ETV Bharat / opinion

విపత్తుల వేళా ఆహార భద్రత!

కరోనా సంక్షోభం కారణంగా ఆకలి చావులు రెట్టింపు అవుతాయని ఐక్యరాజ్యమసితి హెచ్చరించింది. దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో వంట సరకుల పొట్లాల కోసం ఎగబడిన ప్రజలు పోలీసులతో పోట్లాటకు దిగారు. నైరోబీలో జనం ఆహారం కోసం ముష్టి యుద్ధాలు చేశారు. భారతదేశంలో లక్షలాది వలస కార్మికులు తిండీ నీరూ లేకుండా కాలి నడకన వందల మైళ్ల దూరంలోని స్వస్థలాలకు తరలివెళ్లడం టీవీల్లో, పత్రికల్లో చూసి అందరి మనసులు కలతచెందాయి.

food security situation during crisis
స్ఫూర్తినిస్తున్న సాముదాయిక వంటశాలలు
author img

By

Published : Jun 7, 2020, 6:57 AM IST

మామూలు రోజుల్లోనే ప్రపంచంలో ఏటా 90 లక్షలమంది ఆకలితో చనిపోతుంటారని, కొవిడ్‌వల్ల ఆకలి చావులు రెట్టింపు కానున్నాయని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. నిన్నమొన్నటివరకు ఆకలి అనేది పేద దేశాల సమస్య అని భావించినవారూ కరోనా దెబ్బకు ఆ అభిప్రాయం మార్చుకోక తప్పడం లేదు. కొవిడ్‌ కల్లోలంలో దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో వంట సరకుల పొట్లాల కోసం ఎగబడిన ప్రజలు పోలీసులతో పోట్లాటకు దిగారు. నైరోబీలో జనం ఆహారం కోసం ముష్టి యుద్ధాలు చేశారు. ఈ రద్దీ ఆఫ్రికాకే పరిమితం కాలేదు. అమెరికాలోని ఫీనిక్స్‌ నగరంలో జనం ఆహార దినుసుల కోసం రెండు గంటలసేపు కార్లలో బారులు తీరారు. ఒహాయోలో 4,000 మంది అన్నార్తులు ఆహార ప్యాకెట్ల కోసం గంటల తరబడి క్యూలో నిలుచున్నారు. భారతదేశంలో లక్షలాది వలస కార్మికులు తిండీనీరూ లేకుండా కాలి నడకన వందల మైళ్ల దూరంలోని స్వస్థలాలకు తరలివెళ్లడం టీవీల్లో, పత్రికల్లో చూసి అందరి మనసులు కలతచెందాయి. లాక్‌డౌన్‌ కాలంలో దేశమంతటా వ్యక్తులు, మిత్ర బృందాలు, స్వచ్ఛంద సంస్థలు, మత అనుబంధ సేవాసంఘాలు, అపార్ట్‌మెంట్‌ వాసులు, కాలనీవాసుల సంఘాలు విరాళాలు పోగు చేసి వంటావార్పు చేపట్టి వలస కార్మికులకు ఆహార పొట్లాలు అందజేశారు. కేరళ, తెలంగాణ, ఉత్తర్‌ ప్రదేశ్‌ తదితర రాష్ట్ర ప్రభుత్వాలూ సాముదాయిక వంటశాలలు ఏర్పరచి ఆకలిగొన్న పేదలకు, వలస కూలీలకు ఉచితంగా, కొందరికి నామమాత్ర ధరకు భోజన సదుపాయం కల్పించాయి. అసలు కరోనా సంక్షోభానికి ముందే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, ఒడిశా, కర్ణాటక, దిల్లీ, ఝార్ఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు సాముదాయిక వంటశాలలు తెరచి పేదలకు, కూలీలకు చాలా తక్కువ ధరలకు ఆహారం అందించేవి, చాలా రాష్ట్రాలు ఇప్పటికీ అందిస్తున్నాయి. ఆ వంటశాలలు చాలామందికి ఉపాధి సైతం కల్పిస్తున్నాయి. కరోనా సంక్షోభంలో ఈ వంటశాలలు ఎంతో అక్కరకొచ్చి, ఇతర రాష్ట్రాలకూ స్ఫూర్తిదాయకమయ్యాయి.

