ETV Bharat / opinion

విద్యుత్‌ నష్టం- రాష్ట్రాలకు కష్టం

author img

By

Published : May 23, 2020, 7:03 AM IST

విద్యుదుత్పత్తి, పంపిణీ సంస్థలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. కరోనా నేపథ్యంలో వాటిని కాపాడే పేరిట కేంద్రం కొత్త ఆలోచనలతో ముందుకొచ్చింది. కేంద్ర పాలిత ప్రాంతాల డిస్కమ్‌లను ప్రైవేటుపరం చేయబోతున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి ప్రకటించారు. విద్యుత్‌ సంస్థలను ఆదుకుంటామంటూ రూ.90వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. భవిష్యత్తులో రాష్ట్రాల డిస్కంలూ ఇదే బాటలో నడవక తప్పని పరిస్థితులను కేంద్రం కల్పిస్తోందన్న విమర్శ రాష్ట్రాలనుంచి, విద్యుత్‌ ఉద్యోగ సంఘాలనుంచి బలంగా వినిపిస్తోంది.

IMPACT OF COVID ON POWER SECTOR
విద్యుత్‌ నష్టం- రాష్ట్రాలకు కష్టం

విద్యుత్‌ రంగ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా అంశాల్లో విద్యుత్‌ రంగం ఒకటి. అందుకే విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు రాష్ట్ర ప్రభుత్వాల సారథ్యంలో పనిచేస్తున్నాయి. విద్యుదుత్పత్తి సంస్థలను మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు యాజమాన్యాలూ విడివిడిగా ఏర్పాటు చేసుకునే సౌలభ్యం ఎప్పటినుంచో ఉంది. ప్రస్తుతం విద్యుదుత్పత్తి, పంపిణీ సంస్థలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. కరోనా నేపథ్యంలో వాటిని కాపాడే పేరిట కేంద్రం కొత్త ఆలోచనలతో ముందుకొచ్చింది. ఆ సంస్థలను రాష్ట్రాల అధికార పరిధినుంచి తప్పించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ విధానంలో భాగంగానే తొలుత కేంద్ర పాలిత ప్రాంతాల డిస్కమ్‌లను ప్రైవేటుపరం చేయబోతున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి ప్రకటించారు. విద్యుత్‌ సంస్థలను ఆదుకుంటామంటూ రూ.90వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. భవిష్యత్తులో రాష్ట్రాల డిస్కంలూ ఇదే బాటలో నడవక తప్పని పరిస్థితులను కేంద్రం కల్పిస్తోందన్న విమర్శ రాష్ట్రాలనుంచి, విద్యుత్‌ ఉద్యోగ సంఘాలనుంచి బలంగా వినిపిస్తోంది. ఆర్థికమంత్రి ప్రకటనకు నెలరోజుల ముందే 'విద్యుత్‌ చట్టసవరణ ముసాయిదా బిల్లు'ను కేంద్రం విడుదల చేసింది. దానిపై అభ్యంతరాలు, సలహాలను జూన్‌ అయిదో తేదీలోగా పంపమని రాష్ట్రాలను కోరారు.. ఆ ముసాయిదా బిల్లులోనూ విద్యుత్‌ రంగ ప్రైవేటీకరణకు తలుపులు తెరిచే నిబంధనలే ఉన్నాయి. ఆ ముసాయిదా చట్టాన్ని, ఆర్థికమంత్రి ఇటీవలి ప్రకటనను తరచి చూస్తే ఇకమీదట డిస్కమ్‌లు ఎంతో కాలం రాష్ట్రాల అధికార ఛత్రం కింద ఉండవనే సంకేతాలు పొడగడుతున్నాయి.

