కరోనాపై పోరులో టీకాలే కీలకమైనవి. ప్రజలకు ఎంత త్వరగా వాటిని చేరువ చేస్తే అంత తొందరగా ఈ మహమ్మారి బారి నుంచి రక్షణ లభిస్తుంది. అందుకే కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి (ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజెషన్-ఈయూఏ) జనవరి మూడో తేదీన డీజీసీఐ అనుమతులిచ్చింది. దీన్ని తప్పుపడుతూ పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వార్తలు, వ్యాసాలు వచ్చాయి. అలాంటి ఓ వ్యాసంలో 'కొవాగ్జిన్ టీకాకు అత్యవసరంగా అనుమతులు ఇవ్వడం ద్వారా ఏదో సాధించామని గొప్పగా చెబుతున్నారు. ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్ నినాదం కోసం టీకా జాతీయవాదాన్ని ఎగదోస్తున్నారు. అనుమతుల విషయంలో కనీస అంశాలను, నిర్ధరిత శాస్త్రీయ విధి విధానాలను విస్మరించారు' అన్న విపక్షానికి చెందిన ఓ మాజీ కేంద్ర మంత్రి వ్యాఖ్యలను ఉటంకించారు. టీకాలకు ఈయూఏ ఇవ్వడం నిజానికి గొప్ప నిర్ణయం. వివిధ రంగాలకు చెందిన అత్యున్నత నిపుణుల సంఘం సూచనల మేరకే డీజీసీఏ ఈ అనుమతులిచ్చింది. టీకా వేసుకున్న వారిలో మళ్లీ కరోనా వచ్చే అవకాశం చాలా తక్కువ (0.05శాతం) అన్న విషయాన్ని ఐసీఎంఆర్ సైతం వెల్లడించింది. ఇలాంటి సమాచారం ఆధారంగా టీకాలకు అత్యవసర అనుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నూటికి నూరుపాళ్లు సరైనదే.
పసలేని విమర్శలు!
దేశీయంగా టీకాల ఉత్పత్తికి చాలా ఆలస్యంగా ఆదేశాలిచ్చారన్న విమర్శలు పసలేనివి! భారతదేశ టీకా వ్యూహం పకడ్బందీగా సిద్ధమైంది. నిరుడు ఏప్రిల్‌లో టీకా తయారీ పరిశోధనలు, నియంత్రణపరమైన ఇతర అంశాలపై ప్రధానమంత్రి పర్యవేక్షణలో ఓ టాస్క్‌పోర్స్ నియమితమైంది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఆగస్టు 2020లో టీకాలపై జాతీయ నిపుణుల బృందాన్ని ప్రధాని ఏర్పాటుచేశారు. టీకాలను అందరికీ అందించే లక్ష్యంలో భాగంగా వ్యాక్సిన్ల సేకరణ, లబ్ధిదారుల జాబితా నిర్వహణ, టీకా ఎంపిక, రవాణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వ్యవస్థ తదితరాలపై ఈ బృందం సూచనలు అందించింది.
ఏడు సంస్థలకు..
సెప్టెంబర్‌లో సీరమ్, భారత్ బయోటెక్, బయలాజిక్ ఈ, క్యాడిలా హెల్త్ కేర్ సహా ఏడు వ్యాక్సిన్ తయారీ సంస్థలకు ప్రీ-క్లినికల్ పరీక్షలు, ఇతరాలను నిర్వహించేందుకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ) లైసెన్సులు జారీచేసింది. ఆ క్రమంలోనే అందివచ్చిన టీకాల అత్యవసర వినియోగానికి ఈ ఏడాది మొదట్లో అనుమతులు మంజూరయ్యాయి. మరోవైపు, సెప్టెంబర్ 2021 నాటికి 110 కోట్లకు పైగా టీకాలను పంపిణీ చేసేందుకు తగిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. వీటిలో భారత్ బయోటెక్, సీరమ్ సంస్థల టీకాలతో పాటు రష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్ సైతం ఉంది. ఒకవేళ టీకా జాతీయవాదాన్నే కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలనుకుంటే ప్రారంభంలో వివిధ సంస్థలతో జరిపిన చర్చల్లో స్పుత్నిక్‌కు అవకాశం ఉండేది కాదు కదా!
చిత్తశుద్ధితో నెరవేర్చుతోంది..
టీకాలకు ఈయూఏ ఇవ్వడానికి ముందే ఆయా సంస్థలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుని చెల్లింపులు జరిపి ఉండాల్సిందనే వాదనను కొందరు లేవనెత్తారు. అత్యవసర పరిస్థితుల్లో టీకా సేకరణ వివరాలను పరిగణనలోకి తీసుకోకుండానే వారు ఈ విమర్శలు చేశారు. ఒకవేళ ప్రభుత్వం టీకా తయారీదారులకు ముందస్తు చెల్లింపులు చేసి ఉంటే వీరే ఇంతకన్నా ఎక్కువ విమర్శలు చేసుండేవారు! ఒకవేళ క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాలేదనే కారణంతో ఈయూఏ ఇచ్చి ఉండకపోతే ఆపత్కాలంలో కేంద్రం అనైతికంగా వ్యవహరిస్తోందనేే విమర్శలు వెల్లువెత్తేవి! ఎవరి వాదనలు, విమర్శలు ఎలా ఉన్నా... ప్రజలందరికీ టీకాలందించే విషయంలో కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను చిత్తశుద్ధితో నెరవేర్చుతూ వస్తోంది. దేశీయంగా సిద్ధం చేసుకున్న టీకాలతో పాటు ఇతర వ్యాక్సిన్లను సైతం మరింతగా అందుబాటు తీసుకువచ్చేందుకు కృషి చేస్తోంది.
