టీకాలు అందుబాటులోకి రావడం వల్ల ప్రపంచం ఇక కొవిడ్ బారి నుంచి తేరుకొంటుందనే ఆశాభావం బలపడుతున్నా- మరోవైపు ఆహారం, ఆయిల్ ధరలు నానాటికీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచంలో ఆహార నిల్వలు దండిగా ఉన్నా ఈ పరిస్థితి నెలకొనడం విస్మయపరుస్తోంది. 2020-21లో కొన్ని దేశాల్లో తుపానులు, వరదలు, అనావృష్టి, మిడతల దండు దాడుల తాకిడికి పంటలు దెబ్బతిన్న మాట నిజమే. అదే సమయంలో భారత్ వంటి దేశాల్లో అధిక దిగుబడుల వల్ల ప్రపంచ విపణికి ఆహార ధాన్యాల సరఫరా పెరిగింది. ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) గణాంకాల ప్రకారం 2019-20లో ప్రపంచ విపణికి సరఫరా అయిన ఆహార ధాన్యాలు 354.1 కోట్ల టన్నులు; 2020-21లో అవి 358 కోట్ల టన్నులకు పెరిగాయి. 2020లో కొవిడ్ వల్ల రవాణా కార్యకలాపాలు దెబ్బతిని బియ్యం, గోధుమ, మొక్కజొన్న, సోయాచిక్కుడు ధరలు తగ్గాయి. ఈమధ్య పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు రవాణా ఖర్చులను ఎగదోయడంతో ఫిబ్రవరికల్లా ఆహార ధాన్యాల ధరలు పైచూపులు చూడసాగాయి.
కొంప ముంచిన నిల్వలు
కొవిడ్ కాలంలో ప్రభుత్వాలు, వినియోగదారులు తిండి గింజలను భారీయెత్తున కొని నిల్వ చేయడం సైతం ఆహార ధరలు పెరగడానికి కారణమైంది. కొవిడ్ లాక్‌డౌన్ల కాలంలో వినియోగదారులు ఎగబడి కొనడం వల్ల కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లలో ఉప్పులు, పప్పులు, తిండి గింజల అరలు ఖాళీఅయ్యాయి. లాక్‌డౌన్‌లో పేదలకు, క్వారంటైన్‌లో ఉన్న రోగులకు అందించడానికి ప్రభుత్వాలు భారీగానే ఆహార ధాన్యాలు కొనుగోలు చేశాయి. కొవిడ్ రెండోసారి, మూడోసారి విజృంభిస్తుందనే భయంతో ఈ తరహా కొనుగోళ్లు, నిల్వలు మరీ ఎక్కువయ్యాయి. అసలు మొదటిసారి కొవిడ్ విరుచుకుపడినప్పుడే- చైనా, ఈజిప్ట్, మొరాకో, అల్జీరియా, ఫిలిప్పీన్స్‌లలో తిండి గింజల నిల్వలు అడుగంటాయి. వాటిని మళ్ళీ భర్తీ చేసుకోవడానికి ఆయా దేశాలు భారీ కొనుగోళ్లు జరిపాయి.
హెడ్జ్ ఫండ్లతో..
చైనాలో వరదల వల్ల పంటలు బాగా దెబ్బతినడం వల్ల ఆహార దిగుమతులను పెంచుకోక తప్పలేదు. సాధారణంగా ఏడాదికి 30 నుంచి 50 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే చైనా, 2020లో ఏకంగా కోటీ 10 లక్షల టన్నులు దిగుమతి చేసుకుంది. దీంతో రష్యా, వియత్నాం, థాయ్‌లాండ్ స్వదేశీ మార్కెట్లలో ఆహార ధరలు పెరగకుండా చూసుకోవడానికి గోధుమ, బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించాయి. ఈ పరిణామాలు ప్రపంచ విపణిలో ఆహార ధరలను పెంచగా, ఈ పరిస్థితి నుంచి లాభాల పూలు పూయించుకోవడానికి హెడ్జ్ ఫండ్‌లు మార్కెట్ లోకి దిగాయి. కొవిడ్ వల్ల పడిపోయిన గిరాకీని, పెట్టుబడులను పెంచడానికి ప్రపంచ దేశాలు, మరీ ముఖ్యంగా సంపన్న దేశాల కేంద్ర బ్యాంకులు నామమాత్ర వడ్డీ రేట్లకు లక్షల కోట్ల డాలర్ల రుణాలను మార్కెట్లలోకి వదిలాయి. ఈ డబ్బు కూడా వ్యవసాయ సరకుల విపణుల్లో స్పెక్యులేషన్‌ను ప్రేరేపించి ఆహార ధరలు పెరగడానికి కారణమైంది.
ఎఫ్ఓఏ ధరల సూచీ అంచనాలు..