పీకలోతు కష్టాలు

దేశంలో 90శాతం వరకు వినియోగదారులకు ఉత్పత్తి వ్యయం కన్నా తక్కువ ధరకే విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. దీనివల్ల డిస్కమ్‌లకు నష్టం ఏర్పడుతోంది. కానీ, అతి తక్కువ సంఖ్యలో ఉండే పారిశ్రామిక వినియోగదారులే అత్యధిక శాతం డబ్బును డిస్కమ్‌లకు చెల్లిస్తున్నారు. ఉదాహరణకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో యూనిట్‌ కరెంటు సరఫరాకు సగటున ఏడు రూపాయలకు పైనే డిస్కమ్‌లకు ఖర్చవుతోంది. కానీ, 80శాతం వినియోగదారులకు అంతకన్నా తక్కువ ధరకే కరెంటు ఇస్తున్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా గల దక్షిణ తెలంగాణ డిస్కంలో మొత్తం 72.64 లక్షల మంది గృహ, వాణిజ్య లోటెన్షన్‌(ఎల్‌టీ) కరెంటు కనెక్షన్ల వినియోగదారులున్నారు. వీరి నుంచి నెలకు వచ్చే గరిష్ఠ ఆదాయం రూ.623.21 కోట్లు. కానీ ఇదే డిస్కమ్‌లో కేవలం పది వేల హైటెన్షన్‌(హెచ్‌టీ) కనెక్షన్ల వినియోగదారులుండగా వీరు చెల్లించే సొమ్ము రూ.1,160.12 కోట్లు. ఇలా దేశవ్యాప్తంగా అన్ని డిస్కమ్‌లు కోట్ల మందికి తక్కువ ధరకే కరెంటు ఇవ్వడంవల్ల ఏర్పడే నష్టాన్ని పూడ్చుకునేందుకు హెచ్‌టీ వినియోగదారులను కొంతమేర ఉపయోగించుకుంటున్నాయి. ప్రజలకు తక్కువ ధరకు లేదా ఉచితంగా కరెంటు ఇవ్వాలని రాష్ట్రాలు డిస్కంలను ఆదేశిస్తున్నాయి. కానీ, ఆ సొమ్మును ఎప్పటికప్పుడు చెల్లించనందున డిస్కంల నష్టాలు విస్తరిస్తున్నాయి.

జాతీయ సగటు ప్రకారం దేశంలో విద్యుత్‌ ‘సరఫరా, పంపిణీ’(టీడీ) నష్టాలు 21శాతం వరకూ ఉన్నాయి. అంటే ఉదాహరణకు ఒక విద్యుత్కేంద్రం నుంచి 100 యూనిట్ల కరెంటును డిస్కం కొని ప్రజలకు పంపిణీ చేస్తే- తిరిగి కరెంటు బిల్లు వసూలు చేసేటప్పుడు 79 యూనిట్లకే సొమ్ము వస్తోంది. మిగతా 21 యూనిట్లు ఎటుపోతుందో తెలియక 'టీడీ'లో నష్టం కింద చూపుతున్నారు. ఈ శాతాన్ని 12కు తగ్గిస్తేనే డిస్కమ్‌లు ఆర్థికంగా కోలుకుంటాయని కేంద్రం అంచనా. ప్రాంతాల వారీగా చూస్తే కొన్నిచోట్ల ఏకంగా 35నుంచి 45శాతం విద్యుత్తు ఎటుపోతోందో ఎవరికీ తెలియక అందరూ దాన్ని టీడీ నష్టాల ఖాతాలోనే వేస్తున్నారు. హైదరాబాద్‌ వంటి నగరంలోనూ కొన్ని ప్రాంతాల్లో టీడీ నష్టాలు 30శాతం వరకూ ఉండటం గమనార్హం. కేంద్ర పాలిత ప్రాంతాల(యూటీ) డిస్కంలు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నందున రాష్ట్రాలకు హెచ్చరికలు పంపేందుకే వాటిని ప్రైవేటుపరం చేయబోతున్నారన్న వాదన వినిపిస్తోంది. దేశంలోని అన్ని డిస్కమ్‌లు 2015నాటికే రూ.2.60 లక్షల కోట్ల నష్టాల్లో ఉండేవి. వాటిని గట్టెక్కించడానికి 2015 సెప్టెంబరు ఆఖరునాటికి డిస్కంలకున్న మొత్తం నష్టాల్లో 75 శాతం వరకూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు బదిలీ చేయడానికి 'ఉజ్వల్‌ డిస్కం హామీ యోజన'(ఉదయ్‌) పథకాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. నాలుగేళ్లు గడిచాక డిస్కమ్‌ల ఆర్థిక పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. గడచిన డిసెంబరు నాటికే వాటి నష్టాలు మళ్లీ రూ.27వేల కోట్లకు చేరాయి. ప్రస్తుత లాక్‌డౌన్‌తో అవి ఆర్థికంగా మరింత దిగజారాయి.

