ETV Bharat / opinion

ఆర్థిక సహాయంతోనే 'సంక్షోభం'లో ప్రజలకు ఉపశమనం - india growth rate

కరోనా తొలిదశతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ కుదుటపడినట్లు కనిపించినా.. వెనువెంటనే రెండోవిడత వైరస్​ వ్యాప్తి మళ్లీ కలవరపెడుతోంది. అంతా బాగుంది.. ఆర్థిక పురోగతి అంచనాలను మించిపోతోందని నిపుణులు భావించారు. అయితే అంతా తలకిందులైంది. ఇలాంటి విపత్కర పరిస్థితిలో కేంద్రం, రాష్ట్రాలు తక్షణం చర్యలు తీసుకోకపోతే ఆర్థిక ఉపద్రవం తప్పదనేది నిపుణుల అభిప్రాయం. మరి ఈ మహాసంక్షోభం నుంచి తేరుకోవడానికి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టాలి?

After covid India's economy
కరోనా తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ
author img

By

Published : Apr 29, 2021, 6:56 AM IST

'అంతా చక్కబడింది. ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడుతోంది'- కొవిడ్‌ మలి విజృంభణకు ముందు అందరూ అనుకున్న మాట ఇది! ఆశావాదులు మరో అడుగు ముందుకేసి, రాష్ట్రాల్లో వృద్ధి పుంజుకుంటోంది, కాబట్టి జాతీయ స్థాయిలో ఆర్థిక పురోగతి తొలి అంచనాలకంటే అధికంగా ఉంటుందని లెక్కలు వేశారు. కేంద్ర ప్రభుత్వ పన్ను వసూళ్లు భారీగా పెరిగినందువల్ల పథకాలపై వ్యయాలూ ఊపందుకుంటాయన్న భావన బలపడింది. ఇప్పుడు కొవిడ్‌ రెండో కెరటం అందరి ఆశలనూ భగ్నం చేస్తోంది. మహమ్మారి తొలి విడత ప్రభావంతో నిర్మాణం, వాణిజ్యం, రవాణా వంటి ప్రధాన ఉపాధి కల్పన రంగాలు కుదేలు కావడంతో, సరఫరా వ్యవస్థలు విచ్ఛిన్నమై పరిశ్రమలు దెబ్బతిన్నాయి. రెండో దండయాత్రకు, ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, అలసత్వం, వైఫల్యం అవకాశం ఇచ్చాయి. శాస్త్రీయ స్పృహ కోల్పోయి అప్రమత్తతను గాలికి వదిలేశారు.

ప్రధాన రాష్ట్రాలే ప్రభావితం

2020-21 సంవత్సరానికి దేశ జీడీపీ స్థిర ధరల వద్ద రూ.133.01 లక్షల కోట్లు ఉంటుందన్నది- కేంద్ర గణాంకాల సంస్థ ఫిబ్రవరిలో వేసిన ముందస్తు అంచనా. అంతక్రితం ఏడాది జీడీపీ కంటే ఇది ఎనిమిది శాతం తక్కువ. ఇక నికర జాతీయ ఆదాయం రూ.127.33 లక్షల కోట్ల నుంచి ఎనిమిది శాతం క్షీణతతో రూ.117.18 లక్షల కోట్లకు పరిమితమవుతుందన్నది ఆర్థిక సర్వే అంచనా. స్థూల విలువ జోడింపు (జీవీఏ) పరంగా చూస్తే- తయారీ, నిర్మాణం, విద్యుత్తు రంగాల వాటా 26 శాతం; వాణిజ్యం; రవాణా, హోటళ్లు, సమాచార రంగాలు 16 శాతం; ఆర్థిక సేవలు, బీమా, స్థిరాస్తి, ఇతర వ్యాపార సేవలు 23 శాతం; వ్యవసాయం ఇతర అనుబంధ కార్యకలాపాలు 19 శాతం వాటా కలిగి ఉంటాయి.

