మహా సాగరాల నుంచి మహోన్నత పర్వతశ్రేణుల వరకు అన్నింటిపైనా ప్లాస్టిక్ పడగనీడ పరచుకొంటోంది. వాతావరణ మార్పులకు కారణమవుతూ- జీవజాతుల మనుగడకు పెనువిపత్తుగా పరిణమిస్తోంది. ఈ కాలుష్య కోరల్లోంచి పుడమిని రక్షించుకోవడానికి ప్రపంచ దేశాలన్నీ కంకణబద్ధం కావాలని ఐరాస పర్యావరణ విభాగం ఏనాడో హెచ్చరించింది. విశ్వవ్యాప్తంగా ఏటా మేట వేస్తున్న 30 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల్లో పది శాతమైనా పునర్వినియోగంలోకి రావడం లేదు. ఇండియాలోనైతే ఏడాదికి 38 లక్షల టన్నుల మేరకు అసలు సేకరణకే నోచుకోవడం లేదు. భూమి పొరల్లో, జల వనరుల్లో చొరబడి శతాబ్దాల పాటు అలాగే ఉండిపోతూ- ప్రజారోగ్యానికి అవి చేస్తున్న చేటు అంతా ఇంతా కాదు! ఒకసారి వినియోగించి పారవేసే ఉత్పత్తులతో పోనుపోను ముప్పు ముమ్మరిస్తోంది. అటువంటి వాటిపై 2022 జులై 1 నుంచి నిషేధాన్ని ప్రకటించిన కేంద్రం- ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను తాజాగా కఠినతరం చేసింది.
సుప్రీం ఆందోళన..
పర్యావరణానికి ప్రమాదకరమైన ప్లాస్టిక్ చెత్తపై సుప్రీంకోర్టు ఏడేళ్ల క్రితమే తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తంచేసింది. వ్యర్థాల కట్టడికి సమర్థ చట్టాలెన్ని ఉన్నా- వాటి అమలులో యంత్రాంగం అలసత్వమే అసలు సమస్య అని కుండ బద్దలుకొట్టింది. నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తులను యథేచ్ఛగా తయారుచేస్తున్న వందల కొద్దీ కర్మాగారాల బాగోతాలు నిరుడు భాగ్యనగరంలో బయటపడ్డాయి. దేశ రాజధానిలో సైతం తిష్ఠవేసిన అటువంటి సంస్థల గుట్టుమట్లు మూడు నెలల క్రితమే వెలుగులోకి వచ్చాయి. తయారీ మొదలు వినియోగం వరకు అన్ని స్థాయుల్లో పర్యవేక్షణ కట్టుదిట్టమైతేనే ఎలాంటి నిషేధాజ్ఞలైనా సఫలీకృతమవుతాయి. ప్లాస్టిక్ ఉత్పత్తులతో పొంచి ఉన్న ప్రమాదాన్ని విశదీకరిస్తూ జనచేతనకు ప్రోదిచేస్తేనే మేలిమి ఫలితాలు సాధ్యపడతాయి. ప్రధాని మోదీ లోగడే పిలుపిచ్చినట్లు ప్లాస్టిక్ రక్కసి కబంధ హస్తాల నుంచి దేశం బయటపడాలంటే- వ్యర్థాల పునర్వినియోగమూ జోరెత్తాల్సిందే!
పాతికేళ్ల క్రితం దేశీయంగా ఏడాదికి 61 వేల టన్నులుగా ఉన్న ప్లాస్టిక్ వినియోగం- రెండు దశాబ్దాలు తిరిగేసరికి 1.78 కోట్ల టన్నులకు చేరింది. వ్యర్థాల ఉత్పత్తి సైతం గడచిన మూడేళ్లలో నలభై శాతానికి పైగా ఎగబాకింది. రహదారుల నిర్మాణాల్లో ఉపయోగించుకోవడం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలను పెద్దయెత్తున సద్వినియోగం చేయవచ్చన్నది నిపుణుల మేలిమి సూచన. దీంతో కిలోమీటరుకు లక్ష రూపాయల వరకు వ్యయం కలిసి వస్తుందన్నది అంచనా. కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అయిదేళ్ల క్రితమే ఈ పద్ధతి వైపు మొగ్గు కనబరచారు. ఈ ఏడాది జులై 30 నాటికి 703 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారుల నిర్మాణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను వినియోగించగలిగారు! జపాన్, స్వీడన్, కెనడా వంటి దేశాలు పటిష్ఠ విధానాలతో వ్యర్థాలను గరిష్ఠ స్థాయిలో తిరిగి వాడుకలోకి తెస్తున్నాయి.
గణాంకాలు ఇలా..
ఇండియాలో 60శాతం వ్యర్థాలు పునర్వినియోగమవుతున్నట్లు అధికారిక గణాంకాలు చాటుతున్నాయి. మురుగునీటిలో పేరుకుపోతున్న సూక్ష్మ ప్లాస్టిక్ కణాలతో మొండి బ్యాక్టీరియా వృద్ధి చెందుతోందని అమెరికన్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. 83శాతం తాగునీటిలో ప్లాస్టిక్ రేణువులు కలగలసిపోయాయని కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. క్యాన్సర్, గుండెజబ్బులతో సహా ఎన్నో ఆరోగ్య సమస్యలకు అవి కారణభూతమవుతున్నాయని హెచ్చరించింది. ఈ దుస్థితి తొలగిపోవాలంటే పోగుపడుతున్న వ్యర్థాల కుప్పలను ఎప్పటికప్పుడు కరిగించాలి. అందుకుగానూ రహదారులు, ఇళ్ల నిర్మాణం, ఇంధన తయారీ తదితరాల రూపంలో పరిశోధకులు సూచిస్తున్న పరిష్కార మార్గాలను అందిపుచ్చుకోవాలి. ప్రజాభాగస్వామ్యంతో పటుతర కార్యాచరణకు ప్రభుత్వాలు సంసిద్ధమైతేనే- ప్లాస్టిక్‌పై పోరాటానికి సన్నద్ధమైనట్లు!