రాజకీయ పార్టీలు నేరచరిత్ర ఉన్నవారిని నామినేట్ చేస్తే అందుకు కారణాలను వివరించాలని ఇటీవలే దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. రాజకీయ పార్టీలు అటువంటి వారికి ఎందుకు టిక్కెట్టు ఇచ్చాయో వివరణ ఇవ్వాలని నిలదీసే హక్కు.. ఎన్నికల సంఘానికి కోర్టు ఆదేశాల వల్ల రావచ్చు. ఎన్నికల సంఘం ప్రశ్నలకు స్పందించాల్సిన నైతిక బాధ్యత పార్టీలపై ఉంటుంది. అయితే ఈ తీర్పులో ఎన్నికల సంఘానికి ప్రశ్నించే అధికారాన్ని ఇవ్వకపోవడం విచారకరం.
ఫలితంగా ఎన్నికల సంఘం నేర చరిత్ర ఉన్నవారి గురించి రాజకీయ పార్టీలను గట్టిగా నిలదీయలేకపోతోంది అనేది సత్యం! ఈసీకి ఇటువంటి అధికారమే ఉంటే అభ్యర్థిని రంగంలోకి దించే ముందే పార్టీలు ఒకటికి రెండు సార్లు ఆలోచించి టికెట్ ఖరారు చేస్తాయి. నేరచరిత్ర ఉన్నవారిని వెంటనే నామినేట్ చేయవు. కాబట్టి ఈ తీర్పుతో ఎన్నికల్లో నేరస్థులను ప్రవేశించకుండా ఎన్నికల సంఘం నిలువరించగలదా? అనేది పెద్ద ప్రశ్నగా మారింది.
పెరిగిన నేరపాలన...
- నేరమయ రాజకీయాలు భారత రాజకీయాల్లో అతి పెద్ద సమస్యగా మారాయి. నేరచరిత్ర ఉన్న ప్రజాప్రతినిధులు వరుసగా పార్లమెంటుకు, వివిధ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికయ్యే సంఖ్య గణనీయంగా పెరిగింది. 2004 సంవత్సరంలో 15వ లోక్‌సభకు ఎన్నికైన వారిలో 24% మంది సభ్యులపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉండేవి. అయితే 2009లోని 16వ లోక్‌సభలో ఆ సంఖ్య మరో ఆరు శాతం పెరిగి.. 30 శాతానికి చేరిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
- 2014 లోక్‌సభ ఎన్నికల్లో ప్రభుత్వం మారిన తర్వాత గుణాత్మక మార్పు వస్తుందని అందరూ ఆశించారు. కానీ 2014 తర్వాత అలా జరగలేదు. 2019లో 17వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో.. క్రిమినల్ నేపథ్యం ఉన్నవారు 43% మంది సభ్యులు ఉన్నారు.
- ఇక రాష్రాల శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కూడా నేర చరితుల విషయంలో పెద్ద తేడా ఏమీ లేదు. చాలా రాష్ట్రాల్లో ఎన్నికైన సభ్యుల్లో ఎక్కువ మంది నేర చరిత్ర ఉన్నవారే. ఉదాహరణకు... దిల్లీలో ఆప్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. అయితే అక్కడ కూడా నేర చరిత్ర ఉన్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
- మొత్తం 70 మంది సభ్యులు ఉండే దిల్లీ శాసనసభలో.. 2015 ఎన్నికల్లో 24 మంది నేర చరిత్ర ఉన్నవారు గెలిస్తే, ఈసారి ఆ సంఖ్య 42కు పెరిగింది. హత్యలు వంటి తీవ్రమైన అభియోగాలు ఉన్నసభ్యుల సంఖ్య 2015లో 14 ఉంటే, 2020లో ఆ సంఖ్య 37కి చేరింది. పార్లమెంటులోలాగే రాష్ట్రాల్లోనూ పరిస్థితిల్లో మార్పు వస్తుందని.. కొత్త పార్టీగా అధికారం చేపట్టిన ఆప్ నుంచి ఎంతో ఆశించారు ప్రజలు. కానీ వారి ఆశలు నిరాశే అయ్యాయి. నిష్కల్మషమైన రాజకీయ వ్యవస్థను ప్రజల ముందు ఉంచుతామని అటు జాతీయ స్థాయిలో భాజపా, ఇటు దిల్లీలో ఆప్ చేసిన హామీలు మార్పులను ఆవిష్కరించలేకపోయాయి.
సుప్రీం మార్గదర్శకాలు...
ఇటీవల వెలువరించిన తీర్పులో రాజకీయ పార్టీలకు ఆరు మార్గదర్శకాలను సూచించింది సుప్రీంకోర్టు. రాజకీయ పార్టీలు తమ వెబ్‌సైట్లలో నేర చరిత్ర ఉన్నవారి వివరాలను అప్‌లోడ్ చేయాలని ఈ తీర్పు ద్వారా స్పష్టం చేసింది. పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులను నమోదు చేయాలని ఆదేశించింది.
నేర చరిత్ర ఉన్న వ్యక్తులను నామినేట్ చేస్తే.. అందుకు రాజకీయ పార్టీలు సరైన కారణాలు చూపగలగాలని తెలిపింది. ముఖ్యంగా నేరారోపణలు లేని అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేకపోయారో కారణాన్ని వివరించాలి. సుప్రీం మార్గదర్శకాల ప్రకారం.. ఆయా రాజకీయ పార్టీలు ఇచ్చిన సమాచారాన్ని పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌తో పాటు ఒక స్థానిక భాష, ఒక జాతీయ వార్తాపత్రికలో ప్రచురించాలి.