అన్ని జాగ్రత్తలతో ఉత్పత్తి
ఆత్మనిర్భర్ భారత్ 'మిషన్ కొవిడ్ సురక్ష' కింద దేశీయంగా వాక్సిన్ ఉత్పత్తిని పెంచడానికి ప్రదాని మోదీ తగిన చర్యలు తీసుకున్నారు. భారత్ బయోటెక్ బెంగళూరు యూనిట్‌కు, ప్రభుత్వ రంగ సంస్థ అయిన ముంబయిలోని హాఫ్‌కిన్, హైదరాబాద్‌లోని ఇండియన్ ఇమ్యునలాజికల్స్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్ షహర్‌లో ఉన్న భారత్ ఇమ్యునలాజికల్స్ సంస్థలు టీకా ఉత్పత్తి ఏర్పాట్లు చేసుకోవడానికి ఏప్రిల్‌లోనే నిధులు మంజూరు చేశారు. పూర్తి స్థాయి దేశీయ పరిశోధనతో సాధించిన కొవాగ్జిన్‌ను ఇప్పటికే నిర్ణయించిన అయిదు సంస్థలతో పాటు మరికొన్నింటిలోనూ ఉత్పత్తి చేయడానికి సాధ్యాసాధ్యాల పరిశీలన జరుగుతోంది. కొవాగ్జిన్‌ను ఉత్పత్తి చేయాలంటే సజీవ వైరస్‌ను జాగ్రత్తగా నిర్వీర్యం చేయాలి. అత్యాధునిక బీఎస్‌ఎల్-3 ప్రయోగశాలల్లో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అప్పుడే సజీవ వైరస్ బయటికి రాకుండా శాస్త్రవేత్తలకు, సిబ్బందికి సోకకుండా ఉంటుంది. కాబట్టి ఈ సదుపాయాలు ఉన్న సంస్థల్లో మాత్రమే ఆ టీకా ఉత్పత్తి కాగలదు. దీనికోసం ఆయా సంస్థల్లోని పరిస్థితులను మదింపు చేసి శాస్తవేత్తలు, అధికారులు నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ప్రస్తుతం టీకా కార్యక్రమాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లే బృహత్తర యత్నంలో కేంద్ర ప్రభుత్వం తలమునకలైంది. ఇప్పటికే 19 కోట్ల మందికి టీకాలు అందించింది. మే-జులై మధ్యలో 35 కోట్ల టీకా డోసులు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో 17.5 కోట్ల డోసులను కేంద్రమే సేకరించి దేశ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయనుంది. మిగిలిన సగం డోసులు రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా నేరుగా అందుబాటులోకి వస్తాయి. మిగిలిన 200 కోట్లకు పైగా డోసులు ఈ ఏడాది ఆగస్టు-డిసెంబర్ మధ్యలో ప్రజలకు అందుతాయి. తద్వారా ప్రతి భారతీయుడికీ టీకా వేసేందుకు మార్గం సుగమం అవుతుంది. టీకా కార్యక్రమం వేగం పుంజుకుంటున్న కొద్దీ వ్యాక్సిన్ల సరఫరా సైతం పెరుగుతుంది. టీకాల చుట్టూ నెలకొన్న అపోహలను తొలగిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపైనే ఇప్పుడు మనమంతా దృష్టిసారించాలి!
ప్రధాని ప్రత్యేకత
పుణె, హైదరాబాద్, అహ్మదాబాద్ నగరాల్లో టీకా పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలను ప్రోత్సహించడానికి 2020 నవంబర్ చివర్లో ప్రధానమంత్రి స్వయంగా వెళ్లారు. టీకా తయారీలో వారు సాధిస్తున్న ప్రగతిని ప్రత్యక్షంగా పరిశీలించారు. టీకా పరిశోధన సంస్థలను ఇలా సందర్శించిన దేశాధినేతలు ప్రపంచంలో మరెవరూ లేరు. దేశీయంగా రూపొందించిన టీకాకు అత్యవసర అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కొన్ని శక్తులు ప్రణాళికాబద్ధంగా దుష్ప్రచారం చేస్తున్నాయి. ఫలితంగా అందరికీ టీకాలు వేయించే విషయంలో మన వేగం కాస్త మందగించింది. ఓ పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అయితే వీటిని 'భాజపా టీకాలు, మోదీ టీకా' అని సంబోధించారు. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఏకంగా తమ పౌరులు టీకాలు వేయించుకోకుండా అడ్డుకున్నాయి. ఈ విమర్శలు, కుట్రలను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం భారతీయ పౌరులందరికీ ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లనూ యుద్ధప్రాతిపదికన చేస్తోంది. ఇది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం మాత్రమే కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు తానుగా స్వీకరించిన పవిత్ర బాధ్యత!
-జి.కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
ఇదీ చూడండి: ఆకలి కోరల్లో అభాగ్యులు