దేశ ఆర్థికానికి కీలకమైన వ్యవసాయరంగ వృద్ధికి అవకాశాలు అపారంగా ఉన్నా లక్ష్య సాధన దిశగా మన అడుగులు మందగిస్తున్నాయి. ప్రపంచ ఆహారోత్పత్తుల్లో కీలక దేశమైన భారత్, శుద్ధిరంగం(ప్రాసెసింగ్)పై నేటికీ పట్టు సాధించలేకపోతోంది. అత్యాధునిక సాంకేతికతలను అందిపుచ్చుకొన్నా- వాటిని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లకపోవడంతో రైతుల ఆదాయ వృద్ధి సాధ్యపడటం లేదు. ఫలితంగా ఆహారవృథా అనివార్యమవుతోంది. దీన్ని నిరోధించేందుకు ఆహారశుద్ధి రంగంలో మన బ్రాండ్లకు చేయూతనిచ్చేలా కేంద్రం తాజాగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంతో ముందుకొచ్చింది. పలు పంటల ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న భారత్ పంటకోత అనంతర సాంకేతికతను గ్రామాలకు చేర్చగలిగితే ఆహారశుద్ధి రంగంలో అద్భుత ప్రగతికి అవకాశాలున్నాయి.
మందగించిన పురోగతి
ఒక కిలో మొక్కజొన్న పొత్తులు కొనాలంటే దాదాపు రూ.30-40 అవుతుంది. మల్టీప్లెక్స్‌లో అంతే పరిమాణంలో వాటి పేలాలను కొంటే రూ.350కు పైగా ధర చెల్లించాలి. విలువ జోడించే కొద్దీ ఉత్పత్తికి ధర ఇంతగా పెరుగుతుంది. బంగాళాదుంపలను నేల నుంచి తీశాక శుభ్రపరచి వాటిని పరిమాణాల వారీగా విభజించి విక్రయిస్తే మంచి ధరలు వస్తాయి. టమోటా వంటి త్వరగా పాడయ్యే ఉత్పత్తుల నుంచి జామ్, రసం, జెల్లీలను ఉత్పత్తి చేస్తే- సరఫరా అధికంగా ఉన్న కాలంలో ధర లేక రైతులు వాటిని రోడ్లపై పారబోసే దుస్థితి దాపురించదు.
రైతులు ఇటువంటి చిన్న చిన్న శుద్ధి పనులనైనా తమ స్థాయిలో చేపడితే మంచి ఫలితాలు పొందవచ్చు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయంసమృద్ధిని సాధించినప్పటికీ పంట కోత అనంతర సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామస్థాయికి తీసుకువెళ్లడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. భారత ఆహారశుద్ధి ప్రపంచంలో అయిదో అతి పెద్ద పరిశ్రమ. 2018లో దీని విలువ రూ.25.69 లక్షల కోట్లు. 2024 నాటికి ఇది రూ.53.43 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. దేశీయ ఆహార విపణిలో ఆహారశుద్ధి విభాగం వాటా 32శాతం. మన ఎగుమతుల్లో శుద్ధి చేసిన ఉత్పత్తులది 10.7 శాతం వాటా.
భారత్ నుంచి 2019-20లో మొత్తం 3,200 కోట్ల డాలర్ల విలువైన ఆహార ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. వీటిలో ఆహారశుద్ధి ఎగుమతుల విలువ దాదాపు రూ.31 వేల కోట్లు. ఆహారశుద్ధి రంగం కుటీర పరిశ్రమల స్థాయికి చేరకపోవడం వల్ల దేశంలో ప్రగతి ఆశించిన వేగాన్ని అందుకోలేకపోతోంది. ప్రాథమిక దశలో విత్తనాలు, ఎరువులు, యంత్రాలు పనిముట్ల వంటివి అందుబాటులో లేక రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. రెండో దశలో.. పంటను తరలించే దళారులు, స్థానిక వ్యాపారులు, మార్కెట్లలో లోపభూయిష్ఠమైన పరిస్థితులు ఉండటం సాగుదారుల్ని నిస్తేజపరుస్తోంది. ఈ దశ దాటి ఉత్పత్తికి విలువను పెంచే కృషి చేసేవారి సంఖ్య అత్యల్పం.
మూడో దశలో... పంటను శుభ్రపరిచి, పరిమాణాల వారీగా విభజించడం, ఆకర్షణీయంగా ప్యాక్ చేయడం, విలువ జోడింపు ఉత్పత్తుల తయారీ (రసాలు, పౌడర్లు, గుజ్జులు, పచ్చళ్లు, జామ్‌లు వగైరా) వంటివి చేపట్టే చిన్న కంపెనీలు, వ్యక్తులు, అక్కడక్కడా రైతులు లాభపడుతున్నారు. ఈ దశలో మౌలిక వసతులు రైతు స్థాయికి పూర్తిగా చేరలేదు. ఇక నాలుగో దశలో... రవాణా, శీతల వాహన సదుపాయాలు, ప్యాకింగ్, నిల్వ, శీతల గోదాముల అందుబాటు వంటివి- మధ్యతరహా వాణిజ్య సంస్థలు, కార్పొరేట్ కంపెనీలే చురుగ్గా ఉన్నాయి. రైతులు, ఎగుమతిదారుల్ని పెద్ద సూపర్‌మార్కెట్లు, ఎగుమతి సంస్థలు, అంతర్జాతీయ వ్యవసాయ వాణిజ్య సంస్థలతో అనుసంధానించడం అయిదో దశ. వీటిలో మొదటి మూడు దశల్లో మాత్రమే రైతుల ప్రమేయం ఉంటోంది. ఆ తరవాత కార్పొరేట్ కంపెనీలదే ఆధిపత్యం. రైతు స్థాయిలో ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడి ఒక ఉత్పత్తికి బ్రాండింగ్ సృష్టించి నేరుగా ఎగుమతి చేయడం మన దేశంలో దాదాపు కనిపించదు. ఇజ్రాయెల్ వంటి దేశాల్లో రైతుల ఆధ్వర్యంలోని సంస్థలే నేరుగా విదేశాలకు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయగలుగుతున్నాయి.