రెండు వారాల ముందే..
అభ్యర్థిని ఎంపిక చేసిన 48 గంటలలోపు లేదా నామినేషన్లు దాఖలు చేయడానికి మొదటి తేదీకి కనీసం రెండు వారాల ముందు ఈ ప్రక్రియ జరగాలి. నిర్దిష్ట అభ్యర్థిని ఎన్నుకున్న 72 గంటలలో.. పార్టీ సమ్మతి నివేదికను పంపవలసి ఉంటుంది. వీటిని పాటించడంలో విఫలమైతే కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్టుగా భావించి.. ఎన్నికల సంఘం రాజకీయ పార్టీకి నోటీసు జారీ చేయాలి. రాజకీయ పార్టీలు వివరణలు ఇవ్వడం, వాస్తవాలు తెలియజేయడాన్ని తప్పనిసరి చేస్తే.. ఆయా పార్టీలపై కొంత నైతిక ఒత్తిడి తెచ్చినట్టవుతుంది.
లోపించిన అవగాహన...
అభ్యర్థి గురించి ప్రజలకు మరింత అవగాహన కల్పించడంలో ఈ వివరాలన్నీ సహాయపడతాయి. కానీ ఈ తీర్పు రాజకీయాల్లోకి నేరస్థుల ప్రవేశాన్ని అరికట్టడంలో సహాయపడకపోవచ్చు. సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్) నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. భారతీయ ఓటర్లలో 65% మంది పార్టీని చూసి ఓటు వేసే వారే ఉన్నారు. చాలా కొద్ది మంది మాత్రమే అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని ఓటు వేస్తారని అంచనా.
రాజకీయ పార్టీలు నైతిక విలువలను విస్మరించి నేరచరిత్ర గల అభ్యర్థులను నిలబెట్టడం కొనసాగిస్తే.. ఈ అభ్యర్థులు పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికవుతూనే ఉంటారు. ఎన్నికల సంఘం అధికారాల పరిమితిని గ్రహించిన సుప్రీంకోర్టు.. 2018 సెప్టెంబర్‌లో ఇచ్చిన తీర్పులో రాజకీయాల్లో నేరమయ నేతలను అరికట్టే పనిని పార్లమెంటుకు వదిలివేసింది. తీవ్రమైన క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న వ్యక్తులు రాజకీయాల్లోకి ప్రవేశించకుండా ఉండేలా చట్టాలను రూపొందించాలని ఆదేశించింది. కానీ ఇప్పటికీ అది ఆచరణలోకి రాలేదు.
రాజకీయాల్లో నేరస్థుల ప్రవేశాన్ని అరికట్టడంలో ఈ తీర్పు ఎన్నికల సంఘానికి తగినంతగా అధికారం ఇవ్వకపోవచ్చు. కానీ ప్రస్తుత ప్రపంచంలో సోషల్ మీడియాను ప్రచారం కోసం పెద్ద ఎత్తున ఉపయోగించుకోవడం, పార్టీలు తమ మద్దతుదారులతో హ్యాష్‌ట్యాగ్‌లు పెడుతున్నాయి. ట్రెండ్స్ పేరిట ప్రతి విషయం చర్చకు వస్తుడటం వల్ల పార్టీలు తమ అభ్యర్థుల విషయంలో జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది.
న్యాయ వ్యవస్థతోనే సాధ్యం..
న్యాయ వ్యవస్థలో సంస్కరణ వచ్చేవరకు రాజకీయాల నేరపూరితం కావడాన్ని అరికట్టలేము. ఫాస్ట్ ట్రాక్ న్యాయవ్యవస్థ, కోర్టుల ముందు పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్యను తగ్గించడం తప్పనిసరి. కింది స్థాయి న్యాయస్థానంలో తీవ్రమైన నేరాలు రుజువైతే.. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను నిషేధించే మరింత కఠినమైన చట్టాలు తేవాల్సిన అవసరాన్ని గుర్తించాలి.
ఈరోజు అభ్యర్థుల ధన, కండ బలం ఒక శక్తిమంతమైన ప్రజాస్వామ్యం అనుకోవం వల్లే మన దేశ ప్రజాస్వామ్య విలువలు దిగజారిపోతున్నాయి. 130 కోట్లకు పైగా జనాభా, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమని చెప్పుకుంటున్న మనం.. ఇటువంటి పరిస్థితులలో ఏమని గర్వించాలి? నేరస్థులను చట్ట సభలకు ఎన్నుకోవాలా లేదా పోటీ చేయకుండా నిరోధించాలా? కాలం వేగంగా మారుతున్న ఈ కీలకమైన సమయంలో.. రాజకీయాలను ప్రక్షాళన చేయాల్సిన ఆవశ్యకత ఉంది. మరీ ఆలస్యం కాకముందే మార్పు జరగాలి.
*సంజయ్ కుమార్-సెంటర్ ఫర్ స్టడీ అఫ్ డెవలపింగ్ స్టడీస్ (సీఎస్డీఎస్) ఆచార్యుడు. రాజకీయ విశ్లేషకుడు, వ్యాఖ్యాత, ప్రముఖ సెఫాలజిస్ట్.
*నీల్ మాధవ్- దిల్లీ యూనివర్సిటీ జర్నలిజం విద్యార్థి, సీఎస్డీఎస్ పరిశోధన కార్యక్రమం లోకనీతిలో పరిశోధకుడు