొత్తంమీద ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను శాసించేది ఆయా దేశాలే.
పారిశ్రామిక, సేవా రంగాల వాటా
GDP Growth Rate Of India : ప్రపంచంలో అత్యధిక జీడీపీ కలిగి ఉన్న అమెరికా తలసరి ఆదాయం 80,000 డాలర్లు. ఇంతా చేసి ఆ దేశ జనాభా 33 కోట్ల పైచిలుకు మాత్రమే. 12.5 కోట్ల జనాభా కలిగిన జపాన్ తలసరి ఆదాయం 33,815 డాలర్లు. 140కోట్లకు పైగా జనాభా కలిగిన చైనా తలసరి ఆదాయం 13,721 డాలర్లు. జీడీపీపరంగా ప్రపంచంలో తొలి మూడు స్థానాలను ఆక్రమిస్తున్న దేశాలివి. వాటి ఆర్థిక వ్యవస్థలు ఎంతో వైవిధ్యభరితమైనవి. భారీ పరిశ్రమలు, ఎలెక్ట్రానిక్స్, ఆరోగ్య సంరక్షణ, ఫైనాన్స్, ఆధునిక సాంకేతికత, విస్తృత మౌలిక వసతులు, సానుకూల వ్యాపార వాతావరణం, విద్యావంతులు, సుశిక్షితులైన మానవ వనరులు- ఈ మూడు దేశాలను అగ్రస్థానంలో నిలుపుతున్నాయి. 75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పూర్తి చేసుకుని అమృత కాలంలో అడుగుపెట్టిన భారతదేశ పురోగమనాన్ని ఇక్కడ సింహావలోకనం చేసుకోవాలి. భారత్ మరో రెండేళ్లలో ప్రపంచంలోనే నాలుగో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని ఆర్థికవేత్తలు జోస్యం చెబుతున్నారు. ఇప్పటికే అంకుర సంస్థల సంఖ్యలో భారత్ మూడో స్థానం ఆక్రమించింది. నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన అంకుర సంస్థలే 84,000 వరకు ఉన్నాయి.
GDP Developed Countries : అభివృద్ధి చెందిన దేశాల్లో జీడీపీలో వ్యవసాయ రంగ వాటా తక్కువగా, పరిశ్రమలు, సేవా రంగాల వాటా ఎక్కువగా ఉంటుంది. భారత జీడీపీలో వ్యవసాయ రంగ వాటా 20.2 శాతమైతే, ప్రపంచ సగటు 6.8 శాతమే. భారతీయ వ్యవసాయ రంగం పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. దేశంలో పెరిగిపోతున్న రైతు ఆత్మహత్యలే దీనికి నిదర్శనం. వాణిజ్య పంటలు పండించే రైతులు సహా అన్ని వర్గాల కర్షకులు గిట్టుబాటు ధరల కోసం ఎప్పటికప్పుడు ఉద్యమించాల్సిన పరిస్థితి నెలకొంది. భారత జీడీపీలో వ్యవసాయ రంగం వాటా క్రమంగా తగ్గుతోంది. మన పంట దిగుబడులకు విదేశీ కొనుగోలుదారులు కరవయ్యారు. రైతుకు కనీస ధరలే లభిస్తుండగా- కూరగాయలు, ఉల్లిపాయల ధరలు మిన్నంటుతూ దళారులకు లాభాలు పూయిస్తున్నాయి. ప్రపంచ జీడీపీలో పారిశ్రామిక రంగం వాటా సగటున 30శాతం. భారత్‌లో అది 24.6శాతమే. జర్మనీ జీడీపీకి పారిశ్రామిక రంగం 70శాతం వాటా సమకూరుస్తుంటే, బ్రిటన్‌లో సేవారంగం 71శాతం వాటా అందిస్తోంది. ప్రపంచ జీడీపీలో సేవారంగం వాటా 63శాతమైతే, భారత్‌లో అది 54.8 శాతమే. ప్రపంచంలో అగ్రశ్రేణి అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా భారత్ కూడా పారిశ్రామిక, సేవా రంగాల వాటాను పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
ఎగుమతుల వృద్ధితోనే...
