ETV Bharat / opinion

సరిహద్దు నుంచి వెనక్కి వెళ్లే ఉద్దేశం చైనాకు లేదా? - వాస్తవాధీన రేఖ వివాదం

వాస్తవాధీన రేఖ వెంట పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. కేవలం ప్రత్యర్థి చేతులు కట్టేసి లబ్ధి పొందేందుకే ఒప్పందాలు చేసుకొన్నట్లు డ్రాగన్‌ ప్రవర్తిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సరిహద్దు సైన్యం, వనరులను పటిష్ఠం చర్యలు చేపట్టడం ద్వారా సమీప భవిష్యత్తులో చైనాకు వెనక్కు వెళ్లే ఉద్దేశం లేదని స్పష్టం అవుతోందని పేర్కొన్నారు. భారత్‌ వాస్తవాధీన రేఖను కాపాడుకోవాలంటే శాశ్వత సైనిక స్థావరాల ఏర్పాటుపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.

indo china border dispute, భారత్​ చైనా సరిహద్దు
భారత్​- చైనా సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
author img

By

Published : Jul 28, 2021, 8:43 AM IST

భారత్‌-చైనా సంబంధాల్లో అపనమ్మకం పెరిగిపోయింది. కేవలం ప్రత్యర్థి చేతులు కట్టేసి లబ్ధి పొందేందుకే ఒప్పందాలు చేసుకొన్నట్లు డ్రాగన్‌ ప్రవర్తిస్తోంది. ఈ తీరుతో వాస్తవాధీన రేఖ వెంట పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. సరిహద్దు వివాదాన్ని బూచిగా చూపించి భవిష్యత్తులో భారత్‌ను లొంగదీసుకోవాలనే ప్రయత్నాలను చైనా ముమ్మరం చేసింది. ఫలితంగా లద్దాఖ్‌ వద్ద కమ్ముకొన్న యుద్ధమేఘాలు ఏడాది దాటినా వీగిపోలేదు. ఈ సంక్షోభం రెండో శీతాకాలాన్ని చూసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్యాంగాంగ్‌ సరస్సు వద్ద ఇరుపక్షాలు బలగాల ఉపసంహరణ ఒప్పందం కుదుర్చుకొన్న తరవాత వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద పరిస్థితిలో పెద్దగా పురోగతి కనిపించలేదు. దెప్సాంగ్‌, దెమ్‌చోక్‌, గోగ్రా, హాట్‌స్ప్రింగ్స్‌ ప్రాంతాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ ఏడాది వార్షిక యుద్ధవిన్యాసాల అనంతరం టిబెట్‌ సరిహద్దుల్లో బలగాల మోహరింపును చైనా మరోసారి పెంచింది. హఠాత్తుగా దాడి చేసేందుకు (బ్లిట్జ్‌క్రిగ్‌ వ్యూహం) అవసరమైన వనరులను సరిహద్దుల వద్ద సమకూర్చుకొంటోంది.

శాశ్వత నిర్మాణాలు

గతేడాది ఘర్షణల సమయంలో గుర్తించిన లోపాలను చైనా వేగంగా సరిచేసుకొంటోంది. పర్వత యుద్ధతంత్రంలో బలపడటం కోసం టిబెట్‌ వాసులకు శిక్షణ ఇచ్చి దళాల్లో చేర్చుకొనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. భారత్‌ వికాస్‌ బెటాలియన్‌ దెబ్బ రుచిచూసిన తరవాత చైనా ఈ దిద్దుబాటు చర్యలను చేపట్టింది. లద్దాఖ్‌ పర్వత ప్రాంతంలో ప్రాణవాయువు లభ్యత తక్కువగా ఉండటం వల్ల యుద్ధవిమానాల పేలోడు సామర్థ్యం తగ్గిపోతుంది. అందుకే ఎక్కువ యుద్ధవిమానాలను మోహరించేందుకు ఒక్క షింజియాంగ్‌ ప్రావిన్స్‌లోనే వైమానిక స్థావరాల సంఖ్యను 16కు పెంచుతోంది. వీటిలో కనీసం ఆరు స్థావరాలు లద్దాఖ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, సిలుగురి నడవా, అరుణాచల్‌ప్రదేశ్‌లకు అత్యంత సమీపంలో ఉన్నాయి. వీటిలో హోతాన్‌, ఎన్‌గారీ, కున్షా స్థావరాల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతోంది. సరిహద్దుల వద్ద శాశ్వత నిర్మాణాలు చేపట్టి నిఘా కెమెరాలు, సెన్సార్లు అమరుస్తోంది. సేకరించిన సమాచారాన్ని వేగంగా పంపిణీ చేసేలా ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్స్‌ అమరుస్తోంది. అంటే చైనాకు సమీప భవిష్యత్తులో వెనక్కి వెళ్ళే ఉద్దేశం లేదని అర్థం.