పంపిణీ వ్యవస్థ బలోపేతం

విద్యుత్‌ సంస్థలను అత్యాధునిక సాంకేతిక విజ్ఞానం ఆధారంగా నడుపుతూ- మానవ వనరులు, నిర్వహణ వ్యయాలు తగ్గించుకొని, అంతర్గత ఆదాయం పెంచుకోవాలి. ఆ దిశగా అనేక డిస్కమ్‌లలో చర్యలే లేవు. ప్రతి ఇంటికీ 'స్మార్ట్‌ ప్రీపెయిడ్‌' మీటర్లు పెట్టాలనే ఆలోచన మంచిది. ఎంత కరెంటు వాడుకోవాలనుకుంటే అంతే సొమ్ముతో మీటర్‌ను ముందుగా రీఛార్జ్‌ చేసుకునే సదుపాయం ప్రజలకు కల్పించాలి. విద్యుదుత్పత్తి సంస్థలకు 60 రోజుల్లోగా సొమ్ము చెల్లించాలన్న నిబంధన కచ్చితంగా అమలు చేయాలి. నెలలు, ఏళ్ల తరబడి సొమ్ము చెల్లించకుండా కరెంటు ఇవ్వమనడం డిస్కమ్‌లకు భావ్యం కాదు. విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను మరింత మెరుగుపరచేందుకు 'ఆదిత్య' పథకం తేవాలని కేంద్రం తాజాగా యత్నిస్తోంది. పంపిణీ వ్యవస్థను ప్రైవేటుపరం చేసి, స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు ద్వారా కరెంటు లెక్కలన్నీ పక్కాగా సేకరించి డిస్కమ్‌లను నష్టాల బారినుంచి బయటపడేయాలన్నది ఈ పథకం ప్రధానోద్దేశం. ఇందులో భాగంగా డిస్కమ్‌లను 'ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య'(పీపీపీ) విధానంలో నడపాలన్నది కీలక ప్రతిపాదన. గతంలో 'ఉదయ్‌' పథకం తెచ్చినా డిస్కంలకు ఆర్థికంగా ఎలాంటి ఊరట లభించలేదు. 'ఆదిత్య' పేరిట తీసుకువస్తున్న పథకం డిస్కమ్‌లను ఏమేరకు గట్టెక్కిస్తుందో చూడాలి.

సంస్కరణలే శరణ్యం

నష్టాల్లో మునిగిపోతున్న ఏ వ్యాపారాన్నీ ఎవరూ కొనసాగించలేరు. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో వంద యూనిట్లలోపు కరెంటు వాడుకుంటే యూనిట్‌ను కేవలం రూ.1.45కే ఇస్తున్నారు. ఈ ధరను 19 ఏళ్ల క్రితం నిర్ణయించారు. అప్పట్లో ఉమ్మడి ఏపీలో యూనిట్‌ సగటు సరఫరా వ్యయం రూ.4గా ఉండేది. రాష్ట్రం విడిపోయినా రెండు రాష్ట్రాల్లో సగటు సరఫరా వ్యయం రూ.7 దాటినా రూ.1.45 ధరని మాత్రం మార్చలేదు. సంక్షేమ కోణంలో ఈ భారం భరిస్తున్నప్పటికీ- క్రమంగా అది ప్రభుత్వాలకు గుదిబండగా మారుతోందంటే ఆశ్చర్యం లేదు. రైతులకు సాయంకోసం ఉచిత కరెంటు ఇవ్వడం మంచిదే. కానీ, నిజంగా సేద్యానికి ఎంత కరెంటు వాడుకుంటున్నారు అన్న లెక్కలు పక్కాగా తేల్చడానికి మీటర్లు బిగించాలంటే మాత్రం డిస్కమ్‌లు భయపడి వెనకడుగేస్తున్నాయి. పంపిణీ, సరఫరా, నిర్వహణలో లోపాలవల్ల నష్టపోతున్న కరెంటునంతా వ్యవసాయానికిస్తున్నట్లు లెక్కలు వండివార్చే ధోరణిని నిలువరించాలంటే వ్యవసాయబోర్లకు వాడే విద్యుత్తు లెక్కలు తీయడం తప్పనిసరి. సంక్షేమ కోణంలో తాము అమలు చేస్తున్న కార్యక్రమాలకు గండికొట్టే విధంగా డిస్కంలను ప్రైవేటుకు అప్పగిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించడం ఖాయం. విద్యుత్‌ రంగం బాగుపడాలంటే డిస్కమ్‌లు లాభాల్లోకి రావాలి. పేదల నడ్డివిరిచేలా ఛార్జీలు పెంచడమూ సరికాదు. పేదలకు తక్కువ ఛార్జీలకిచ్చే అందించే విద్యుత్తుకు అవసరపడే రాయితీ నిధులను ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు డిస్కమ్‌లకు చెల్లిస్తే ఏ సమస్యా రాదు. అలా జరగకపోవడంవల్లే 'ఉదయ్‌', 'ఆదిత్య' వంటి పథకాలు; చట్ట సవరణ బిల్లులను కేంద్రం ముందుకు తీసుకువస్తోందని రాష్ట్రాలు గ్రహించాల్సి ఉంది.

-మంగమూరి శ్రీనివాస్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.