మనిషి ఆరోగ్యంగా జీవించేందుకు పోషక విలువలున్న, నాణ్యమైన ఆహారం అవసరం. కరోనా వైరస్ సృష్టిస్తున్న సంక్షోభం మానవాళిలో ఆరోగ్యంపై అవగాహనను పెంచింది. ఈ నేపథ్యంలో పోషకాలున్న ఆహారానికి ప్రాధాన్యమూ పెరిగింది. మరోవైపు ప్రపంచాన్ని చుట్టుముడుతున్న కల్తీ, నాసిరకం ఆహార పదార్థాలు, ఉత్పత్తులు ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో, లేదా స్థిరంగా ఉంచడంలో పోషక విలువలున్న ఆహారం ఎంతగా ఉపకరిస్తుందో- దాన్ని క్షీణింపజేయడంలో నాసిరకం, కల్తీ ఆహారం అంతకంటే వేగంగా ప్రభావం చూపుతుంది. కొవిడ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల వ్యాపార వర్గాలు అనుసరించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆహార తయారీ పరిశ్రమల్లో అత్యంత పరిశుభ్రమైన వాతావరణం ఉండాలి. అక్కడ పని చేసే కార్మికులు పీపీఈ కిట్లు ధరించి, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కనీసం ఒకరికొకరు ఒక మీటరు దూరంలో ఉండాలి. కానీ ఈ మార్గదర్శకాలు మనదేశంలో ఎంతవరకూ అమలవుతున్నాయన్నదే చర్చనీయాంశం.
కాదేదీ కల్తీకనర్హం...
ప్రపంచ సురక్షిత ఆహార సూచీ-2019లో సింగపూర్ 87.4 స్కోరుతో మొదటిస్థానంలో ఉండగా, ఐర్లాండ్ (84), అమెరికా (83.7) తరవాతి స్థానాల్లో ఉన్నాయి. భారత్ 58.9 స్కోరుతో 72వ స్థానంలో ఉండటం గమనార్హం. దీన్ని బట్టి దేశంలో సురక్షిత ఆహారాన్ని ప్రజలకందించాల్సిన బాధ్యతను పోషించడంలో ప్రభుత్వాల వెనకబాటుతనం ప్రస్ఫుటమవుతోంది. పలురకాల మార్కెట్లలో విక్రయించే ఉత్పత్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాటి నాణ్యత, స్వచ్ఛతలకు భరోసా ఉందా అని లోతుగా పరిశీలిస్తే ఒళ్లు గగుర్పొడిచే ఎన్నో అంశాలు వెలుగుచూస్తాయి. ఇటీవల శాస్త్ర పర్యావరణ కేంద్రం (సీఎస్‌ఈ) ప్రముఖ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న తేనెను పరిశీలించి సుమారు పది బ్రాండ్‌ల తేనెలో కల్తీ ఉన్నట్లు స్పష్టం చేసింది. ఆ కల్తీని ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) రూపొందించిన దేశీయ ప్రామాణిక పరీక్షలు సైతం కనిపెట్టలేవని వెల్లడించడం గమనార్హం. కంపెనీలు ఎంతో నేర్పుగా, చట్టానికి సైతం పట్టుబడని రీతిలో ఆహార పదార్థాల్లో కల్తీని చొప్పిస్తున్నాయనడానికి ఇది ప్రబల నిదర్శనం. నిత్యం వంటల్లో వాడే పసుపు, కారం, చక్కెర, బెల్లం, మిరియాలు, నూనె, తేనె... ఇలా చెప్పుకొంటూ పోతే కల్తీ చేయని పదార్థమే కనిపించదు. అనారోగ్య హేతువులైన ప్రమాదకర విషపదార్థాల కల్తీ చివరికి మనుషుల ప్రాణాలనే హరించే స్థాయిలో వేళ్లూనుకుపోయింది.
