ETV Bharat / opinion

అభివృద్ధి పేరిట విధ్వంసం- విలయం వలలో కేరళ - reason for kerala disasters

కేరళలో ప్రధానంగా మానవ తప్పిదాల కారణంగానే తుపానుల తీవ్రత బాగా పెరిగిపోతున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. నీట మునిగిన భూములను మళ్లీ ఉపయోగంలోకి తీసుకురావడం, ఓడరేవుల అభివృద్ధి, రొయ్యల సాగు, నదీమార్గాల మళ్లింపు, డ్రెడ్జింగ్‌, ఇసుక తవ్వకాలు... ఇలా అనేక రకాలుగా ప్రకృతి సహజత్వాన్ని తీవ్రంగా దెబ్బతీశారనే ఆరోపణలున్నాయి.

kerala disasters
విలయం వలలో కేరళ- అభివృద్ధి పేరిట విధ్వంసమే కారణం
author img

By

Published : Jun 1, 2021, 8:36 AM IST

అపార సహజ వనరులు కలిగిన కేరళ తరచూ ప్రకృతి విపత్తులతో సతమతమవు తోంది. 2007లో ఓఖి తుపాను రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. తాజాగా తౌతే తుపాను మరోసారి విలయం సృష్టించింది. లెక్కలేనన్ని ఇళ్లతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు మునిగిపోయాయి. కొవిడ్‌ చికిత్స కోసం ఆసుపత్రుల్లో నిల్వ చేసిన మందులను కాపాడుకోవడమే తలకు మించిన భారమైంది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్న మత్స్యకారుల్లో అత్యధికులు ఒకవైపు తుపాను, మరోవైపు కరోనాను తట్టుకోలేక విలవిల్లాడారు. తుపాను కారణంగా మరణించింది ఇద్దరే అయినా, తీరప్రాంతంలో అది సృష్టించిన విలయం ఎక్కువే.

తప్పిదాల వల్లే..

కేరళలో ప్రధానంగా మానవ తప్పిదాల కారణంగానే తుపానుల తీవ్రత బాగా పెరిగిపోతున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. నీట మునిగిన భూములను మళ్లీ ఉపయోగంలోకి తీసుకురావడం, ఓడరేవుల అభివృద్ధి, రొయ్యల సాగు, నదీమార్గాల మళ్లింపు, డ్రెడ్జింగ్‌, ఇసుక తవ్వకాలు... ఇలా అనేక రకాలుగా ప్రకృతి సహజత్వాన్ని తీవ్రంగా దెబ్బతీశారనే ఆరోపణ లున్నాయి. చెల్లనం వంటి ప్రాంతాల్లో ఈ తరహా కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నాయి. తాజాగా వచ్చిన తౌతే తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో అదొకటి.

అరేబియా సముద్రంలో..

ఇటీవలి కాలంలో బంగాళా ఖాతంలో తీవ్ర తుపానుల సంఖ్య క్రమేణా తగ్గుతోంది. అరేబియా సముద్రంలో పెరిగిపోయాయి. 2014లో నిలోఫర్‌ తుపాను వచ్చే వరకూ అరేబియా సముద్ర తీరంలో తీవ్రస్థాయి తుపాన్లు లేవు. కానీ, భూతాపం పెరిగిపోవడం, వాతావరణ మార్పుల కారణంగా తుపాన్ల్ల ముప్పు పెరిగిపోతోంది. 2018 నుంచి ఇప్పటి వరకు నాలుగు తుపాన్లు వచ్చాయి. ఇవన్నీ రుతుపవనాలకు ముందు- అంటే ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య కాలంలోనే ఎక్కువగా సంభవించాయి. పైపెచ్చు అన్నీ తీవ్ర, అతి తీవ్ర తుపానులే. 2018లో ఒమన్‌ దేశంలో మెకను తుపాను వచ్చింది. 2019లో గుజరాత్‌ తీరంలో వాయు, 2020లో మహారాష్ట్రలో నిసర్గ తుపానులు విశ్వరూపం చూపించాయి.
ఉష్ణమండల తుపాన్లు బలపడాలంటే వాటికి బోలెడంత శక్తి అవసరం. ఈ శక్తిని అవి వేడి నీళ్ల నుంచి, లేదా సముద్రాల మీద ఉండే తేమగాలుల నుంచి తీసుకుంటాయి. ప్రస్తుతం అరేబియా సముద్రంలో 50 మీటర్ల లోతు వరకు ఉండే నీళ్లన్నీ వేడిగానే ఉంటున్నాయి. అందుకే ఇక్కడ తుపానులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

