దేశంలో విద్యుత్ సంస్థల ఆర్థిక కష్టాలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. దేశ చరిత్రలోనే తొలిసారి 'విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో)'లకు 'విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కమ్)'లు చెల్లించాల్సిన బకాయిలు ఈ ఏడాది జూన్ ఆఖరుకే లక్షా 20 వేల కోట్ల రూపాయలను దాటిపోయాయి. అంటే విద్యుత్తును కొంటున్న డిస్కమ్‌లు అందుకు సొమ్ము సకాలంలో చెల్లించడం లేదు. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న డిస్కమ్‌లను కొవిడ్ సంక్షోభం మరింత ఊబిలోకి నెట్టింది. లాక్‌డౌన్ ప్రారంభానికి ముందు గరిష్ఠ డిమాండ్ ఉన్నప్పుడే- డిస్కమ్‌లు ఖర్చులకు తగిన ఆదాయం లేక నష్టాల్లో ఉండేవి. కరోనా ప్రభావంతో కరెంటు వినియోగం పడిపోవడం మరింత దెబ్బతీసింది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి 'ఆత్మ నిర్భర్ భారత్' పథకం కింద జెన్‌కోల బకాయిలు తీర్చడానికి రూ.90 వేల కోట్లను రుణాలుగా డిస్కమ్‌లకు ఉదారంగా ఇస్తామని కేంద్రం ప్రకటించింది.
మోయలేని భారం
భారత్‌లో విద్యుత్ సంస్థలన్నీ ‘కంపెనీ చట్టం’ కింద ఏర్పడిన వ్యాపార సంస్థలైనా ఏనాడూ వాణిజ్య సూత్రాలను పట్టించుకున్న దాఖలాలు కానరావడం లేదు. నిజంగా వృత్తి నైపుణ్యమున్న వాణిజ్య సంస్థల్లా పనిచేస్తే- అవి అమ్మే కరెంటుకు ఏటికేడు డిమాండ్ పెరుగుతున్నా నష్టాలెందుకు వస్తున్నాయి? దేశంలో 11 ఏళ్ల క్రితం 2009-10లో 808.49 బిలియన్ యూనిట్ల(బీయూ) కరెంటు ఉత్పత్తి కాగా, నిరుటి ఆర్థిక సంవత్సరం అది 1,389.12 బీయూలకు పెరిగింది. అంటే 11 ఏళ్లలో 71.81 శాతం అదనంగా ఉత్పత్తి, డిమాండ్ పెరిగాయి. ఆ మేరకు డిస్కమ్‌ల అమ్మకాలు, వ్యాపారం పెరిగినా అవి లాభాల్లోకి రాకపోగా మరింత నష్టాల్లోకి ఎందుకు వెళుతున్నాయనేది కీలకప్రశ్న. దేశవ్యాప్తంగా అన్ని డిస్కమ్‌ల నష్టాలు 2018-19 ఆఖరునాటికే రూ.49 వేల కోట్లకు చేరాయి. వాస్తవానికి ఈ నష్టాల మొత్తం 2015 మార్చి నాటికి రూ.2 లక్షల 40 వేల కోట్లు. ఈ నష్ట మొత్తాన్ని తగ్గించడానికి 2015 సెప్టెంబరు వరకు ఉన్న బకాయిల్లో 75శాతం రాష్ట్ర ప్రభుత్వాల ఖాతాల్లోకి బదిలీచేస్తూ ‘ఉజ్జ్వల్ డిస్కం హామీ యోజన’(ఉదయ్) పథకాన్ని కేంద్రం తెచ్చింది. ఆ పథకంతో నష్టాలు తగ్గిపోయి ఇక డిస్కమ్‌లు లాభాల్లోకి వస్తాయని కేంద్రం అప్పట్లో అంచనా వేసింది. కానీ మళ్లీ నష్టాలు పెరగడం మొదలై రూ.49 వేల కోట్లకు చేరాయి.
తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి..
కరెంటుకు డిమాండ్ పడిపోవడంతో తెలంగాణలోని రెండు డిస్కమ్‌లకు ఏకంగా రూ.900 కోట్ల వరకు నష్టాలొచ్చినట్లు తాజా అంచనా. పేదల సంక్షేమం కోసం తక్కువ ఛార్జీలకే కరెంటు పంపిణీ చేస్తున్నందువల్ల- వాణిజ్య సంస్థల్లా పనిచేయడం కుదరదని ఈ సంస్థలు చెబుతున్నాయి. కానీ, విద్యుత్ చట్టాన్ని తుంగలో తొక్కి పరిశ్రమలకు, వాణిజ్య అవసరాలకు ఉత్పత్తి వ్యయంకంటే చాలా ఎక్కువ ఛార్జీ వసూలు చేస్తూ కరెంటు అమ్ముకోవడం వాణిజ్యమే కదా? విద్యుత్ చట్టం ప్రకారం కరెంటు కొనుగోలు ధరకు 20 శాతంకంటే ఎక్కువ లేదా తక్కువకు అమ్మరాదు. కానీ, చాలా రాష్ట్రాల డిస్కమ్‌లు ఈ నిబంధనను అమలుచేయడం లేదు. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో కరెంటు కొనుగోలు ధరలో 79 శాతం తగ్గించి పేదలకు ఇస్తున్నారు. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి పరిశ్రమలకు, వాణిజ్య సంస్థలకు 40 శాతం ధర పెంచి అమ్ముతున్నారు. పేదలకిస్తున్న చౌక కరెంటుకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏటా వేల కోట్ల రూపాయలు రాయితీలుగా పొందుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత ఏడాది(2020-21)లో ఈ రాయితీల రూపంలో రాష్ట్ర ప్రభుత్వాలు రూ.19 వేల కోట్లు డిస్కమ్‌ల కోసం రాష్ట్ర బడ్జెట్లలో కేటాయించాయి. అవి కూడా సరిపోక నష్టాలు మరింత పెరగవచ్చని డిస్కమ్‌ల అంచనా.
