ETV Bharat / opinion

అనారోగ్యం పిచికారీ.. పరిస్థితి మారేదెప్పుడు?

ఇటీవల ఆంధ్రప్రదేశ్​ ఏలూరులో వింతవ్యాధితో వందలమంది ఆసుపత్రుల్లో చేరారు. బాధితుల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించిన నిపుణులు వారి అస్వస్థత మూలాలు తీసుకొన్న ఆహారంలోనే ఉన్నాయని గుర్తించారు. బాధితుల రక్తంలో అధికంగా కనిపిస్తున్న సీసం, నికెల్‌, పాదరసాలకు సేద్య రసాయనాలే కారణమనీ నిపుణులు చెబుతున్నారు.

heavy usage of pesticides leads to damage food
ఆహారంలో పురుగుమందు అవశేషాలు
author img

By

Published : Dec 12, 2020, 10:00 AM IST

ప్రాణాంతక పురుగుమందు అవశేషాల పెనుభూతం అభాగ్య జనావళిని కర్కశ మృత్యు పాశాలతో నీడలా వెన్నాడుతూనే ఉంది. ఏడేళ్లుగా ఏటా డిసెంబరు అయిదో తేదీని ‘ప్రపంచ నేల దినోత్సవం’గా గుర్తించి మృత్తికా జీవ వైవిధ్య పరిరక్షణకు ఐక్యరాజ్య సమితి ఎంతగా మొత్తుకొంటున్నా ప్రభుత్వాల నిష్క్రియాపరత్వం పెను ఆరోగ్య సంక్షోభాలకు అంటుకడుతోంది.

తాజాగా ఏలూరులో వందలమంది అభాగ్యుల్ని ఆసుపత్రి పాల్జేసిన అస్వస్థత మూలాలు వారు తీసుకొన్న ఆహారంలోనే ఉన్నాయని, బాధితుల రక్తంలో అధికంగా కనిపిస్తున్న సీసం, నికెల్‌, పాదరసాలకు సేద్య రసాయనాలే కారణమనీ నిపుణులు చెబుతున్నారు.

బియ్యం, కూరగాయల్లో నిక్షిప్తం అవుతున్న రసాయన పురుగుమందుల అవశేషాలు జనారోగ్యాన్ని కబళిస్తున్న దురవస్థకు మించిన మహా విషాదం లేదు. కూరగాయల సాగులో అధిక మోతాదులో పురుగుమందుల వినియోగం ఒకరకంగా వినియోగదారుల్ని హత్య చేయడమేనని మొన్న అక్టోబరులో ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తలు ఈసడించారు. కూరగాయల్లో రసాయన అవశేషాల మోతాదు పరీక్షా వివరాల్ని వెల్లడించవద్దని కేంద్ర వ్యవసాయ శాఖ ఇచ్చిన ఆదేశాలు నిశ్చేష్టపరుస్తున్నాయి. మొత్తం 27 రకాల విష రసాయనాలను దేశీయంగా నిషేధిస్తూ మొన్న మే నెలలో పురుగుమందుల చట్టసవరణ ముసాయిదా వెలువరించీ కేంద్రం వెనక్కి తగ్గడంలో- పురుగుమందు తయారీదారుల ఒత్తిళ్లే గట్టిగా పని చేశాయి. రిజిస్ట్రేషన్‌ కమిటీ ఆమోదించిన విధంగా పరిమితులకు లోబడి పురుగు మందుల్ని వినియోగిస్తే వాటితో ఎలాంటి ప్రమాదం లేదని జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు వ్యవసాయ మంత్రిత్వ శాఖ నివేదించింది. భూసారంపైనా, జనారోగ్యంపైనా దుష్ప్రభావాల్ని నివారించే కార్యాచరణ కోసం మొన్న జూన్‌లో హరిత ట్రైబ్యునల్‌ ఆదేశించినా, కదులూ మెదులూ లేకపోవడమే- పెను సంక్షోభానికి కారణమవుతోంది!

కేరళలోని కాసరగడ్‌ జిల్లా 20 గ్రామ పంచాయతీల్లో 12వేల ఎకరాల జీడిపప్పు తోటలపై చీడపీడల నివారణకు రాష్ట్ర ప్రభుత్వ సంస్థ వాయుమార్గాన 1975-2000 మధ్య పిచికారీ చేయించిన ఎండోసల్ఫాన్‌, వెయ్యిమంది మరణానికి అయిదువేలమంది శారీరక మానసిక వైకల్యానికి పుణ్యం కట్టుకొంది. బాధితులకు జీవితకాల వైద్యంతోపాటు రూ.500 కోట్ల పరిహారం చెల్లించాలని 2017లో సుప్రీంకోర్టు ఆదేశించింది. 2013లో మోనోక్రొటోఫాస్‌ అవశేషాలున్న మధ్యాహ్న భోజనాన్ని తిని బిహార్‌లో 23మంది పిల్లలు మరణించడం, మూడేళ్లక్రితం మహారాష్ట్రలోని యావత్‌మల్‌ జిల్లాలో పురుగుమందుల పిచికారీ వికటించి 50మంది రైతులు కనుమూయడం యావద్దేశాన్నీ దిగ్భ్రాంతపరచాయి. మనుషులకు జంతువులకు ప్రమాదకరం కాని విధంగా పురుగుమందుల్ని నియంత్రించడానికి రెగ్యులేటరీ యంత్రాంగాలున్నా అడుగడుగునా పొడగడుతున్న వాటి వైఫల్యం- భూసారాన్ని, మనుషుల ఆరోగ్యాల్ని ఒక్కతీరుగా కుంగదీస్తోంది. ఇతర దేశాల్లో నిషేధించినప్పటికీ ఇండియాలో నిక్షేపంగా వినియోగిస్తున్న పురుగుమందులు 2001లో 33 ఉండగా, 2011నాటికి వాటి సంఖ్య 67కు చేరింది! డాక్టర్‌ అనూప్‌ వర్మ కమిటీ సూచనల మేరకు 27 రకాల పురుగుమందులపై నిషేధానికి సంకల్పించి కూడా కేంద్రం వెనక్కి తగ్గడంలో- ప్రత్యామ్నాయాల దిగుమతులకు రైతులు భారీగా వెచ్చించాల్సి వస్తుందని, దాదాపు రూ.12వేల కోట్ల మార్కెట్‌ను చైనాకు కోల్పోవాల్సి వస్తుందంటూ ఉత్పత్తిదారులు చేసిన హెచ్చరికలూ పనిచేశాయి. 1968నాటి పురుగుమందుల చట్టం సురక్షిత సేద్య సంస్కృతిని పెంచడానికి ఏమాత్రం దోహదపడలేదు. రైతు శ్రేయమే లక్ష్యమంటూ వారికి ఏమాత్రం మింగుడుపడని సేద్య సంస్కరణల గరళాన్ని గట్టిగా సమర్థిస్తున్న కేంద్ర ప్రభుత్వం- రైతులు సహా యావత్‌ జాతి ఆరోగ్యంతో ముడివడిన పురుగుమందుల అవశేషాల నివారణపై యుద్ధప్రాతిపదికన ఎందుకు కదలడం లేదు? సమగ్ర సస్య రక్షణ పద్ధతులు, జీవ రసాయనాలు, తక్కువ గాఢతగల పురుగుమందులు వంటి ప్రత్యామ్నాయాలకు మళ్ళేలా సేద్య విప్లవాన్ని సాకారం చేస్తే తప్ప- జనారోగ్యానికి రక్షణ దక్కదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.