ప్రతిబంధకంగా రుణభారం

కొవిడ్‌ కంటే ముందే చాలా రాష్ట్రాల ఆర్థిక స్థితి అధమంగా ఉంది. 2014 నుంచీ వీటి పరిస్థితి క్షీణిస్తూ వస్తోంది. మితిమీరిన వ్యయం, తరిగిపోతున్న ఆదాయం- ఇవి ఎదుర్కొంటున్న ప్రధానమైన సవాళ్లు. కొవిడ్‌ మహమ్మారితో పరిస్థితి మరింత జటిలమైంది. ఆర్‌బీఐ లెక్కల ప్రకారం, 2014-15 జీడీపీలో 21.69 శాతం ఉన్న రాష్ట్రాల అప్పులు 2019-20 నాటికి వచ్చేసరికి జీడీపీలో 24.92 శాతానికి పెరిగాయి. 2020-21లో ఇవి అంతకు ముందటి ఏడాదిలో కంటే 30 శాతం అధికంగా రూ.7.98 లక్షల కోట్లు అప్పు చేశాయి. రాష్ట్రాల మొత్తం అప్పుల్లో ఏడు రాష్ట్రాల (ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌, తమిళనాడు, యూపీ, పశ్చిమ్‌ బంగ) వాటా 61 శాతం. ఇక కేంద్రం రుణాలు ఇదే కాలంలో రాష్ట్రాలకు భిన్నంగా 51.42 శాతం నుంచి 48.60 శాతానికి తగ్గిపోయాయి. పెరుగుతున్న రుణభారం రాష్ట్రాల వృద్ధికి ప్రధాన ప్రతిబంధకంగా మారుతోంది. కిందటేడాది కొవిడ్‌ వల్ల గణనీయ ఆర్థిక నష్టం వాటిల్లింది. మలి విడత కొవిడ్‌ వ్యాప్తి, స్థానిక లాక్‌డౌన్ల వల్ల ఆర్థిక వ్యవస్థకు ఈసారి అదనంగా 10 శాతం ప్రత్యక్ష నష్టం వాటిల్లుతుంది. ఇదే కాకుండా ఉద్యోగాలు కోల్పోవడం, తత్ఫలితంగా వినియోగం తగ్గిపోవడం వంటివి ఉండనే ఉంటాయి. ఇలా ఆదాయాలు కోల్పోయే రాష్ట్రాలు మరోవంక మహమ్మారిపై పోరాడేందుకు అదనపు వ్యయం చేయాల్సి ఉంటుంది. దీంతో గతంలో మాదిరిగా అవి అప్పులు పుట్టించలేవు.

మలి విడత మహమ్మారి వ్యాప్తి భారత ఆర్థిక వ్యవస్థ పాలిట మూలిగే నక్కపై తాటిపండు చందంగా మారింది. దీని ప్రభావంతో దేశం అదనంగా కనీసం ఒకశాతం (100 బేసిస్‌ పాయింట్లు) జీడీపీ నష్టపోతుంది. ముఖ్యంగా సేవల రంగంలో ఈ ప్రభావం కనపడుతుంది. ఆర్థిక నష్టం వారానికి రూ.7,500 కోట్ల నుంచి రూ.37,500 కోట్లదాకా ఉంటుందని అంచనా. తొలి, మలి విడతల ప్రభావం ఇప్పటికే సుస్పష్టంగా కనిపిస్తోంది. వార్షిక పెట్రోలియం ఉత్పత్తుల విక్రయాలు 20 ఏళ్లలో ఎన్నడూ లేనంతటి కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ఇక రిజిస్ట్రేషన్లు క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 30 శాతానికి పైగా తగ్గాయి. 2019 మార్చి ఆఖరు నాటికి, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జీఎస్‌డీపీ రూ.153.30 లక్షల కోట్లు ఉండగా, ఇందులో ఆర్థికంగా అయిదు అగ్రరాష్ట్రాలైన గుజరాత్‌, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తర్‌ ప్రదేశ్‌ల నుంచి 45శాతం (రూ.69.92 లక్షల కోట్లు) సమకూరింది. మహారాష్ట్ర ఒక్కటే భారత స్థూల విలువ జోడింపు (జీవీఏ)లో 14.9 శాతం వాటా, వాహన రంగ విక్రయాల్లో 10-12 శాతం వాటాను ఆక్రమిస్తోంది. ఆర్థికంగా అత్యంత ప్రధానమైన ఈ రాష్ట్రాలే అత్యధికంగా ప్రభావితం కావడం అసలైన సమస్య.