పరిశ్రమల నుంచి ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వేల కోట్ల రూపాయలు రాయితీలుగా పొందుతున్నా డిస్కమ్‌ల అంతర్గత పనితీరు మెరుగుపడకపోవడం వల్ల నష్టాలు తగ్గడం లేదు. ఒక యూనిట్‌ను జెన్‌కోల నుంచి కొని, ప్రజలకు సరఫరా చేయడాన్ని ‘సగటు సరఫరా వ్యయం (ఏసీఎస్)’ అంటారు. దీనికి, సగటు ఆదాయ అంచనా(ఏఆర్‌ఆర్)కు మధ్య ఎంత వ్యత్యాసం ఉందనేదాన్ని బట్టి ప్రతి రాష్ట్రంలోని డిస్కమ్‌ల ఆర్థిక ప్రగతి, పనితీరును కేంద్రం అంచనా వేస్తుంది. బిహార్‌లాంటి అత్యంత వెనకబడిన రాష్ట్రంలో ఈ వ్యత్యాసం 57 పైసలుంటే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌లో అంతకన్నా వందశాతం ఎక్కువ ఉండటం గమనార్హం. అంటే ఏపీలో ప్రతీ యూనిట్ కరెంటు సరఫరాపై 104 పైసల నష్టాన్ని డిస్కమ్‌లు మూటగడుతున్నాయి.
ఆర్థిక క్రమశిక్షణ అవసరం
డిస్కమ్‌లు లాభాల్లోకి రావాలంటే కొనే ప్రతి యూనిట్ కరెంటుకూ ఆదాయం పొందాలి. కానీ దేశంలో జెన్‌కోల నుంచి డిస్కమ్‌లు కొంటున్న కరెంటును అంతిమంగా వినియోగదారులకిచ్చిన తరవాత లెక్కలు తీస్తే 18.87 శాతం ‘సరఫరా, పంపిణీ’(టీడీ)లోనే నష్టపోతున్నట్లు కేంద్ర విద్యుత్‌శాఖ తాజా నివేదికలో వెల్లడించింది. రాజస్థాన్‌లో ఈ నష్టం గరిష్ఠంగా 25 శాతం. ఉదాహరణకు గతేడాది 1,38,912 కోట్ల యూనిట్ల విద్యుదుత్పత్తి చేస్తే ఇందులో 26,212 కోట్ల(18.87) యూనిట్లు మధ్యలోనే నష్టపోయారు. దేశవ్యాప్తంగా సగటున యూనిట్ సరఫరా వ్యయం కనిష్ఠంగా రూ.5 కింద లెక్కించినా ఇలా మధ్యలో నష్టపోయిన 26,212 కోట్ల యూనిట్లకు కోల్పోయిన సొమ్ము లక్షా 31 వేల కోట్ల రూపాయలు. డిస్కమ్‌ల నష్టాలన్నీ కలిపినా ఇందులో సగం సైతం లేవు. ప్రజలకు కరెంటు ఛార్జీ పైసా పెంచకుండానే లాభాలను కళ్లచూడవచ్చని గణాంకాలే ఘోషిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏసీఎస్ రూ.7కు పైనే ఉంది. అంటే ఈ రాష్ట్రాల్లో నష్టపోతున్న కరెంటు 11.38 శాతానికిగాను కోల్పోతున్న సొమ్ము వేల కోట్ల రూపాయల్లో ఉంది. వ్యవసాయానికిచ్చే కరెంటుకు మీటర్లు లేకపోవడంతో సరఫరా, పంపిణీలో నష్టపోతున్నదాన్ని వ్యవసాయ వాడకంలో డిస్కమ్‌లు చూపుతున్నాయనే విమర్శలో నిజం లేకపోలేదు. ప్రతీ యూనిట్ కరెంటుకు లెక్క తేలాలంటూ విద్యుత్ చట్ట సవరణ బిల్లు ముసాయిదాను కేంద్రం సిద్ధం చేసింది. కానీ, ఈ బిల్లును భాజపాయేతర పాలనలోని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. లెక్కలన్నీ పక్కాగా తేల్చే స్మార్ట్‌మీటర్ల వంటి అధునాతన వ్యవస్థలొస్తే విద్యుత్ సంస్థల డొల్లతనమూ బయటపడుతుంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ కారణాలతో కరెంటు ఛార్జీలు పెంచకుండా డిస్కమ్‌లను నష్టాలపాలు చేస్తున్నాయి. విద్యుత్ నియంత్రణ మండళ్లు కఠినంగా వ్యవహరిస్తే డిస్కమ్‌ల పనితీరు మెరుగవుతుంది. సంస్థల పనితీరు మెరుగుదలకు సంస్కరణలు తేవాలి. నష్టపోతున్న కరెంటుకు బాధ్యులను గుర్తించాలి.
- మంగమూరి శ్రీనివాస్