ఖరీఫ్ పంట సాగుపై ఆశ నిరాశల ఊగిసలాటలో కిందుమీదులవుతున్న అన్నదాతమీద అనూహ్యంగా ఎరువుల పిడుగు పడింది. సాధారణంగా రైతులు అధికంగా వినియోగించే డీఏపీ (డై అమ్మోనియం ఫాస్ఫేట్) యాభైకిలోల బస్తా రేటు ఒక్కసారిగా రూ.700 పెంపుదలతో రూ.1900కు చేరనుంది. కాంప్లెక్స్ ఎరువుల ధరలకూ రెక్కలు మొలుస్తున్నాయి. ఇప్పట్లో ఎరువుల ధరలు పెంచే వీల్లేదన్న కేంద్రం రోజు గడవకముందే నాలుక మడతేసి- అందుబాటులో ఉన్న పాత స్టాక్ ఎరువులకే పాత ధరలు వర్తిస్తాయంటూ చేతులు దులిపేసుకుంది.
రికార్డుల ప్రకారం, పాత నిల్వల రాశి 11.3 లక్షల టన్నులే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ఖరీఫ్, రబీలలో కలిపి 31 లక్షల టన్నులకుపైగా అవసరమంటే- దేశవ్యాప్తంగా పాత ధరల రూపేణా సాంత్వన.. పరిమితమే! విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి పదార్థాల ధరవరలు ఇటీవల భారీగా పెరిగిన కారణంగా సవరణ అనివార్యమైందని 'ఇఫ్కో' చెబుతున్నా- ఒక్కుమ్మడిగా ఇలా రేట్ల పెంపు.. సాగుదారులపై పెనుభారం కాక మానదు.
నిబంధనల మేరకు సంచులపై ముద్రిస్తామే తప్ప ఆ రేట్లను రైతులనుంచి వసూలు చేయబోమంటున్నా- భయాందోళనలు ఉపశమించడంలేదు. పెంపుదల భారం రైతన్నమీద పడరాదంటే తనవంతు సబ్సిడీ వాటాను కేంద్రం పెంచాలన్న సూచనలు వస్తున్నాయి. వాటి ఊసెత్తని ప్రభుత్వం- ఎరువుల కంపెనీలు అంతర్జాతీయ విపణినుంచి ఖరీదైన ముడిపదార్థాలు కొనుగోలు చేసేకన్నా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, జీవ ఎరువుల్లాంటి ప్రత్యామ్నాయాల వైపు మళ్ళాలన్న సలహాతో సరిపుచ్చింది. ఏతావతా, ఈ పెంపుదల మూలాన ఆహారపంటలు పండించే రైతులపై సగటున ఎకరానికి రూ.4000 నుంచి రూ.5000 మేర అదనపు భారం పడనుందంటున్నారు. వాణిజ్య పంటలు సాగుచేసేవారికి మరిన్ని వాతలు తేలక తప్పదు. కూరగాయలు, పత్తి సాగుకు ఎరువుల అవసరం అధికం కాబట్టి- ఆ మేరకు మున్ముందు వినియోగదారుల వీపులపైనా ధరల దరువు అనివార్యం. ఒక్కో ఎరువుల బస్తా రేటు ఉన్నట్టుండి ఇంతగా పెరిగిపోయినా- కనీస మద్దతు ధరలో ఏటా కంటితుడుపు పెంపుదలకే పరిమితమై ఏనాడూ సరైన గిట్టుబాటుకు నోచని రైతన్న గోడు పట్టించుకునేదెవరు?
గ్యారంటీ ఏది?
కొన్నాళ్లుగా భగ్గుమంటున్న చమురు ధరల వల్ల సేద్యరంగాన పెట్టుబడి వ్యయం కనీసం 28శాతం మేర విస్తరించనుందన్న అంచనాలు ఆరేడు వారాలక్రితమే వెలుగుచూశాయి. డీజిల్ రేటు జోరెత్తేకొద్దీ సాగు ఖర్చు పెరిగేదే తప్ప తరిగేది కాదు. కొత్తగా ఎరువుల ధరాఘాతాలు జతపడటం రైతుల గుండెల్ని మండించే పరిణామం. యూరియాపై నిర్ణయం కేంద్రప్రభుత్వ పరిధిలోనిది. ప్రస్తుతానికి ఆ రేటు పెంచకపోయినా, అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక ఖరీఫ్ మొదలయ్యే సమయానికి- పెంపుదల తథ్యమన్న విశ్లేషణలు రైతాంగానికి దడ పుట్టిస్తున్నాయి. తనవంతుగా 'ఇఫ్కో'- డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల పాత నిల్వలపై పాత ధరలే అమలవుతాయంటున్నా.. రైతుల పుట్టి ముంచడంలో ఆరితేరిన డీలర్లు, దుకాణదారులు అడ్డగోలు లాభాలు దండుకోరన్న గ్యారంటీ ఏముంది? ఎక్కడ ఏ పంట రకానికి ఏమేమి ఎరువులెంత అవసరమన్న శాస్త్రీయ మార్గదర్శకత్వం కొరవడి అమాయక సాగుదారులు 'డబ్బూ పోయె.. శనీ పట్టే' చందంగా నష్టపోతున్నారు. పొటాషియానికి నాలుగింతల మోతాదులో నత్రజని వాడాల్సి ఉన్నా- పంజాబ్లో 24 రెట్లు, హరియాణాలో 32 రెట్ల వినియోగం నమోదైంది.
తెలుగు రాష్ట్రాల్లో సైతం వేయాల్సినదానికన్నా రెండింతలకుపైగా యూరియా గుమ్మరిస్తున్నట్లు గణాంకాలు చాటుతున్నాయి. పర్యవసానంగా భూమి ఆరోగ్యం దెబ్బతిని, దిగుబడులు కుంగుతున్నాయి. పెట్టుబడి వ్యయమూ తడిసి మోపెడవుతోంది. యథేచ్ఛగా రసాయన ఎరువుల వాడకం- నాసి దిగుబడులకు, కోట్ల రూపాయల మేర ఆర్థిక నష్టాలకు కారణమన్న అధ్యయనాలను ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆకళించుకోవాలి. వ్యవసాయాధికారులే నేరుగా రైతుల క్షేత్రాల్లో సాగు చేయించాలన్న తెలంగాణ ప్రతిపాదనకు జాతీయ స్థాయిలో మన్నన దక్కితే- ఎరువుల ధరాభారం తగ్గుతుంది, నాణ్యమైన దిగుబడులూ దక్కుతాయి!
ఇదీ చదవండి: రౌడీషీటర్ దారుణ హత్య- సీసీటీవీలో దృశ్యాలు