వాస్తవానికి 1914లో సిమ్లా ఒప్పందంలో గుర్తించిన మెక్‌మోహన్‌ రేఖను కాకుండా 1959లో చైనా ప్రభుత్వాధినేత ఝోవ్‌ ఎన్‌లై ప్రతిపాదించిన రేఖను డ్రాగన్‌ ఆధారంగా తీసుకొంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 1959లో ప్రతిపాదిత రేఖకు అనుగుణంగానే పాంగాంగ్‌ సరస్సు వద్ద రాజీ ఒప్పందానికి వచ్చినట్లు అర్థమవుతోంది. దెప్సాంగ్‌ సమీపంలోనూ ఆ రేఖనుబట్టే ముందుకొచ్చింది. ఆ రేఖకు అనుగుణంగా చైనాతో ఒప్పందం చేసుకొంటే భారత్‌కు చెందిన దౌలత్‌బేగ్‌ఓల్డీ వైమానిక స్థావరానికి మార్గం కష్టమైపోతుంది. తాజాగా దెమ్‌చోక్‌వద్ద చైనా పౌరుల్లాగా సైనికులు తిష్ఠవేసినట్లు వార్తలు వచ్చాయి. వీరిని ఖాళీ చేయించేందుకు ఇండియా సైన్యం బలవంతంగా ప్రయత్నిస్తే పౌరులపై దాడిగా చైనా చిత్రీకరిస్తుంది. అందుకే సరిహద్దుల్లో చైనా తరచూ కృత్రిమ గ్రామాలను నిర్మిస్తోంది. ఇటీవల తజకిస్థాన్‌ రాజధాని దూషాన్‌బేలో జరిగిన షాంఘై సహకార సంస్థ సమావేశం సందర్భంగా భారత్‌-చైనా విదేశాంగ శాఖ మంత్రులు మరోమారు భేటీ అయ్యారు. వాస్తవాధీన రేఖ వద్ద శాంతి స్థాపన విషయంలో ఇద్దరూ విభిన్నమైన ప్రతిపాదనలు చేశారు. సరిహద్దు వివాద పరిష్కారమే కేంద్రంగా ఇరు దేశాలు కృషిచేసి సంబంధాలను ముందుకు తీసుకెళ్లాలని భారత విదేశాంగ మంత్రి జయశంకర్‌ పేర్కొన్నారు. సరిహద్దుల వద్ద పరిస్థితులను గమనిస్తే భారత్‌-చైనా సంబంధాలు తిరోగమన దిశగా పయనిస్తున్నాయని ఇరు దేశాల విదేశాంగ మంత్రులు అంగీకరించారు.

చైనా వింత పాట!

చైనా సరిహద్దు వివాదం విషయంలో తాపీగా వ్యవహరిస్తోంది. ఈ వివాదాన్ని పక్కనపెట్టి ఇతర రంగాల్లో పరస్పర సహకారంతో లబ్ధిపొందుతూ వివాదాలకు తావులేని ఆరోగ్యవంతమైన పోటీ నెలకొల్పాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ సూచించారు. ఇరు దేశాల మధ్య అపనమ్మకాన్ని పెంచి యుద్ధం అంచుకు తీసుకొచ్చిన వివాదాన్ని పక్కన పెట్టి పరస్పరం ఎలా సహకరించుకోవాలో వాంగ్‌యీకే తెలియాలి. ఒకవేళ ఇలా జరిగితే వాస్తవాధీన రేఖ వివాదం చైనా బేరసారాలకు ఆయుధంగా మారే ప్రమాదం ఉండనే ఉంది. గతేడాది ఇరు దేశాల మంత్రులు మాస్కోలో భేటీ అయిన సమయంలో సమస్య పరిష్కారానికి కొన్ని అంశాలను నిర్దేశించుకొన్నారు. ఫలితంగా కొంత పురోగతి కనిపించి ప్యాంగాంగ్‌ సరస్సు వద్ద వివాదం సద్దుమణగడానికి దారి తీసింది. ఈసారి అటువంటి పరిస్థితి కనిపించలేదు. మరోవిడత సైన్యాధిపతుల సమావేశానికి మాత్రమే అంగీకారం కుదిరింది. ఈ భేటీకి కార్గిల్‌ విజయ దినోత్సవమైన జులై 26ను చైనా వ్యూహాత్మకంగా ప్రతిపాదించగా, భారత్‌ కుదరదని చెప్పినట్లు సమాచారం. వచ్చేనెల తొలివారంలోపు ఈ భేటీ జరిగే అవకాశం ఉంది. సరిహద్దు వివాదాన్ని దీర్ఘకాలం కొనసాగించాలనే ఉద్దేశం చైనాకు ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఎల్‌ఏసీ వద్ద భారీ సంక్షోభం తలెత్తితే కొత్తగా వచ్చే దళాలు ఆ పర్వత వాతావరణానికి అలవాటు పడటానికే కనీసం పక్షం రోజులు పడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని భారత్‌ వాస్తవాధీన రేఖను కాపాడుకోవాలంటే శాశ్వత సైనిక స్థావరాల ఏర్పాటుపై దృష్టిపెట్టడం ప్రయోజనకరంగా ఉండవచ్చు.

- పెద్దింటి ఫణికిరణ్‌

ఇదీ చదవండి : అంతా డ్రోన్ల మయం.. ఎగిరే యంత్రాలతో లాభాలెన్నో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.