దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరవాత మహిళలు ఎన్నో రంగాల్లో పురుషులతో సమానంగా పురోగమిస్తున్నారు. ఎందరో మహానుభావులు భారతీయ సమాజంలో అనాదిగా ఉన్న దుష్ట సంప్రదాయాలకు చరమగీతం పాడారు. పలు సంస్కరణోద్యమాల ఫలితంగా స్త్రీలు విద్యారంగంలో, ఉపాధిలో తమ ప్రతిభాపాటవాలను చాటుకున్నారు. ఇప్పటికీ కొన్ని రంగాల్లో వారి భాగస్వామ్యం నామమాత్రంగా ఉందని చెప్పక తప్పదు. జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు ఆ మేరకు సమాజంలో నాయకత్వం వహించేందుకు తగిన అవకాశాలు లభిస్తున్నాయా? ఈ ప్రశ్నకు నిరాశాజనకమైన సమాధానమే వస్తుంది. నిత్యం మహిళల ప్రాధాన్యాన్ని ప్రస్తావిస్తూ ఉపన్యాసాలు చేసే ప్రధాన రాజకీయ పార్టీలు- వారికి ఆ మేరకు ప్రాతినిధ్యం కల్పించడం లేదన్నది చేదు వాస్తవం.
అసోం, కేరళ, తమిళనాడు, పశ్చిమ్ బంగ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో మొత్తం 824 స్థానాల్లో 18.68 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే ఎన్నికల నగారా మోగించి పోరుకు సిద్ధమయ్యాయి. గత ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికను పరిశీలించినప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలు కోటీశ్వరులకు, నేరస్తులకే పెద్దపీట వేశాయి. మహిళలకు తగిన గుర్తింపు ఇవ్వలేదు. పరిమిత స్థానాలు కేటాయించి, వారికి దక్కాల్సిన వాటాను కుదించాయి.
తక్కువ అవకాశాలు
పశ్చిమ్ బంగలో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 200 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేయగా 39మంది గెలుపొందారు. 2011 ఎన్నికలతో పోలిస్తే పోటీ చేసినవారి సంఖ్య పెరిగింది. రాష్ట్ర జనాభాలో 48.7శాతంగా ఉన్న మహిళలు కేవలం 13.3 శాతం స్థానాల్లో మాత్రమే గెలవడం కాస్త నిరాశపరచే అంశమే. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 43 స్థానాల్లో మహిళలకు అవకాశం కల్పించగా- 29 స్థానాల్లో గెలుపొందారు. భారతీయ జనతా పార్టీ 31, బహుజన్ సమాజ్ పార్టీ 17 స్థానాల్లో మహిళలకు సీట్లు కేటాయించాయి. స్వతంత్ర అభ్యర్థులు 26 మంది పోటీ చేసినప్పటికీ ఒక్క స్థానమూ గెలవలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ ఎనిమిది మందికి అవకాశం కల్పించగా నలుగురు విజయం సాధించారు.
తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2016లో జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా 320 మంది మహిళలు పోటీ చేయగా 21 మందే గెలుపొందారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఏఐఏడీఎంకే- ఆ ఎన్నికల్లో పోటీలో నిలిపిన మొత్తం అభ్యర్థుల్లో మహిళలు 12శాతమే. డీఎంకే మహిళలకు కేటాయించిన స్థానాలు ఎనిమిదిశాతం. భాజపా పోటీలో నిలిపిన అభ్యర్థుల్లో మహిళల శాతం ఏడు. కాంగ్రెస్ పార్టీ నుంచి కేవలం ముగ్గురికి మాత్రమే అవకాశం కల్పించడం... ఆ పార్టీకి మహిళలపై ఉన్న గౌరవం ఏ పాటిదో తేటతెల్లం చేస్తోంది.
కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 110 మంది మహిళలు పోటీచేయగా, ఎనిమిది మంది గెలుపొందారు. సీపీఐ, సీపీఐ(ఎం)ల నుంచి 18 మంది మహిళలకే ఎన్నికల్లో పోటీచేసే అవకాశం లభించింది. అందులో ఎనిమిది మంది విజేతలయ్యారు. ప్రధాన రాజకీయ పార్టీలైన భాజపా, బీఎస్పీ, కాంగ్రెస్ సైతం మహిళలకు అత్తెసరు సీట్లు కేటాయించాయి. అయినా ఎవరినీ విజయం వరించలేదు. కేరళ రాష్ట్ర జనాభాలో 52 శాతానికి పైగా ఉన్న చైతన్యవంతులైన మహిళలకు- పార్టీలు అప్రాధాన్య స్థానాలను కేటాయిస్తున్నాయి.
అసోంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలు ఉండగా- 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 91 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేశారు. అందులో ఎనిమిది మందే గెలుపొందారు. బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ పార్టీ ఇద్దరు అభ్యర్థులను బరిలో నిలిపి, గెలిపించుకొంది. అక్కడ అధికారంలో ఉన్న భాజపా ఆరుగురు మహిళా అభ్యర్థులను పోటీలోకి దింపినా- ఇద్దరినే గెలిపించుకోగలిగింది. కాంగ్రెస్ పార్టీ 17 మందిని పోటీలో నిలపగా, అందులో ముగ్గురు గెలుపొందారు.
చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2011లో అక్కడ ఆరుగురు మహిళా అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ ఒక్కరూ గెలవలేదు. 2016లో 21 మంది బరిలో నిలవగా- నలుగురు విజయం సాధించారు. ఆలిండియా ఎన్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఇద్దరిని; కాంగ్రెస్, డీఎంకే ఒక్కొక్కరు చొప్పున మహిళా అభ్యర్థులను బరిలో నిలిపి గెలిపించుకోగలిగాయి. పుదుచ్చేరిలో మహిళలు అక్షరాస్యతలో దేశ సగటుకంటే ముందంజలోనే ఉన్నారు. కానీ రాజకీయ పార్టీలు వారికి తగిన గుర్తింపు ఇవ్వడంలేదు. ప్రధాన రాజకీయ పార్టీలు మహిళలకు పెద్దపీట వేసి- తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి ఉంది. జనాభాలో దాదాపు సగభాగం ఉన్న మహిళలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల్లో మహిళా కోటాను అమలు చేయాల్సిన బాధ్యత పార్టీలపై ఉంది. తమకు రాజకీయాల్లో సముచిత వాటా దక్కాలంటే మహిళలు ప్రధాన పార్టీలపై ఒత్తిడి తీసుకురావాలి. మహిళా చైతన్యం శక్తి ఏమిటో తెలియజెప్పాలి. అప్పుడే రాజకీయాల్లో స్త్రీలకు తగిన న్యాయం దక్కుతుంది!
- డాక్టర్ సిలువేరు హరినాథ్ ('సెస్'లో రీసెర్చ్ అసిస్టెంట్)
ఇదీ చదవండి:ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం ఆత్మహత్య