ప్రపంచమంతటా గతేడాది డిసెంబరుకన్నా ఈ ఏడాది జనవరిలో ఆహార ధాన్యాలు, నూనె గింజలు, మాంసం, పాలు, చక్కెర ధరలు 4.3శాతం పెరిగాయని ఎఫ్‌ఏఓ తాజా ఆహార ధరల సూచీ నిర్ధరించింది. జనవరికి ముందు ఎనిమిది నెలల నుంచే ఈ సరకుల ధరలు పెరుగుతూ వస్తున్నాయని అది వెల్లడించింది. ఇది భారతీయ రైతులకు శుభవార్తే. నిరుడు పుష్కలంగా కురిసిన వర్షాల వల్ల 2020-21లో భారతదేశంలో వరి, గోధుమ, ముతక ధాన్యాలు, పప్పు గింజల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 30.34 కోట్ల టన్నులకు చేరింది. 2019-20లో ఉత్పత్తి 29.75 కోట్ల టన్నులే. 2020-21లో భారత్‌లో గోధుమ పంట విస్తీర్ణమూ పెరిగి 10.76 కోట్ల టన్నుల రికార్డు దిగుబడి వచ్చింది. 2021-22 పంటల సంవత్సరంలో గోధుమ దిగుబడి మరింత పెరగవచ్చు. రష్యా గోధుమ ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో ప్రపంచ ఆహార అవసరాలను తీర్చడానికి భారత్ ముందుకొచ్చింది. 2019-20లో 2,17,020 టన్నుల గోధుమలను ఎగుమతి చేసిన భారత్- కొవిడ్ కాలంలో (2020 ఏప్రిల్-డిసెంబరు మధ్య) 9,76,083 టన్నులను ఎగుమతి చేసింది. బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, పశ్చిమాసియా దేశాలకు ఈ ఏడాది మన గోధుమల ఎగుమతులు పెరగనున్నాయి. 2021లో భారత్ 18 లక్షల టన్నుల గోధుమలను, 17 లక్షల టన్నుల బాస్మతి, సాధారణ బియ్యాలను ఎగుమతి చేయనుందని అమెరికా వ్యవసాయ శాఖ అంచనా.
పేదలపై అశనిపాతం
అమెరికా సహా, పలు దేశాల్లో ఆహార ధాన్యాలు, మాంసం ఉత్పత్తి తగ్గడం వ్యవసాయ కూలీలను ఆర్థికంగా దెబ్బతీసింది. సాధారణంగా పంట నాట్ల నుంచి కోతల వరకు వలస కూలీలు, సంచార కూలీలను వినియోగిస్తుంటారు. వీరంతా ఒకే చోట తాత్కాలిక బసలు ఏర్పాటు చేసుకోవడం వల్ల- ఆ కిక్కిరిసిన స్థలాల్లో కొవిడ్ తేలిగ్గా వ్యాపిస్తోంది. ఇది వ్యవసాయ కార్యకలాపాలకు ఆటంకం కలిగించి దిగుబడులను దెబ్బతీస్తోంది. దీనికి తోడు చమురు ధరలూ పెరగడం ఆహారోత్పత్తికి పెద్ద ఆటంకం. అందుకే అమెరికాలో మరో ఏడాది, ఏణ్నర్ధం వరకు ఆహార ధరలు పెరుగుతూనే ఉంటాయని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. పేదల ఆదాయంలో 36శాతం వరకు ఆహారం మీదనే ఖర్చయిపోతుందని గుర్తుంచుకుంటే- ఆహార ద్రవ్యోల్బణం సృష్టించే కష్టనష్టాలేమిటో అర్థమవుతుంది.
మందగిస్తున్న వ్యాపారం..
ప్రపంచవ్యాప్తంగా పేదలకు ఆహారం అందించే స్వచ్ఛంద సంస్థల బడ్జెట్లూ దీనివల్ల తలకిందులవుతాయి. ఆహార రవాణా కార్యకలాపాలకు విఘాతం కలిగినా ఈ-కామర్స్ సంస్థలు, సూపర్ మార్కెట్లు దండిగా సరకులను నిల్వచేసి, ఖాతాదారులకు విక్రయించగలుగుతున్నాయి. చిన్న చిన్న కిరాణా దుకాణాలకు అటువంటి వెసులుబాటు ఉండదు. ఆహార ధరలు పెరుగుతున్న కొద్దీ వాటి వ్యాపారమూ మందగిస్తుంది. అసలే కొవిడ్ కాలంలో ఆదాయాలు పడిపోయి నానా అగచాట్ల పాలవుతున్న పేద, మధ్య తరగతులవారికి తిండి గింజలతోపాటు నూనె గింజల ధరలూ పెరగడం పెద్ద దుర్వార్త. కొవిడ్ కడగండ్లను అధిగమించడానికి విధాన నిర్ణయాలు వెలువరించేటప్పుడు ప్రభుత్వం ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి.

రైతుల ఆదాయం అంతంతే...
ప్రపంచ మార్కెట్‌లో పత్తి ధర కొంత హెచ్చడంతో భారత్ నుంచి ఈ ఏడాది పత్తి ఎగుమతులు 75 లక్షల బేళ్లకు పెరుగుతాయని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. నిరుడు 50 లక్షల బేళ్లు ఎగుమతి అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో వ్యవసాయ సరకుల ధరలు పెరిగినందువల్ల భారతీయ రైతులకు అదనపు ఆదాయం సమకూరనున్నా, నూనె గింజల ధరల పెరుగుదల భారతీయ వినియోగదారుడికి భారం కానుంది. భారతదేశ వంటనూనెల అవసరాల్లో 70-74 శాతానికి దిగుమతులే ఆధారం. మలేసియా, ఇండొనేసియాలలో పామాయిల్ ఉత్పత్తి తగ్గడంతో ఈ ఏడాది భారత్‌లో వంటనూనెల ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే పొద్దుతిరుగుడు నూనె ధర పెరుగుతోంది. విదేశాల్లో చెరకు దిగుబడులు తగ్గడం ఇక్కడ చక్కెర ధరలు పెరగడానికి కారణం కావచ్చు.
- కైజర్ అడపా, రచయిత
ఇదీ చదవండి: జోరుగా వ్యాక్సినేషన్- 5 కోట్లకుపైగా డోసులు పంపిణీ