ETV Bharat / opinion

Vaccination: అందరికీ టీకా అందేదెలా?

author img

By

Published : Jun 18, 2021, 7:50 AM IST

దేశంలో ఇప్పటివరకు పంపిణీ చేసిన మొత్తం టీకా డోసులు 27 కోట్లకు చేరువైనట్లు కేంద్రం లెక్కలు చెబుతోంది. అయితే.. ఏప్రిల్‌ నెలలో సగటున రోజుకు 30.24 లక్షల టీకా డోసులు పంపిణీ చేయగా.. మే నెలలో అది 16.22 లక్షలకు పడిపోయింది. ఇకమీదట రోజుకు కోటి చొప్పున ఈ ఏడాది ద్వితీయార్ధంలో 180 కోట్ల డోసులు వేయాలన్న ప్రణాళికను సవ్యంగా ఎలా పట్టాలకు ఎక్కించదలచారో అంతుచిక్కడం లేదు. ఈ జూన్‌ నెలలోనే 12 కోట్ల మోతాదులు అందుబాటులోకి వస్తాయన్న అధికారిక వివరణ పైనా ఎన్నో అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి.

vaccination in india, covid vaccine
కరోనా టీకా, వ్యాక్సినేషన్​

ప్రాణాంతక కరోనా వైరస్‌కు విరుగుడుగా ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ మహాయజ్ఞం దేశంలో మొదలై 150 రోజులు పూర్తయ్యాక, మనం ఎక్కడున్నాం? ఈ అయిదు నెలల్లో వేసిన మొత్తం డోసులు 27 కోట్లకు చేరువైనట్లు కేంద్రం లెక్క చెబుతోంది. అందులో రెండు మోతాదులూ పొందినవారు అయిదు కోట్ల లోపు. అంటే, పూర్తిస్థాయి వ్యాక్సిన్‌ రక్షణ లభించినవారు 138 కోట్ల దేశజనాభాలో ఇంచుమించు మూడున్నర శాతం! యాభైవేలు, అంతకు మించి కొవిడ్‌ కేసులు నమోదైన 111 దేశాల్లో 63 ఇండియా కన్నా మెరుగ్గా అధిక శాతం జనాభాకు వ్యాక్సినేషన్‌ చేపట్టాయి.

పట్టాలెక్కేదెలానో..

ప్రతి వందమంది పౌరుల్లో సంపూర్ణంగా టీకా రక్షణ లభించిన వారెందరన్న ప్రాతిపదికన ఇజ్రాయెల్‌, యూకే, అమెరికా, జర్మనీ వంటివి మనకన్నా ఎంతో ముందున్నాయి. దేశీయంగా ఇదే వేగం కొనసాగితే వయోజనులకు కొవిడ్‌ టీకాల కార్యక్రమం ఒక కొలిక్కి రావడానికి కనీసం 18 నెలలు పడుతుందన్న అంచనాల వెలుగులో- ఈ ఏడాది డిసెంబరు నాటికి అంతా చక్కబెట్టేస్తామని ప్రభుత్వం ధీమాగా ప్రకటించింది. ఏప్రిల్‌ నెలలో సగటున రోజుకు నమోదైన డోసులు 30.24 లక్షలు. మే నెలలో అది 16.22 లక్షలకు పడిపోయింది. ఇకమీదట రోజుకు కోటి చొప్పున ఈ ఏడాది ద్వితీయార్ధంలో 180 కోట్ల డోసులు వేయాలన్న ప్రణాళికను సవ్యంగా ఎలా పట్టాలకు ఎక్కించదలచారో అంతుచిక్కడం లేదు. ఈ జూన్‌ నెలలోనే 12 కోట్ల మోతాదులు అందుబాటులోకి వస్తాయన్న అధికారిక వివరణ పైనా ఎన్నో శంకలు ఉత్పన్నమవుతున్నాయి. టీకా రెండు మోతాదుల మధ్య వ్యవధిని కొన్ని దేశాలు ఎనిమిది వారాలకు తగ్గించగా, వ్యాక్సిన్‌ కొరత మూలాన దాన్ని దేశీయంగా 12-16 వారాలకు పెంచడం తెలిసిందే. అటువంటిది, ఈ సంవత్సరాంతానికల్లా అందరికీ టీకాలు ఎలా సాధ్యమన్నది ప్రస్తుతానికి అత్యంత గడ్డు ప్రశ్నే!

చిటికెల పందిళ్లు!

కొవిడ్‌ నియంత్రణకు పకడ్బందీ ప్రణాళిక అసలెక్కడుందన్న తీవ్ర విమర్శలకు సమాధానంగానా అన్నట్లు నెల్లాళ్ల క్రితం నీతి ఆయోగ్‌ చిట్టాపద్దులు వల్లెవేసింది. ఆగస్ట్‌, డిసెంబర్‌ నెలల మధ్య, ఎకాయెకి 216 కోట్ల డోసులు అందుబాటులోకి రానున్నాయంటూ జాబితా క్రోడీకరించింది. అది చెప్పిన ప్రకారం ఆ కాలావధిలో కొవిషీల్డ్‌(75 కోట్లు), కొవాగ్జిన్‌(55 కోట్లు), బయోలాజికల్‌ ఇ(30 కోట్లు)లతో పాటు కొవావాక్స్‌, ముక్కులో వేసే వ్యాక్సిన్‌, స్పుత్నిక్‌ తదితర రకాలూ పెద్దయెత్తున సమకూరాలి. అది ఎంతవరకు సాధ్యమో స్పష్టత లేకుండానే- నీతి ఆయోగ్‌ చిటికెల పందిళ్లు వేయడం విస్మయపరుస్తోంది. తనవంతుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖా వచ్చే డిసెంబరు నాటికి 108 కోట్ల జనాభాకు 216 కోట్ల డోసులు వేయడం తథ్యమంటున్నా- మౌలిక సందేహాలకు సమాధానాలు దొరకడం లేదు.

పిల్లలకు ఎప్పటికో..

టీకా రెండు మోతాదులు పొందినవారిలో వైరస్‌ ప్రభావ తీవ్రత, ప్రాణహాని తగ్గుతాయని, కొవిడ్‌ మూడో దఫా విజృంభణలో గరిష్ఠ ముప్పు పిల్లలకేనన్న విశ్లేషణలు కొన్నాళ్లుగా వెలుగు చూస్తున్నాయి. అమెరికా, జర్మనీల్లో పన్నెండేళ్ల వయసుకు పైబడిన వారందరికీ టీకాలు అందుబాట్లో ఉండగా- ప్రయోగాలు, పరీక్షలు, అనుమతుల దశ దాటి ఇక్కడి పిల్లలకు వ్యాక్సిన్‌ రక్షణ ఎప్పటికి లభిస్తుందో చెప్పగలవారెవరు? కనిష్ఠ వ్యవధిలో గరిష్ఠ జనాభాకు టీకాల పంపిణీ సాకారం కానంతవరకు పౌర సమాజాన్ని కొవిడ్‌ ముప్పు వెన్నాడుతూనే ఉంటుంది. జాతిజనులకు అవసరమైనన్ని టీకాల సమీకరణలో కేంద్రం, సమస్త వనరులూ సాధన సంపత్తి మోహరించి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని సఫలం చేయడంలో రాష్ట్రాలు నిబద్ధతతో నిమగ్నమైతేనే- కరోనా మహమ్మారిని నియంత్రించగలుగుతాం!

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.