ఇటీవలి కాలంలో సముద్రం బాగా ముందుకొస్తోందని, ఇదీ భూతాపం ప్రభావమేనని అంటున్నారు. తౌతే తుపాను తీవ్రత, దాని తీరును బట్టి చూస్తే- రాబోయే రోజుల్లో అరేబియా సముద్రంలో మరిన్ని తీవ్ర తుపానులు సంభవిస్తాయని, వీటన్నింటికీ వాతావరణ మార్పులే ప్రధాన కారణమని కొచ్చిన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి చెందిన వాతావరణ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

సముద్ర కోత ఎక్కువై..

కొచ్చిన్‌ ఓడరేవు కోసం డ్రెడ్జింగ్‌ చేసిన తరవాత సముద్రం గ్రామాలకు బాగా దగ్గరైపోయింది. కొచ్చి నుంచి అళప్పుళ వరకు తీరప్రాంత జాతీయ రహదారి నిర్మాణంతో సముద్ర కోత మరింత ఎక్కువైంది. ఈ తరహా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టిన తరవాతేే తుపాన్ల ప్రభావం కేరళను మరింతగా ఇబ్బంది పెడుతుండటం గమనార్హం. తుపాను వల్ల సముద్రపు అలల ప్రభావం తీరప్రాంత గ్రామాలపై మరీ ఎక్కువగా ఉండకుండా చూసేందుకు జియో సింథటిక్‌ ట్యూబులతో దాదాపు 310 కిలోమీటర్ల మేర గోడలు కట్టారు. మొత్తం తీరప్రాంతంలో 60శాతం వరకు ఇలాంటి గోడలు వచ్చాయి. కానీ, తాజా తుపానుకు వాటిలో చాలావరకు కొట్టుకుపోయాయి. ఇలాంటి గోడలు కట్టడం వల్ల అలల ఉద్ధృతి తగ్గడం మాట అటుంచి పెరుగుతోందన్నది శాస్త్రవేత్తల మాట. తీరప్రాంతం కోత విషయంలో మన దేశంలో పశ్చిమ్‌బంగ మొదటి స్థానంలోనూ, కేరళ రెండో స్థానంలోనూ ఉన్నాయి. శరవేగంగా మౌలిక వసతులను అభివృద్ధి చేయాలన్న ఆలోచన తప్ప, ఇతరత్రా ముందుచూపు లేకపోవడమే ప్రకృతి విలయానికి ప్రధాన కారణమని వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సముద్ర కోత వల్ల మత్స్యకారుల జీవనోపాధికీ గండి పడుతోంది. సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు చేపలు పడటం బాగా తగ్గిపోతోందని కేరళ మత్స్యకారులు వాపోతున్నారు. అలల ఎత్తు, తీవ్రత బాగా పెరిగిపోయిందని, 2004 సునామీ సమయం నుంచి సముద్రం తరచూ అల్లకల్లోలంగా ఉంటోందని, దానివల్ల తాము వేటకు వెళ్లే సమయం తగ్గిపోతోందని ఆవేదన చెందుతున్నారు. కేరళ తీరప్రాంతంలో ఇప్పుడు ఒకరకంగా నిప్పులపై నడుస్తున్న పరిస్థితి నెలకొంది. వాతావరణ మార్పుల ప్రభావాన్ని వీలైనంత త్వరగా తగ్గించకపోతే, భవిష్యత్తులో ముప్పు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశాలే అధికం!

- కామేశ్వరరావు పువ్వాడ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.