GDP Development India : చైనా పరిశ్రమల రంగంపై అత్యధిక శ్రద్ధాసక్తులు కేటాయించి నేడు ప్రపంచంలో మేటి ఎగుమతిదారుగా నిలుస్తోంది. దానివల్ల చైనాలో ఉపాధి అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. అధిక జనాభా కలిగిన భారతదేశం దీని నుంచి ఆచరణీయ పాఠాలు నేర్చుకోవాలి. చైనాలో ప్రభుత్వమే మౌలిక వసతులు, సాంకేతిక రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టింది. ప్రైవేటు పెట్టుబడులు పారిశ్రామిక, సేవా రంగాల వికాసానికి తోడ్పడుతున్నాయి. చైనా మాదిరిగా భారత్‌లోనూ ప్రైవేటు రంగంలో భారీ పరిశ్రమలు ఏర్పడాల్సిన అవసరం ఉంది. భారతీయ కార్పొరేట్ సంస్థలు ప్రపంచ శ్రేణి బహుళజాతి సంస్థలుగా ఎదగడంలో వేగం పుంజుకోలేకపోయాయి. గణనీయమైన అంతర్జాతీయ బ్రాండ్లనూ సృష్టించలేకపోయాయి. అదే అమెరికాలో ఆపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి భారీ బహుళజాతి సంస్థలు వర్ధిల్లుతున్నాయి. దేశదేశాలకు వ్యాపార, ఉత్పత్తి కార్యకలాపాలను విస్తరించాయి. టొయోటా, హోండా, మిత్సుబిషి వంటి జపాన్ కంపెనీలు జగత్ప్రసిద్ధం. దక్షిణ కొరియాకు చెందిన సామ్‌సంగ్ ప్రపంచ కంపెనీగా నిలుస్తోంది. చైనా చౌకగా తయారుచేసే వస్తువులు అల్పాదాయ దేశాలకు వరంగా మారాయి. అందుకే నేడు చైనా అంతర్జాతీయ వాణిజ్యం శిఖరాలను తాకుతోంది. అక్కడ రెండు రూపాయల ధరకు సిగరెట్ లైటర్లను కొనే దిగుమతిదారులు వాటిని తమ దేశంలో 10 రూపాయలకు అమ్ముకొంటున్నారు. భారతదేశం ఔషధాలు, ఐటీ ఉత్పత్తులతోపాటు ప్రత్యేక రసాయనాలు, ఎలెక్ట్రానిక్స్ వంటి వివిధ రకాల వస్తువులను ఎగుమతిచేసే స్థాయికి చేరుకోవాలి. ఎగుమతుల వృద్ధితోనే జీడీపీతో పాటు ప్రజల తలసరి ఆదాయాలు పెరుగుతాయి.
ఉత్పత్తులు పెరగాలి
GDP India Rank : భారతదేశ జనాభాలో పేదల సంఖ్య ఎక్కువ. అందుకని, వస్తు వినియోగం తక్కువగా ఉంది. ఫలితంగా వస్తూత్పత్తి పరిమిత స్థాయిలో జరుగుతోంది. దానివల్ల ఉద్యోగ అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. వస్తుసేవల ఉత్పత్తిని పెంచడానికి వెచ్చించాల్సిన విలువైన నిధులను ఎన్నికల్లో లబ్ధి కోసం ఉచిత వరాలుగా ధారపోయడం జరుగుతోంది. ఇందుకు బదులుగా ఉత్పత్తులను తద్వారా వృత్తి ఉపాధి, వ్యాపార అవకాశాలను పెంచాలి. అప్పుడే, ప్రతి కుటుంబానికీ మంచి ఆదాయం లభించి, పొదుపు మొత్తాలు పెరిగి దేశ ఆర్థికాభివృద్ధి వేగం అందుకొంటుంది.
-- శ్రీరామ్ చేకూరి, రచయిత- ఆర్థిక, విదేశీ వాణిజ్య నిపుణులు
Rupee Internationalisation RBI : రూపాయి అంతర్జాతీయీకరణ సాధ్యమేనా?