సహకార రంగాన్ని సంస్కరణల పథంలో నడిపించే విషయంలో రాష్ట్రాలు ముందడుగు వేయలేదనే విమర్శలున్నాయి. ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) నుంచి సహాయ ప్యాకేజీ పొందాలంటే సహకార సంఘాల నిర్వహణలో సంస్కరణలు తీసుకురావాలని, సహకార చట్టాల్లో మార్పులు చేయాలని వైద్యనాథన్ కమిటీ చేసిన సిఫార్సును చాలా కొద్ది రాష్ట్రాలు మాత్రమే అమలు చేశాయి. దీంతో ప్రమాణాలను సడలించక తప్పలేదు. సంస్కరణలు చేపట్టని రాష్ట్రాలకు కూడా సహాయ ప్యాకేజీ అందించారు. దీనికి 2004 ఏప్రిల్‌ను గడువుగా విధించారు. సహకార సంఘాలు ఆ గడువుకల్లా బ్యాలన్స్ షీట్లను ఒక కొలిక్కి తీసుకురావాలనే షరతు విధించారు. అప్పటి నుంచి మూడు నెలల్లోగా సహాయ ప్యాకేజీని అందిస్తామని తెలిపారు. అయినా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు (పీఏసీఎస్) ఉద్యోగుల నియామక ప్రమాణాలు, అకౌంటింగ్ పద్ధతులు, కంప్యూటరీకరణకు సంబంధించిన సమస్యలను చాలా రాష్ట్రాలు పరిష్కరించలేదు. తమ లొసుగులు బయట పడతాయని వాటిని కప్పిపెట్టి ఉంచాయి. కొన్ని రాష్ట్రాల్లో సహకార చట్టాలను సవరించినా, అమలు చేయలేదు. అనేక రాష్ట్రాల్లో పీఏసీఎస్‌లకు ఎన్నికలు జరపలేదు. దాంతో ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహణకు తావులేకుండా పోయింది. పలు రాష్ట్రాల్లో పీఏసీఎస్‌లు తమ బ్యాలన్స్ షీట్లను కొలిక్కి తేలేదు.
రుణమాఫీ వరం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రుణ, వడ్డీ మాఫీ పథకాలను ప్రకటించడం ప్రాథమిక, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు వరంగా మారింది. దీంతోపాటు లైసెన్సింగ్ ప్రమాణాలను సడలించడం వల్ల అనేక డీసీసీబీలు బ్యాంకులుగా పనిచేయడానికి రిజర్వు బ్యాంకు అనుమతి పొందగలిగాయి. వ్యవసాయ రుణ వితరణకు ఆర్థిక క్రమశిక్షణ, సమానత్వం చాలా ముఖ్యం. గ్రామీణ సహకార పరపతి సంఘాలకు సరిగ్గా ఆ లక్షణాలే లోపించాయి. సహకార సంఘాలకు స్వయం నిర్ణయాధికారం కల్పించాలని వైద్యనాథన్ కమిటీ సూచించినా- ఆచరణలో స్వయంప్రతిపత్తి వక్రీకరణకు లోనైంది. సహకార సంఘాల సభ్యులకు సక్రమంగా రుణాలు మంజూరు చేసే బదులు పెత్తనం చలాయించడానికి స్వయం నిర్ణయాధికారాన్ని దుర్వినియోగం చేశారు. దీంతో వైద్యనాథన్ కమిటీ ఆశించిన ప్రయోజనం నెరవేరలేదు.
సమర్థంగా నిర్వహించే స్థాయికి..