ఆగ్రహించిన ధర్మపీఠం

భారతదేశంలో పేదరికం ఉన్నంతవరకు సాముదాయిక వంటశాలలను కొనసాగించవలసిందేనని ఆలోచనాపరులు గట్టిగా అభిప్రాయపడుతున్నారు. కరోనాకు ముందే ఆ పని చేసి ఉంటే ఇప్పుడు ఎంతో వెసులుబాటుగా ఉండేది. దేశంలో 19 కోట్లమంది ఆకలి కడుపులతో నిద్రిస్తున్నారు. ఈ దుస్థితిని రూపుమాపడానికి దేశమంతటా సాముదాయిక వంటశాలలు అమోఘ సాధనం. అందువల్ల వీటి ఏర్పాటుకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ గతేడాది సుప్రీంకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలైంది. జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అధ్యక్షతలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ అభ్యర్థనను మన్నించి, సాముదాయిక వంటశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలంటూ గత అక్టోబరులోనే కేంద్రాన్ని, రాష్ట్రాలను ఆదేశించింది. అందుకు సంబంధించి అఫిడవిట్లను దాఖలు చేయాలని కోరింది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు కేవలం పంజాబ్‌, నాగాలాండ్‌, కర్ణాటక, జమ్మూకశ్మీర్‌, అండమాన్‌-నికోబార్‌, ఉత్తరాఖండ్‌, ఝార్ఖండ్‌ లు మాత్రమే కోర్టు ఉత్తర్వును పాటించాయి. అయిదు నెలలు గడచిపోయినా మిగతా రాష్ట్రాలు సమాధానమివ్వకపోవడంపై కోర్టు మండిపడింది. 24 గంటల్లో అఫిడవిట్లను సమర్పించకపోతే లక్ష రూపాయల జరిమానా కట్టాలని, ఆ గడువు దాటిపోతే మరో అయిదు లక్షల రూపాయలు కట్టాలని సుప్రీంకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరి 10న ఆదేశించింది. ఈ వ్యవహారం ఒక కొలిక్కి రాకముందే కరోనా కలవరం దేశాన్ని చుట్టుముట్టింది. దీనివల్ల లక్షలమంది బతుకుతెరువు కోల్పోయి ఆకలి చావుల బారిన పడే ప్రమాదం ముంచుకొచ్చింది. దీన్ని నివారించడానికి దేశమంతటా బ్లాకు స్థాయిలో తాత్కాలిక సాముదాయిక వంటశాలలను ఏర్పరచేట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని ఏప్రిల్‌లో మరో వ్యాజ్యం సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలైంది. గతేడాది దేశవ్యాప్త సాముదాయిక వంటశాలల ఏర్పాటును కోరిన పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఫజైల్‌ అహ్మద్‌, ఆశిమా మండ్ల కొత్త పిటిషన్‌ వేశారు.

రాజ్యాంగ ప్రాతిపదిక

వీరి వాదనకు మానవ కారుణ్య దృష్టితోపాటు రాజ్యాంగపరమైన, చట్టపరమైన ప్రాతిపదికలూ ఉన్నాయి. 21వ రాజ్యాంగ అధికరణ పౌరులకు హుందాగా జీవించే ప్రాథమిక హక్కు ఉందని, ఆహార హక్కు లేనిదే ఈ అధికరణ సంపూర్ణంగా అమలైనట్లు కాదని పేర్కొంది. 47వ అధికరణ- ప్రజలకు పౌష్టికాహారం అందించి, వారి జీవన ప్రమాణాలను పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఉద్ఘాటించింది. 2013లో పార్లమెంటు ఆమోదించిన ఆహార భద్రతా చట్టం ప్రజలకు పౌష్టికాహారం పొందడానికి శాసనబద్ధమైన హక్కు కల్పించింది. దేశంలో 19 కోట్లమంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని ఆ చట్టం చెబుతోంది. ఆకలి, పోషకాహార లోపంతో దేశంలో ఏటా మూడు లక్షలమందికిపైగా బాలలు మరణిస్తున్నారని 2017నాటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తెలిపింది. పౌష్టికాహార లోపంతో క్షయ, నీళ్ల విరేచనాలు, తట్టు వంటి వ్యాధులు ప్రబలుతాయి. కొవిడ్‌ వల్ల జీవనోపాధి కోల్పోయిన లక్షలమంది మృత్యువాత పడకుండా ఆపాలంటే సాముదాయిక వంటశాలల ద్వారా పోషణ అందించడం తప్పనిసరి. తమిళనాడులో అమ్మ ఉనవగం, కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్లు, రాజస్థాన్‌లో అన్నపూర్ణ రసోయి, ఒడిశాలో ఆహార్‌ సెంటర్లు కరోనాకు ముందు నుంచే పేదలకు ఉచితంగానో, చౌక ధరకో ఆహారం అందిస్తూ సాముదాయిక వంటశాలల ప్రయోగం ఆచరణీయమని నిరూపించాయి. ఈ తరహా వంటశాలలు దేశమంతటా రావాలని కొవిడ్‌ వ్యాధి వల్ల తేటతెల్లమవుతోంది.

