పకడ్బందీ దర్యాప్తుతో అవినీతి కుంభకోణాసురుల కూసాలు కదిలించాల్సిన బృహత్ బాధ్యతాయుత వ్యవస్థ- కేదస (సీబీఐ). భ్రష్ట ధోరణుల్ని తుదముట్టించే తెగువతో శోభించాల్సిన ఆ 'ప్రతిష్ఠాత్మక' యంత్రాంగమే అవినీతి మడుగులో ఈదులాడుతోంది. ఇదెవరో గిట్టనివాళ్లు చేసిన దుర్మార్గ ఆరోపణ కాదు. సాక్షాత్తు కేంద్ర దర్యాప్తు సంస్థే స్వయంగా ధ్రువీకరించిన చేదు నిజం! బ్యాంకుల్ని నిలువునా ముంచేసిన కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొన్ని సంస్థలకు తమ అధికార సిబ్బందే అనుకూలంగా వ్యవహరించారని, కుంభకోణాల్లో ఇరుక్కున్న కార్పొరేట్ కంపెనీల నుంచి వాళ్లకు ముడుపులందాయని ఎనిమిది పేజీల ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్)లో కేదస స్పష్టీకరించింది. ఇద్దరు డీఎస్పీలు సహా నలుగురు సీబీఐ సిబ్బందిపైనా, వకీళ్లతోపాటు కొంతమంది ప్రైవేటు వ్యక్తుల మీదా అభియోగపత్రాలు (ఛార్జ్‌షీట్లు) నమోదయ్యాయి.
సంక్రాంతినాడు దిల్లీ, ఘజియాబాద్, నొయిడా, మీరట్, కాన్పూర్ సహా 14 ప్రాంతాల్లో కార్యాలయాల్లో కేదస విస్తృత తనిఖీలు చేపట్టింది. సీబీఐ ఇన్‌స్పెక్టర్ కపిల్ ధన్‌కడ్‌కు అతగాడి పై అధికారులనుంచి దఫదఫాలుగా పదేసి లక్షల రూపాయలు ముట్టిన దరిమిలా కీలక సమాచారం చేతులు మారిందని, ఇరువురు డీఎస్పీలకు ఇద్దరు వకీళ్లనుంచి పదిహేను లక్షల రూపాయల వంతున అందాయని, 'ఒప్పందం' కుదిర్చిన వ్యక్తులకూ సొమ్ము దక్కిందన్న విశ్లేషణాత్మక కథనాలు- వ్యవస్థాగతమైన అవినీతిమయ సంస్కృతిని కళ్లకు కడుతున్నాయి. చేతులు మారిన లక్షల రూపాయల ముడుపులు జాతి ప్రతిష్ఠకే తూట్లు పొడిచిన తీరు, మరిన్ని కేసుల విచారణ క్రమాన్ని సైతం ప్రభావితం చేసేలా తెరచాటు బాగోతాలు- నిశ్చేష్టపరుస్తున్నాయి!
సుమారు యాభై ఏడేళ్లక్రితం ఆల్‌ఫూల్స్ డే (ఏప్రిల్ ఒకటి)నాడు కేదసగా అవతరించిన దర్యాప్తు సంస్థ అనంతరం ఇందిర జమానాలో కేంద్రప్రభుత్వ పెంపుడు జాగిలంగా భ్రష్టుపట్టింది. ఆపై కేంద్ర సర్కారు పంజరంలో చిలుకలా కేదస దిగజారిందని కోర్టులెన్నోసార్లు మొట్టికాయలు వేశాయి. రాజకీయ జోక్యానికి తావేలేని పటిష్ఠ దర్యాప్తు సంస్థగా కేదస వ్యవహారశైలి ప్రశంసలందుకోవాలని సర్వోన్నత న్యాయస్థానమే నిర్దేశించినా- మెరుగుదల ఎప్పటికప్పుడు ఎండమావినే తలపిస్తోంది. రాజకీయ ఒత్తిళ్లు, ఇతరత్రా కారణాలతో ఎన్నో కేసులు నీరుకారిన ఉదంతాలు పోగుపడ్డాయి. వాటి వెనక నేతాగణం ప్రమేయంతోపాటు మరేమి తెరచాటు బేరసారాలు చోటుచేసుకున్నాయోనన్న అనుమానాలిప్పుడు అసంఖ్యాకంగా పుట్టుకొస్తున్నాయి.
నిజాయతీ, పరిశ్రమ, నిష్పక్షపాతం- ఈ మూడూ తనకు దారిదీపాలని కేదస ఘనంగా చాటుకుంటుంది.