వ్యవసాయ రుణ విధానాన్ని నియంత్రించాల్సిన నాబార్డ్ మాటను పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఖాతరు చేయడం లేదు. అందువల్ల నాబార్డ్ తన అజమాయిషీలోని గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధి సంస్థ వ్యవహారాలకే పరిమితమైంది. సహకార వ్యవస్థలో డిజిటలీకరణ సాధన గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే పీఏసీఎస్‌ల నుంచి డీసీసీబీల వరకు యావత్ సహకార పరపతి వ్యవస్థను సంపూర్ణంగా డిజిటలీకరించగలిగింది. రాష్ట్రంలో పాడి, మత్స్యకార సహకార సంఘాల బాధ్యతలను సమర్థంగా నిర్వహించే స్థాయికి రాష్ట్ర సహకార వ్యవస్థ ఎదిగింది. సహకార ప్రాతిపదికపై గిడ్డంగుల అనుసంధానం, ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ నిర్వహణ, గ్యాస్, పెట్రోలు బంకుల నిర్వహణలో తెలంగాణ ముందంజ వేస్తోంది. ధరణి పోర్టల్ ద్వారా భూ రికార్డుల ప్రక్షాళన దీనికి కలిసి వచ్చింది. ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దడంపై శ్రద్ధ పెడుతున్నారు. సహకార సంఘాలు సమర్థంగా నడిస్తే అందరికీ సమానంగా ఆర్థిక ఫలాలను అందించడం వీలవుతుంది. తెలంగాణ తరహాలో ఉత్తరాఖండ్ కూడా సహకార సంస్థల డిజిటలీకరణపై దృష్టి కేంద్రీకరించింది. ఆ రాష్ట్ర బడ్జెట్‌లో ఇందుకు రూ.1,800 కోట్లు కేటాయించారు. వడ్డీ సబ్సిడీలు, సంస్కరణలకు దన్ను, సహకార సంఘాల డిజిటలీకరణలకు కేంద్ర ప్రభుత్వం మార్గనిర్దేశనం చేస్తోంది. సహకార సంఘాల వ్యవస్థలో ఏవైనా సంస్కరణలు వచ్చాయంటే, ఆ ఘనత కేంద్ర ప్రభుత్వానికే దక్కుతుంది. కేంద్రం సూచనలను రాష్ట్రాలు సంపూర్ణంగా పాటించకపోవడం వల్లనే చిక్కులు తలెత్తుతున్నాయనే విమర్శలు లేకపోలేదు.
అమిత్ షాకే ఎందుకు అప్పగించారు?
సహకార సంఘాల రాజకీయాలు, అవి రికార్డు స్థాయిలో నమోదు చేసిన సభ్యత్వాలు, సృష్టించిన ఓటు బ్యాంకు- కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దృష్టిని బాగా ఆకర్షించాయని, సహకార శాఖను హోంమంత్రి అమిత్ షాకు అప్పగించడాన్ని ఈ కోణం నుంచే చూడాలనే వాదన గట్టిగా వినిపిస్తోంది. అమిత్ షా కేంద్ర హోంమంత్రి కావడం వల్ల సహకార సంఘాల్లో అవకతవకలకు పాల్పడిన రాజకీయ నాయకులపైకి సీబీఐని, ఇంటెలిజెన్స్ బ్యూరోను ప్రయోగిస్తారేమోననే ఆందోళన ప్రత్యర్థి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇలాంటి నాయకులపై ఒత్తిడి తెచ్చి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలోకి ఫిరాయించేలా చేస్తారని భావిస్తున్నారు. సహకార శాఖను అమిత్ షాకు అప్పగించడానికి వెనక బలమైన కారణం ఇదేనా? లేకపోతే, ఈ రంగంలో విస్తృత సంస్కరణలు తీసుకురావాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమా అన్నది మున్ముందు తేలుతుంది. ఏదేమైనా సహకారోద్యమాన్ని కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్రాలపై ఉందనడంలో సందేహం లేదు.
- డాక్టర్ బి.ఎర్రంరాజు
(రచయిత- ఆర్థిక రంగ నిపుణులు)
ఇదీ చూడండి: ప్రాణాలను తోడేస్తున్న ఆకలి భూతం
ఇదీ చూడండి: సహకార సంఘాలపై పట్టు కోసమే కొత్త శాఖ!