కొవిడ్ కోరల నుంచి ప్రజానీకాన్ని రక్షించడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించక తప్పలేదు. సామాజిక, ఆర్థిక జీవనం స్తంభించిపోతున్నందువల్ల, ప్రజల భద్రతకు భంగం కలగకుండా క్రమంగా సడలింపులు ఇస్తున్నారు. ఈ క్రమంలో జనం నిర్దేశిత భౌతిక దూరం పాటించకుండా దగ్గరగా మసలుకునే సందర్భాలు అనివార్యంగా సంభవిస్తుంటాయి. ఇలా మసలినవారిలో కరోనా పాజిటివ్ కేసులు ఉంటే వెంటనే హెచ్చరించడానికి స్మార్ట్‌ఫోన్‌లో ‘కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్’ అమర్చుకోవడం వెసులుబాటుగా ఉంటుంది. మనం ఎవరెవరిని కలిశామో కనిపెట్టడాన్ని కాంటాక్ట్ ట్రేసింగ్ అంటారు. బ్లూటూత్, జీపీఎస్ సాంకేతికతలను ఉపయోగించి భారత ప్రభుత్వం రూపొందించిన ఈ తరహా యాప్ ఆరోగ్యసేతును ఏప్రిల్ రెండో తేదీ నుంచి పది కోట్ల మందికి పైగానే డౌన్‌లోడ్ చేసుకున్నారు. కరోనా ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నవారు, ప్రభుత్వ, ప్రైవేటురంగ ఉద్యోగులు, రైలు ప్రయాణికులు తప్పనిసరిగా తమ ఫోన్లలో ఆరోగ్యసేతు అమర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం మే ఒకటో తేదీన ఆదేశించింది. కంటైన్‌మెంట్ జోన్లలోని ప్రజలందరూ తప్పనిసరిగా ఈ యాప్‌ను తమ ఫోన్లలో అమర్చుకోవలసిందేనని పేర్కొంది. మే 11 వరకు ఈ యాప్ 1,40,000 మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను కరోనా ప్రమాదం గురించి అప్రమత్తం చేసిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఎన్నెన్నో సందేహాలు
ఆరోగ్యసేతు యాప్‌లోని లోపాల వల్ల తొమ్మిది కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత గోప్యత బట్టబయలయ్యే ప్రమాదం ఉందని ఎలియట్ యాల్డర్సన్ అనే ఎథికల్ హ్యాకర్ హెచ్చరించారు. దీనికి భారత ప్రభుత్వం స్పందించి, తమ యాప్ అన్ని విధాలా సురక్షితమని స్పష్టం చేసింది. అయినా ప్రభుత్వ వైఖరి మీద అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఉదాహరణకు యాప్‌ను అమర్చుకున్నాక కూడా పాజిటివ్ కేసులను గుర్తించడంలో విఫలమైతే ప్రభుత్వం దానికి బాధ్యత వహించదు. ఈలోగా పౌరుల వ్యక్తిగత వివరాలు మాత్రం ప్రభుత్వానికి చేరతాయి. ఇది ప్రజలపై నిఘా పెట్టడమేనని ప్రతిపక్షాలతోపాటు సామాజిక కార్యకర్తలు విమర్శిస్తున్నారు. అసలు ఆరోగ్యసేతుకు చట్టబద్ధత లేదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీకృష్ణ తేల్చేశారు. ఈ దుమారం మధ్య కేంద్రం ఒక మెట్టు దిగివచ్చి ఆరోగ్యసేతు యాప్‌ను అమర్చుకోవడం తప్పనిసరేమీ కాదంటూ మే 17న కొత్త ఉత్తర్వు జారీచేసింది. తమ ఉద్యోగులు స్మార్ట్‌ఫోన్లలో ఆరోగ్యసేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకొనేట్లు సంస్థల యాజమాన్యాలు జాగ్రత్త తీసుకోవచ్చునని వివరించింది. జిల్లా అధికార యంత్రాంగం కూడా పౌరులకు ఈ విధమైన సలహా ఇవ్వవచ్చు తప్ప ప్రభుత్వపరంగా నిర్బంధం ఉండదని తెలిపింది. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోనివారిపై చట్టపరంగా చర్య తీసుకోవచ్చని మే ఒకటో తేదీనాటి ఉత్తర్వు పేర్కొనగా, మే 17న ఆ నిబంధనను తొలగించారు. ఆరోగ్యసేతును తప్పనిసరి చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు కొనసాగుతుంది. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఆ అధికారాన్ని ప్రయోగిస్తోంది. అర్బన్ క్లాప్, జొమాటో వంటి ప్రైవేటు సంస్థలు తమకు తాముగా ఉద్యోగులకు ఆరోగ్యసేతును తప్పనిసరి చేశాయి. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రైలు, విమాన ప్రయాణికులు, క్రీడాకారులకు ఈ యాప్ తప్పనిసరి.