సురక్షితమైన ఆహారంకోసం ప్రభుత్వం నిధులు వెచ్చించడం ఆర్థికవ్యవస్థకు మేలు చేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌ను అయిదేళ్ల ముందే అప్రమత్తం చేసింది. సంస్థకు చెందిన ‘ఫుడ్‌బార్న్ డిసీజ్ ఎపిడమాలజీ రీసెర్చ్ గ్రూప్’ అధ్యయనం ప్రకారం భారత్‌లో కలుషిత లేదా కల్తీ ఆహారంవల్ల వ్యాధుల బారిన పడుతున్నవారి సంఖ్య 2011లో సుమారు 10 కోట్లు; 2030 నాటికి వారి సంఖ్య 17 కోట్లకు చేరే అవకాశం ఉందని అధ్యయనం తేల్చింది. అంటే ప్రతి తొమ్మిది మందిలో ఒకరు ఆహారంలో నాణ్యతాలోపంవల్ల అనారోగ్యం పాలవుతారు. తక్కువ ధరకు లభించే నాసిరకం ఆహారోత్పత్తులను కొనుగోలు చేస్తూ, కల్తీ ఆహారానికి ఎక్కువగా బలయ్యేది నిరుపేద వర్గాలే కావడం బాధాకరం. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో ఇటీవల వందలాది ప్రజలు అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడం, అపస్మారక స్థితిలోకి వెళ్లడం వెనక ఆహార కల్తీయే ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. కొవిడ్ సంక్షోభంలో పారిశుద్ధ్యంపై ప్రభుత్వాలు, నిపుణులు పెద్దయెత్తున అవగాహన కల్పిస్తూ ప్రచారం చేపట్టినా, చాలా హోటళ్లు, టిఫిన్ సెంటర్లు యథాతథంగా పాతపద్ధతిలోనే పారిశుద్ధ్య నిబంధనలకు నీళ్లొదులుతున్నాయి. నిత్యం ఆస్పత్రులకు వచ్చే ప్రజల్లో సుమారు 20శాతం కల్తీ ఆహారం బారినపడి అనారోగ్యానికి గురైనవారేనని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
కొరవడిన కార్యాచరణ
కల్తీ చేసి లేదా నాణ్యతను తగ్గించి ఆహారాన్ని విక్రయించడం వెనక ప్రధాన ఉద్దేశం లాభార్జనే. పాల చిక్కదనాన్ని పెంచడానికి ప్రమాదకరమైన రసాయనాలు వాడుతున్నారు. పండ్లను వేగంగా, అసహజ రీతిలో మగ్గించేందుకూ విషపూరిత రసాయనాలను వినియోగిస్తున్నారు. ఏటా ప్రపంచవ్యాప్తంగా జనాభాలో నాలుగు నుంచి అయిదు లక్షలమంది కల్తీ ఆహారం తినడంవల్ల రోగగ్రస్తులై మరణిస్తున్నట్లు అంచనా. కల్తీని అరికట్టేందుకు కఠిన చర్యలకు వెనకాడేది లేదంటూ పాలకులు, అధికారులు ప్రకటిస్తున్నా, దశాబ్దాలుగా కల్తీ వ్యాపారం పెరుగుతోందేగానీ, తగ్గడంలేదు. మన దేశంలో 2006లోనే సురక్షిత ఆహార ప్రమాణాల చట్టం తెచ్చారు. అది అమలవుతున్న తీరే ఏ మాత్రం సంతృప్తికరంగా లేదు. కల్తీ కేసుల నిందితుల్లో 16శాతానికే శిక్షలు
పడుతున్నట్లు అంచనా. అందుకే అక్రమ వ్యాపారులు తమ సామ్రాజ్యాన్ని యథేచ్ఛగా విస్తరించుకుంటున్నారు. ప్రజలకు ఆహారాన్ని అందించడం ఎంత ముఖ్యమో- నాణ్యమైన, కల్తీలేని ఆహారం ఇవ్వడమూ అంతే కీలకమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. ఆహారంలో ప్రమాణాలను పెంచేందుకు అవసరమైన వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. కల్తీలను పసిగట్టగలిగేలా వినియోగదారుల్లో అవగాహన పెంచి, చట్టాలను పటిష్ఠంగా అమలు చేయాలి.
- నీలి వేణుగోపాల్‌రావు