భారతదేశానికి ఇప్పుడైతే కరోనా మహమ్మారి వచ్చి పడింది కానీ, ఇక్కడ ఏటా వరదలు, తుపానులు, ఇతర ప్రకృతి ఉత్పాతాలు విరుచుకు పడటం, ప్రజలు నిరాశ్రయులు కావడం సర్వసాధారణం. పెరుగుతున్న భూతాపంవల్ల కొత్త ఉపద్రవాలు దాపురిస్తున్నాయి. వీటిని ఎదుర్కోవడానికి శాశ్వత ప్రాతిపదికన సాముదాయిక వంటశాలలను నెలకొల్పాల్సిన అవసరం పెరుగుతోంది. దేశమంతటా గ్రామ పంచాయతీల పరిధిలో శాశ్వతంగా యాంత్రిక వంటశాలలను ఏర్పరచాలి. వీటిని స్కూలు పిల్లలకు, అంగన్‌ వాడీ బాలలకు మధ్యాహ్న భోజనం తయారీతోపాటు పేద జనానికి రూ.10కే ఆహారం వడ్డించడానికీ ఉపయోగించవచ్చు. గ్రామ పంచాయతీల ద్వారా ఈ సాముదాయిక వంటశాలలకు సబ్సిడీ ధరలపై ఆహార ధాన్యాలు, నిధులు అందించాలి. పట్టణాల్లో మునిసిపల్‌ అధికారులు ఈ బాధ్యత తీసుకోవాలి. 'సాముదాయిక వంటశాలల జాతీయ గ్రిడ్‌' ఏర్పడినట్లయితే పేదల క్షుద్బాధను తీర్చడం సుసాధ్యమవుతుంది.

కొరవడిన సన్నద్ధత

కేంద్ర ప్రభుత్వం లక్షలాది వలస కార్మికులకు ఆహారం అందించడానికి వీలుగా రాష్ట్రాలకు రూ.11,000 కోట్లు అందించింది. అయినా చాలా రాష్ట్రాలు సకాలంలో మేల్కొని వలస కార్మికులకు ఆదుకోలేకపోయాయి. కారణం- మన పాలనా యంత్రాంగానికి ముఖ్యంగా జిల్లా రెవిన్యూ అధికారులు, సిబ్బందికి ఇలాంటి ఆహార సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొనే అనుభవం కానీ, శక్తికానీ లేకపోవడమే. తగినన్ని నిధులు, స్పష్టమైన ఆదేశాలు వచ్చినా వాటిని అమలు చేయడానికి తగు మౌలిక వసతులు, సాధన సంపత్తి జిల్లా యంత్రాంగాల వద్ద లేవు. సహాయ శిబిరాలు, క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటుచేయడానికి స్కూలు భవనాలను ఆశ్రయించక తప్పడం లేదు. ఆ భవనాల్లో వందలమంది అన్నార్తులకు వండివార్చిపెట్టడానికి వంటశాలలు, వంట పాత్రలను సమకూర్చుకోవడం సాధ్యం కాని పని.

- ప్రసాద్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.