విధానం అవసరం

మలివిడతలో మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోలేకపోవడంవల్ల భారత ఆర్థిక వ్యవస్థ జీ-20 దేశాల్లో వెనకబడే అవకాశం ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా రెండోవిడతను సమర్థంగా తిప్పికొట్టినట్లు- జోరు మీదున్న వాటి కీలక ఆర్థిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భారత్‌ పరిస్థితికి ఇది పూర్తిగా భిన్నం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ, సామాజిక, మతపరమైన భారీ జనసమీకరణలను గుడ్డిగా అనుమతించాయి. పాఠశాలలు, కళాశాలలను ఆలోచన లేకుండా తెరిపించాయి. కేంద్రం, రాష్ట్రాలు ఇలాంటి విపత్కర స్థితిలో తక్షణం చర్యలు తీసుకోకపోతే ఆర్థిక ఉపద్రవం తప్పదు. రాష్ట్రాలు కొన్నేళ్లుగా ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొనే ప్రయత్నంలో ప్రాంతీయ వైఖరిని అవలంబిస్తూ ఉద్యోగాల్లో స్థానికులకు కోటాలు ఇవ్వడం వంటి విధానాలను పాటించాయి. అలాంటి ఆంక్షలను తొలగించాలి.

ప్రతి రాష్ట్రం ఇలాగే ఆలోచిస్తే ప్రజలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళలేరు. ఉద్యోగాలు చేయలేరు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మెరుగు పడుతోందంటే- అంతర్జాతీయంగా భారత్‌ సహా అన్ని దేశాల్లో వడ్డీరేట్లు పెరుగుతాయి. రాష్ట్రాలు గత ఏడాదిలో మాదిరిగా అదే పనిగా కొత్త రుణాలు తీసుకోలేవు. తమ ఆదాయాలు, నికర రుణాల్లో కనీసం 50 శాతాన్ని పెట్టుబడుల రూపంలో వ్యయం చేయాల్సిందిగా రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తేవాలి. వచ్చే ఆరు నెలల్లో కేంద్ర ప్రభుత్వం అన్ని కుటుంబాలకూ ఏకకాల నగదు సాయం అందించాల్సిన అవసరం ఉంటుంది. చిరు వ్యాపారాలు, స్వయం ఉపాధి మార్గాల ద్వారా జీవనం సాగిస్తున్న కోట్ల మంది మధ్యతరగతి ప్రజలు కొవిడ్‌ ఫలితంగా ఇప్పుడు పేదల వర్గంలోకి జారిపోయారు. ఒక ఆదాయ పరిమితికి దిగువన ఉన్న ప్రతి ఒక్కరికీ- అమెరికాలో బైడెన్‌ ప్రభుత్వం చెక్కులు ఇచ్చి ఆదుకున్న తరహాలో భారత ప్రభుత్వం కూడా గ్రాంటు రూపంలో ప్రజలకు ఆర్థిక తోడ్పాటు ఇచ్చేందుకు తక్షణం ఒక విధానం రూపొందించాలి.

రచయిత- డాక్టర్ ఎస్​. అనంత్​, ఆర్థిక, సామాజిక రంగ నిపుణులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.