కరోనా వైరస్ విజృంభించినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కొవిడ్ రోగులకు సహా యపడేందుకు, ఇంటింటికి వెళ్లి పౌరులకు పరీక్షలు నిర్వహించేందుకు, ఇతరత్రా సేవలకు ఆరోగ్య సంరక్షణ సిబ్బందినే ఎక్కువగా వినియోగించారు. ఇలాంటి పరిస్థితుల్లో బలహీనమైన ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలతో సతమతమయ్యే భారత్ వంటి దేశాలు- ప్రసూతి ఆరోగ్యం వంటి ముఖ్యమైన అంశాన్ని పర్యవేక్షించేందుకు మానవ వనరుల కొరతతోపాటు ఇతరత్రా సమస్యల్ని ఎదుర్కొన్నాయి.
ప్రసూతి ఆరోగ్య సేవలు అందించే వైద్యులు, సిబ్బంది కొరత ఏర్పడటంతో కొవిడ్ మహమ్మారి విజృంభించిన ప్రారంభ సమయంలో మాతృత్వ, శిశు మరణాల్లో పెరుగుదల నమోదైంది. ఈ సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల అవాంఛిత గర్భధారణలు చోటుచేసుకోవచ్చని ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (యూఎన్‌ఎఫ్‌పీఏ) అంచనా వేసింది. ఫలితంగా సరిపడినంతగా అత్యవసర వైద్యసేవలు అందుబాటులో లేకపోవడంతో గర్భస్రావాలు, కాన్పుల కారణంగా పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించవచ్చని పేర్కొంది.
2 కోట్ల మంది శిశుజననాలు..
ఐరాస చిన్నారుల నిధి-యూనిసెఫ్ ప్రకారం భారత్‌లో మార్చి, డిసెంబర్ మధ్యలో రెండు కోట్ల శిశుజననాలు చోటు చేసుకుంటున్నట్లు అంచనా. ఇది ప్రపంచంలోనే అత్యధికం. అంతేకాకుండా, మహమ్మారి సంక్షోభం సృష్టిస్తున్న వేళలో ప్రపంచవ్యాప్తంగా దెబ్బతిన్న ఆరోగ్య వ్యవస్థలతో గర్భిణులు, నవజాత శిశువుల సేవల్లో అంతరాయాలు తలెత్తవచ్చని యూనిసెఫ్ హెచ్చరించింది. ఈ క్రమంలో సరైన సమయానికి గర్భధారణను నిర్ధారించకపోవడం, అధికస్థాయి మాతృత్వ, శిశు మరణాల రేట్లు వంటి సుదీర్ఘకాలంగా ప్రసూతి రంగాన్ని వేధిస్తున్న సమస్యల్ని ఎదుర్కొనేందుకు మనదేశం అత్యవసరంగా పరిష్కార మార్గాల్ని గుర్తించాల్సిన అవసరం నెలకొంది.
కొవిడ్ వేళ గర్భిణులు, బాలింతల ఆరోగ్యానికి తగినంత మానవ వనరుల్ని, ఇతరత్రా సౌకర్యాల్ని సమకూర్చలేక పోయిన పరిస్థితి తలెత్తింది. ఈ సమస్యకు పరిష్కారంగా విస్తృత స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంపై దృష్టి సారించడం మేలు. ఇలాంటి సరికొత్త పరిష్కార మార్గాలను దేశంలో కొన్నిచోట్ల ఇప్పటికే వాడుతున్నారు. ఉదాహరణకు- అపర్ణ హెగ్డే అనే యూరోగైనకాలజిస్టు రూపొందించిన ‘ఆరోగ్య సఖి’ మొబైల్ యాప్ మహారాష్ట్ర గ్రామీణ ప్రాంత గర్భిణులకు ఎంతగానో తోడ్పడుతోంది. ఆస్పత్రులకు వెళ్లలేని గర్భిణులకు పరీక్షలు నిర్వహించి, కాన్పు ముందు సంరక్షణ సేవల్ని అందించేందుకు ఆశా వర్కర్లు ఆరోగ్యసఖి సహాయాన్ని పొందుతున్నారు.
సాంకేతిక తోడ్పాటు..
ప్రసూతి ఆరోగ్య సంరక్షణలో సాంకేతిక ఆవిష్కరణకు ఉదాహరణగా- ఆరోగ్య సేవల సిబ్బందికి తోడ్పడే ‘అలయన్స్ ఫర్ సేవింగ్ మదర్స్ అండ్ న్యూబార్న్ (ఆస్మాన్)’ అనే డిజిటల్ వేదికను రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. దీనిద్వారా బాలింతలు, నవజాత శిశువులకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తోడ్పాటు అందిస్తారు. మారుమూల గ్రామీణ ప్రాంతంలో నివసించే మహిళ కాన్పు కోసం ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి వెళ్లడం కష్టతరమైనప్పుడు... ఈ వేదిక ద్వారా ఆరోగ్య సిబ్బంది, ఇతర నిపుణులు ఎప్పటికప్పుడు ప్రసవం స్థితిగతుల్ని తెలుసుకునేందుకు తోడ్పడుతుంది. ముప్పు అధికంగా ఉండే కేసులను గుర్తించడం, తగిన చర్యలు తీసుకోవడం, అవసరమైనప్పుడు అత్యున్నత స్థాయి వైద్య కేంద్రాలకు పంపించడం, అత్యవసర నిర్ణయాలను తీసుకొనేందుకు ఆరోగ్య సిబ్బందికి డిజిటల్ వేదిక సేవలు ఉపయోగపడతాయి. దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్‌లో ఈ తరహా పరిష్కార మార్గాల్ని అందుబాటులోకి తీసుకొస్తే ఎన్నో ప్రాణాలను కాపాడే అవకాశం దక్కుతుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఆశా, ఏఎన్‌ఎం వర్కర్లు గర్భిణులను ఫోన్ ద్వారా సంప్రదించడం, ఏవైనా సమస్యలుంటే సత్వరమే గుర్తించి తదుపరి చర్యలు తీసుకొనేందుకు వీలుగా కౌన్సెలింగ్ చేపట్టడం వంటి కార్యక్రమాలను మేళవించాలి. అవాంతరాలు లేకుండా ప్రసూతి ఆరోగ్య సేవలను అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవలను వినియోగించుకోవడం ఉపయుక్తం. దీనివల్ల ఆరోగ్యేతర కార్యకలాపాల పనిభారం సిబ్బందిపై పడకుండా చూడవచ్చు. కొవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందిన వేళల్లో సాధ్యమైనంత వరకు బాలింతలు, శిశు సంరక్షణలో నిపుణులైన సిబ్బంది ప్రత్యక్ష సేవల్ని తగ్గించడం మేలు. జాతీయ, స్థానిక స్థాయుల్లో ఆరోగ్య సమాచార వ్యవస్థను బలోపేతం చేసేందుకూ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా ఉపయోగించుకోవచ్చు. మనదేశం చాలీచాలని ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలతో కొవిడ్ మహమ్మారి తీవ్రతను ఎదుర్కొంటున్న వేళ- దేశవ్యాప్తంగా నవకల్పనలతో కూడిన సాంకేతిక పరిజ్ఞాన పరిష్కారాలను ఉపయోగించడం ద్వారా- ప్రసూతి ఆరోగ్య సేవలు ఎలాంటి అవాంతరాలు, లోపాలు లేకుండా అందరికీ దక్కుతాయి. ఎన్నో ప్రాణాలూ నిలుస్తాయి.
(రచయిత- అమిత ధను, భారత కుటుంబ నియంత్రణ సంఘం సహాయ సెక్రెటరీ జనరల్)