రైతుస్థాయి యూనిట్లతో...
తాజాగా కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆరేళ్లలో ఆహారశుద్ధి పరిశ్రమలో ఉత్పత్తి ఆధారిత పథకాన్ని అమలు చేస్తోంది. దీనికింద రూ.10,900 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఆహారశుద్ధి ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెటింగ్ కల్పిస్తూ, బలమైన బ్రాండ్‌లుగా ఎదిగేందుకు ప్రోత్సాహకాలు అందించనున్నారు. గతంలోనూ ప్రోత్సాహకాలను అందించినా ఆశించని ఫలితాలివ్వలేదు. అలా జరగకూడదంటే గ్రామస్థాయిలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన ప్యాకింగ్, గ్రేడింగ్, శీతల నిల్వ, రవాణా వసతులను నెలకొల్పాలి. పంపిణీ వ్యవస్ధలను వ్యవస్థీకృతం చేసి, ఆహార తనిఖీ వ్యవస్ధలను బలోపేతం చేయాలి. రైతులకు మద్దతు ధరలు అందించాలి.
ఇప్పటికే నడుస్తున్న ఆహారశుద్ధి పరిశ్రమలకు దిగుమతి సుంకాలు భారమవుతున్నాయి. ముడిపదార్థాలు, ప్యాకింగ్ ధరలు అధికంగా ఉండటం, ప్రకటనల ఖర్చులు పెరగడం, శీతల నిల్వ, రవాణా వసతులు లేక అద్దెలు భారం కావడం తదితర సమస్యలు వెంటాడుతున్నాయి. కేంద్రం వీటికి ప్రోత్సాహకాలు అందించాలి. మొత్తంగా ఆహారశుద్ధి పరిశ్రమలను ఎంతగా క్షేత్రస్థాయికి తీసుకువెళ్లగలిగితే అంతగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రైతులూ పరిస్థితులకు తగ్గట్టు పంట మార్పిడి పాటించడంతో పాటు ఆధునిక సాగు పద్ధతులను అమలు చేయాలి. ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడి ఎగుమతి అవకాశమున్న పంటలను విస్తృతంగా సాగు చేయాలి. సాధ్యమైనంత వరకు పంటను రైతుస్థాయిలోనే శుభ్రపరచి, గ్రేడింగ్ చేసి తరలించగలిగితే అధిక ధరలు లభిస్తాయి!
విలువ జోడింపు ఏదీ?
భారత్ నుంచి ప్రధానంగా పండ్లు, కూరగాయలు, డెయిరీ, ఆహారధాన్యాలు, పౌల్ట్రీ, మాంసం ఎగుమతులకు అవకాశాలున్నాయి. ప్రపంచంలో రెండో అతి పెద్ద పండ్లు, కూరగాయల ఉత్పత్తిదారు భారత్ (ప్రపంచ ఉత్పత్తిలో 15 శాతం). కానీ, దేశంలో పండించేే మొత్తం పండ్లు, కూరగాయల్లో వాణిజ్యపరంగా 2.2 శాతాన్నే శుద్ధి చేస్తున్నాం. కోళ్ల పరిశ్రమలో ఇది ఆరు శాతం. అమెరికా (65శాతం), చైనా (28), ఫిలిప్పీన్స్(78) వంటి దేశాలతో పోలిస్తే మనం చాలా వెనకబడి ఉన్నాం. తగిన నిల్వ సదుపాయాలు లేక భారత్‌లో ఏటా అయిదు నుంచి 16శాతం పండ్లు, కూరగాయలు వృథా అవుతున్నాయి.
ఒక అంచనా ప్రకారం- దేశంలో వరిలో 34.7శాతం, గోధుమలో 18.4శాతం, మొక్కజొన్నలో 43శాతం శుద్ధి జరుగుతోంది. రెండు దశాబ్దాల నాడు దేశంలో మొత్తం వ్యవసాయోత్పత్తుల శుద్ధి 2.9 శాతŸమే. నేడది 7.60 శాతానికి చేరింది. 1950-51లో దేశంలో వెయ్యి వరకు పండ్లు, కూరగాయల శుద్ధి యూనిట్లు ఉండగా- ప్రస్తుతం 39,748 యూనిట్లు ఉన్నాయి. వీటి నుంచి 15.80 వేల కోట్ల డాలర్ల విలువైన ఉత్పత్తులు వస్తున్నాయి. 2020లో మరో 134 ఆహారశుద్ధి యూనిట్లను మంజూరు చేశారు. ప్రధాన మంత్రి కిసాన్‌సంపద యోజన కింద ప్రతిపాదిత 39 మెగాఫుడ్ పార్కుల్లో గత సంవత్సరం నవంబరు నాటికి 21 యూనిట్లు కార్యకలాపాలు ఆరంభించాయి.
రచయిత- అమిర్నేని హరికృష్ణ