రాజకీయ బాసుల అడుగులకు మడుగులొత్తడానికి పేరొందిన కేదస తనకు వెన్నెముక అన్నదే లేదని అనేక పర్యాయాలు నిర్లజ్జగా నిరూపించుకుంది. పలువిధాల పరువుమాసిన ఆ సంస్థను సుమారు రెండు సంవత్సరాలక్రితం ఆలోక్‌వర్మ, రాకేశ్ అస్థానాల మధ్య రేగిన రచ్చ నిలువెల్లా పట్టి కుదిపేసింది. అప్పట్లో మొయిన్ ఖురేషీ అనే మాంసపు వ్యాపారిపై వివిధ అభియోగాల కూపీ లాగుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి అస్థానా సారథ్యం వహించేవారు. ఇంకొన్ని నెలల్లో పదవీ విరమణ చేయబోతున్న ఆలోక్‌వర్మ సారథ్యంలో నాడు కేదస ఒక ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. దాని సారాంశం- ఘరానా అవినీతి కేసులో ప్రధాన నిందితుడు మరెవరోకాదు.. ప్రత్యేక సంచాలకుడి హోదాలో చక్రం తిప్పుతున్న అస్థానా! కేదస ఉచ్చునుంచి వెలికిరావడానికి తాను మూడుకోట్ల రూపాయలు చెల్లించినా, మరింత ముట్టజెప్పాలంటూ సీబీఐ అధికారులు వేధిస్తున్నారని సతీశ్ అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం- నాడు పెనుసంచలనం సృష్టించింది. ఆ కేసులో రాకేశ్ అస్థానా అన్నెం పున్నెం ఎరుగడంటూ నిరుడు మార్చ్ నెలలో కేదస కితాబివ్వగా, సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సమ్మతించడం వల్ల అధికారికంగా గొడవ సద్దుమణిగింది. లంచాలు మేపినట్లు అభియోగాలున్నాయి. అదనపు మేత కోసం డిమాండ్లపై ఆరోపణలూ ఉన్నాయి. అయినా ఎవరి దోషిత్వం నిరూపణ కాలేదు.
ఇప్పుడు ముంబయి, యూపీ ప్రధాన స్థావరాలుగా పెచ్చరిల్లిన వేలకోట్ల రూపాయల బ్యాంకు కుంభకోణాల్లో పలువురు అధికారులకు అవినీతి మకిలంటిందంటున్నా- కడకు ఏమవుతుందో ఎవరికెరుక? నేరం నిజం, కేసు మిథ్యగా రుజువు చేయడం కేదసకు వెన్నతో పెట్టిన విద్య. ఇంటిదొంగల విషయంలో అందుకు భిన్నంగా మెలగుతుందా అన్నదే చిక్కుప్రశ్న!
భూపీందర్ సింగ్ హూడా ప్రభుత్వం గురుగ్రామ్‌లో చేపట్టదలచిన 14 వందల ఎకరాల భూసేకరణకు సంబంధించి తలెత్తిన వివాదంలో కేదస మందకొడిగా ఉపేక్షాభావంతో వ్యవహరిస్తున్నదని సర్వోన్నత న్యాయస్థానం 2019 డిసెంబరులో తూర్పారపట్టింది. 2009నాటి కేసు ఏళ్లతరబడి కొనసాగుతుండటం ఏమిటని సూటిగా ఆక్షేపించింది. అంతగా 'పనితనం' చాటుకుంటున్న కేదస సొంతింటిని సర్దుకోవడంలో ఏపాటి చురుగ్గా వ్యవహరిస్తుందో చూడాలి. మూడేళ్ల వ్యవధిలో 36 మంది సీబీఐ అధికారులపై అవినీతి కేసులు నమోదయ్యాయని ఆమధ్య కేంద్రమే లెక్కచెప్పింది. ఆ జాబితా నిడివి ఆగకుండా విస్తరిస్తోంది. ఒకటిన్నర దశబ్దాల విరామానంతరం కేదస ఇటీవలే తన నేర నిబంధన పత్రం (క్రైమ్ మాన్యువల్)లో మార్పులు చేసింది. ఇకమీదట అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) కింద దర్యాప్తులన్నింటినీ గరిష్ఠంగా తొమ్మిది నెలల్లో ముగించేయాలని కొత్తగా సంకల్పించింది. అదే గడువులో ఇంటిదొంగల భరతం పడితేనే, ఆ మాటలకు మన్నన దక్కేది!
తనపైనే కేసులున్న వ్యక్తి, అవినీతి వ్యతిరేకపోరు సాగించాల్సిన అత్యున్నతాధికార వ్యవస్థ సారథ్య బాధ్యతలెలా చేపడతారంటూ పదేళ్లక్రితం సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర నిఘా సంఘం(సీవీసీ) అధిపతిగా పీజే థామస్ నియామకాన్ని కొట్టేసింది. అవినీతి బాగోతాలు, ఆర్థిక సైబర్ ప్రత్యేక నేరాల గుట్టుమట్లు వెలికి తీసి దోషుల్ని బోనులో నిలబెట్టాల్సిన కేదసలో లంచాలకు కక్కుర్తి పడేవాళ్లనూ శంకరగిరి మాన్యాలు పట్టించాలి. ఎఫ్‌బీఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్), సీఐఏ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ)లను అమెరికా ప్రత్యేక చట్ట నిబంధనావళికి అనుగుణంగా నియంత్రిస్తోంది. రష్యా, జర్మనీ, జపాన్ ప్రభృత దేశాల్లోనూ నిర్దిష్ట శాసనాలకు లోబడి నిఘా దర్యాప్తు సంస్థలు పని చేస్తున్నాయి. అక్కడికి భిన్నంగా ఇక్కడ ఒకవైపు రాజకీయ జోక్యం, మరోవైపు అవినీతి నంజుకు తింటుంటే దర్యాప్తు యంత్రాంగం జనంలో పలుచనవుతోంది. అవినీతి పంకిలాన్ని ప్రక్షాళించడానికి ఏర్పరచిన సంస్థలూ అందులోనే ఈదులాడటంకన్నా దౌర్భాగ్యం ఉంటుందా? మరెవరూ గడ్డి తినకుండా, గాడి తప్పినవాళ్లకు శీఘ్ర విచారణతో కఠిన దండన విధించి అమలు పరిస్తేనే- కేదస పరువు కాస్తో కూస్తో నిలబడుతుంది. ఏమంటారు?
- బాలు