ఈ యాప్‌లో నమోదు కావడానికి వినియోగదారుడు ఇచ్చే వ్యక్తిగత వివరాలను అనధికార వ్యక్తులు, సంస్థలు దుర్వినియోగపరిస్తే దానికి భారత ప్రభుత్వం పూచీ వహించదు కాబట్టి గోప్యతను కాపాడటం ఎలా సాధ్యమని న్యూయార్క్‌లోని 'సాఫ్ట్‌వేర్ ఫ్రీడమ్ లాసెంటర్' న్యాయ విభాగ డైరెక్టర్ మిషీ చౌధురి ప్రశ్నించారు. ఇతర దేశాల యాప్‌లు కేవలం బ్లూటూత్‌ను వాడుతుంటే, ఆరోగ్యసేతు బ్లూటూత్‌తో పాటు జీపీఎస్‌నూ ఉపయోగిస్తోంది. దీనివల్ల వినియోగదారుడు ఎక్కడెక్కడ తిరిగిందీ ప్రతి 15 నిమిషాలకు యాప్ నమోదు చేస్తుంది. వినియోగదారుడి పేరు, ఫోన్ నంబర్, లింగం, వృత్తితోపాటు గత 30 రోజుల్లో ఏయే ప్రదేశాలకు వెళ్లిందీ నమోదవుతుంది. ఈ యాప్ అవసరమైనదానికన్నా ఎక్కువ వివరాలను తీసుకొంటోందని దిల్లీకి చెందిన 'ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్' విమర్శిస్తోంది. భారతదేశంలో వ్యక్తిగత సమాచార గోప్యత చట్టం ఏదీ లేనందువల్ల ఆరోగ్యసేతు యాప్‌ను దుర్వినియోగం చేసేవారిని గుర్తించి శిక్షించడం చట్టపరంగా సాధ్యం కాదు.
సైబర్ నేరగాళ్ల వీరంగం
ఇప్పటికే సైబర్ మోసగాళ్లు ఆరోగ్యసేతు ద్వారా పౌరుల వివరాలు సేకరించే ప్రయత్నాలను ముమ్మరం చేశారని భారత సైబర్ భద్రతా సంస్థ 'సెర్ట్-ఇన్' హెచ్చరించింది. వీరు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేరును, జూమ్ వీడియో కాన్ఫరెన్సింగ్ సాధనాన్ని, గూగుల్ మీట్, మైక్రోసాఫ్ట్ బృందాలను ఉపయోగించి వ్యక్తిగత వివరాలను కాజేస్తున్నారు. 'కరోనా నియంత్రణ కోసం ప్రధానమంత్రి కేర్స్ నిధికి విరాళాలు ఇవ్వండి, మీరు కరోనా ఆర్థిక సహాయానికి అర్హులు' అంటూ బోగస్ ఈ-మెయిల్స్, ఎస్‌ఎంఎస్‌లు పంపుతూ పౌరులను బురిడీ కొట్టిస్తున్నారు. మోసగాళ్ల బారి నుంచి రక్షణ కల్పించకుండానే ఆరోగ్యసేతును కొన్ని వర్గాల ప్రజలు తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడం సరికాదని సైబర్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి ఆందోళనలు, అనుమానాలను నివృత్తి చేయడానికి ప్రభుత్వం తనవంతు ప్రయత్నం చేస్తోంది. పౌరులు యాప్ నుంచి తమ సమాచారాన్ని తొలగించాలని కోరితే, 30 రోజుల్లో ఆ పనిపూర్తి చేస్తామని హామీ ఇస్తోంది. కరోనా నియంత్రణలో నిమగ్నమైన ప్రభుత్వ విభాగాలు, సంస్థలు ఆరునెలలకు మించి వ్యక్తిగత సమాచారాన్ని తమ సర్వర్లలో నిల్వ చేయరాదని, అలా చేస్తే జైలు శిక్ష పడుతుందని హెచ్చరించింది. అయితే శ్రీకృష్ణ కమిటీ రూపొందించిన వ్యక్తిగత సమాచార రక్షణ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించేంతవరకు పౌరుల వివరాలకు భద్రత లభించదు. ఈ చట్టం సంవత్సరం నుంచి పార్లమెంటు పరిశీలనలోనే ఉన్నందువల్ల ప్రభుత్వం ఆపద్ధర్మ ఆదేశాలతో సరిపెడుతోంది. ఇకనైనా చట్టం అమలులోకి రావాలి.
లోపించిన చట్టబద్ధత
కేంద్ర ప్రభుత్వం అసలు ఏ చట్టం కింద ఆరోగ్యసేతును తప్పనిసరి చేసిందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీకృష్ణ నిలదీస్తున్నారు. వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లును రూపొందించిన కమిటీకి ఆయన అధ్యక్షత వహించారు. కేంద్రం 2005నాటి జాతీయ ఉత్పాతాల నిభాయింపు చట్టం (ఎన్‌డీఎమ్‌ఏ) కింద ఆరోగ్యసేతు మార్గదర్శకాలను జారీ చేయడం చట్టసమ్మతం కాదని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాలు జరగని రోజుల్లో ఒక ఆర్డినెన్సు ద్వారా ఆరోగ్యసేతు యాప్‌ను తప్పనిసరి చేయవచ్చు. 180 రోజుల్లో ఆ ఆర్డినెన్సు స్థానంలో పార్లమెంటుతో ఒక చట్టాన్ని ఆమోదింపజేసుకోవాలని సూచించారు. అంతేతప్ప, ఎన్‌డీఎమ్‌ఏ కింద ప్రభుత్వాదేశంతో ఆరోగ్యసేతును నిర్బంధం చేయకూడదన్నారు. ప్రస్తుతం అత్యవసరంగా పై ఆదేశాన్ని జారీచేయాల్సి వచ్చినా, కరోనా ప్రమాదం తొలగిపోయిన తరవాతా వ్యక్తిగత సమాచారం ప్రభుత్వ వ్యవస్థ చేతిలోనే ఉండటం ప్రజాస్వామ్యానికి క్షేమకరం కాదంటున్నారు.
-- వరప్రసాద్